• facebook
  • whatsapp
  • telegram

వాణిజ్య బంధంపై పీటముడి

కొనసాగుతున్న ‘బ్రెగ్జిట్‌’ ప్రకంపనలు

అటుఇటుగా అయిదు దశాబ్దాల అనుబంధాన్ని తెగతెంచుకుని ఐరోపా సమాఖ్యనుంచి బ్రిటన్‌ వైదొలగడానికి కారణం... వాణి జ్యం, వలసల రూపంలో స్వీయ అస్తిత్వానికి కలుగుతున్న ముప్పును ఎదుర్కోవాలనుకోవడమే! ఐరోపా సమాఖ్య (ఈయూ)లో కొనసాగడం ద్వారా కోల్పోయామనుకున్న సొంత గొంతుకను తిరిగి పొందడంకోసం ‘బ్రెగ్జిట్‌’వైపు అడుగేసిన బ్రిటన్‌ గమనం ఏ మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరం. ఈయూ నుంచి అధికారికంగా 2020 జనవరి 31న బయటపడినప్పటికీ ఈ ఏడాది ముగిసేవరకూ ‘సమాఖ్య’ నిబంధనల మేరకే బ్రిటన్‌ నడుచుకోవాల్సి ఉంటుంది. మరో రెండు వారాల వ్యవధిలో ఈయూతో సరికొత్త వాణిజ్య నిబంధనలు రూపొందించుకోవాల్సిన అనివార్యత ఉరుముతోంది. ఆ మేరకు ఇరుపక్షాల మధ్య గడచిన కొన్ని నెలలుగా జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈయూ భాగస్వామిగా ఇంతకాలం 70కిపైగా దేశాలతో ‘సమాఖ్య’ నిబంధనలకు కట్టుబడి వాణిజ్యం నెరపిన బ్రిటన్‌- వచ్చే ఏడాది తొలినాళ్లనుంచి వాటితో కొత్త లెక్కల ప్రకారం వ్యాపార, వాణిజ్యాలు సాగించాల్సి ఉంటుంది. ఆ క్రమంలో బ్రిటన్‌ ఇప్పటికే 50 దేశాలతో  వేర్వేరుగా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. ఎటొచ్చీ ఇప్పటికీ తేలనిది ఈయూతో వాణిజ్య బంధమే!

ఐరోపా సమాఖ్య భాగస్వామిగా ఎలాంటి పన్నులూ చెల్లించకుండానే బ్రిటన్‌ కంపెనీలు ఈయూవ్యాప్తంగా వస్తువుల కొనుగోలు అమ్మకాలను నిరాటంకంగా సాగించాయి. ఈ ఏడాది ముగిసేలోగా ఈయూతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరుపక్షాలూ ఇకమీదట ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల మేరకు మెలగాల్సి ఉంటుంది. వస్తు సేవల ధరలను ప్రతికూలంగా ప్రభావితం చేసి, వినియోగదారులపై పెనుభారం మోపే ఆ దుస్థితిని నివారించడంకోసమైనా ఈయూ, బ్రిటన్‌లు ఒక అంగీకారానికి రావడం తప్పనిసరి. కీలక అంశాలపై ఏ పక్షమూ పట్టు సడలించకపోవడంతో పీటముడి కొనసాగుతోంది. గడువు తరుముకొస్తున్న తరుణంలో ఏదో ఒకటి చేసి ఇరుపక్షాల మధ్య సంధి సాధ్యం చేయాలన్న ఒత్తిళ్ల నేపథ్యంలో- బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, ఈయూ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా ఒన్‌డెర్‌ లెయెన్‌ రెండ్రోజుల క్రితం ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ‘గొప్ప ముందడుగు వేసి ఉభయ పక్షాలూ వాణిజ్య బంధం కుదుర్చుకొనే అవకాశాలు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయ’ని బోరిస్‌ జాన్సన్‌ ఆ సందర్భంగా వ్యాఖ్యానించారు.

ఈయూ నుంచి బ్రిటన్‌ వైదొలగాలంటూ ఆనాడు వినిపించిన వాదనల్లో ముఖ్యమైనది ‘చేపల వేట’. బ్రిటన్‌ ప్రాదేశిక జలాల్లో ఈయూ దేశాలు నిరాటంకంగా చేపలను వేటాడటాన్ని నిలువరించాలన్న డిమాండ్‌ ఆనాడు ‘బ్రెగ్జిట్‌’ ఉద్యమంలో బలంగా వినిపించింది. బ్రిటన్‌ ప్రాదేశిక జలాల్లో ప్రవేశించి ఈయూకు చెందిన చేపల బోట్లు, జాలర్లు ఏటా 60 కోట్ల డాలర్ల విలువైన మత్స్య సంపదను తరలించుకుపోతున్నారు. వచ్చే ఏడాదినుంచి తమ జలాల్లో ఈయూ చేపలవేటకు పరిమితులు విధించాలని బ్రిటన్‌ భావిస్తోంది. అలాగైతే తమ విపణిలో బ్రిటన్‌ చేపల విక్రయానికి పరిమితులు, పన్నులు విధిస్తామని ఈయూ హెచ్చరిస్తోంది. నిరుడు తమ మత్స్యసంపదలో నాలుగింట మూడొంతుల భాగాన్ని ఈయూ మార్కెట్లలో బ్రిటన్‌ విక్రయించుకుంది. ఇరుపక్షాలూ పట్టుసడలించకపోవడంతో వాణిజ్య ఒప్పందానికి ‘చేపల వేట’ ప్రధాన అడ్డంకిగా మారింది. వాణిజ్య నిబంధనలను ఉల్లంఘిస్తే విధించాల్సిన ఆంక్షల విషయంలోనూ మల్లగుల్లాలు కొనసాగుతున్నాయి. పోలీసుల ద్వారా సేకరించే భద్రతాపరమైన సమాచారాన్ని నిరాటంకంగా తమతో మునుపటిలానే పంచుకోవాలన్న బ్రిటన్‌ డిమాండ్‌కు ఈయూ ససేమిరా అంటోంది. ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన భద్రత విధానాలు, ఔషధాల ఎగుమతి దిగుమతులు వంటి అంశాలపైనా పేచీ కొనసాగుతోంది. ఈయూనుంచి నిష్క్రమణ తరవాత ఐరోపా సమాఖ్య దేశాలతో వాణిజ్యానికి సంబంధించి బ్రిటన్‌ సహజంగానే మునుపటి వెసలుబాట్లు కోల్పోతుందని; కానీ ఇకమీదటా అవే వెసలుబాట్లు ఉండాలన్న రీతిలో బ్రిటన్‌ చేస్తున్న డిమాండ్లవల్లే పీటముడి కొనసాగుతోందన్నది కొందరు విశ్లేషకుల వాదన. బ్రిటన్‌ వాణిజ్యంలో సుమారు సగ భాగం ఈయూతోనే ముడివడి ఉంది. ఆ దేశం ఎగుమతుల్లో 43 శాతం ఈయూ దేశాలకు వెళుతుంటే, దాని దిగుమతుల్లో 51శాతం ఈయూనుంచే వస్తున్నాయి. ఇరుపక్షాలూ సాధ్యమైనంత సత్వరం ఏదో స్థాయిలో బెట్టువీడి మెట్టుదిగితే తప్ప వాణిజ్య బంధం ముడివడే సూచనలు కనిపించడం లేదు. చర్చలు ఫలించి వాణిజ్య ఒప్పందం కుదిరినా- డిసెంబరు 31లోగా ఉభయ పార్లమెంట్లూ అంగీకరిస్తే తప్ప దానికి చట్టబద్ధత లభించదు. ఇప్పటికే ‘బ్రెగ్జిట్‌’ నేపథ్యంలో బ్రిటన్‌లో ముగ్గురు ప్రధానులు మారారు. రెండుసార్లు ఎన్నికలు జరిగాయి. చిక్కుముడి ఇంకా కొనసాగితే మరోసారి బ్రిటన్‌లో సంక్షోభం తలెత్తినా ఆశ్చర్యం లేదు!

- శ్రీదీప్తి
 

Posted Date: 26-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం