• facebook
  • whatsapp
  • telegram

పొదుపు బాటలో భోగి భాగ్యాలు!

జాతి భవితకోసం మదుపు

స్వాతంత్య్రానంతరం ఎన్నడూ లేని స్థాయిలో భారత ఆర్థికాభివృద్ధి రేటు ఈ ఏడాది క్షీణముఖం పట్టనుంది. చివరకు ప్రభుత్వం సైతం భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటులో 7.7శాతం తరుగుదల కనిపిస్తుందని అంగీకరించింది. ఆర్థిక వ్యవస్థను తిరిగి వృద్ధి పథంలో పరుగులు తీయించడానికి ‘ఆత్మ నిర్భర్‌’ ప్యాకేజీ ఏమాత్రం సరిపోదు. కొవిడ్‌ వల్ల దెబ్బతిన్న జన జీవితాలను గాడిన పెట్టడానికి ఇతర దేశాలు పెద్దయెత్తున డబ్బు ఖర్చు పెట్టాయి. ఆత్మ నిర్భర్‌ పథకం కింద రాబోయే ఏడాది కాలంలో ప్రజలకు, పరిశ్రమలకు నేరుగా నగదు రూపేణా సహాయం చేయాల్సింది పోయి, ప్రభుత్వం వచ్చే 3-5 ఏళ్లకు రుణ గ్యారంటీల బాటను ఎంచుకుంది. ప్రధాన దేశాలు తమ జీడీపీలో మూడు శాతం నుంచి ఏడు శాతాన్ని ఉద్దీపన కింద ఖర్చుపెట్టగా, భారత ప్రభుత్వ ఉద్దీపన వ్యయం జీడీపీలో రెండు శాతానికి మించబోవడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు, కుటుంబాల వినియోగ వ్యయం 9.5శాతం మేర కోసుకుపోనున్నది. ఆర్థిక వ్యవస్థలో 65శాతానికి వ్యక్తిగత వినియోగ వ్యయమే ఆలంబన అయిన భారతదేశానికి ఇది పెద్ద దుర్వార్త.

ప్రభుత్వాల చొరవ కీలకం

బ్రిటిష్‌ వలస పాలనలో లూటీ అయిన భారతదేశం, స్వాతంత్య్రం వచ్చిన తరవాత పెట్టుబడుల కొరతతో సతమతమైంది. అప్పుడు ప్రభుత్వమే పొదుపును ప్రోత్సహించి పెట్టుబడుల సమీకరణకు తోడ్పడింది. 1950-51 నుంచి 1979-80 వరకు ప్రభుత్వ రంగ సగటు పొదుపు 2.8శాతం; ప్రైవేటు రంగ పొదుపు 1.45 శాతమని రిజర్వు బ్యాంకు గణాంకాలు తెలుపుతున్నాయి. ఆ 30ఏళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల సగటు పొదుపు 4.3శాతం. గడచిన నాలుగేళ్లలో ప్రభుత్వ పొదుపు రేటు తరిగిపోగా, ప్రభుత్వ రంగ సంస్థల పొదుపు రేటు ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోయింది. బ్యాంకుల జాతీయీకరణ పొదుపునకు గొప్ప ఊతమిచ్చింది. 1991 తరవాత సైతం పొదుపు రేట్లు పెరిగాయి. గడచిన పదేళ్లలో కుటుంబాల పొదుపు రేట్లు రెట్టింపు అయ్యాయి. 2009-10లో కుటుంబాల పొదుపు రూ.9.89 లక్షల కోట్లు; 2019లో అది రూ.19.96 లక్షల కోట్లకు పెరిగింది. ఎల్‌ఐసీ, ఇతర బీమా సంస్థలు, మ్యూచువల్‌ ఫండ్‌లలో, చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ప్రజలు డబ్బు దాచుకోవడమే దీనికి కారణం. అంతకుముందు ప్రధానంగా బ్యాంకు డిపాజిట్లపై వారు ఆధారపడేవారు. 1981 మార్చిలో రూ.8,244 కోట్లుగా ఉన్న చిన్న పొదుపు మొత్తాలు, 2020 మార్చికల్లా రూ.9,18,459 కోట్లకు పెరిగాయి. 1989లో ఎల్‌ఐసీ పెట్టుబడులు రూ.17,343 కోట్లు; 2020 మార్చికి అవి రూ.29,57,163 కోట్లకు పెరిగాయి. ఇదే కాలంలో పొదుపు డిపాజిట్లు రూ.12,995 కోట్ల నుంచి రూ.43,50,746 కోట్లకు పెరిగాయి. మ్యూచువల్‌ ఫండ్‌ నిధులు రూ.52 కోట్ల నుంచి రూ.22,26,203 కోట్లకు హెచ్చాయి.

అయితే ఫైనాన్స్‌ రంగంలో నికరమైన పొదుపు సాధనాల కొరత వల్ల, ఆర్థిక మోసాలు పెరగడం వల్ల ప్రజలు బంగారం, వెండి మినహా భూములు, భవనాలు, యంత్రాలు, పరికరాల వంటి భౌతిక ఆస్తులలో పొదుపు చేస్తున్నారు. ఆర్థిక మోసాలపై నియంత్రణ సంస్థలు కఠినంగా వ్యవహరించకపోవడం వల్లనే ప్రజలు భౌతిక ఆస్తులకు మరలుతున్నారు. 1999లో మొత్తం పొదుపు రూ.3.25 లక్షల కోట్లలో భౌతిక ఆస్తుల వాటా రూ.1.33 లక్షల కోట్లు; 2018-19లో కుటుంబాల మొత్తం పొదుపు రూ.34.47లక్షల కోట్లలో భౌతిక ఆస్తుల వాటా రూ.21.80లక్షల కోట్లని ఎన్‌ఎస్‌ఓ సర్వేలో తేలింది. మొత్తం పొదుపులో భౌతిక ఆస్తుల వాటా 40శాతం నుంచి 63 శాతానికి పెరిగిందన్న మాట.

దేశీయ మూలధనం పెరగాలి

ప్రస్తుతం భారతావనిలో పొదుపు తీరుతెన్నులు చూసి ప్రభుత్వం, బ్యాంకులు, పొదుపుదారులు ఆందోళన చెందాలి. నేడు భారతీయ బ్యాంకుల వద్ద రూ.66.48 లక్షల కోట్ల డిపాజిట్లు మూలుగుతున్నా, వాటిలో మూడేళ్లకు పైబడిన డిపాజిట్లు రూ.13.6 లక్షల కోట్లకు మించవు. ఏడాది, అంతకులోపు కాలావధులకు డిపాజిట్‌ చేసిన మొత్తాలన్నీ కలిపి రూ.14.04 లక్షల కోట్లే. ఇలా స్వల్పకాలిక డిపాజిట్లతో దీర్ఘకాల రుణాలివ్వడం బ్యాంకులకు ఏమాత్రం క్షేమకరం కాదు. ఆర్థిక వ్యవస్థ కోలుకోకపోతే జనం తమ డిపాజిట్లు వెనక్కు తీసుకోవాలని అనుకోవచ్చు. అప్పుడు బ్యాంకులు పులుసులో పడతాయి. అప్పుడు వాటిని ఆదుకోవలసింది ప్రభుత్వమే. సబ్సిడీలు, సంక్షేమ పథకాలపై స్థోమతకు మించి ఖర్చు చేయడంతో ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి సైతం అంతంతమాత్రంగానే తయారైంది. అందుకే విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులు, జమలపై సర్కారు అధికంగా ఆధారపడవలసి వస్తోంది. ఇది ఏమాత్రం అభిలషణీయం కాదు. ప్రజల నుంచి దీర్ఘకాల పొదుపు మొత్తాలను ఆకర్షించగలిగినప్పుడు మాత్రమే అభివృద్ధి నిధులు సమకూరతాయి. దురదృష్టవశాత్తు గడచిన అయిదారేళ్లలో నష్టభయం లేని ఫిక్స్‌డ్‌ పొదుపు సాధనాలకు అవకాశాలు తగ్గిపోతున్నాయి. సాధారణంగా 55ఏళ్లు పైబడినవారు నష్ట ప్రమాదం లేని పొదుపు సాధనాలపై ఆధారపడుతుంటారు. వాటికి వడ్డీ రేటు తగ్గడం సీనియర్‌ పౌరులకు నిజంగా అశనిపాతమే.
రాబోయే బడ్జెట్‌- పొదుపును ప్రోత్సహించడానికి గట్టి చర్యలు తీసుకోవాలి. అది పెరిగితే మూల ధనం కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అగత్యం తగ్గుతుంది. వ్యక్తులకు, కుటుంబాలకు ఏడునుంచి 15 ఏళ్ల కాలపరిమితితో బాండ్ల వంటి దీర్ఘకాల పొదుపు సాధనాలను అందుబాటులోకి తీసుకురావాలి. దీనికోసం బ్యాంకులు, బీమా కంపెనీలు, బ్యాంకింగేతర ఫైనాన్స్‌ సంస్థలు కలిసి ఉమ్మడి వేదికను ఏర్పరచుకోవాలి. దాని ద్వారా ప్రజలకు అధిక వడ్డీ ఇచ్చే బాండ్లను విక్రయించవచ్చు. బాండ్ల ద్వారా లభించే సొమ్ము బ్యాంకుల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. కొన్నేళ్ల క్రితం నిలిపేసిన ఆదాయ పన్ను మినహాయింపు బాండ్లను పునరుద్ధరిస్తే, కొవిడ్‌ వల్ల చితికిపోయిన ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం 80-డి సెక్షన్‌ కింద ఆరోగ్య బీమాకు పన్ను మినహాయింపు పరిమితి రూ.25,000గా ఉంది. దీన్ని రూ.35,000 లేదా రూ.50,000కు పెంచడం అభిలషణీయం. నానాటికీ పెరుగుతున్న వైద్య ఖర్చుల నుంచి మధ్యతరగతికి ఇది ఎంతో కొంత వెసులుబాటు ఇస్తుంది. 

ఆర్థిక వ్యవస్థకు దన్నుగా...

ప్రజల చేతికి నగదు అందిస్తే వారు ఆ మొత్తాలను ఖర్చు చేసి వస్తుసేవలకు గిరాకీ పెంచుతారు. తద్వారా ఉత్పత్తి, ఉపాధులు పెరుగుతాయి. అలా కాకుండా ప్రజలు తమ చేతికి అందిన మొత్తాలను బ్యాంకుల్లో, ఇతర ఆర్థిక సంస్థల్లో దాచుకున్నా, అది కూడా ఆర్థికానికి మంచిదే. ఎందుకంటే ఆ పొదుపు మొత్తాలు చాలా తక్కువ వడ్డీకి లభిస్తాయి కాబట్టి, బ్యాంకులు నిధుల కోసం అదేపనిగా ప్రభుత్వంపై ఆధారపడాల్సిన అగత్యం తప్పుతుంది. బ్యాంకులు ఆర్థికంగా నిలదొక్కుకుని పరిశ్రమలకు, వ్యాపారాలకు రుణాలిచ్చి ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడానికి తోడ్పడతాయి.

Posted Date: 13-01-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం