• facebook
  • whatsapp
  • telegram

సంక్షోభంలో రాష్ట్రాలకు సైదోడుగా...

ఆర్థికంలో సమాఖ్య స్ఫూర్తి

రానున్న కేంద్ర బడ్జెట్‌పై గతంలోకంటే భిన్నమైన ఆసక్తి నెలకొంది. కొవిడ్‌ అనంతరం ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్‌ ప్రకటన దేశ ఆర్థిక వ్యవస్థ వాస్తవ స్థితిని వెల్లడించనుంది. కేంద్ర ప్రభుత్వ రాబడులు, వ్యయాలపై కచ్చితమైన గణాంకాలు మన ముందుకు రాబోతున్నాయి. కేంద్రం నుంచి రాష్ట్రాలు ఏ మేరకు నిధులు పొందనున్నాయో తేటతెల్లమవుతుంది. నిరుడు వేసిన అంచనా ప్రకారం, కేంద్ర ఖజానా ఈసరికి రూ.20.2 లక్షల కోట్ల పన్ను వసూళ్ల ఆదాయంతో కళకళలాడుతూ ఉండాలి. ఈ రాబడి అంచనా కొవిడ్‌ పుణ్యమా అని ఏడు లక్షల రూపాయలకు కుంచించుకుపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్ర ఆదాయం 2016-17లో కంటే తక్కువగా ఉండబోతోంది. ఇదే సమయంలో వ్యయం రూ.23.28 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. గత బడ్జెట్లో ఆశించిన ప్రధాన ఆదాయ వనరులు- కార్పొరేట్‌ పన్నులు (రూ 6.81 లక్షల కోట్లు), ఆదాయ పన్ను (రూ.6.38 లక్షల కోట్లు), కస్టమ్స్‌, ఎక్సైజ్‌ సుంకాలు (రూ.4.47 లక్షల కోట్లు), జీఎస్టీ (రూ.6.90 లక్షల కోట్లు). ఇవన్నీ కొవిడ్‌, లాక్‌డౌన్‌ ప్రభావంతో బక్కచిక్కనున్నాయి. ఒక్క ఎక్సైజ్‌ సుంకాలు మాత్రం ఇందుకు మినహాయింపు. పెట్రో ఉత్పత్తులపై సుంకం గణనీయంగా పెంచడం వల్ల ఈ ఆదాయంలో భారీ వృద్ధి నమోదుకానుంది. ఎందుకంటే, పెట్రో ఉత్పత్తులపై సుంకాన్ని రూపాయి పెంచితే ప్రభుత్వ ఆదాయం రూ.14,000 కోట్లు పెరుగుతుంది. ఇక రాష్ట్రాలకు కేంద్రం నుంచి సంక్రమించే పన్నుల వాటా రూ.7.84 లక్షల కోట్లు ఉంటుందని 2020-21 బడ్జెట్‌ అంచనా వేసింది. రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు జరిగే అన్ని బదిలీల మొత్తం రూ.13.91 లక్షల కోట్లవుతుందని లెక్క కట్టింది. ఇవన్నీ అంచనాలుగానే మిగిలే అవకాశం కనిపిస్తోంది. పన్నుల్లో వాటా కింద రాష్ట్రాలకు వస్తుందనుకున్న సొమ్ములో భారీగా కోత పడుతుంది. కొన్ని పద్దుల కింద రాష్ట్రాలకు భర్తీ చేయాల్సిన నిధుల చెల్లింపులోనూ జాప్యం తప్పకపోవచ్చు. రాష్ట్రాలకు ఇది అశనిపాతమే.

అధిక రుణాలు

పెను సంక్షోభమే అయినప్పటికీ, దేశం ప్రస్తుత పరిస్థితిని అధిగమిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు అసాధారణంగా పడిపోయినా, అవి భారీస్థాయిలో చేస్తున్న అప్పులే గండం గట్టెక్కిస్తాయి. 2020 జులై నుంచి సెప్టెంబరు వరకు మూడు నెలల్లో కేంద్ర ప్రభుత్వ రుణాలు రూ.5.68 లక్షల కోట్లు పెరిగాయి. వీటిలో రుణపత్రాల జారీ రూపంలో మార్కెట్‌ నుంచి సేకరించినవి రూ.4.2 లక్షల కోట్లు. ఈ జనవరి నాటికి కేంద్ర ప్రభుత్వ నికర రుణాలు రూ.8.73 లక్షల కోట్లకు రెట్టింపు అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వాల మార్కెట్‌ రుణాలు- అక్టోబరు-డిసెంబరు కాలంలో రూ.2.98 లక్షల కోట్ల నుంచి రూ.4.37 లక్షల కోట్లకు చేరాయి. అంతకు ముందటి ఏడాదితో పోలిస్తే రాష్ట్రాల స్థూల రుణభారం దాదాపు 42 శాతం హెచ్చింది. చాలా రాష్ట్రాలు దీర్ఘకాలిక ఆర్థిక సమస్యల్లో చిక్కుకునే ముప్పుంది. కొన్ని పాత అప్పుల కిస్తీలు కట్టేందుకు కొత్త రుణాలు తీసుకోవాల్సి రావడంతో రుణఊబిలో కూరుకుపోయే ప్రమాదం లేకపోలేదు.

ప్రస్తుతం చాలా రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభం నీడన ఉన్నాయి. ఈ క్రమంలో సర్‌ఛార్జీలు, సెస్సులకు బదులు కొత్త పన్నులు విధించేలా విధాన మార్పును తీసుకొస్తామంటూ కేంద్రం రాష్ట్రాలకు వాగ్దానం చేసి, అమలు చేయాలి. కొత్త పన్నుల విధింపు అత్యవసర చర్యగా మాత్రమే ఉండాలి. కొవిడ్‌ ఆర్థిక దుష్ప్రభావాలు నెమ్మదిగా సమసిపోయే అవకాశం ఉన్నందువల్ల, రాష్ట్రాలకు ఏకకాలిక గ్రాంటు రూపంలో నిధులు సమకూర్చే ప్రతిపాదన చేయాలి. ఆయా నిధులను జనాకర్షక పథకాలపై వృథా చేయకుండా, అధిక వడ్డీలతో కూడిన పాత రుణాలు తీర్చివేసేందుకు వినియోగించాలని రాష్ట్రాలకు ముందే స్పష్టంగా చెప్పాలి. ప్రజారోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేకంగా ప్యాకేజీ ప్రకటించాలి. ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలపై రాష్ట్రాలు అనివార్యంగా పెట్టుబడులు పెట్టాల్సి ఉన్నప్పటికీ, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిలో అవి ఆ పని చేయలేవు. కాబట్టి, ప్రత్యేక ప్యాకేజీ వాటికి ఎంతగానో ఉపకరిస్తుంది. ఇలా సమకూర్చే ప్యాకేజీ నిధులను నూటికి నూరు శాతం సంబంధిత పథకానికే వినియోగించాలన్న షరతు ఉండాలి.

ప్రాథమ్యాలు నిర్ణయించాలి

ఏ రూపంలో ప్రత్యేక నిధులు సమకూర్చినా, వాటి వినియోగానికి ప్రాథమ్యాలను నిర్ణయించాలి. ముందుగా జీతాలు, పింఛన్లు, రుణకిస్తీలు చెల్లించాలన్న లంకె పెట్టాలి. ఆ తరవాత జనాకర్షక పథకాలకు వ్యయం చేయాలన్న నిబంధన విధించాలి. చాలా రాష్ట్రాలు తమ పాత బాకీలు తీర్చేందుకు కొత్త రుణాలు సేకరించే ప్రమాదకర స్థితికి చేరుకుంటున్న తరుణంలో, ఇది అత్యంత ప్రధానం. రాష్ట్రాల రుణసమీకరణకు కేంద్రం బాధ్యత వహించాల్సి ఉండటం... ఇక్కడ ప్రస్తావించాల్సిన మరో ముఖ్యమైన అంశం. కేంద్రం అనుమతితోనే రాష్ట్రాలు రుణాలు తీసుకోగలవు. రాజ్యాంగంలోని అధికరణ 293 ప్రకారం- రాష్ట్రాల రుణాలకు కేంద్రానిదే పూచీ. కొన్ని రాష్ట్రాలు శ్రుతి మించి అప్పులు చేస్తున్నందు వల్ల, అలాంటి రాష్ట్రమేదైనా రుణాల చెల్లింపులో విఫలమైతే దేశం మీద, ఆర్థిక వ్యవస్థపైనా ఊహించలేని  ప్రభావం ఉంటుంది. ఎందుకంటే వాటికి మార్కెట్‌ రుణాలు సమకూర్చేది బ్యాంకులు, బీమా సంస్థలు, మ్యూచువల్‌ ఫండ్లే. ఆయా నిధులన్నీ ప్రజలకు చెందినవి. రాష్ట్ర ప్రభుత్వాలు రుణ చెల్లింపుల్లో విఫలమైతే ప్రజల పొదుపు సొమ్ము ప్రమాదంలో పడుతుంది. వ్యవస్థ కుప్పకూలుతుంది. విదేశీ మదుపుదారులు తక్షణం తమ నిధులను ఉపసంహరించుకుంటారు. కొత్త పెట్టుబడులు పెట్టరు. అందుకే నిధుల వినియోగంలో రాష్ట్రాలు క్రమశిక్షణ పాటించేలా కేంద్రం జాగ్రత్తలు తీసుకుని తీరాలి!

జీఎస్‌టీకి అంగీకారం

పన్నులు విధించే అధికారం చాలా వరకు కేంద్ర ప్రభుత్వం లేదా జీఎస్‌టీ మండలి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ముందే అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్రాల ఆర్థికస్థితి కొవిడ్‌తో మరింత దిగజారేందుకు ఈ మార్పు తోడైంది. మరోవైపు, కేంద్రం తన ఆదాయాన్ని సెస్సులు, లైసెన్సు ఫీజుల రూపంలో పెంచుకుంటూ పోవడం వల్ల రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. జీఎస్‌టీకి అంగీకరించడం ద్వారా, రాజ్యాంగబద్ధంగా తమకు సంక్రమించిన పన్ను విధింపు అధికారాన్ని వదులుకోవడం రాష్ట్రాల తప్పిదమే. అన్ని రకాల సెస్సులు, ఇతర పన్నులను కలిపేస్తామని రాష్ట్రాలకు వాగ్దానం చేసినా, కేంద్రం కొత్త సెస్సులను తిరిగి విధిస్తోంది. దీంతో జీఎస్‌టీ పరిధిలో లేని పెట్రోలియం ఉత్పత్తులు, మద్యం, స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ రసుములు, భూవిలువలు, ఇతర ఫీజులను భారీగా పెంచుతూ పోవడం తప్ప- రాష్ట్రాలకు మరోమార్గం లేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థలో వ్యయభారం పెరుగుతోంది.  ప్రస్తుతం ఏ రాష్ట్రమూ ఆర్థిక కార్యకలాపాల వ్యయాన్ని తగ్గించే పరిస్థితిలో లేదు.

Posted Date: 30-01-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం