• facebook
  • whatsapp
  • telegram

స్వావలంబనకెలా నిధుల దన్ను?

రక్షణ బడ్జెట్‌పైనా కొవిడ్‌ ప్రభావం

సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సంవత్సరం బడ్జెట్లో రక్షణ వ్యయానికి పెద్దపీట వేయక తప్పదన్నదే అందరి అభిప్రాయం. భారత్‌ నేడు కాచుకోవలసినది ఒక్క శత్రువును కాదు. ఏక కాలంలో ఇద్దరిని ఎదుర్కోవలసి రావచ్చు. ఒకవైపు పాకిస్థాన్‌ ఎప్పటిలాగే వంకర బుద్ధి ప్రదర్శిస్తూ ఉగ్రవాదులను మనపైకి ఎగదోస్తోంది. ఎన్ని ఎదురు దెబ్బలు తింటున్నా సరిహద్దుల్లో గోతులు (సొరంగాలు) తవ్వే బుద్ధి మానడం లేదు. మరోవైపు కయ్యాలమారి చైనా మన తూర్పు సరిహద్దుల్లో చీటికిమాటికి అతిక్రమణలకు దిగుతోంది. దీంతో భారత్‌ ఏకకాలంలో పాక్‌, చైనాలను ఢీకొనడానికి సిద్ధంగా ఉండక తప్పడం లేదు. ఇందుకు భారీగానే వ్యయం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఏటి బడ్జెట్లో రక్షణ కేటాయింపులు పెంచుతారన్న అంచనాలు జోరుగా వినిపిస్తున్నాయి.

తగ్గుతున్న వాటా

ఇటీవలి సంవత్సరాల్లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో రక్షణ వాటా నిజ విలువ తగ్గిపోతూ వస్తోంది. పేరుకు బడ్జెట్‌ కేటాయింపులు పెరుగుతున్నట్లు కనిపించినా ద్రవ్యోల్బణం వల్ల వాటి నిజవిలువ క్షీణిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రక్షణకు ఎక్కువ నిధులు కేటాయించడం ద్వారా ద్రవ్యోల్బణం తాకిడిని అధిగమించాలని నిపుణులు సూచించారు. అది సరైన సలహాయే కానీ కొవిడ్‌ వల్ల ఆర్థిక వ్యవస్థ కుదించుకుపోయిన దశలో అదెంత వరకు ఆచరణ సాధ్యమన్నది ప్రశ్న. 2020వ సంవత్సర బడ్జెట్లో రక్షణ కేటాయింపులను అంతకుముందు సంవత్సరంకన్నా ఆరు శాతం పెంచి రూ.4.71 లక్షల కోట్లకు తీసుకెళ్లారు. 2021లో కూడా కేటాయింపులు పెరగవచ్చు కానీ, ఆ పెరుగుదలకు కొవిడ్‌ పగ్గాలు వేస్తుందనడంలో సందేహం లేదు. రక్షణ బడ్జెట్లో రెండు విభాగాలు ఉంటాయి. ఒకటి- మూలధన వ్యయం. రెండు- రెవిన్యూ వ్యయం. కొత్త ఆయుధాల కొనుగోలు, వాటిని స్వదేశంలోనే ఆధునికీకరణ ద్వారా ఉత్పత్తి చేయడం, రక్షణ పరిశోధన-అభివృద్ధికి హెచ్చు నిధులు కేటాయించడం మూలధన వ్యయం కిందకు వస్తాయి. సైనిక సిబ్బంది, సామగ్రి వినియోగం, జీతాలు, పింఛన్లు, సంస్థాగత నిర్వహణ ఖర్చుల చెల్లింపు, బట్వాడా ఖర్చులు- రెవిన్యూ వ్యయం కిందకు వస్తాయి. మారిన పరిస్థితుల్లో మరిన్ని కొత్త ప్రాధాన్యాలు ముందుకొచ్చి, బడ్జెట్లో వాటా పొందవచ్చు. వీటన్నింటినీ సమతౌల్య పరచాల్సిన బాధ్యత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ మీద ఉంది. సైన్యం ఆధునికీకరణ, నవీన ఆయుధాల రూపకల్పనపై చైనా భారీగా నిధులు వెచ్చిస్తున్న దృష్ట్యా భారత్‌ అప్రమత్తంగా ఉండటం అత్యావశ్యకం. ‘భారత్‌లో తయారీ’, ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ కార్యక్రమాల కింద అత్యాధునిక ఆయుధాలను రూపొందించాలి. సొంతంగా రూపొందించుకున్న తేజస్‌ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, శతఘ్నుల వంటివి విదేశాలకు ఎగుమతి చేసి మార్కెట్‌ పెంచుకోవాలి. పూర్తిగా ఎగుమతుల కోసమే ప్రభుత్వ, ప్రైవేటు ఆయుధోత్పత్తి పరిశ్రమలను నెలకొల్పే విషయమూ పరిశీలించాలి.

అనుకోని ఖర్చులు

అన్ని ఆధునిక ఆయుధాలనూ పూర్తిగా స్వదేశంలోనే తయారు చేయడం సాధ్యం కాకపోవచ్చు. కొన్ని అత్యాధునిక ఆయుధాల కోసం విదేశీ సహాయం పొందవలసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని ప్రభుత్వం 49 శాతం నుంచి 74 శాతానికి పెంచింది. అదే సమయంలో రక్షణ రంగంలో స్వావలంబన పథాన్ని వీడటం లేదు. కాలంచెల్లిన మిగ్‌ 21 విమానాల స్థానంలో తేజస్‌ యుద్ధవిమానాలను ప్రవేశపెట్టేందుకు వైమానిక దళం భారీ ఆర్డరు పెట్టింది. సైన్యం, నౌకా దళాల్లోనూ సొంత ఆయుధాలు, నౌకల తయారీ కొనసాగుతోంది. చైనాతో ఘర్షణల్లో పైచేయి సాధించడానికి అత్యవసరంగా కొన్ని ఆయుధాలు, సాధన సంపత్తి కోసం ఆర్డరు పెట్టాల్సి వచ్చింది. రైఫిళ్లు, అతిశీతలాన్ని తట్టుకునే దుస్తులు, పాదరక్షలు, పర్వత స్కూటర్ల వంటి వాటి కోసం విదేశాలను ఆశ్రయించక తప్పడంలేదు. దీనికి పెద్దయెత్తున ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ అనుకోని ఖర్చులు ఖజానాకు భారమే. చైనాతో హఠాత్తుగా ఏర్పడిన ఘర్షణ వాతావరణంలో మన సాయుధ దళాలు అనునిత్యం అప్రమత్తంగా ఉండవలసి వస్తోంది. మన దళాల అవసరాలను తీర్చడానికి భారీగా ఖర్చు చేయక తప్పడంలేదు. ఇది తాత్కాలిక వ్యయం; భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి ఆధునిక ఆయుధాలు, యుద్ధరీతులపై దీర్ఘకాలిక వ్యయానికి సిద్ధంగా ఉండాలి. ఇవి తప్పనిసరి ఖర్చులే అయినా, కొవిడ్‌ వల్ల ఆర్థిక వ్యవస్థ కుంగిపోయిన స్థితిలో ఈ ఏటి రక్షణ బడ్జెట్‌ అందుకు తగ్గ కేటాయింపులు చేయగలుగుతుందా అంటే, అనుమానమే.

సంయుక్త కమాండ్ల ఆవశ్యకత

చైనాకు దీటుగా భారతదేశమూ థియేటర్‌ కమాండ్లను ఏర్పాటుచేయాల్సి ఉంది. టిబెట్లో చైనా అటువంటి ప్రత్యేక కమాండ్‌ను ఏర్పాటు చేయగా, భారత్‌ అండమాన్‌-నికోబార్‌ దీవులకు సంయుక్త కమాండ్‌ ఏర్పరచింది. ఒక్కో థియేటర్‌ కమాండ్‌ కింద పదాతిదళం, వాయుసేన, నౌకాసేనలు కలిసి పనిచేస్తాయి. దీన్ని సంయుక్త కమాండ్‌ అనవచ్చు. ఇవి శత్రువుల దాడులకు వేగంగా స్పందించి తిప్పికొట్టగలవు. తామే తెగబడి దాడికి దిగగలవు. ముఖ్యంగా చైనా సరిహద్దులో శాశ్వతంగా సైనిక దళాలను మోహరించడం ఆవశ్యకం కాబట్టి అక్కడ ప్రత్యేక కమాండ్‌ను ఏర్పరచాలి. సైన్యం, వాయు, నౌకాసేనలు కలిసి పనిచేసే సంయుక్త కమాండ్‌ నిర్వహణకు భారీగా ఖర్చవుతుంది. ఆ మేరకు బడ్జెట్లో మూలధన, రెవిన్యూ వ్యయాలు రెండింటినీ పెంచాల్సి వస్తుంది. బడ్జెట్‌ రూపకల్పనను ప్రభావితం చేసే అంశమిది. ఆధునిక యుద్ధ రీతులు సమూలంగా అతి వేగంగా మారిపోతున్నాయి. హైపర్‌ సోనిక్స్‌, ఎలక్ట్రోమేగ్నటిక్‌ ఆయుధాలు, కృత్రిమ మేధ, డ్రోన్ల దండు, రోబోటిక్స్‌, లేజర్‌ ఆయుధాలు, నింగిలో తారట్లాడుతూ అదను చూసి విరుచుకుపడే లాయిటర్‌ బాంబులు, బిగ్‌ డేటా-అల్గొరిథమ్‌ చోదిత అస్త్రాలు ఆధునిక సమరాన్ని శాసించబోతున్నాయి. చైనా, అమెరికాలు వీటిని సమకూర్చుకోవడానికి పోటాపోటీగా ముందుకెళుతున్నాయి. ఈ పోటీలో భారత్‌ వెనకంజ వేయకూడదు. ఈ అస్త్రాల రూపకల్పనలో యువ శాస్త్రవేత్తలను నియోగించే పథకాన్ని భారత్‌ చేపట్టింది. రక్షణ పరిశోధనాలయాలు కీలక ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగాలను గుర్తించి యువ శాస్త్రవేత్తలతో పరిశోధనలు చేయిస్తున్నాయి. వీటిపై హైదరాబాద్‌, బెంగళూరు, ముంబయి, చెన్నై, కోల్‌కతాల్లోని కేంద్ర పరిశోధనాలయాల్లో యువ శాస్త్రజ్ఞులు పరిశోధనలు సాగిస్తున్నారు. కీలక ఆయుధాలను సొంతంగా తయారు చేసుకోవాలంటే భారీగా పెట్టుబడులు పెట్టాలి. దిగుమతులపై ఆధారపడటం తగ్గించాలి. అందుకే సాయుధ శకటాలు, క్షిపణులు, రైఫిళ్లతో సహా 101 ఆయుధాల దిగుమతిని ప్రభుత్వం నిషేధించింది. భారత్‌లో తయారీ, ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకాల కింద వాటిని స్వదేశంలోనే తయారు చేయడానికి అన్ని విధాలుగా అండదండలందిస్తోంది.

- సంజీవ్‌ కె.బారువా
 

Posted Date: 09-02-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని