• facebook
  • whatsapp
  • telegram

వాణిజ్యంలో కొత్త దిశ దశ

అదే... భారత్‌ ముందున్న కర్తవ్యం

కొవిడ్‌ మహమ్మారికి ముకుతాడు వేసేందుకు పలు టీకాలు  అందుబాటులోకి రావడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంటోంది. వ్యాపార వాణిజ్యాలు తిరిగి వేగం పుంజుకుంటున్నాయి. ఆర్థిక వ్యవస్థను సత్వరం సాధారణ స్థాయికి తెచ్చేందుకు వీలుగా భారత్‌ తాజా విధానాలు రూపొందిస్తోంది. వృద్ధిరేటును పరుగులు తీయించేందుకు సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. ఈ లక్ష్య సాధనకు స్థూల ఆర్థిక అంశాలతో పాటు, వాణిజ్యం పాత్రా కీలకం. అందుకని వాణిజ్య విధానాలకు కొత్త రూపు ఇవ్వాలి. మారుతున్న ప్రపంచ భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో ఇది మరింత ముఖ్యం. మనం ఎప్పటినుంచో కోరుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్యాన్ని కొత్త కోణం నుంచి పరిశీలించాలి.

మన దేశానికి లాభసాటేనా?

ప్రపంచీకరణకు దోహదపడిన ప్రధాన చోదక శక్తుల్లో ఒకటైన స్వేచ్ఛా వాణిజ్యం పలు అంతర్జాతీయ విపణులను ఏకం చేసింది. మిగులు ఉత్పత్తులను సరసమైన ధరలకు ఎగుమతి చేయడం, కొరత వస్తువులను చవకగా దిగుమతి చేసుకోవడం ఆయా దేశాలకు సాధ్యమైంది. స్వేచ్ఛా వాణిజ్యం నెరపే దేశాలు తమ ఎగుమతులు గణనీయంగా పెంచుకోగలిగాయి. అయితే నాణానికి రెండో పార్శ్వం కూడా ఉంటుంది. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా భూమి, శ్రమ, పెట్టుబడి, మౌలిక వనరులు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండి ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేస్తాయి. సాంకేతికత, ఇతర ఆర్థిక పరిస్థితులు, రాజకీయ వ్యవస్థ వంటి అంశాలూ దేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి. వీటికి అనుగుణంగా ఉత్పాదకత స్థాయి, సరకుల ధరలు దేశాన్ని బట్టి మారతాయి. దీంతో- చవకగా ఉత్పత్తి చేసి తక్కువ ధరలకు ఎగుమతి చేసే దేశాలకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) లాభసాటి అని, దిగుమతి చేసుకునే దేశాలకు అవి నష్టదాయకమని చాలా దేశాలు భావిస్తున్నాయి. భారత్‌ విషయానికి వస్తే- స్వేచ్ఛా వాణిజ్యం వల్ల సంస్కరణల అనంతర కాలంలో దేశం లబ్ధి పొందినప్పటికీ, రెండో వాదన కూడా చాలాసార్లు నిజమవుతోంది. ఆసియాన్‌, జపాన్‌, కొరియాలతో భారత్‌కు ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలనే ఉదాహరణగా తీసుకుంటే- దేశం మొత్తం ఎగుమతుల్లో ఈ విపణుల వాటా గత పదేళ్లలో 51 శాతం నుంచి 46 శాతానికి పడిపోయింది. అంటే, ఎఫ్‌టీఏలు ఉన్నప్పటికీ భారత్‌ ఈ దేశాలకు ఎక్కువ ఎగుమతులు చేయలేకపోయింది. అదే సమయంలో, భారత్‌ ఎగుమతుల్లో ఐరోపా యూనియన్‌, అమెరికాల వాటా 38 శాతం నుంచి 43 శాతానికి పెరిగింది. వీటితో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు లేనప్పటికీ ఇది సాధ్యపడింది. 2018లో భారత్‌ ఈ దేశాలతో జరిపిన వాణిజ్యంలో 12.7 బిలియన్‌ డాలర్ల వాణిజ్య మిగులు సాధించింది. స్వేచ్ఛా వాణిజ్య విధానంలో మన వైఖరిని పునస్సమీక్షించుకోవలసిన అవసరాన్ని ఈ ధోరణులు సూచిస్తున్నాయి.

అర్థం చేసుకోవాలి

స్వేచ్ఛా వాణిజ్యంతో మనకు ప్రయోజనాలతోపాటు ప్రతిగా మనం చెల్లించాల్సిన మూల్యాలూ ఉంటాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. స్వేచ్ఛా వాణిజ్యంలో దేశాల జాతీయ ప్రయోజనాలు ఇమిడి ఉంటాయి. పోటీ పడగలిగిన సత్తా ఉన్నప్పుడే, అంతర్జాతీయ వాణిజ్య సంప్రదింపుల్లో లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి. ప్రపంచ సరఫరాల గొలుసులో దేశాన్ని ఒక ముఖ్యమైన అనుసంధానంగా మార్చగలిగితేనే ఇది సాధ్యపడుతుంది. ఇందుకోసం, పరిశ్రమల సమర్థతను పెంచి వాటి ఉత్పాదకతను హెచ్చించే దిశగా సంస్కరణలు చేపట్టి పారిశ్రామిక రంగం మొత్తాన్ని ప్రక్షాళన చేయడం తప్పనిసరి. మరోవైపు దేశ ఎగుమతుల రంగానికి ఊపునిచ్చేలా మౌలిక సదుపాయాల అవరోధాలను తొలగించాలి. ఎగుమతుల ప్రోత్సాహానికి వీలుగా పెట్టుబడుల నిబంధనలను మరింతగా సడలించాలి.

ఈ అనుభవం దృష్ట్యా భారత్‌ స్వేచ్ఛా వాణిజ్యానికి దూరం జరిగి దేశీయ పరిశ్రమలను సంరక్షించే విధానాలు అవలంబించాలని భావిస్తే పొరపాటే. దీనివల్ల దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు వాటిల్లే విపరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఎఫ్‌టీఏలు లేకపోయినా, ఈయూ, అమెరికా వంటి దేశాలకు మనం ఎలా ఎక్కువగా ఎగుమతులు చేపట్టగలుగుతున్నామనేది పరిశీలించాలి. ‘వాణిజ్య పరిపూరకాలు’ (ట్రేడ్‌ కాంప్లిమెంటరీస్‌) ఇందుకు చోదక శక్తిగా పని చేస్తున్నాయి. అంటే... ఈయూ, అమెరికా వంటివి ఇతర విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులనే భారత్‌ వాటికి ఎగుమతి చేస్తోంది. ఉదాహరణకు- ఔషధాలు, వజ్రాభరణాలు, కర్బన ఇంధనాలు, ఫర్నిచరును అమెరికా అత్యధికంగా దిగుమతి చేసుకుంటుంది. వీటి తయారీ భారత్‌లో చవకగా ఉంటుంది. కాబట్టి, సరిగ్గా ఇవే వస్తూత్పత్తులను అమెరికాకు, ఇతర ప్రపంచ దేశాలకు సరసమైన ధరలకు సరఫరా చేయగలుగుతోంది. ఇదే తరహా సూత్రం స్వేచ్ఛా వాణిజ్య దేశాల విషయంలోనూ ఫలప్రదంగా వర్తింపజేసేలా మన వాణిజ్య వ్యూహాలు కొత్తగా రూపొందాలి. ఈ వైపుగా విధాన నిర్ణేతలు కసరత్తు చేయాలి. అప్పుడే విదేశీ విపణుల్లోని అవకాశాలను అందిపుచ్చుకోవడం సాధ్యమవుతుంది. తద్వారా వాణిజ్యానికి కొత్త ఊపు లభిస్తుంది. స్వేచ్ఛా వాణిజ్యం మనం విస్మరించజాలని అంశం. అది మరింత జోరుగా కొనసాగాల్సిందే. కాకపోతే, దృక్కోణం మారాలి. స్వేచ్ఛా వాణిజ్యం పట్ల వ్యక్తమవుతున్న భయాందోళనలను విధాన నిర్ణేతలు పట్టించుకోవాలి. ఎఫ్‌టీఏల వల్ల చవక వస్తువుల దిగుమతి వెల్లువెత్తే అవకాశాల ఫలితంగా దేశీయ పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు కొంతవరకు దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. ఈ విషయంలో మన ప్రతినిధులు సంప్రదింపుల్లో దృఢవైఖరిని కనబరచాలి.

తగినంత అవకాశం

ప్రపంచ ఆర్థిక చరిత్రలో ప్రసిద్ధమైన భారత ‘వృద్ధిగాథ’ను ఈ సందర్భంగా గుర్తు చేసుకోడం సమంజసం. స్వేచ్ఛావాణిజ్యం భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెంది విస్తరించడానికి తగినంత అవకాశం ఇచ్చింది. అయినప్పటికీ, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని పూర్తి ఫలాలు చేజిక్కించుకోడంలో దేశం వెనుకబడింది. ఫలాలు అందుకోకుండా కిందికి లాగుతున్న శక్తులను గుర్తించాలి. వాటిని అధిగమించి లక్ష్యాలు సాధించాలి. బైడెన్‌ ఆధ్వర్యంలో అమెరికా, ఈయూ నుంచి వైదొలగిన బ్రిటన్‌; అలాగే బ్రిటన్‌ లేని ఈయూ... భారత్‌ వాణిజ్య విస్తరణకు, మరిన్ని స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుని బలోపేతం అయ్యేందుకు విశేషమైన అవకాశాలు కల్పిస్తున్నాయి. సరికొత్త దృక్పథంతో అప్రమత్తంగా ముందుకు అడుగేసి ఆ అవకాశాలు అందుకోడమే మన పాలకుల కర్తవ్యం.

Posted Date: 15-02-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం