• facebook
  • whatsapp
  • telegram

దా‘రుణ’ సమస్యలకు పరిష్కారం

ఆర్థికవ్యవస్థకు డీఎఫ్‌ఐ దన్ను!

సౌదాగర్‌ అనే హిందీ సినిమా 1973లో విడుదలైంది. అమితాబ్‌ బచ్చన్‌ అందులో బెల్లం వ్యాపారి. ఆ బెల్లాన్ని తన భార్య నూతన్‌ స్వయంగా తయారు చేస్తుంది. పద్మాఖన్నా అందానికి బానిసైన అమితాబ్‌ నూతన్‌కు విడాకులిస్తాడు. ఆ తరవాత వ్యాపారం దెబ్బ తింటుంది. నూతన్‌ విలువ తెలిసి వస్తుంది. కేంద్ర బడ్జెట్‌ తాజాగా ప్రతిపాదించిన అభివృద్ధి రుణ సంస్థ ఏర్పాటు ఈ చిత్రాన్ని గుర్తు చేస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.20,000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ‘డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌ (డీఎఫ్‌ఐ)’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రైవేటు యాజమాన్యంలోనూ ఇలాంటి మరిన్ని సంస్థలు ప్రాణం పోసుకునేందుకు వీలు కల్పించారు. ఒకప్పుడు ‘వద్దు’ అనుకున్న అభివృద్ధి బ్యాంకులు లేదా రుణ సంస్థలు ఇప్పుడు మళ్ళీ ‘ముద్దు’ అయ్యాయి. సంస్కరణలు మొదలైన మూడు దశాబ్దాల తరవాత భారత్‌ ఎట్టకేలకు ఒక ఆధునిక రుణ విపణి నిర్మాణానికి నడుం బిగించింది. దేశ దీర్ఘకాలిక రుణ అవసరాలు తీర్చేందుకు ఇది వీలు కల్పిస్తుంది. మౌలిక సదుపాయాల కల్పనకు తోడ్పడటంతో పాటు, మొండిబాకీల పీడకు ఇది విరుగుడుగా పనిచేసి ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి భరోసా ఇస్తుంది. విదేశీ సంస్థాగత మదుపుదారులకు దేశీయ రుణ విపణిని మరింత ఆకర్షణీయం చేస్తుంది.

అపార ప్రయోజనాలు

ఒకప్పుడు డీఎఫ్‌ఐలు భారతీయ ఆర్థికావనిపై మకుటం లేని మహారాజుల్లా చక్రం తిప్పాయి. భారతదేశ మౌలిక సదుపాయాల అభివృద్ధి బ్యాంక్‌ (ఐడీబీఐ) చట్టం-1964 రద్దు కావడంతో... 2003లో వాటి శకం ముగిసింది. ఐడీబీఐ ప్రధాన అభివృద్ధి రుణ సంస్థగా ఉంటూనే- భారతదేశ మౌలిక సదుపాయాల ఆర్థిక సంస్థ (ఐఎఫ్‌సీఐ), భారత మౌలిక సదుపాయాల రుణ, పెట్టుబడుల సంస్థ (ఐసీఐసీఐ), ఇంకా మరికొన్ని చిన్న సంస్థల నియంత్రణదారుగా వ్యవహరించేది. ఆర్‌బీఐ గవర్నర్‌ ఎం.నరసింహం, ఐడీబీఐ ఛైర్మన్‌ ఎస్‌.హెచ్‌.ఖాన్‌ అధ్యక్షులుగా ఏర్పాటైన ఉన్నతస్థాయి నిపుణుల కమిటీలు 1990లలోనే వీటి తలరాతను మార్చేశాయి. దీర్ఘకాలిక రుణాల పంపిణీలో డీఎఫ్‌ఐల ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించి, అన్ని రకాల రుణాలూ అందించే అవకాశం సాధారణ బ్యాంకులకు కల్పించాలంటూ రుణవిపణి రూపురేఖలు మార్చేసే పెను మార్పులకు ఈ కమిటీలు సిఫార్సు చేశాయి. వీటిని ఆమోదించిన ప్రభుత్వం దఫాల వారీగా బ్యాంకింగ్‌ వ్యవస్థలో పలు సంస్కరణలు తీసుకువచ్చింది. కాలవ్యవధి ప్రాతిపదికన ఇచ్చే రుణాల (టర్మ్‌ లోన్ల) మంజూరుకు బ్యాంకులను అనుమతించడం ఆర్థిక సేవల రంగంలో అతి ప్రధానమైంది. దీంతో డీఎఫ్‌ఐల నియంత్రణ చట్టం అవసరం తీరిపోయింది. ఆ తరవాత అది లాంఛనంగా రద్దయింది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు దివంగత ప్రియరంజన్‌ దాస్‌మున్షీ ఒక్కరే ప్రభుత్వ చర్యను వ్యతిరేకించారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆయన ఆనాడు సూచించారు. ఆ సూచనను ప్రస్తుత ప్రభుత్వం అమలు చేసింది. టర్మ్‌ లోన్‌ సహజంగానే రిస్కుతో కూడుకుని ఉంటుంది. అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థకు టర్మ్‌ రుణాలు కీలకం. అంతగా ఆస్తుల దన్ను లేని చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వర్ధమాన వ్యవస్థలో అధికంగా ఉంటారు. వారి భారీ లక్ష్యాల సాధనకు టర్మ్‌ రుణాలే మార్గం. గడచిన దశాబ్దంలో అంతగా ప్రాచుర్యంలో లేని ప్రమోటర్లు నెలకొల్పిన అనేక థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు ఆధారం కాలావధి రుణాలే. ప్రధాన రహదారుల నిర్మాణానికీ ఇవే శరణ్యం. ప్రాజెక్టుల అమలులో అంచనాలు తప్పినప్పుడు, రుణదాతలు తమ బాకీలు రాబట్టుకునే అవకాశాలు మృగ్యమవుతాయి.

‘టర్మ్‌ రుణాల మంజూరీ’ నైపుణ్యంతో కూడుకున్న ప్రత్యేక వ్యవహారం. వాజ్‌పేయీ (1998-2004), మన్మోహన్‌ సింగ్‌ (2004-2009) ప్రభుత్వాలు చేపట్టిన బ్యాంకింగ్‌ సంస్కరణలను తప్పు పట్టాల్సిన పని లేదు. కాని, ఈ రెండు జమానాలూ నైపుణ్య సంస్థల ప్రాధాన్యం గుర్తించలేదు. దీర్ఘకాలిక రుణపత్రాల విపణి వర్ధిల్లలేదు. పరపతి విస్తరణపై రిజర్వు బ్యాంకు విధించిన ఆంక్షలు ఇలాంటి విపణి అభివృద్ధికి ఆటంకంగా నిలిచాయి. 2004-09 నాటి ఆర్థిక ప్రభంజనంలో తామూ లబ్ధి పొందాలన్న తాపత్రయంతో- చిన్నాచితకా బ్యాంకులన్నీ కూటములుగా ఏర్పడి వేలంవెర్రిగా కాలావధి రుణాలు ఇచ్చాయి. రెండు మూడేళ్ల స్వల్పకాలిక డిపాజిట్లను- 15 ఏళ్ల దీర్ఘకాలిక వ్యవధిలో గానీ ప్రతిఫలాలు దక్కని రహదారి నిర్మాణ పథకాల్లో అవి మదుపు చేశాయి. రహదారి నిర్మాణ ప్రాజెక్టులు అనుకున్న సమయానికి భూసేకరణ చేయలేక తీవ్రంగా దెబ్బతిన్నాయి. అలాగే, లాభసాటి ధరకు తగినంత విద్యుత్తును విక్రయించుకోలేక విద్యుదుత్పత్తి సంస్థలు నష్టపోయాయి. దీంతో, రుణాలు తిరిగి చెల్లించలేక మౌలిక సదుపాయ సంస్థలు దివాలా తీశాయి. బ్యాంకులు మొండిబాకీల్లో పీకల్లోతు మునిగిపోయాయి. 2014లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసిన తరుణంలోనే మోదీ ప్రభుత్వానికి ఈ సమస్య ఎదురైంది. పరిష్కారంగా ప్రవేశపెట్టిన ‘హైబ్రీడ్‌ యాన్యుటీ మోడల్‌’ కూడా బ్యాంకులను ఆకర్షించలేకపోయింది. చివరకు, ఈపీసీ(ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌) విధానాన్ని తెరపైకి తెచ్చింది. దీనికింద, జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) లేదా జాతీయ రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌) స్వయంగా నిధులు సమకూరుస్తాయి. ప్రైవేటు రంగం గుత్తేదారు పాత్ర పోషిస్తుంది.

ప్రాజెక్టుల ద్వారా ధనప్రవాహం

ఈ సమస్య పరిష్కారం కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రధానంగా మూడు అవకాశాల మీద దృష్టి సారించారు. వీటిలో మొదటిది, ప్రాజెక్ట్‌ మానిటైజేషన్‌. అంటే, ప్రాజెక్టులను డబ్బు రూపంలోకి మార్చుకోవడం. ఇందులో ఇప్పటికే పూర్తి అయిన మౌలిక సదుపాయాల పథకాలకు విలువ కట్టి ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తారు. ప్రైవేటు రంగం వాటి అంతిమ వినియోగదారుల నుంచి ఆదాయం రాబడుతుంది. ఇలా చేయడం వల్ల ప్రాజెక్టులు నిర్మించిన ఎన్‌హెచ్‌ఏఐ, ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌ సంస్థలు ఆర్థికంగా పరిపుష్టమై మరిన్ని భవిష్యత్‌ పథకాలను అమలు చేయగలుగుతాయి. ఇది కొత్త భావన. దృఢమైన రుణ విపణి ఆవిర్భావానికీ నిర్మలా సీతారామన్‌ అంతే ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఇదంత సులభం కాదు. ఈ దిశగా తొలుత మౌలిక సదుపాయాల మదుపు సంస్థలను, రియల్‌ ఎస్టేట్‌ మదుపు సంస్థలు ఏర్పాటు చేయాలన్నది ఆర్థిక మంత్రి ప్రతిపాదన. సంస్థాగత మదుపుదారులకు ఇవి దీర్ఘకాలిక పెట్టుబడి అవకాశాలు కల్పిస్తాయని, తద్వారా పథకాలకు నిధుల లభ్యత పెరుగుతుందని ఆమె భావిస్తున్నారు. ఇవి వివిధ మార్గాల ఆన్వేషణలో భాగం మాత్రమే. ఎంతవరకు విజయవంతం అవుతాయన్నది వాటి అమలులో ఉండే సాధకబాధకాలపై ఆధారపడి ఉంటుంది. ఏమైనప్పటికీ, డీఎఫ్‌ఐ ఏర్పాటు ప్రతిపాదన- టర్మ్‌ రుణాల సంస్కృతి మీద, వాటి మంజూరుకు కావాల్సిన నైపుణ్యాల పునరుద్ధరణ మీద ప్రభుత్వ ఆసక్తిని వెల్లడిస్తోంది. ఆర్థికమంత్రి ఈ సందర్భంగా ప్రైవేటు రంగం గురించి ప్రస్తావించి, ప్రభుత్వం దోహదకారిగా ఉంటుందే తప్ప గుత్తాధిపత్యం వహించదన్న సుస్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. ఇది మంచి పరిణామం.

- ప్రతీమ్‌ రంజన్‌ బోస్‌
(మౌలిక రంగ నిపుణులు)

Posted Date: 16-02-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం