• facebook
  • whatsapp
  • telegram

దక్షతే శ్రీరామరక్ష

పీఎస్‌బీల ప్రైవేటీకరణే మార్గం కారాదు

రెండు ప్రభుత్వరంగ బ్యాంకు(పీఎస్‌బీ)లను ప్రైవేటీకరించాలని 2021-22 కేంద్ర బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించినప్పటి నుంచి బ్యాంకింగ్‌ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం ఏయే బ్యాంకులను ప్రైవేటుపరం చేయనుందోనన్న విషయమై కొన్ని రోజులుగా ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి 2020లో జరిగిన పీఎస్‌బీల మెగా విలీనం అనంతరం విలీనాల నుంచి మినహాయింపు పొందిన కొన్ని చిన్న బ్యాంకులను ప్రైవేటీకరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొన్ని ప్రముఖ పీఎస్‌బీలలో ప్రభుత్వం తన వాటాను క్రమంగా తగ్గించుకొంటోంది. గతంలో పీకే నాయక్‌ కమిటీ సైతం పీఎస్‌బీలలో ప్రభుత్వ వాటాను 51శాతం దిగువకు తగ్గించాలని సిఫార్సు చేసింది. పీఎస్‌బీల నిరర్థక ఆస్తులు అనూహ్యంగా పెరుగుతున్నందువల్ల ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాటికి పెద్దయెత్తున మూలధనాన్ని సమకూర్చాల్సి వస్తోంది. తత్ఫలితంగా ప్రభుత్వంపై ఆర్థికభారం పెరుగుతోంది. ముఖ్యంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 9.5శాతానికి పెరుగుతుందన్న అంచనాల మధ్య- ప్రభుత్వం పీఎస్‌బీలకు గతంలో మాదిరి పెద్దయెత్తున మూలధనాన్ని సమకూర్చడం సాధ్యంకాదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తొలుత రెండు పీఎస్‌బీలను ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించింది. దేశబ్యాంకింగ్‌ రంగ చరిత్రలో ఇది మరో కీలకనిర్ణయం.

పురోభివృద్ధికి వెన్నుదన్ను

దేశ ఆర్థికాభివృద్ధిలో పీఎస్‌బీల పాత్ర ఎనలేనిది. 1969లో ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేసిన తరవాత దేశ బ్యాంకింగ్‌ రంగ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. అప్పటిదాకా కేవలం కొద్దిమంది సంపన్నులకు, ప్రముఖులకే పరిమితమైన బ్యాంకింగ్‌ సేవలు జాతీయీకరణ అనంతరం అందరికీ అందుబాటులోకి వచ్చాయి. బ్యాంకుల శాఖలు దేశవ్యాప్తంగా పల్లెపల్లెకూ విస్తరించడంలో పీఎస్‌బీలు పోషించిన కీలకమైన పాత్రను విస్మరించలేం. అదేవిధంగా ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పలు ఆర్థిక, సామాజిక, సంక్షేమ పథకాల అమలులో పీఎస్‌బీల పాత్ర శ్లాఘనీయం. పేదలకు, అట్టడుగు వర్గాలకు సైతం బ్యాంకు రుణాలు అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వాలు గతంలో చేపట్టిన, ఇప్పుడు చేపడుతున్న రుణ పథకాల అమలును పీఎస్‌బీలు లేకుండా ఊహించలేం. ఎనిమిదో దశకం నాటి ప్రభుత్వ హయాములో అంకురారోపణ జరిగిన ‘రుణ మేళాలు’ మొదలుకొని- 2019లో నిర్వహించిన రుణమేళా వరకు అన్నింటా పీఎస్‌బీలే ముందుండి నడిపించాయి. ప్రాధాన్య రంగంలో (వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ, ఎంఎస్‌ఎంఈ, ఎగుమతుల రుణాలు, విద్య, గృహరుణాలు, సామాజిక మౌలిక వసతుల కల్పన రుణాల వంటివి...) రుణాల వితరణలో లక్ష్యాలను సాధించిన ఘనత పీఎస్‌బీలదే.

గడచిన దశాబ్దకాలంలో పీఎస్‌బీల ప్రాభవం మసకబారింది. పారుబాకీలు అనూహ్యంగా పెరిగి ఒకప్పటి దిగ్గజ పీఎస్‌బీలు సైతం నష్టాలపాలయ్యాయి. కొన్ని పీఎస్‌బీలకు పెద్దయెత్తున మూలధనం సమకూర్చాల్సి రావడంతో అవి ప్రభుత్వానికి భారంగా మారాయి. పీఎస్‌బీలు ఈ స్థితికి దిగజారడానికి పలు కారణాలున్నాయి. గతంలో కార్పొరేట్‌ రంగానికి విచక్షణారహితంగా  రుణవితరణ చేయడం, మితిమీరిన రాజకీయ జోక్యం, బ్యాంకుల ఉన్నతాధికారుల్లో చోటుచేసుకున్న అవినీతి, కార్పొరేట్‌ రంగంలో జరిగిన భారీ కుంభకోణాలు, కొవిడ్‌ ప్రేరేపిత మాంద్యం... వెరసి- పీఎస్‌బీల పరిస్థితి సంక్లిష్టంగా మారింది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచి సామాజిక బ్యాంకింగ్‌కు మారుపేరైన పీఎస్‌బీలు అత్యంత గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. పీఎస్‌బీల ఏకీకరణ లేదా స్థిరీకరణలో భాగంగా ఇప్పటికే మెగా విలీనాల ప్రక్రియను ప్రభుత్వం పూర్తిచేసింది. దేశంలో అంతకుముందున్న 27 పీఎస్‌బీలను 12కు కుదించింది. ఇప్పుడు రెండు పీఎస్‌బీలను ప్రైవేటీకరించేందుకు సిద్ధమవుతోంది. అప్పటి జాతీయీకరణను తిరగరాసి మళ్ళీ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం ఒకవైపు ‘బ్యాడ్‌ బ్యాంక్‌’ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతూ మరోవైపు పీఎస్‌బీల ప్రైవేటీకరణను వేగవంతం చేస్తోంది. ఒకసారి బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పడితే కొన్ని పీఎస్‌బీల అధికశాతం పారుబాకీలను ఆ బ్యాంకుకు బదిలీ చేసి ఆయా బ్యాంకు బ్యాలన్స్‌ షీట్లను ప్రక్షాళన చేసే వెసులుబాటు కలుగుతుంది. పీఎస్‌బీల పారుబాకీలు గణనీయంగా తగ్గడం వల్ల వాటికి కొత్తగా రుణాలనిచ్చే వీలుంటుంది. ఇదంతా జరగాలంటే మరికొంత సమయం పట్టవచ్చు.

పనితీరు మారాలి

గతంలో జరిగిన మెగా విలీనాల నుంచి మినహాయింపు పొందిన ఆరు బ్యాంకుల (బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌) పనితీరు క్రమంగా మెరుగుపడుతోంది. ముఖ్యంగా ప్రస్తుతం ‘సత్వర దిద్దుబాటు చర్య’ (పీసీఏ- ప్రాంప్ట్‌ కరెక్టివ్‌ యాక్షన్‌) పరిధిలో ఉన్న ఐఓబీ, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాల పనితీరు గడచిన మూడు నాలుగు త్రైమాసికాల్లో గణనీయంగా మెరుగుపడింది. ఐఓబీ 2019 మూడో త్రైమాసికంలో రూ.6,075 కోట్ల నష్టం చవిచూడగా 2020 డిసెంబర్‌ నాటికి రూ.213 కోట్ల నికరలాభం ఆర్జించింది. అదేవిధంగా స్థూల నిరర్థక ఆస్తులు 17శాతం నుంచి 12శాతానికి దిగివచ్చాయి. గతంలో భారీ నష్టాలను మూటగట్టుకున్న సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇప్పుడిప్పుడే లాభాల బాట పడుతోంది. పారుబాకీలు సైతం తగ్గుముఖం పట్టాయి. ఈ బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తులు 16.77శాతం (2019 డిసెంబరు) నుంచి 7.69శాతానికి తగ్గాయి. భవిష్యత్తులో ఈ బ్యాంకుల పనితీరు మరింత మెరుగుపడే అవకాశాలున్నాయి. ఈ తరుణంలో పీఎస్‌బీల ప్రైవేటీకరణ సబబు కాదు. ప్రత్యామ్నాయంగా పీఎస్‌బీలలో ప్రస్తుతం ప్రభుత్వానికున్న వాటాను 51శాతానికి తగ్గించుకోవడం శ్రేయస్కరం. ఈ పద్ధతిలో ప్రభుత్వానికి కొంతమేర నిధులు సమకూరడంతోపాటు ఆ బ్యాంకులు ప్రైవేటుపరం కాకుండా ప్రభుత్వ యాజమాన్యంలోనే కొనసాగే వీలుంటుంది. ఉదాహరణకు ప్రస్తుతం బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, సెంట్రల్‌ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 92శాతానికిపైగా ఉండగా- బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 89శాతం, ఐఓబీలో 96శాతం ఉంది. యూకో బ్యాంకులో 94 శాతందాకా ఉంది. ఈ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను 51శాతానికి తగ్గించుకొనే అవకాశం ఉంది. అదే సమయంలో పీఎస్‌బీలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలి. పీఎస్‌బీలలో పాలనాదక్షతను పెంచి ప్రైవేటురంగానికి దీటుగా పనితీరును మెరుగుపరచుకొనేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. అంతేకాక- దేశంలో ఒక బలమైన ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ వ్యవస్థ కొనసాగడం ఎంతైనా అవసరమన్న వాస్తవాన్ని విస్మరించలేం.

దేశ నిర్మాణంలో అద్వితీయ పాత్ర

ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన మొదలు ముద్రా రుణాల వితరణదాకా పీఎస్‌బీల కృషి ఎంతో ఉంది. ముఖ్యంగా గతంలో పలు ప్రైవేటు బ్యాంకులు విఫలమై సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు- వాటిని విలీనం చేసుకొని ఆయా బ్యాంకుల డిపాజిటర్లను సకాలంలో ఆదుకొని వారి ప్రయోజనాలను కాపాడింది పీఎస్‌బీలేనన్నది జగద్విదితం. 2002 నుంచి 2020దాకా అప్పటి బెనారస్‌ స్టేట్‌బ్యాంక్‌ నుంచి ఇప్పటి యెస్‌ బ్యాంక్‌దాకా ప్రైవేటు బ్యాంకులు విఫలమైనప్పుడల్లా పీఎస్‌బీలు అక్కరకొచ్చాయి.

Posted Date: 26-02-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం