• facebook
  • whatsapp
  • telegram

హద్దుమీరిన సుంకాలు

రాష్ట్రాల పన్నుల వాటాలో కోత

కేంద్ర ప్రభుత్వం సెస్సు విధింపు ద్వారా ఆదాయం సమకూర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. పన్ను వసూళ్ల ద్వారా కేంద్రం సమీకరించిన ఆదాయ మొత్తాన్ని విభాజ్య నిధిగా వ్యవహరిస్తారు. ఆ నిధిలో రాష్ట్రాలకు వాటా ఉంటుంది. ఏ రాష్ట్రం వాటా ప్రకారం ఆ రాష్ట్రానికి ఈ నిధిని పంచి ఇవ్వాలి. మినహాయింపు ఏమిటంటే, సెస్సుల ద్వారా కేంద్రానికి సమకూరే పన్ను ఆదాయాన్ని ఈ నిధిలో కలపరు. రాజ్యాంగంలోని 270 అధికరణ ప్రకారం సెస్సు ఆదాయం పూర్తిగా కేంద్ర భోజ్యం. కాబట్టి సెస్సు వసూళ్లలో రాష్ట్రాలకు వాటా ఉండదు. కొన్ని ప్రత్యేక అవసరాలు, కార్యక్రమాల పేరిట సెస్సును విధిస్తారు. వివిధ రకాల సెస్సుల రూపేణా అదనపు ఆదాయం సంపాదించడం... కేంద్రానికి ఈ మధ్యకాలంలో పరిపాటైంది.  పన్నుల రాబడిలో సెస్సులు, సర్‌ఛార్జీల వాటా గణనీయంగా పెరుగుతోంది. దీంతో, స్థూల పన్నుల రాబడి (గ్రాస్‌ ట్యాక్స్‌ రెవిన్యూస్‌- జీటీఆర్‌)లో తమ భాగం తరిగిపోతోందని 15వ ఆర్థిక సంఘానికి రాష్ట్రాలు మొరపెట్టుకున్నాయి. సెస్సులు మరోవిధంగానూ విమర్శల పాలవుతున్నాయి. ఆరోగ్యం, విద్య, రహదారులు వంటి నిర్దేశిత ప్రజా ప్రయోజనాల కోసం వీటిని వెచ్చించడం లేదన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఎలా ఖర్చవుతున్నాయి?

వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) అమలుతో 17 రకాల సెస్సులు, ఇతర లెవీలు కనుమరుగైనా- మరో 35 లెవీలు ఇంకా కొనసాగుతున్నాయని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (కాగ్‌) నివేదిక వెల్లడిస్తోంది. ఇలాంటి లెవీల ద్వారా 2018-19లో భారీ మొత్తంలో రూ.2.7 లక్షల కోట్ల రాబడి పోగుపడగా, నిర్దేశిత ప్రయోజనాలకు ఉద్దేశించిన రిజర్వు ఖాతాల్లోకి బదిలీ అయిన సొమ్ము కేవలం రూ.1.64 లక్షల కోట్లేనని ‘కాగ్‌’ గుర్తించింది. మిగిలిన 40శాతం నిధులను భారత ప్రభుత్వ సంచిత నిధికి జమ చేశారు. ముడి చమురు మీద విధించిన సెస్సు ద్వారా రూ.1.25 లక్షల కోట్లు వసూలు చేసినా, ఒక్క పైసా కూడా చమురు పరిశ్రమ పరిశోధన అభివృద్ధి సంస్థలకు బదిలీ చేయలేదు. ఆరోగ్యం, విద్య పేరిట ఆదాయం పన్నుపై అయిదు శాతం సెస్సు విధించి సమీకరించిన నిధులను విద్య కోసం పాక్షికంగా కేటాయించినా, ఆరోగ్యం కోసం చిల్లిగవ్వ ఇవ్వలేదు. సామాజిక సంక్షేమం పేరిట వాణిజ్య సుంకాలపై విధించిన సర్‌ఛార్జీ సొమ్ముదీ ఇదే కథ. ఇలాంటి తీవ్రమైన లోటుపాట్లు ఏమరుపాటుగా చోటుచేసుకున్నాయంటే నమ్మడం కష్టం.

కేంద్రం ఉద్దేశపూర్వకంగానే సెస్సుల దారిలో ఆదాయం పెంచుకుంటోందనే వాదన ఉంది. పన్ను రాబడుల విభాజ్య నిధిలో రాష్ట్రాల వాటా 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు 32 శాతం నుంచి 42 శాతానికి పెరిగింది. అయినప్పటికీ కేంద్ర పన్ను వసూళ్లలో రాష్ట్రాలకు వాస్తవంగా దక్కింది 35.7 శాతమే. 2016-17 నుంచి పన్నుల రాబడిలో సెస్సులు, సర్‌ఛార్జీల వాటా పెరగడమే ఇందుకు కారణం. 2013-14లో కేవలం ఆరు శాతం ఉన్న వీటి వాటా 2019-20 నాటికి 13శాతానికి చేరింది. జీఎస్‌టీ అమలు వల్ల రాష్ట్రాలు గణనీయంగా ఆదాయం నష్టపోతే దాన్ని భర్తీ చేయడానికి వసూలు చేసిన జీఎస్‌టీ సెస్సును దీనిలో కలపకుండానే- సెస్సుల రూపేణా ఇంతటి అదనపు రాబడి నమోదైంది. జీఎస్‌టీ సెస్సును సైతం కలిపి లెక్కకడితే- కేంద్ర పన్నుల ఆదాయంలో సెస్సులు, సర్‌ఛార్జీల వాటా 17.8శాతం అవుతుంది. ఇదంతా విభాజ్య నిధిలో చేరదు కనుక రాష్ట్రాలు తమకు దక్కాల్సినదానిలో ఎనిమిది శాతం వాటా కోల్పోయాయి. కేంద్రం అవలంబిస్తున్న ఈ వైఖరి రాష్ట్రాల నిత్య అసంతృప్తికి కారణమవుతోంది. దీనికితోడు, రూ.47,272 కోట్ల జీఎస్‌టీ పరిహార సెస్సు నిధులను ‘గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌’ కింద ఇవ్వడం రాష్ట్రాలకు పుండు మీద కారం చల్లినట్లయింది. జీఎస్‌టీ వచ్చిన తొలి రెండేళ్లకు ఈ సెస్సు నిధుల్లో వాటా  పొందడం వాటి న్యాయబద్ధమైన హక్కు. దాన్ని కూడా కేంద్రం గుర్తించలేదు. ఇలాంటి ధోరణితో కేంద్రం- రాష్ట్రాల ఆర్థిక సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి.

హేతుబద్ధత అవసరం

సెస్సులపై ఆధారపడే బదులుగా అదనపు వనరుల సమీకరణ కోసం పన్ను వసూళ్ల సామర్థ్యం పెంచుకోవాలని, పన్నుల పరిధి విస్తరించాలని నిపుణులు సూచిస్తున్నారు. సెస్సుల సంఖ్యపై పరిమితి ఉండితీరాలి. అంతేకాదు, స్థూల పన్నుల రాబడి (జీటీఆర్‌)లో సెస్సుల శాతం మీదా ఆంక్ష విధించుకోవాలి.  35 రకాల సెస్సుల ఆదాయాన్ని ప్రాధాన్య ప్రాతిపదికన సద్వినియోగమయ్యేలా పర్యవేక్షించడమూ అంత తేలికైన వ్యవహారం కాదు. సమయానుసారంగా సెస్సులపై సమీక్ష జరపాలి. దీనివల్ల, వాస్తవ వసూళ్లు, వ్యయాలపై స్పష్టత లభిస్తుంది. చిన్నా చితకా సెస్సుల నిర్వహణ ఆర్థికంగా నష్టదాయకం. రూ.50 కోట్ల ఆదాయం సైతం ఉండని సెస్సులను రద్దు చేయడం సబబు. ఒక సెస్సును కొనసాగించడం ఎంత వరకు సమంజసమో అనుభవం ప్రాతిపదికన నిర్ణయించాలి. సెస్సు నిధుల వినియోగానికి అయిదేళ్ల కాలపరిమితి పెట్టాలి. ప్రతిపాదించిన ప్రయోజనం కోసం ఖర్చు చేయనట్లయితే అది పన్ను చెల్లింపుదారును వంచించినట్లే!  స్వచ్ఛ భారత్‌ సెస్సును ఇందుకు ఉదాహరణగా తీసుకోవాలి. 2017 జులై 1న ఈ సెస్సు రద్దయింది. విచిత్రమేమిటంటే ఆ తరవాతా ఈ సెస్సు కింద రూ.2,100 కోట్లు వసూలు అయ్యాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ఆర్‌టీఐ దరఖాస్తుదారుకు ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. అయితే, స్వచ్ఛ భారత్‌ సెస్సు వసూళ్ల ఆదాయాన్ని ఎక్కడ ఎలా వ్యయం చేశారో ప్రభుత్వం చెప్పడంలేదు. సెస్సు వసూళ్ల నిర్వహణలో మరింత పారదర్శకతకు చోటుపెట్టాలి. రాష్ట్రాలనూ భాగస్వాములుగా చేసుకుని ముందుకు సాగాలి. అప్పుడే సెస్సు నిధులు సద్వినియోగం అవుతాయి.

- డాక్టర్‌ ఎన్‌.వి.ఆర్‌. జ్యోతి కుమార్‌
(మిజోరం కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వాణిజ్య శాఖాధిపతి)

 

Posted Date: 06-03-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం