• facebook
  • whatsapp
  • telegram

డిజిటల్‌ కరెన్సీ దిశగా భారత్‌!

అదేబాటలో పలు దేశాలు

కొవిడ్‌ దెబ్బకు వ్యాపారాలు, ఉద్యోగాలు గల్లంతై ప్రజల కొనుగోలు శక్తి దెబ్బతిన్నది. దాన్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వాలు ప్రకటించిన భారీ ఉద్దీపన పథకాల వల్ల ద్రవ్యోల్బణం పెరిగి, కరెన్సీ విలువ పడిపోయి, బ్యాంకింగ్‌ రంగం సుస్థిరతపైనా అనుమానాలు మొదలయ్యాయి. మంచి పెట్టుబడి సాధనాలు అనుకున్న బంగారం, షేర్ల ధరలూ ఒడుదొడుకులకు లోనయ్యాయి. వీటికన్నా బిట్‌కాయిన్‌, ఎథీరియం వంటి క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడి పెట్టడం భద్రమనే భావన బలపడింది. ప్రపంచంలోని అతిసంపన్నులలో ఒకరైన టెస్లా కంపెనీ అధిపతి ఎలాన్‌ మస్క్‌ తాను ఇప్పటికే బిట్‌ కాయిన్లలో 150 కోట్ల డాలర్లు మదుపు చేశానని వెల్లడించారు. అంతేకాదు తమ టెస్లా ఎలక్ట్రిక్‌ కార్లకు బిట్‌ కాయిన్‌లో చెల్లింపులు స్వీకరిస్తాననీ ప్రకటించి బిట్‌ కాయిన్‌ ధర విపరీతంగా పెరగడానికి ప్రేరకులయ్యారు. ఈ నెల తొమ్మిదో తేదీ నాటికి ఒక్కో బిట్‌ కాయిన్‌ ధర 34,67,000 రూపాయలకు (47,493 డాలర్లకు) చేరింది. ఈ సంవత్సరంలోనే ఈ ధర లక్ష డాలర్లను మించిపోతుందని మార్కెట్‌ పండితులు జోస్యం చెబుతున్నారు. ప్రపంచంలో చలామణీలో ఉన్న 6,000 పైచిలుకు క్రిప్టో కరెన్సీల మార్కెట్‌ విలువ ఇప్పటికే లక్షా 24 వేల కోట్ల డాలర్లను (90 లక్షల కోట్ల రూపాయలను) మించిపోయింది. వీటిలో ఒక్క బిట్‌ కాయిన్‌ మార్కెట్‌ విలువే ఈ నెల రెండో తేదీకి 66,100 కోట్ల డాలర్లను (48.3 లక్షల కోట్ల రూపాయలను) అందుకొంది. ఇది ప్రపంచంలో అతిపెద్ద చెల్లింపుల సంస్థ వీసా, అతిపెద్ద చిల్లర వర్తక సంస్థ వాల్‌మార్ట్‌ మార్కెట్‌ విలువలకన్నా ఎంతో ఎక్కువ. వీసా సంస్థ బిట్‌ కాయిన్‌ను డిజిటల్‌ బంగారంగా అభివర్ణిస్తూ, ప్రపంచవ్యాప్తంగా తన భాగస్వాములైన ఏడు కోట్ల వ్యాపారులు, సంస్థలు, బ్యాంకుల నుంచి బిట్‌ కాయిన్లు కొనుగోలు చేసే అవకాశాన్ని ఖాతాదారులకు కల్పించదలచింది.

ప్రభుత్వాల కన్నెర్ర

క్రిప్టో కరెన్సీ పూర్తిగా ప్రైవేటు కరెన్సీ. రూపాయలు, డాలర్లు ప్రభుత్వాల పూచీకత్తుపై విడుదలయ్యే సాధికార కరెన్సీలు. మీ వద్ద 100 రూపాయల నోటు ఉంటే, ఆ కరెన్సీ కాగితం విలువకు సమానమైన వస్తుసేవలు కొనుక్కోవచ్చని రిజర్వు బ్యాంకు భరోసా ఇస్తుంది. రేపు అది విడుదల చేసే సాధికార డిజిటల్‌ రూపాయికీ అదే పూచీకత్తు లభిస్తుంది. కానీ, ప్రైవేటు ధనమైన క్రిప్టో కరెన్సీకి అలాంటి సార్వభౌమ భరోసా లేదు. ఇప్పటికే క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, యూపీఐ, క్యూఆర్‌ కోడ్‌ల ద్వారా జరుపుతున్న చెల్లింపులు డిజిటల్‌ కరెన్సీ కావు. ఈ చెల్లింపులు మన బ్యాంకు ఖాతాల నుంచి జరుగుతాయి. మన ఖాతాలోని ధనాన్ని ఏటీఎం నుంచి కానీ, చెక్కుల రూపంలోగానీ ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు. క్రిప్టోకరెన్సీ విషయలో అది కుదరదు. మరి అలాంటి ప్రైవేటు కరెన్సీ వల్ల ఉపయోగమేమిటనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రభుత్వ విధానాల వల్ల కరెన్సీ విలువ పడిపోతోందని భావిస్తున్నవారు బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే క్రిప్టోకరెన్సీలవైపు మొగ్గు చూపుతున్నారు. చిత్తానుసారం క్రిప్టోకరెన్సీ విలువను మార్చడానికి ఈ సాంకేతికతలో వీలుండదు. కానీ, క్రిప్టోకరెన్సీలు తమ సార్వభౌమాధికారానికి భంగకరమని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అందుకే భారత ప్రభుత్వం బిట్‌ కాయిన్‌ వంటి ప్రైవేటు క్రిప్టోకరెన్సీలను నిషేధించి, రిజర్వు బ్యాంకు చేతులమీదుగా సాధికార డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టదలచినట్లు ఇటీవల విడుదలైన లోక్‌సభ బులెటిన్‌ తెలిపింది. బడ్జెట్‌ సమావేశాల్లో పార్లమెంటు ఆమోదం కోసం వేచివున్న 20 బిల్లుల్లో క్రిప్టోకరెన్సీ నిషేధ బిల్లూ ఒకటి.

నిషేధం మాటేమిటి?

ప్రస్తుతం దాదాపు అన్ని అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలు అమెరికన్‌ డాలర్లలో జరుగుతున్నాయి. ఆసియా, ఆఫ్రికాలతోపాటు ఐరోపాలో కూడా భారీ పెట్టుబడులు పెట్టి, ప్రపంచంలో అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించిన చైనా మున్ముందు తన లావాదేవీలు డిజిటల్‌ యువాన్లలో జరగాలని ఆశిస్తోంది. గత నెల 16న బీజింగ్‌లో రిజిస్టరైన ఫైనాన్స్‌ గేట్‌ వే ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌ సంస్థ ద్వారా చైనా ఆకాంక్ష నెరవేరే అవకాశం ఉంది. ఈ సంస్థలో 55 శాతం వాటాలు స్విఫ్ట్‌ మెసేజింగ్‌ సిస్టమ్‌వి, పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనాకు చెందిన జాతీయ క్లియరింగ్‌ కేంద్రం 34 శాతం వాటాలు తీసుకుంది. ప్రపంచంలోని ప్రధాన బ్యాంకులు డబ్బు బదిలీకి స్విఫ్ట్‌ సేవలను ఉపయోగించుకుంటాయి. అంతర్జాతీయ క్రయవిక్రయాలకు చెల్లింపులు స్విఫ్ట్‌ ద్వారా డాలర్లలో జరుగుతున్నాయి. స్విఫ్ట్‌, చైనాలు తాజాగా ఏర్పరచిన సంయుక్త సంస్థ- ఫైనాన్స్‌ గేట్‌ వే ఉత్తరోత్రా డిజిటల్‌ యువాన్‌లలో అంతర్జాతీయ చెల్లింపులు జరగడానికి వీలు కల్పిస్తుంది. ఇంతవరకు స్విఫ్ట్‌లో అమెరికాకు అపరిమిత అధికారాలు ఉన్నాయి కాబట్టి, తనకు గిట్టని ఇరాన్‌, రష్యా, వెనెజులా వంటి దేశాల ఎగుమతులు, దిగుమతులకు డాలర్లలో చెల్లింపులు జరగకుండా ఆంక్షలు విధించగలుగుతోంది. అలాంటి ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి చైనా నేరుగా స్విఫ్ట్‌తో చేతులు కలిపి డిజిటల్‌ యువాన్‌ను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి అడుగులు వేస్తోంది. మొదట ఆగ్నేయాసియా దేశాల సంఘం(ఆసియాన్‌)తో డిజిటల్‌ యువాన్లలో లావాదేవీలు జరపవచ్చు. తరవాత ఆఫ్రికాలో ఈ పద్ధతిని ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. క్రిప్టో కరెన్సీలను నిషేధిస్తే విదేశీ పెట్టుబడుల ప్రవాహం దెబ్బతింటుంది కదా అని కొందరు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. చివరకు ఇదంతా చైనాకు, ప్రపంచ పెట్టుబడిదారులకు మధ్య పోటీగా పరిణమిస్తుందా? భారత్‌ డిజిటల్‌ రూపాయిని ప్రవేశపెట్టేటప్పుడు అన్ని అంశాలనూ బేరీజు వేసుకోవడం శ్రేయస్కరం.

పరుగు ప్రారంభం

ప్రపంచంలో కేంద్ర బ్యాంకు ఆమోదంతో మొట్టమొదటి డిజిటల్‌ కరెన్సీని విడుదల చేసిన ఘనత- బహమాస్‌ ప్రభుత్వానిది. గత అక్టోబరులో విడుదలైన ఈ డిజిటల్‌ కరెన్సీని శాండ్‌ డాలర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రపంచంలో 80 శాతం కేంద్ర బ్యాంకులు (భారతీయ రిజర్వు బ్యాంకుతోసహా) డిజిటల్‌ కరెన్సీపై పరిశోధన, ప్రయోగాలు జరుపుతున్నాయని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్‌మెంట్స్‌ (బీఐఎస్‌) వెల్లడించింది. వీటిలో అమెరికా, బ్రిటన్‌, కెనడా, జపాన్‌ కేంద్ర బ్యాంకులు కూడా ఉన్నాయి. ఐరోపా కేంద్ర బ్యాంకు కూడా ఈ ఏడాది డిజిటల్‌ యూరో ప్రాజెక్టును మొదలుపెట్టనుంది. లిథువేనియా, స్వీడన్‌, దక్షిణ కొరియా, కంబోడియా, బ్రెజిల్‌ కూడా అదే బాటలో ఉన్నాయి. చైనా ఇప్పటికే తన డిజిటల్‌ యువాన్‌తో షాంఘై, షెంజెన్‌, సుఝౌ, చెంగ్డు నగరాల్లో పైలట్‌ ప్రాజెక్టులు నిర్వహించింది. ఈ ఏడాదే తమ కేంద్ర బ్యాంకు అండతో డిజిటల్‌ యువాన్‌ను ప్రవేశపెట్టదలచింది. దీనికి ముందు చైనా అన్ని ప్రైవేటు క్రిప్టోకరెన్సీలను నిషేధించింది. వాటిలో లావాదేవీలు జరపకూడదని, పెట్టుబడులు పెట్టకూడదని ఆదేశించింది.

- ఏఏవీ ప్రసాద్‌
 

Posted Date: 12-03-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం