• facebook
  • whatsapp
  • telegram

ఆశ్రిత పక్షపాతంతో అనర్థం

పెట్టుబడిదారీ విధానంలో పెడ ధోరణులు

పాలక వర్గాలు పెట్టుబడిదారీ వ్యవస్థలో ‘వ్యాపార మిత్రులకు’ జాతి సంపదను దోచిపెట్టే ఆశ్రిత పక్షపాత ధోరణి (క్రోనీ క్యాపిటలిజం) ఒక వికృత పార్శ్వం. ఈ విధానంలో ప్రభుత్వం తనకు కావలసినవారికి గ్రాంట్లు, పన్ను మినహాయింపులు, అనుచిత పర్మిట్లు, ముందే నిర్ధారించిన టెండర్లు, ప్రోత్సాహకాలు... ఇలా పలు రూపాల్లో లాభం సమకూరుస్తుంది. పాలకవర్గ అనుంగు వ్యాపారవేత్తలు ప్రభుత్వాలను తమ చెప్పుచేతల్లో పెట్టుకుంటారు. ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తారు. ప్రజాశ్రేయం, జాతీయ ప్రయోజనాలు పణంగా పెట్టి వ్యక్తిగత సంపదను అపారంగా పెంచుకుంటారు. రాజకీయ వ్యాపారవర్గాల నడుమ బిగిసే అపవిత్ర బంధం వ్యాపార విజయానికి ఆధారంగా మారుతుంది. ఆశ్రిత పక్షపాత పెట్టుబడిదారీ విధానంలో పన్ను రాయితీలు, బ్యాంకుల అక్రమ రుణాల రూపేణా భారీ ఆర్థిక మూల్యం చెల్లించాల్సి వస్తుంది. దీంతో, మానవాభివృద్ధికి కొలమానాలైన వైద్యం విద్య వంటి రంగాలకు కేటాయింపులు క్షీణిస్తాయి. ఇది సామాజిక మూల్యం.  

స్కాముల భారతం

‘ది ఎకనమిస్ట్‌’ పత్రిక 2016 సంవత్సరానికి నిర్వహించిన అధ్యయనం ప్రకారం, 22 దేశాలతో కూడిన క్రోనీ క్యాపిటలిజం సూచీలో భారత్‌ (2014లో మాదిరిగానే) తొమ్మిదో స్థానంలో ఉంది. దేశంలోని క్రోనీ వ్యాపార సంపద విలువ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.4 శాతాన్ని ఆక్రమించింది. ఆర్థిక వ్యవస్థలో ప్రజల జీవనం క్రోనీ క్యాపిటలిజం వల్ల ఎంత దుర్భరంగా మారిందో ఈ అధ్యయనం వెల్లడిస్తోంది. 1991లో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణల అనంతరం... ప్రైవేటు సంస్థలు అప్పటివరకు ప్రభుత్వరంగానికే పరిమితమైన అనేక రంగాల్లోకి చొచ్చుకువచ్చాయి. ప్రభుత్వ రంగ సంస్థలకు, ప్రైవేటు కంపెనీలకు- ప్రభుత్వ విధానాలు, నియంత్రణల పరంగా సమాన వ్యాపార అవకాశాలు ఉండేలా చూసేందుకు సెబీ, ఐఆర్‌డీఏ, ట్రాయ్‌ వంటి స్వతంత్ర నియంత్రణ సంస్థలు ఏర్పాటయ్యాయి. హర్షద్‌ మెహతా స్టాక్‌ మార్కెట్‌ కుంభకోణం (1992), హవాలా కుంభకోణం (1996) వంటి కొన్ని అపశ్రుతులను మినహాయిస్తే, దేశ ఆర్థిక వ్యవస్థ 1990లలో ఉదారవాద విపణి-ఆధారిత పెట్టుబడిదారీ విధానంలోకి సాఫీగానే ప్రవేశించినట్లు కనిపించింది. కాలక్రమేణా పరిస్థితి మారిపోయింది. 21వ శతాబ్దంలోకి ప్రవేశించేసరికి ఎన్నో కుంభకోణాలు బయటపడుతున్నాయి. కొందరు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు సహా ప్రభుత్వ నేతలకు క్రోనీ క్యాపిటలిస్టులకు మధ్య నెలకొన్న అపవిత్ర బంధమే దాదాపు ఈ స్కాములన్నింటికీ మూల కారణంగా వెలుగులోకి వచ్చింది. 2జి స్పెక్ట్రం కేటాయింపు (2008), సత్యం కంప్యూటర్స్‌ (2009), కామన్వెల్త్‌ క్రీడలు (2010), బొగ్గు గనుల కేటాయింపు (2012), బళ్లారి గనుల (2006-10) కుంభకోణాలు ఎంతో సంచలనం సృష్టించాయి. కృష్ణ-గోదావరి బేసిన్‌ వివాదం (2011), నీరవ్‌ మోదీ పీఎన్‌బీ మోసం కేసు (2018) తదితర భారీ స్కాములతో దేశ ప్రతిష్ఠ మసకబారింది. ఖజానాకు భారీగా నష్టం వాటిల్లింది. వీటి ఫలితంగా భారత సంపద పంపిణీలో తీవ్రమైన అసమానతలు చోటు చేసుకున్నాయి.

ప్రభుత్వం-వ్యాపారం మధ్య నెలకొన్న అపవిత్ర బంధంతో పెచ్చరిల్లిన అవినీతి 2014 లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏ-2 ప్రభుత్వాన్ని బలితీసుకుంది. వ్యాపార సౌలభ్యం ధ్యేయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపడుతున్న సంస్కరణల తీరు పట్ల వ్యాపార వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవలి పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఎల్‌ఐసీ వంటి అత్యంత సమర్థ, లాభదాయక సంస్థలనూ ఈ జాబితాలో చేర్చిన మోదీ మెగా ప్రైవేటీకరణ పథకం- అంతిమంగా కొన్ని వ్యాపార కుటుంబాలకు అనుచిత ప్రయోజనం చేకూర్చుతుందన్న ఆందోళనకు దారి తీసింది. విశాఖ ఉక్కు ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పారదర్శకతతో వ్యవహరించలేదన్న భావన అన్ని వర్గాల ప్రజల్లో కలకలం సృష్టించింది. ప్రభుత్వాలు ఇలాంటి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునేప్పుడు, వాటిని అమలు చేసేప్పుడు మరింత పారదర్శకతతో, హేతుబద్ధతతో వ్యవహరించి అందరినీ పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది.

నిర్మూలన ఎలా?

ఈ అంశం మీద 2017లో చిరంజీబ్‌ సేన్‌ (అజీం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం) అధ్యయనం జరిపి ఏకకాలంలో అమలు చేయాల్సిన చతుర్మఖ వ్యూహాన్ని సూచించారు. రాజకీయ పక్షాలు విరాళాలు తీసుకునే పద్ధతిలో, విధాన నిర్ణయ ప్రక్రియలో సంస్కరణలు, ఆడిట్‌ సంస్థలను పటిష్ఠపరచడం, వ్యాపార వాతావరణంలో సంస్కరణలు ఆయన సూచించిన వ్యూహంలోని నాలుగు పార్శ్వాలు. రాజకీయ పక్షాలు విరాళాలు స్వీకరించే విధానంలో మార్పు తీసుకురావడం వీటిలో మొదటిది. పాలకవర్గానికి మిత్రులైన వ్యాపారవేత్తలు ఎన్నికలకు నిధులు సమకూర్చడమే క్రోనీ క్యాపిటలిజానికి దారి తీస్తోందన్న భావన ఉంది. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫార్మ్స్‌ దీనిపై అధ్యయనం జరిపి, ప్రధాన రాజకీయ పక్ష్లాలకు 73శాతం విరాళాలు ‘అజ్ఞాత వనరుల’ ద్వారా సమకూరుతున్నట్లు తేల్చింది. రాజకీయ విరాళాల వ్యవస్థలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని ప్రవేశపెట్టడం తక్షణావసరం.

రెండోది- ఎలాంటి పెట్టుబడుల ఉపసంహరణ అయినా నిర్ణయ ప్రక్రియను మరింత పారదర్శకతకు, సంప్రతింపులకు, ప్రాతినిధ్యానికి వీలు కల్పించేదిగా తీర్చిదిద్దడం. ఈ ప్రక్రియకు తూట్లు పొడవటం వల్లే బొగ్గు కుంభకోణం జరిగినట్లు కాగ్‌ గుర్తించింది. మూడోది- కాగ్‌ వంటి ఆడిట్‌ సంస్థలను, ప్రజా పద్దుల సంఘం (పీఏసీ) వంటి పార్లమెంటరీ వేదికలను బలోపేతం చేయడం. స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో ఆహారం, వైద్యం, విద్య వంటి రంగాల్లో అమలవుతున్న ప్రభుత్వ భారీ పథకాల్లో వినోద్‌ రాయ్‌- కాగ్‌ అధిపతిగా ఉన్నప్పుడు సామాజిక తనిఖీ విధానం ప్రవేశపెట్టారు. ఇది మంచి పద్ధతి. నాలుగోది- వ్యాపార వాతావరణంలో మార్పులు తీసుకురావలసిన అవసరంఉంది. ఇందుకోసం నియంత్రణ సంస్థలను బలోపేతం చేయాలి. బ్యాంకింగ్‌ వ్యవస్థను క్రోనీ పెట్టుబడిదారులు ప్రభావితం చేయకుండా అదుపు చేయాలి. ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బాకీల్లో వీరి వాటాయే ఎక్కువగా ఉంటోంది. ఆస్తిఅప్పుల పట్టికలను ప్రక్షాళన చేసేలా బ్యాంకుల పట్ల రిజర్వు బ్యాంకు క్రియాశీలక పాత్ర వహించాలి. 

కొందరి చేతుల్లోనే అత్యధిక సంపద

ఆక్స్‌ఫామ్‌ నివేదిక (2020) ప్రకారం... 63 మంది భారతీయ సంపన్నుల సంపద 2018-19 జాతీయ బడ్జెట్‌ కంటే అధికం. జీడీపీలో సంపన్నుల సంపద శాతం అత్యధికంగా ఉన్న దేశాల సరసన భారత్‌ కూడా చేరింది. వారి సంపదలో 60 శాతం వరకు స్థిరాస్తి వ్యాపారం, నిర్మాణ-మౌలిక సదుపాయాలు, నౌకాశ్రయాలు, ప్రసార మాధ్యమాలు, సిమెంటు, గనుల తవ్వకం రంగాల నుంచే సమకూరింది. మొత్తం దేశ సంపదలో 42.5శాతం-  జనాభాలో ఒక శాతం సంపన్నుల చేతిలో ఉండగా... 50శాతం జనాభా వద్ద ఉన్న సంపద కేవలం 2.8శాతమేనని ఆక్స్‌ఫామ్‌ నివేదిక ద్వారా వెల్లడైంది.

- డాక్టర్‌ ఎన్‌.వి.ఆర్‌. జ్యోతి కుమార్‌
(మిజోరం కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వాణిజ్య శాఖాధిపతి)

 

Posted Date: 31-03-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని