• facebook
  • whatsapp
  • telegram

ఆర్థిక పునరుత్థానానికి సవాళ్లు

మరో ప్యాకేజీ ప్రకటించాల్సిందే!

నిరుడు కొవిడ్‌ మొదటి దశ విరుచుకు పడినప్పుడు భారతీయులు పెద్దయెత్తున జీవనాధారాలను కోల్పోయారు. ఎంతో ప్రాణనష్టం జరిగింది. కొవిడ్‌ తెచ్చిపెట్టిన లాక్‌డౌన్‌తో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరులు ఊదడానికి కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్లతో గత ఏడాది మే 13న ఆత్మనిర్భర్‌ ప్యాకేజీని ప్రకటించింది. అయితే ఇది ప్రజలకు నేరుగా నగదు అందించడానికి ఉద్దేశించిన పథకం కాదు. బ్యాంకుల్లో తగినంత ద్రవ్య లభ్యత ఉండేలా చూస్తూ, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలకు, వీధి వర్తకులకు బ్యాంకులు అందించే రుణాలకు ప్రభుత్వ పూచీకత్తు ఇచ్చే పథకమది. వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల సృష్టి, పరిశ్రమలకు వ్యాపార సౌలభ్యం కల్పించడం ఈ ప్యాకేజీలో అంతర్భాగాలు. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను పెద్దయెత్తున ప్రైవేటు రంగానికి విక్రయించడమూ దీని లక్ష్యమే. ఆత్మనిర్భర్‌ పథకం ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందకముందే భారత్‌పై కొవిడ్‌ రెండో దశ విరుచుకుపడింది. కరోనా వైరస్‌ ఉద్ధృతంగా వ్యాపిస్తూ పెద్ద సంఖ్యలో మరణాలకు కారణమవుతోంది.

వృద్ధిరేటు కిందికి...

1952 తరవాత ఎన్నడూ లేని రీతిలో భారత ఆర్థికాభివృద్ధి రేటు కిందికి జారిపోయింది. మొదటి దశ ముగిశాక భారత్‌ వేగంగా కోలుకొంటోందని భావిస్తూ మన వృద్ధిరేటు ఎక్కువగా ఉంటుందని అంచనా వేసిన ఆర్థికవేత్తలు, రెండోదశ విజృంభణతో తమ అంచనాలను తగ్గించేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్‌ వృద్ధిరేటు 11 శాతంగా ఉంటుందని లెక్కగట్టిన ఎస్‌ అండ్‌ పి గ్లోబల్‌ రేటింగ్స్‌ సంస్థ రెండో దశ ఉద్ధృతిని చూసి, దాన్ని 9.8 శాతానికి తగ్గించింది. ఫిచ్‌ సంస్థ దీన్ని 9.5 శాతానికి తగ్గించింది. ఆర్థికాభివృద్ధి కుంటువడితే నిరుద్యోగం మరింత విజృంభిస్తుంది. వ్యక్తులు, సంస్థల పొదుపు హరించుకుపోతుంది. ఇప్పటికే స్వతంత్ర భారత చరిత్రలో కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రజానీకం, కొవిడ్‌ మూడో దశకు ఎంతగా తల్లడిల్లిపోతారో తలచుకుంటేనే భయమేస్తుంది. ఏడాది క్రితం కొవిడ్‌ విరుచుకుపడినప్పుడు ఎంత దుస్థితిలో ఉన్నామో మళ్లీ ఇప్పుడు అదే స్థితికి జారిపోయాం. ఈసారి కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తరవాత మరో ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ కోసం డిమాండ్లు మిన్నంటబోతున్నాయి.

ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకం రెండో విడత వినూత్నంగా ఉండాలి. సమస్యా పరిష్కార పటిమను కనబరచాలి. ఇంతకుముందు ప్రకటించిన ఆత్మనిర్భర్‌-1 ప్యాకేజీ నేరుగా నగదు సహాయం కానీ, సబ్సిడీలు కానీ ఇచ్చేది పోయి రుణాల మంజూరుతో అభివృద్ధి సాధించాలని చూసింది. ఇక్కడ పాలకులు విస్మరించిన అంశం ఒకటుంది. సాధారణంగా చిన్నా పెద్దా కంపెనీలు తమకు వ్యాపారం దివ్యంగా ఉంటుందని ఆశించినప్పుడు మాత్రమే రుణాలు తీసుకుంటాయి. తాము బ్యాంకు రుణాలపై చెల్లించే వడ్డీకన్నా ఎక్కువ ఆర్జిస్తామని నమ్మకం ఉంటేనే అప్పులు తీసుకుంటాయి. కొవిడ్‌ తెచ్చిపెట్టిన కల్లోలంలో ఏ కంపెనీ కూడా తమకు వ్యాపారం ఉజ్జ్వలంగా ఉంటుందని ఆశించలేదు. ఉద్యోగాలు ఊడి, వ్యాపారాలు దెబ్బతిన్నప్పుడు వినియోగదారులు వస్తుసేవలపై ఖర్చులు తగ్గించుకొంటారు. ఈ అనిశ్చిత స్థితిలో గిరాకీ పడిపోవడంతో కంపెనీలు కొత్త ఉత్పత్తి చేపట్టడానికి కానీ, ఉన్న ఉత్పత్తిని విస్తరించడానికి కానీ ముందుకురావు. ఈ సవాళ్లను గుర్తెరిగి, వాటిని అధిగమించేలా సహాయక ప్యాకేజీని రూపొందించి అమలు చేయాలి.

మార్గాంతరం ఏమిటి?

ఉద్యోగాలు, వ్యాపారాలు భారీగా నష్టమైన ప్రస్తుత దశలో వస్తుసేవలకు గిరాకీ పెరగాలంటే ఇవ్వాల్సింది రుణాలు కావు- భారీ ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ. ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తే అది భారీ సంఖ్యలో ఉద్యోగాల సృష్టికి దారితీస్తుంది. రైతులకు ఎరువులు, విత్తనాలు తదితరాలపై సబ్సిడీలు ఇవ్వడం, ఎంఎస్‌ఎంఈలకు, చిన్న కిరాణా వ్యాపారాలకు రాయితీలు, ఆర్థిక సహాయాలు అందించడం రెండో విడత ఉద్దీపన ప్యాకేజీలో ముఖ్య భాగాలు కావాలి. ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపును భారీగా పెంచితే గ్రామీణ పేదలకు గొప్ప అండ లభిస్తుంది. గ్రామాల్లో గిరాకీ పెరిగి ఉపాధి వ్యాపారాలు వికసిస్తాయి. వ్యవసాయ రంగంపై పెట్టుబడులు పెంచితే గ్రామీణార్థికం వృద్ధి పథంలో దూసుకుపోతుంది. కొవిడ్‌ పెంచుతున్న ఆర్థిక అసమానతలను తగ్గించాలంటే యాజమాన్యాలు ప్రస్తుత సిబ్బందికి, కొత్తగా నియమితులైన ఉద్యోగులకు వేతన సబ్సిడీలు ఇవ్వాలి. దీనివల్ల జనం చేతిలో డబ్బు చలామణీ¨లో ఉండి గిరాకీ, దానితోపాటే ఉత్పత్తి, ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ఉద్యోగులు, కార్మికులకు ఎంతో కొంత స్థిరాదాయం లభిస్తుంది. ఆదాయ అసమానతలను కొంతైనా తగ్గించడానికి తోడ్పడుతుంది. పనులు లేక రోజువారీ అవసరాలకు కటకటలాడుతున్న పేదలకు నేరుగా నగదు బదిలీ చేయాలి. దీనివల్ల గిరాకీ, ఉత్పత్తి, ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ఇలా వస్తుసేవల వినియోగం పెరిగినప్పుడు వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ రంగాలు ఎక్కువ వృద్ధిరేటును సాధిస్తాయి. అసంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు, వినియోగం పెరిగి గ్రామీణులు, పేదల ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. నగదు బదిలీ, సబ్సిడీల వల్ల దేశ విత్తలోటు పెరిగే మాట నిజమే కానీ, ఇది లోటు గురించి ఆలోచించాల్సిన సమయం కాదు. భారీ ప్రభుత్వ వ్యయం దేశ జీడీపీని పెంచి నిజమైన ఆత్మ నిర్భర్‌ భారత్‌ అవతరణకు తోడ్పడుతుంది.

వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ రంగాలు పుంజుకోవాలి  

మొట్టమొదటి సవాలు దేశంలో వస్తుసేవల వినియోగాన్ని పెంచడమెలా అన్నదే. వస్తుసేవలకు గిరాకీ తగ్గితే ఉత్పత్తి కుంటువడి నిరుద్యోగం ప్రబలుతుంది. దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు, పాక్షిక లాక్‌డౌన్‌లు లేదా కఠిన ఆంక్షలు అమలులో ఉన్నందువల్ల గిరాకీ ఇప్పుడప్పుడే పుంజుకొనేలా లేదు. దీన్ని సరిదిద్దడమెలా అన్నది మొదటి సవాలు. కొవిడ్‌ రెండో దశ విజృంభణ తెచ్చిపెట్టే ఆదాయ అసమానతలను అధిగమించడమెలా అన్నది రెండో సవాలు. కార్మికులు, ఉద్యోగులు జీవనోపాధిని కోల్పోయి, తమ వద్ద ఉన్న కాస్తోకూస్తో పొదుపు మొత్తాలను ఖర్చుపెట్టేసుకోవలసి వస్తోంది. మధ్య తరగతివారు పేదరికంలోకి జారిపోతుంటే, పేదలు కటిక పేదలుగా మారుతున్నారు. మరోవైపు కొన్ని కార్పొరేట్‌ సంస్థలు మాత్రం కొవిడ్‌ కాలంలోనూ లాభాల పంట పండిస్తున్నాయి. సమాజంలో ప్రబలుతున్న ఆదాయ అసమానతలు మూడో దశ ఉద్ధృతి కూడా సంభవిస్తే మరింత పేట్రేగిపోతాయి. గ్రామాల్లో కూడా ఆదాయాలు, వేతనాలు పడిపోతున్నందువల్ల ట్రాక్టర్లు, మోటారు వాహనాలు, ఎరువులు, విత్తనాలకు గిరాకీ పడిపోతుంది. అన్నింటినీ మించి ఎంఎస్‌ఎంఈ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ రంగాలు కలిసి 80 శాతం ఉపాధిని కల్పిస్తున్నాయి కనుక, ఈ రెండు రంగాలు పుంజుకోనిదే దేశార్థికం వృద్ధి బాట పట్టలేదు.


 

Posted Date: 17-05-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం