• facebook
  • whatsapp
  • telegram

నిగూఢ కరెన్సీలు భద్రమేనా?

పతనమవుతున్న ‘క్రిప్టో’ విలువ

కొన్నేళ్ల నుంచి మదుపరులను మురిపిస్తున్న బిట్‌ కాయిన్‌ తదితర క్రిప్టో (నిగూఢ) కరెన్సీల భవిష్యత్తుపై నేడు అనిశ్చితి అలముకొంది. ప్రపంచమంతటా చలామణీలో ఉన్న 5000 క్రిప్టో కరెన్సీలలో బిట్‌ కాయిన్‌, ఎథీరియంలే అగ్రగణ్యమైనవి. గత వారంరోజుల్లోనే క్రిప్టో మార్కెట్‌కు లక్ష కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది. క్రిప్టోలకు కరెన్సీ ప్రతిపత్తిని నిరాకరించి, సొంత డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెట్టాలని ప్రధాన దేశాలు భావిస్తుండటం దీనికి మొదటి కారణం. క్రిప్టోల సృష్టికి అపారంగా విద్యుచ్ఛక్తి అవసరమై, పర్యావరణానికి నష్టం వాటిల్లడం రెండో కారణం. అసలు టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ తమ కార్ల విక్రయానికి బిట్‌ కాయిన్లలో చెల్లింపును స్వీకరిస్తానని ప్రకటించినప్పటి నుంచి క్రిప్టోలకు గిరాకీ పెరిగిపోయింది. 2010లో సున్నాగా ఉన్న బిట్‌ కాయిన్‌ విలువ గత నెలలో 63 వేల డాలర్లకు చేరింది. అంతలోనే మస్క్‌ మాటమార్చి బిట్‌ కాయిన్ల సృష్టి వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ఆయన ప్రతికూల వ్యాఖ్యలతో క్రిప్టో కరెన్సీల విలువ భారీగా పడిపోయింది. మరోవైపు చైనా తమ దేశంలో క్రిప్టోలను నిషేధించి, వాటితో లావాదేవీలు జరపకూడదని ఆజ్ఞాపించడంతో క్రిప్టోల విలువ అమాంతం కోసుకుపోయింది. భారత క్రిప్టో ఎక్స్ఛేంజ్‌ వజీర్‌ ఎక్స్‌లో క్రిప్టోలను వదిలించుకునేవారు ఎక్కువకావడంతో ఇక్కడా బిట్‌ కాయిన్‌, ఎథీరియంల ధర పతనమైంది. చైనాలానే భారత ప్రభుత్వమూ క్రిప్టో కరెన్సీలను నిషేధించి, రిజర్వు బ్యాంకు ద్వారా డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ) జారీకి ఒక బిల్లును ప్రతిపాదిస్తుందనే వార్త క్రిప్టోలకు పిడుగుపాటైంది. కానీ, భారత్‌లో దాదాపు కోటిన్నర మంది క్రిప్టో వినియోగదారులు ఉన్నందున, వారి ప్రయోజనాలను కాపాడాలనే వాదం బలం పుంజుకొంది.

నిషేధంకన్నా నియంత్రణ మిన్న

క్రిప్టోలకు ప్రాతిపదిక అయిన బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికత వల్ల దేశ ఆర్థికానికి కలిగే ప్రయోజనాలను విస్మరించకూడదని సలహాలు వస్తున్నాయి. అందుకే భారత్‌లో క్రిప్టోలను నిషేధించే బదులు నియంత్రించే అంశాన్ని పరిశీలించడానికి కేంద్రం నిపుణుల సంఘాన్ని నియమించనున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీల మార్కెట్‌ మూలధన విలువ లక్ష కోట్ల డాలర్లకు చేరడంతో వాటిని తేలిగ్గా తీసివేయలేం. భారత ప్రభుత్వానికి మొదటి నుంచీ క్రిప్టో కరెన్సీల పట్ల సానుకూలత లేకపోయినా క్రిప్టో మదుపరులు, ట్రేడర్ల లావాదేవీలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. దీన్ని నియంత్రించడానికి రిజర్వు బ్యాంకు 2018లో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్రిప్టో ట్రేడింగ్‌, ఎక్స్ఛేంజ్‌లను ప్రోత్సహించకూడదని సర్క్యులర్‌ జారీ చేసింది. 2020లో సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేయడంతో సమస్యను సమీక్షించడానికి కేంద్రం ఓ నిపుణుల సంఘాన్ని నియమించే అవకాశం ఉంది. బిట్‌ కాయిన్‌, ఎథీరియం వంటి క్రిప్టోలను కరెన్సీలుగా కాకుండా డిజిటల్‌ మదుపు సాధనాలుగా పరిగణించవచ్చా అని నిపుణుల సంఘం పరిశీలించవచ్చు. 2008 ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రభుత్వాలు భారీయెత్తున రుణాలు, గ్రాంట్లను విడుదల చేయడం అధికార కరెన్సీల విలువను దిగజార్చిందని కంపెనీలతో పాటు ధనవంతులు భావించారు. అందుకే బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికత సాయంతో ప్రభుత్వాలు, బ్యాంకులు ప్రమేయం లేకుండా తమలో తామే లావాదేవీలు జరుపుకోవడానికి బిట్‌ కాయిన్‌ను చలామణీలోకి తెచ్చారు. కానీ, ఏ ప్రభుత్వమూ తన పర్యవేక్షణ లేకుండా ఆర్థిక లావాదేవీలను సాగనివ్వదు. అలా సాగనిస్తే నల్లధనాన్ని తెలుపు కింద మార్చేవాళ్లకు, మూల ధనాన్ని సరిహద్దులు దాటించేవాళ్లకు పట్టపగ్గాలు లేకుండా పోతాయి. మాదకద్రవ్యాలు, అక్రమ ఆయుధాల క్రయవిక్రయాలకు అడ్డూఆపూ ఉండకుండా పోతుంది. ప్రభుత్వ నియంత్రణ లేకపోతే సాధారణ మదుపరుల క్రిప్టో పెట్టుబడులకూ భద్రత ఉండదు. కంపెనీలు, ధనాఢ్యులూ పూర్తిగా క్రిప్టో లావాదేవీలకు మళ్లిపోతే ప్రభుత్వాలకు పన్నుల ఆదాయం కోసుకుపోతుంది. ఉపాధి కల్పన, రక్షణ, మౌలిక వసతుల సృష్టి, పేదల సంక్షేమానికి నిధులు లేకుండా పోతాయి. ఆర్థికాభివృద్ధికి పెట్టుబడులూ చిక్కవు.

కొవిడ్‌ కష్టకాలంలో నానా అవస్థల పాలవుతున్న మధ్యతరగతి వారిపై ఇప్పటికే వడ్డీ వ్యాపార యాప్‌లు, ఆన్‌లైన్‌ లాటరీ యాప్‌లూ వలవేస్తున్నాయి. కొంతమంది తమ వద్ద ఉన్న కాస్తో కూస్తో పొదుపు మొత్తాలను షేర్‌ మార్కెట్‌ యాప్‌లలోనో, క్రిప్టో ఎక్స్చేంజ్‌లలోనో పెట్టుబడిగా పెట్టి ఎంతో కొంత సంపాదించుకోవచ్చునని ఆశ పడుతున్నారు. అధిక స్థిరాదాయం, ఆస్తులు ఉన్నవారు తప్ప మిగిలినవారు ఈ లావాదేవీల్లోకి దిగితే చేతులు కాల్చుకోక తప్పదు. అసలు పేద, మధ్యతరగతి వారికి కొవిడ్‌ సంక్షోభం కన్నా చాలాముందు నుంచే ఆదాయాలు పడిపోతున్నాయి. ఆర్థిక అనిశ్చితిలోకి జారిపోయిన ఈ వర్గాలకు చవక వడ్డీపై రుణాలిచ్చి గృహాలు కొనిపించడం, డబ్బు అవసరమైనప్పుడు వాటిని తాకట్టు పెట్టుకుని కొత్త రుణాలు ఇవ్వడమనే క్రీడకు బ్యాంకులు, ప్రభుత్వాలు తెరతీశాయి. వ్యక్తిగత రుణాలిచ్చి కృత్రిమంగా గిరాకీ పెంచాయి. ఇదంతా 2008 ఆర్థిక సంక్షోభానికి దారితీసింది. దశాబ్ద కాలంగా పరిమిత కాల ఉద్యోగాలు, గిగ్‌ ఉద్యోగాలు, ఫ్రీలాన్స్‌ ఉద్యోగాలతో నెట్టుకువస్తున్న యువతరం ఇప్పుడు కొవిడ్‌తో మళ్ళీ అనిశ్చితిని ఎదుర్కొంటోంది.

ఉపయుక్తమైన సాంకేతికత

క్రిప్టోలను కరెన్సీగా కన్నా షేర్లు, బాండ్లు, ఎఫ్‌డీల వంటి మదుపు సాధనాలుగా పరిగణించడం మేలు. ప్రజలు తమ పొదుపులో కొంత భాగాన్ని మూడు నుంచి అయిదేళ్ల కాలావధికి క్రిప్టోలలో మదుపు చేయడానికి అనుమతించవచ్చు. సీబీడీసీకి మాత్రమే సాధికార కరెన్సీగా గుర్తింపునివ్వాలి. తద్వారా అక్రమ ధన చలామణీని, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టవచ్చు. క్రిప్టో కరెన్సీలకు మూలాధారమైన బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికత అనేక అంకుర పరిశ్రమల ఆవిర్భావానికి తోడ్పడింది. భూమి రికార్డులను, ఇతర కీలక సమాచారాన్ని భద్రపరచడానికి, అవినీతి రహితంగా ఆన్‌లైన్‌లో ప్రభుత్వ వ్యవహారాలు నడపడానికి ఇదెంతో ఉపకరిస్తుంది. పెద్దయెత్తున ఉపాధి, వ్యాపార అవకాశాలనూ సృష్టించగలదు. కేంద్రం నియమించబోయే నిపుణుల సంఘం ఈ అంశాలన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించి పకడ్బందీ కార్యాచరణను సిఫార్సు చేయాలి.

తస్మాత్‌ జాగ్రత్త

కరోనా వైరస్‌ కొత్త రూపాంతరాలకు లోనవుతున్నందువల్ల ప్రభుత్వాలు పదేపదే లాక్‌డౌన్‌లు విధించాల్సి వస్తోంది. నెమ్మదిగా తేరుకుంటాయనుకున్న వ్యాపారాలు వరస లాక్‌డౌన్‌లతో కుదేలవుతున్నాయి. చేతిలో కాసులు ఆడుతున్నవారు సరైన పెట్టుబడి సాధనాలు లేక స్టాక్‌, క్రిప్టో మార్కెట్లలో జూదమాడుతున్నారు. ద్రవ్యోల్బణం నుంచి ఈ విధంగా తమ సంపదను కాపాడుకోవాలనుకొంటున్నారు. ఫలితంగా క్రిప్టోల ధర అనూహ్యంగా పెరుగుతూ ఈ క్రీడలోకి మధ్యతరగతి వారినీ ఆకర్షిస్తోంది. ఎప్పుడైనా క్రిప్టో బుడగ బద్దలైతే ఈ వర్గం మళ్ళీ బలైపోయే ప్రమాదం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోయే కొత్త బిల్లు ఈ ప్రమాదాన్ని గుర్తెరగాలి. క్రిప్టో లావాదేవీలను నియంత్రించడం, వాటిపై పన్ను వేయడం వంటివి బిల్లులో పొందుపరచాలి.

- ఏఏవీ ప్రసాద్‌
 

Posted Date: 28-05-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం