• facebook
  • whatsapp
  • telegram

పేదల మేలుకే ప్రజాధనం

రుణ సాయంతో ఆర్తులకు ఊరట

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల ప్రకటించిన ఉద్దీపన ప్రతిపాదనల్లో ముఖ్యమైనది- పట్టణ పేదలకు రుణ భరోసా ఇచ్చేలా సూక్ష్మ రుణ (మైక్రోఫైనాన్స్‌) సంస్థలను ప్రోత్సహించడం. కొవిడ్‌ తెచ్చిపెట్టిన లాక్‌డౌన్‌ల వల్ల పట్టణ పేదలు తీవ్ర ఆర్థిక కడగండ్లకు లోనవుతున్న సంగతి తెలిసిందే. గ్రామీణ పేదలకు సంవత్సరంలో నిర్దిష్ట కాలం పని కల్పిస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తరహాలో పట్టణ పేదలకూ జీవనోపాధి కల్పించాలని చాలాకాలంగా డిమాండ్లు వస్తున్నాయి. కరోనా మహమ్మారి వల్ల పెరిగిపోయిన గ్రామీణుల వెతలను తీర్చడానికి ఉపాధిహామీ పథకం తోడ్పడిన మాట నిజమే. మామూలు రోజుల్లో మాత్రం ఉపాధి హామీని శాశ్వత చెల్లింపుగా లేదా హక్కుగా అమలుచేయడం సమస్యాత్మకమవుతుంది. అయినా ఈ పథకం, జాతీయ ఆహార భద్రత చట్టం కింద పేదలకు వర్తింపజేస్తున్న శాశ్వత చెల్లింపులను ఉపసంహరించడం భారత్‌ వంటి ప్రజాస్వామ్య దేశంలో కుదిరే పని కాదు. కాబట్టి పట్టణ పేదలకు ఒకసారి ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెడితే, దాన్ని తరవాత నిలిపివేయడం అసాధ్యమవుతుంది. అది కూడా శాశ్వత హక్కుగా మారిపోయే అవకాశాలే హెచ్చు. పైగా గ్రామాలు, పట్టణాల్లో ఉపాధి స్వభావాలు భిన్నంగా ఉంటాయి కాబట్టి ఉపాధి హామీ వంటి పథకాన్ని పట్టణాలు, నగరాల్లో యథావిధిగా అమలు చేయాలంటే ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి.

అర్హులకు అందించడమే మేలు

గ్రామాల్లో మాదిరిగా పట్టణాల్లో ఉపాధి అనేది కొన్ని వ్యవసాయ సీజన్లకే పరిమితం కాదు. అక్కడ సంవత్సరం పొడవునా పనులు ఉంటాయి. ఆ పనులకు కొన్ని నైపుణ్యాలు అవసరం అవుతాయి. గ్రామాల్లో పెద్దగా నైపుణ్యాలు లేనివారు సైతం వ్యవసాయ కూలీలుగా జీవనం సాగించగలరు. కానీ, పట్టణాల్లో ఏదో ఒక నైపుణ్యం- ముఖ్యంగా సాంకేతిక నైపుణ్యం ఉన్నవారికే పనులు దొరుకుతాయి. అక్కడ నైపుణ్యాన్ని బట్టి, చేసే పనిని బట్టి వేతనాలను నిర్ణయిస్తారు. అందువల్ల ఉపాధి హామీ కింద గ్రామాల్లో చెల్లిస్తున్నట్లు పట్టణాల్లో అందరికీ ఒకే విధమైన కూలీ లేదా వేతనం చెల్లించడం సాధ్యం కాదు.

పట్టణ ఉపాధి హామీ పథకం చేపట్టి హెచ్చు వేతనాలు చెల్లిస్తే, అవి గ్రామాల నుంచి పట్టణాలకు పెద్దయెత్తున వలసలను ప్రేరేపిస్తాయి. పట్టణాల్లో జీవన వ్యయం ఎక్కువ కాబట్టి గ్రామాలకన్నా ఎక్కువ వేతనాలను చెల్లించాల్సి వస్తుంది. హెచ్చు వేతనాలు సహజంగానే గ్రామాల నుంచి వలసలను పెంచుతాయి. ఒకవేళ బేషరతు చెల్లింపులు జరిపినా అవి బాగా అవసరం ఉన్నవారికి చేరాల్సింది పోయి- పలుకుబడి, స్థోమత ఉన్నవారికే దఖలుపడే ప్రమాదం ఉంది. 2009నాటి రైతు రుణమాఫీ పథకంలో జరిగింది ఇదే. దీనివల్ల ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం నెరవేరకపోగా- ప్రజాధనం దుర్వినియోగమవుతుంది. నిజమైన పట్టణ పేదలకు చెల్లింపులు జరిగితే మొత్తం ఆర్థిక వ్యవస్థలో గిరాకీ పెరిగి, అన్ని వర్గాలకూ అనేకానేక విధాలుగా లబ్ధి చేకూరుతుంది. అలాకాకుండా ఏవో కొన్ని వర్గాలకే చెల్లిస్తే ఆర్థిక వ్యవస్థకు ఒరిగేది పెద్దగా ఉండదు. ఈ సమస్యను అధిగమించాలంటే బేషరతు నగదు బదిలీ కన్నా సూక్ష్మ రుణ వితరణ సంస్థ(ఎంఎఫ్‌ఐ)ల ద్వారా అర్హులకు ఆర్థిక సహాయం అందించడం భేషైన మార్గం.

ప్రభుత్వ హామీ అవసరం

పట్టణ ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వ భరోసాతో ఎంఎఫ్‌ఐల ద్వారా రుణాలు తీసుకున్నవారికి ఇలాంటి అనుభవాలు హెచ్చరిక అవుతాయి. ఎంతో కష్టం వస్తే కానీ వారు ఎగవేతకు పాల్పడరని ఆశించవచ్చు. ప్రభుత్వ భరోసాతో ఎంఎఫ్‌ఐల ద్వారా రుణాలు అందుకోగలవారిని మూడు వర్గాలుగా విభజించవచ్చు. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులూ లేవు కాబట్టి రుణాలు అక్కర్లేదనుకునేవారు మొదటి వర్గంలోకి వస్తారు. కొవిడ్‌ వల్ల ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నా, గడువుకల్లా తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఇబ్బంది పడనివారు రెండో వర్గంలోకి వస్తారు. రుణ ఎగవేత వల్ల ఎదురయ్యే కష్టనష్టాల గురించి వారికి బాగా తెలుసు. మూడో వర్గంలోని వారు ఇప్పుడూ ఆర్థిక ఇబ్బందులకు గురవుతుంటారు, రేపు రుణాలను తీర్చాల్సిన సమయానికీ ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఈ వర్గంలో ఎగవేతలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారికి ఇచ్చిన రుణం పాక్షిక నగదు బదిలీ లాంటిది. ప్రభుత్వ హామీ లేకుండా రెండు, మూడు వర్గాల వారికి రుణాలు ఇవ్వడానికి ఎంఎఫ్‌ఐలు ముందుకురావన్న సంగతి గుర్తించాలి. ప్రభుత్వ హామీ ఉంటే పరిస్థితి మారిపోతుంది. ఈ పద్ధతిలో మొదటి వర్గంవారు రుణాలు తీసుకోరు కాబట్టి అర్హులైన ఆర్తులకే సహాయం చేరుతుంది. రేపు ఆర్థిక వ్యవస్థ మెరుగుపడినప్పుడు వారు ప్రస్తుతం తీసుకున్న రుణాలను సక్రమంగా తీర్చివేయడానికి ముందుకొస్తారు. ఇక్కడ అత్యవసర దశలవారీ రుణహామీ పథకానికి లభిస్తున్న స్పందన గురించి సిబిల్‌ ఇటీవల వెలువరించిన నివేదికను ప్రస్తావించాలి. ఈ పథకం కింద రూ.1.25 లక్షల వరకు రుణాలిస్తారు. ఇంత పెద్ద మొత్తాలను ప్రభుత్వ హామీ లేకుండా ఇవ్వడం సాధ్యపడదు. కొవిడ్‌ వల్ల నిజంగా ఇబ్బందులు పడుతున్న వారికే ప్రభుత్వ హామీతో ప్రజా ధనం చేరినప్పుడు, అది సద్వినియోగమవుతుంది. విధానకర్తల లక్ష్యం నెరవేరుతుంది.

బడుగు వర్గాలకు అండ

చిన్న, పెద్ద పట్టణాల్లో సూక్ష్మరుణ సంస్థ(ఎంఎఫ్‌ఐ)ల నుంచి రుణాలు తీసుకున్నవారి సంఖ్య దాదాపు రెండు కోట్ల వరకు ఉంటుందని గణాంకాలు తెలుపుతున్నాయి. దీన్నిబట్టి ఇవి పట్టణ పేదలకు ప్రధాన రుణ వనరుగా నిలుస్తాయని అర్థమవుతోంది. పేదల్లో ఎవరెవరికి రుణాలు అందించాలి, ఎలా వసూలు చేసుకోవాలి వంటి అంశాల్లో ఎంఎఫ్‌ఐలకు దీర్ఘకాల అనుభవం ఉంది. పట్టణ పేదల్లో అత్యధికులు గ్రామాల నుంచి వలస వచ్చినవారే అయి ఉంటారు కాబట్టి, వారి పూర్వాపరాలు, రుణ చరిత్ర గురించి ప్రభుత్వం దగ్గర సరైన సమాచారం ఉండదు. అందువల్ల వారికి నేరుగా నగదు బదిలీ చేయడం చిక్కులతో కూడుకున్న వ్యవహారమవుతుంది. దీనికి బదులు ఎంఎఫ్‌ఐ ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించడం మేలు. ప్రభుత్వ ధనాన్ని ఈ సంస్థల ద్వారా పట్టణ పేదలకు అందిస్తే, అది పాక్షిక నగదు బదిలీ పథకంలా ఉపయోగపడుతుంది. కొవిడ్‌ గడ్డుకాలంలో పట్టణ పేదలను ఆదుకున్నట్లూ అవుతుంది. ఒకసారి రుణాలు ఎగవేసిన వారికి ఎంఎఫ్‌ఐలు మళ్లీ రుణాలివ్వవు. అందువల్ల రుణగ్రహీతలు తీసుకున్న రుణాలను సక్రమంగా తీర్చడానికి శ్రద్ధవహిస్తారు. ప్రభుత్వ సహాయం నేరుగా చేరవలసిన వారికి చేర్చడానికి ఎంఎఫ్‌ఐలు ఈ విధంగా తోడ్పడతాయి. 2009నాటి రైతు రుణమాఫీ పథకం కింద ఎగవేతదారులకు తరవాత బ్యాంకులు రుణాలు ఇవ్వడం తగ్గించాయన్న సంగతి ఇక్కడ గుర్తుంచుకోవాలి.


 

Posted Date: 05-07-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం