• facebook
  • whatsapp
  • telegram

దేశార్థికానికి పరిశ్రమల దన్ను

అవసరాలు తీర్చే విద్యతో సత్ఫలితాలు

కరోనా కష్టకాలంలో ఎంతోమంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ తరుణంలో ఉద్యోగాల కల్పనకు బంగారు బాటలు వేసే వ్యవస్థాపకత (అంత్రప్రెన్యూర్‌షిప్‌)కు ప్రాధాన్యం ఇవ్వడం భారత్‌కు అత్యవసరం. విద్యా విధానంలో వ్యవస్థాపకతను పాఠ్యాంశంగా చేర్చడం ద్వారా విజయవంతమైన వ్యవస్థాపకుల (అంత్రప్రెన్యూర్స్‌)ను తయారు చేయవచ్చని జాతీయ, అంతర్జాతీయ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవస్థాపకత చాలా కాలం నుంచే ఉన్నత విద్య పాఠ్యాంశాల్లో భాగం అయింది. కొన్ని దేశాల్లో పాఠశాల స్థాయి నుంచే దీన్ని బోధిస్తున్నారు. మూడు దశాబ్దాల నుంచి ప్రపంచీకరణ వేగవంతమైంది. ప్రపంచ దేశాల మధ్య పోటీతత్వం పెరిగిపోయింది. ఈ క్రమంలో వస్తువుల తయారీ, సేవలు వాటి సరఫరా గొలుసులకు ప్రాధాన్యం అధికమైంది. దీనికితోడు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) మేధాసంపత్తి హక్కులకు గణనీయంగా ప్రాధాన్యం ఇస్తోంది.

విజయానికి మార్గం

ఒక అధ్యయనం ప్రకారం అమెరికాలోని మసాచుసెట్స్‌ సాంకేతిక విద్యాసంస్థ (ఎంఐటీ)లో చదివిన విద్యార్థులు దాదాపు 25 వేల కంపెనీలను స్థాపించి 33 లక్షల మందికి ఉపాధి కల్పించారు. మన దేశంలోనూ వ్యవస్థాపకత బోధనను ప్రవేశపెట్టిన ఐఐటీలు, ప్రముఖ మేనేజ్‌మెంట్‌ కళాశాలల్లో చదివిన వారెందరో వైవిధ్యమైన అంకుర సంస్థలను నెలకొల్పి వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. బైజూస్‌, క్యూర్‌ డాట్‌ ఫిట్‌, నౌకరీ డాట్‌ కామ్‌, మేక్‌ మై ట్రిప్‌, ఆర్కిడ్‌ ఫార్మా, సింటెక్స్‌ వంటి ఎన్నో సంస్థలు వాటిలో ఉన్నాయి. వ్యవస్థాపకతను పాఠ్యాంశంగా చేర్చడం వల్ల యువతలో ఏదైనా సాధించాలన్న తపన పెరుగుతుంది. వివిధ అధ్యయనాల ప్రకారం పుట్టినప్పటి నుంచే మనిషిలో కొన్ని వ్యవస్థాపక లక్షణాలు దాగి ఉంటాయి. కొందరిలో వాటంతట అవే బహిర్గతమవుతాయి. మరికొందరిలో అంతర్గతంగా ఉండిపోతాయి. అలాంటి వారికి ప్రోత్సాహం అవసరం. వ్యవస్థాపకతను పాఠ్యాంశంగా చేర్చడం ద్వారా యువత మేధకు సానపట్టి గొప్ప వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దవచ్చు. 67శాతం మేర వ్యవస్థాపక లక్షణాలను బోధన ద్వారా సాధించవచ్చని, 25 నుంచి 40శాతం మాత్రమే పుట్టుకతో సంక్రమిస్తాయని ఒక పరిశోధనలో తేలింది. యువతకు ప్రేరణ అందించడం, మనోనిబ్బరం కలిగి ఉండేలా తీర్చిదిద్దడం ఎంతో అవసరం. విద్యార్థులు ఏదైనా సాధించడానికి కావాల్సిన సృజనాత్మకతను పెంపొందించే దిశగా విద్యావిధానం ఉండాలి. సేవాస్ఫూర్తి, లక్ష్యసాధనకు శ్రమించే తత్వాన్ని అలవరచాలి. నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి. భవిష్యత్తుపై సానుకూల భావన ఏర్పరచడం, బలమైన మానవ సంబంధాలు నిర్మించుకునేలా ప్రోత్సహించడం, చక్కటి భావ వ్యక్తీకరణ వంటివి అంకుర వ్యాపారాల్లో విజయ సాధనకు అవసరమైన ముఖ్య లక్షణాలు. విద్యార్థి దశలోనే వీటిని రూపుదిద్దితే మేటి వ్యవస్థాపకులు తయారయ్యే అవకాశం ఉంటుంది. వ్యవస్థాపకతను పాఠ్యాంశంగా చదువుకున్న యువత అంకుర వ్యాపారాలను స్థాపించకపోయినా ఉద్యోగాల్లో రాణించి, ఉన్నత స్థానాలను అందుకున్నట్లు ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) అధ్యయనంలో తేలింది. మన దేశం నుంచి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలకు అధిపతులుగా వ్యవహరిస్తున్న చాలామంది వ్యవస్థాపకతను పాఠ్యాంశంగా చదువుకున్న వారే! వ్యవస్థాపకతను కేవలం పుస్తకరూపంలో సిద్ధాంతపరంగానే కాకుండా కార్యశాలలు నిర్వహిస్తూ బోధిస్తున్నారు. ఎన్నో విద్యాసంస్థల్లో ఇంక్యుబేటర్లను ఏర్పరచి పరిశ్రమలను, వ్యాపారాలను స్థాపించేందుకు నైపుణ్యాలు కల్పిస్తున్నారు. దాంతోపాటు వ్యాపారానికి అవసరమైన నైపుణ్యాలను అందుకోవడం, అత్యాధునిక సాంకేతికతపై అవగాహన, పరిశ్రమల సమాఖ్యల సహకారం వంటి ఎన్నో బోధనాంశాలు విజయవంతమైన వ్యవస్థాపకులుగా ఎదగడానికి తోడ్పడతాయి.

చదువుతోపాటే నైపుణ్యాలు

మనదేశంలో వ్యవస్థాపకతను పాఠ్యాంశంగా దాదాపు 120 ఉన్నత విద్యాసంస్థల్లోనే బోధిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. వాణిజ్యం, మేనేజ్‌మెంట్‌, ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఈ పాఠాలు ఎంతగానో ఉపయోగపడతాయి. భారత్‌లో సుమారు 5,500 మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థలు ఉన్నాయి. ఏడు వేలకు పైగా ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ విద్యాసంస్థల నుంచి ఏటా 10 లక్షల పైచిలుకు విద్యార్థులు పట్టాలు తీసుకుని ఉద్యోగాల వేటలో పడుతున్నారు. కొన్ని లక్షల మంది విద్యార్థులు ఐటీఐలలో శిక్షణ పొంది బయటకు వస్తున్నారు. వ్యవస్థాపకతను పాఠ్యాంశంగా చేర్చితే వీరిలో ఎందరో అంకుర పరిశ్రమలు, వ్యాపారాలను స్థాపించే అవకాశం ఉంది. కరోనా లాక్‌డౌన్‌ వల్ల భారత్‌లో ఆర్థిక అసమానతలే కాకుండా నిరుద్యోగమూ పెచ్చుమీరినట్లు ‘ఆక్స్‌ఫామ్‌’ నివేదిక పేర్కొంది. ఈ పరిస్థితిని అధిగమించడానికి సాంకేతికతతో కూడిన వ్యాపారాలే శిరోధార్యం. ప్రపంచ దేశాలు నాలుగో పారిశ్రామిక విప్లవం (ఇండస్ట్రీ 4.0)లో సాంకేతికతతో కూడిన సృజనాత్మక పరిశ్రమలు, వ్యాపారాల పోటీలో ముందుకు దూసుకెళ్తున్నాయి. డిజిటల్‌ సాంకేతికతతో తయారవుతున్న వస్తు తయారీ సేవలు ప్రపంచ దేశాల అభివృద్ధిని శాసిస్తున్నాయి. ఈ మార్పునకు అనుగుణంగా వ్యాపారాలను, పరిశ్రమలను అభివృద్ధి చేయలేని దేశాలు ఆర్థికంగా, సామాజికంగా వెనకబడటం మనం గమనించవచ్చు. ప్రస్తుత తరుణంలో దేశాభివృద్ధిలో చురుకైన వ్యవస్థాపకుల పాత్ర కీలక ప్రాధాన్యం సంతరించుకుంది. రానున్న నాలుగేళ్లలో జీడీపీని అయిదు లక్షల కోట్ల డాలర్ల స్థాయికి తీసుకెళ్ళాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది. 2040 నాటికి 30 కోట్ల మందికి ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో ముందుకు వెళ్తోంది. ఇవి సాకారమయ్యేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నత విద్యలో వ్యవస్థాపకతను పాఠ్యాంశంగా చేర్చవలసిన అవసరం ఉంది. ఫలితంగా కరోనా మహమ్మారి వల్ల అతలాకుతలమైన దేశ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కల్పించేందుకు అవకాశం దక్కుతుంది.

పోటీతత్వమే ప్రగతికి పునాది

వాణిజ్యానికి సాంకేతికత జతపడి సమర్థ వ్యవస్థాపకులు సృజనాత్మకమైన వ్యాపారాలను ప్రారంభించి తమ దేశాల ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నారు. గూగుల్‌, వాట్సాప్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటివి ఈ కోవకు చెందినవే. ఈ పోటీతత్వానికి అనుగుణంగా యువతను ప్రోత్సహించకుంటే ఏ దేశమూ అభివృద్ధికి నోచుకోలేదని వివిధ పరిశోధనల్లో రుజువైంది. అలాంటివన్నీ అల్పాదాయ దేశాలుగానే మిగిలిపోతున్నాయి. భారత్‌లో 15-29 మధ్య వయస్కులను దృష్టిలో ఉంచుకొని దేశ ఉన్నత విద్యా వ్యవస్థలో వ్యవస్థాపకత విద్యను విస్తృతపరచాలి. చురుకైన యువతను గుర్తించి విజయవంతమైన వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దాలి. తద్వారా మారుతున్న ఆర్థిక సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా వస్తు తయారీ, సేవలను తక్కువ ధరలకు ప్రజలకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంటుంది.


 

Posted Date: 31-07-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం