• facebook
  • whatsapp
  • telegram

సహేతుక పన్నులే సమంజసం

ప్రజలపై జీఎస్‌టీ పెనుభారం

 

 

2020 మార్చి నుంచి వర్చువల్‌గా సమావేశమవుతూ వచ్చిన వస్తుసేవల పన్నుల (జీఎస్‌టీ) మండలి మొట్టమొదటిసారి సెప్టెంబరు 17న లఖ్‌నవూలో ముఖాముఖి భేటీ నిర్వహించింది. ఈ భేటీలో మండలి పలు నిర్ణయాలు తీసుకున్నా పెట్రో ధరలు తగ్గుతాయని ఎదురుచూస్తున్న సామాన్య వినియోగదారుడికి మాత్రం అసంతృప్తి మిగిలింది. సమస్య మూలాలను అర్థం చేసుకుని పరిష్కరించాలన్న చిత్తశుద్ధి కరవైన మండలి పదేపదే పన్నులు పెంచడంపై ఆసక్తి చూపుతోంది. ప్రజలపై పడే భారాన్ని పట్టించుకోవడం లేదు. పన్నులు పెంచడమే కాకుండా చిన్నాపెద్ద వ్యాపారాలన్నింటినీ తప్పనిసరిగా ప్రభుత్వ నియంత్రణలోకి, పన్నుల చట్రంలోకి తీసుకురావడమే సర్కారు లక్ష్యమని జీఎస్‌టీ మండలి నిర్ణయాలను బట్టి స్పష్టమవుతోంది. ఈ మార్పును క్రమేణా కాకుండా ఉన్నపళాన తీసుకురావడానికి తొందరపడుతున్న ప్రభుత్వం, దీనివల్ల కలిగే కష్టనష్టాలను పట్టించుకోవడం లేదు. అసలే పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు, కరోనా దాడితో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థ ఇంకా తెప్పరిల్లకముందే మండలి తాజా నిర్ణయాలు గోరుచుట్టుపై రోకటి పోటులా వచ్చిపడ్డాయి. అదే పనిగా పన్నులు పెంచుకుంటూ పోతే దేశార్థిక వ్యవస్థలో ఉత్పత్తి, వ్యాపార వ్యయాలు పెరిగి గిరాకీ పడిపోతుందని జీఎస్‌టీ మండలికానీ, ప్రభుత్వంకానీ గ్రహించడం లేదు.

 

చమురు ధరలపై నిరాశ

పెట్రోలు, డీజిల్‌లను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తారని, తద్వారా చమురు ధరలు తగ్గుతాయని ఆశించినవారిని జీఎస్‌టీ మండలి నిరాశపరచింది. అసలు కేరళ హైకోర్టు సూచన మేరకు ఈ అంశాన్ని పరిశీలించామే తప్పించి, ఇప్పుడప్పుడే పెట్రో ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొచ్చే ఆలోచన లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఓటు బ్యాంకు రాజకీయాలకు, దుబారా సబ్సిడీలకు పెట్రో ఆదాయమే కల్పవృక్షం కాబట్టి దాన్ని వదులుకునే ఉద్దేశం వాటికి ఏ కోశానా లేదు. పెట్రో ఉత్పత్తులపై పన్నుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దాదాపు అయిదు లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. దీన్ని వదులుకోవడానికి అవి సుతరామూ అంగీకరించవు. జీఎస్‌టీ విధానం వల్ల ఆదాయం కోల్పోయిన రాష్ట్రాలకు నష్టపరిహార చెల్లింపును 2022 జూన్‌ తరవాత కొనసాగించేది లేదని కేంద్ర ఆర్థికమంత్రి స్పష్టం చేయడం గందరగోళానికి దారితీసింది. చివరికి రాష్ట్రాల ఒత్తిడితో ఈ గడువును 2026 వరకు పొడిగించాల్సి రావచ్చని ఆమె సూచించారు. జీఎస్‌టీ క్రమబద్ధీకరణతోపాటు ఇ-వే బిల్లులు, ఫాస్ట్‌ట్యాగ్‌, సాంకేతికత వినియోగం వంటి అంశాలను పరిశీలించడానికి జీఎస్‌టీ మండలి రెండు మంత్రుల బృందాలను నియమించింది. అవి రెండు నెలల్లో తమ నివేదికలను సమర్పించాలి. ఉద్యోగుల భవిష్యనిధి, ఈఎస్‌ఐలతో సహా అన్ని ప్రత్యక్ష, పరోక్ష పన్నుల చెల్లింపులపై జీఎస్‌టీ గురించి సైతం ఈ బృందాలు పట్టించుకుంటాయని ఆశిద్దాం.

 

ఇతర దేశాల్లోనూ జీఎస్‌టీ ఉన్నా, భారతదేశంలో మాదిరిగా చిన్న వ్యాపారులు, కొనుగోలుదారులపై పన్నుల భారం పెంచలేదు. పెద్ద కంపెనీలు, వ్యాపారాలను సమర్థంగా పన్నుల చట్రంలోకి తీసుకురాలేకపోవడం వల్లనే ప్రభుత్వం సామాన్యులపై పడుతోంది. జీఎస్‌టీ పన్ను వాపసు కోసం దరఖాస్తు పెట్టుకునే వ్యక్తులు, సంస్థలకు ఆధార్‌ ధ్రువీకరణను తప్పనిసరి చేయడంతో నిఘా మరింత సమర్థంగా మారుతోంది. ప్రతి ఒక్కరూ సక్రమంగా పన్నులు చెల్లించాల్సిన అగత్యం ఏర్పడుతోంది. రిజిస్ట్రేషన్‌ సమయంలో సమర్పించే బ్యాంకు ఖాతాను తప్పనిసరిగా పాన్‌ కార్డుతో అనుసంధానించాల్సి ఉంటుంది. జీఎస్‌టీ సొమ్మును కూడా అదే ఖాతాకు వాపసు చేయాలని నిబంధన పెట్టడం ద్వారా అందర్నీ పన్నుల చట్రంలోకి తీసుకురావడం వీలవుతుంది.

 

చిన్న వ్యాపారాలకు కష్టకాలం

ఇంతవరకు వ్యాపార లావాదేవీలు అధికార, అనధికార మార్గాల్లో జరుగుతూ ప్రభుత్వం పన్నుల ఆదాయం కోల్పోతూ వస్తోంది. ఇకపై ఏదైనా సంస్థ ఒకసారి జీఎస్‌టీ పరిధిలోకి వస్తే, అనధికార లావాదేవీల నిర్వహణ కష్టమవుతుంది. ఇది చిన్న వ్యాపారాలకు ఏమాత్రం లాభదాయకం కాదు. ఇంతకాలం అవి పన్నుల పరిధిలోకి రాకుండా చూసుకోవడం ద్వారా మాత్రమే కాస్తోకూస్తో లాభాలను కళ్లజూడగలుగుతున్నాయి. అవి కూడా జీఎస్‌టీ పరిధిలోకి వస్తే మనుగడ కష్టమవుతుంది. సంఘటిత, అసంఘటిత వ్యాపారాల మధ్య లంకె పూర్తిగా తెగిపోతుంది. వ్యాపారాలన్నీ జీఎస్‌టీ పరిధిలోకి వస్తే మున్ముందు పెద్ద నోట్ల రద్దు, కరోనా వంటివాటి దెబ్బను కాచుకుని సంఘటిత రంగం కోలుకోవడం కష్టమవుతుంది. అలాంటి గడ్డు వేళల్లో అసంఘటిత రంగ వ్యాపారాలు ఆదుకుంటాయని గమనించాలి. అవి కూడా పన్నులు చెల్లించలేక మూతపడితే, ప్రధాన ఉపాధి కల్పన వనరు మూసుకుపోతుంది. పెద్ద కంపెనీలు పోనుపోను రోబోలు, కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నందువల్ల అవి పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించలేవు. చిన్న వ్యాపారాలు, పరిశ్రమలతో కూడిన అసంఘటిత రంగమే నిరుద్యోగులను ఆదుకోగలిగేది. జీఎస్‌టీ దెబ్బకు అవి కాస్తా మూతపడితే దిక్కెవరు? పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవలసిన భారీ కంపెనీలు కూడా పన్నుల దెబ్బకు ఆ పని చేయకుండా, ఉన్న ఉద్యోగులతోనే పని చేయించుకోవాలని చూస్తాయి. ఎక్కువ పని పిండుకోవాలని చూస్తాయి. కాబట్టి చిన్న వ్యాపారాలు మనుగడ సాగించాలన్నా, ఉపాధి కల్పన పెద్దయెత్తున జరగాలన్నా అధిక పన్నులు విధించడమే మార్గం కాదు. పన్నుల భారం పెరిగితే ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయి వస్తు సేవలకు గిరాకీ పడిపోతుంది. దానివల్ల ఉత్పత్తి పతనమై ఉద్యోగ కల్పన కుంటువడుతుంది. దీన్ని నివారించాలంటే పన్ను రేట్లు సహేతుకంగా ఉండాలి.

 

కొన్ని సేవలు ప్రియం

కొన్ని ముఖ్యమైన మార్పుల్లో భాగంగా- కొవిడ్‌ మందులతోపాటు ఇతర ప్రాణ రక్షక మందులపై జీఎస్‌టీ రేట్లలో ఇస్తున్న అయిదు శాతం రాయితీ మూడు నెలలపాటు కొనసాగనుంది. కొవిడ్‌ సంక్షోభం కొనసాగుతున్నందువల్ల రాయితీని పొడిగించాల్సింది. ఈ-కామర్స్‌ సరకులతో సహా మరికొన్ని వస్తువులపై పన్ను రేట్లను అయిదు, పన్నెండు శాతం నుంచి 18 శాతానికి పెంచారు. 18 శాతం శ్లాబు కిందకు ఎప్పటికప్పుడు మరిన్ని వస్తువులను తీసుకురావాలని సర్కారు ఉబలాటపడుతోంది. ఆహార బట్వాడా, రెస్టారెంట్లు, ప్రయాణికుల రవాణా, ఇటుక బట్టీలు, కొన్ని మధ్యవర్తిత్వ సేవలను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడం మరొక కీలక మార్పు. రిజిస్టరు కాని సర్వీసు ప్రొవైడర్లు ఇంతవరకు అందిస్తూ వచ్చిన వస్తుసేవలపై ఇక నుంచి కొనుగోలుదారులు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉబర్‌, ఓలా, ఓయో, మేక్‌ మై ట్రిప్‌, స్విగ్గీ, జొమాటో, ఐస్‌క్రీం పార్లర్లు, సామాజిక వంటశాలల సేవలు ఇకపై ఖరీదు కానున్నాయి.

 


 

Posted Date: 24-09-2021 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌