• facebook
  • whatsapp
  • telegram

మార్పులపై ఆచితూచి ముందడుగు

జాతి భవితకు పీఎస్‌యూలు కీలకం

గడచిన సంవత్సరకాలంగా ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)ల గురించి అసలైన అంశాలపై కాకుండా అన్య విషయాలపై అనవసర చర్చ జరుగుతోంది. 51శాతంకన్నా ఎక్కువ వాటాలు ప్రభుత్వం చేతిలో ఉన్న సంస్థలను పీఎస్‌యూలుగా, వంద శాతం ప్రభుత్వ వాటాలుంటే పీఎస్‌ఈలుగా వ్యవహరిస్తున్నారు. ‘వ్యాపారం చేయడం ప్రభుత్వం పని కాదు. వ్యాపారాలకు మద్దతు ఇచ్చి ప్రోత్సహించడమే సర్కారు విధి’ అని ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వ్యూహపరంగా కీలకమైన రంగాల్లో మాత్రమే ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేయాలన్నారు. దీంతో పీఎస్‌ఈల భవిష్యత్తుపై చర్చ మొదలైంది. భారత్‌లో మూడు రకాల ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ఒకటి- పార్లమెంటు చట్టం ప్రకారం ఏర్పాటైన సంస్థలు, రెండు- రైల్వే, ఆకాశవాణి, దూరదర్శన్‌, ఆయుధోత్పత్తి కర్మాగారాలు, తంతి తపాలా వంటి మంత్రిత్వ శాఖాపరమైన సంస్థలు. మూడు- కేంద్ర మంత్రివర్గ నిర్ణయాల ప్రకారం ఏర్పాటైనవి.

ప్రభుత్వ ఆస్తుల విక్రయం

బ్యాంకులను మినహాయించి మొత్తం కేంద్ర పీఎస్‌యూల సంఖ్య 348. వీటిలో 262 పీఎస్‌యూలు 37 మంత్రిత్వ శాఖల కింద పనిచేస్తున్నాయి. వాటిలో 58 స్టాక్‌ మార్కెట్‌లో నమోదైనవి. 178 పీఎస్‌ఈలు లాభాల్లో ఉంటే, 84 రూ.44,817 కోట్ల నష్టాలను ప్రకటించాయి. కొన్ని పీఎస్‌ఈలు వ్యాపారంలో సహజ ఎగుడు దిగుళ్ల వల్ల తాత్కాలికంగా నష్టాలు చవిచూస్తున్నాయి. అన్ని పీఎస్‌యూ, పీఎస్‌ఈలలో మొత్తం ప్రభుత్వ పెట్టుబడులు రూ.26.33 లక్షల కోట్లు; నికర లాభం రూ.1.42లక్షల కోట్లు. ఈ ప్రభుత్వ రంగ సంస్థలకు మొత్తం రూ.10లక్షల కోట్ల మిగులు నిధులు ఉన్నాయి. కేంద్ర పీఎస్‌ఈల నుంచి ఎక్సైజ్‌, కస్టమ్స్‌ సుంకాలు, జీఎస్టీ, కార్పొరేట్‌ పన్ను, డివిడెండ్లు తదితర రూపాల్లో కేంద్ర ఖజానాకు 2019-2020లో దాదాపు రూ.3.78లక్షల కోట్ల ఆదాయం లభించింది. నీతి ఆయోగ్‌ రూపొందించిన జాతీయ ద్రవ్యీకరణ పథకం (ఎన్‌ఎంపీ) కింద పీఎస్‌ఈ ఆస్తుల విక్రయం ద్వారా రూ.2.5లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం ఆశిస్తోంది. 2025 కల్లా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ అధీనంలోని పీఎస్‌ఈ ఆస్తుల అమ్మకం ద్వారా మరో మూడు లక్షల కోట్ల రూపాయలు సమీకరించాలని సూచించింది. జీవిత బీమా సంస్థలో కొన్ని వాటాల అమ్మకంతో పాటు ఆకాశవాణి, బీపీసీఎల్‌ సంస్థల్లో మొత్తం ప్రభుత్వ వాటాలను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది.

కేంద్ర ఆర్థిక మంత్రి ఈ ఏడాది ఆగస్టు 23న జాతీయ ద్రవ్యీకరణ పథకం (ఎన్‌ఎంపీ) ప్రారంభించారు. 2022-25 మధ్య నాలుగేళ్లలో ఎన్‌ఎంపీ కింద ఆరు లక్షల కోట్ల రూపాయలు సమీకరిస్తామని, రాష్ట్రాలూ ఇదే పంథాను అనుసరించాలని అన్నారు. దీని కింద పీఎస్‌యూ ఆస్తులను విక్రయించడం లేదని, కేవలం హక్కులను మాత్రమే నగదీకరిస్తామని ప్రకటించారు. ఈ ఆస్తులపై యాజమాన్య హక్కులు ఎవరికీ ఇవ్వబోమని, నాలుగేళ్ల తరవాత ఆ ఆస్తులు తిరిగి ప్రభుత్వానికి దఖలు పడతాయని వివరించారు. రైల్వే, విద్యుదుత్పాదన, సహజ వాయు పైపులైన్లు, టెలికమ్యూనికేషన్లు, రేవులు, గనులు, స్టేడియాలు, పట్టణ స్థిరాస్తుల వంటి రంగాల్లో ప్రభుత్వ ఆస్తులను నగదీకరిస్తారు. లీజు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలు, రాయితీలు, పెట్టుబడి ట్రస్టుల వంటి మార్గాల్లో ఏటా ప్రభుత్వానికి కొంత ఆదాయం లభిస్తుందని సర్కారు ఆశిస్తోంది. అయితే, ఆశ్రితులకు తక్కువ లీజుకే ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టబోతున్నారని, లీజు కాలం పూర్తయ్యాక ఆ ఆస్తుల విలువ- అరుగుదల, తరుగుదలతో క్షీణించిపోతుందని విమర్శలు వస్తున్నాయి. ఉదాహరణకు ఒక గనిలోని ఖనిజాన్ని పూర్తిగా తవ్వుకుని ప్రభుత్వానికి అప్పగిస్తే ఉపయోగం ఏముంటుంది? ఇలాంటి ఆస్తులను లీజుకిచ్చే బదులు పూర్తిగా విక్రయించడం ఉత్తమం.

కిం కర్తవ్యం?

దేశాభివృద్ధికి ప్రభుత్వ రంగం అవసరం లేదని, అంతా మార్కెట్టే చూసుకుంటుందనే వాదానికి 2008 ఆర్థిక సంక్షోభం, కొవిడ్‌ మహమ్మారి గోరీ కట్టాయి. ఒక్క కమ్యూనిస్ట్‌ చైనాలోనే కాదు, పెట్టుబడిదారీ అమెరికాలో... ఆ మాటకొస్తే అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్‌)లోనూ ప్రభుత్వ రంగ ప్రాధాన్యాన్ని ఎవరూ తోసిపుచ్చడం లేదు. రానున్న 30-50 ఏళ్లలో అంతరిక్షం, ఆరోగ్యం, కొత్త తరహా ఔషధాలు, టెలికాం వంటి సాంకేతిక రంగాలు విప్లవాత్మక అభివృద్ధిని అందుకోనున్నాయి. ఈ రంగాల్లో పరిశోధన-అభివృద్ధిపై భారీ పెట్టుబడులకు ప్రభుత్వమే పూనుకోవాలి. 6జీ సాంకేతికతలో తక్షణం 20 కోట్ల డాలర్లు విత్త మూలధనంగా పెట్టుబడి పెడతానని, దీన్ని క్రమక్రమంగా పెంచుకుంటూ పోతానని నెల క్రితం దక్షిణ కొరియా ప్రకటించింది. ప్రభుత్వ రంగం పనికిమాలినదనే భావన తప్పనడానికి ఇదే నిదర్శనం. భారత జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్‌పీసీఎల్‌) మరో విశిష్ట ఉదాహరణ. నేడు దేశంలో డిజిటల్‌ చెల్లింపులు ఊపందుకోవడానికి ఈ సంస్థే మూల కారణం.

ప్రభుత్వ రంగ వాటాలను విక్రయించడమంటే మనుగడ కోసం కుటుంబ ఆస్తులను తెగనమ్ముకోవడమే. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు అమ్మగా వచ్చే సొమ్మును ఓట్ల కోసం నగదు బదిలీ పథకాలపై ఖర్చు చేసేస్తే చివరకు చేతిలో చిల్లిగవ్వ మిగలదు. దీని బదులు ఆ నగదును ప్రత్యేక ఎస్క్రో ఖాతాలో భద్రపరచడం ఉత్తమం. ఆ నిధులను భావి తరాల వికాసానికి తోడ్పడే మౌలిక వసతుల నిర్మాణంపైన, మేధా హక్కుల సృష్టి మీద వెచ్చించాలి. అమెరికా ఇలాంటి కార్యక్రమాల కోసం జాతీయ సైన్స్‌ ఫౌండేషన్‌కు నిధులు కేటాయిస్తోంది. చమురు ఎగుమతుల ద్వారా లభిస్తున్న విదేశీ మారక ద్రవ్యాన్ని నార్వే తన సార్వభౌమ నిధిలో భద్రపరచి, భావి తరాల అభివృద్ధికి వెచ్చిస్తోంది. చైనా, ఇజ్రాయెల్‌, సింగపూర్‌ ప్రభుత్వాలు తమ తమ పంథాలో ఇటువంటి కార్యక్రమాలను చేపడుతున్నాయి. భారత్‌ వాటిని ఆదర్శంగా తీసుకొని పురోగమిస్తే ఆర్థిక వ్యవస్థ గాడిన పడగలదు!

సర్కారీ చొరవ

బ్రిటిష్‌ వలస పాలనలో నాశనమైన ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయడానికి పారిశ్రామికీకరణ అవసరమని స్వతంత్ర భారతం గుర్తించింది. స్వావలంబన, ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధి సాధనకు మన ప్రభుత్వాలు నడుం బిగించాయి. బ్రిటిష్‌ దోపిడివల్ల భారత్‌ తీవ్ర పెట్టుబడుల కొరతను ఎదుర్కొంది. ప్రైవేటు రంగం ధైర్యంగా పెట్టుబడులు పెట్టే వాతావరణమూ లేదు. అందువల్ల పరిశ్రమల స్థాపనకు తానే చొరవ తీసుకోవాలని కేంద్ర ఫ్రభుత్వం గ్రహించింది. భెల్‌, సెయిల్‌ తదితర సంస్థలను నెలకొల్పింది. వెనకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించి అభివృద్ధికి ఊపునిచ్చింది. విద్య, వైద్యంతోపాటు విద్యుత్‌, రైల్వే, రహదారులు, ఉక్కు, రేవులు, గనులు, పెట్రోలియం, తదితర ఉత్పాదన రంగాల్లో పెట్టుబడులు పెట్టింది. వీటి ఉత్పత్తులకు తానే మార్కెట్‌ సృష్టించింది. తరవాతి కాలంలో ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేటు సంస్థలు ముందుకొచ్చాయి. భెల్‌, ఈసీఐఎల్‌, ఐడీపీఎల్‌ వంటివి అనేక అనుబంధ సంస్థలకు జన్మనిచ్చే మాతృ సంస్థలుగా నిలిచాయి.


 

Posted Date: 04-10-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం