• facebook
  • whatsapp
  • telegram

గాడితప్పిన పట్టణీకరణ

పట్టాలకెక్కిస్తేనే సుస్థిరాభివృద్ధి

ప్రపంచీకరణ, ఆర్థిక వ్యవస్థలో పరిణామాలు, వినియోగ సంస్కృతులవల్ల ప్రపంచంలో పట్టణాలు, నగరాల ప్రాధాన్యం పెరిగింది. అవి ఆర్థిక చోదకశక్తులుగా మార్పు చెందాయి, చెందుతున్నాయి. ప్రపంచ స్థూల ఉత్పత్తిలో 60శాతం వాటా పట్టణాలదే. నేడు పట్టణీకరణ దేశాల ఆర్థికాభివృద్ధికి కొలమానంగా నిలుస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో పట్టణీకరణ 16వ శతాబ్దం నుంచే ప్రారంభమైంది. పారిశ్రామిక విప్లవం అందుకు ప్రధాన కారణం. భారతదేశంలో పట్టణీకరణ స్వాతంత్య్రానంతరమే వేగం పుంజుకొంది. 1950-51లో భారత స్థూల దేశీయోత్పత్తిలో 29శాతంగా ఉన్న పట్టణాల వాటా... 2011 నాటికి 65 శాతానికి పెరిగింది. భారత్‌లో ఈ శతాబ్దం ప్రథమార్ధంలో వేగం అందుకున్న పట్టణీకరణ ద్వితీయార్ధం నాటికి గణనీయంగా పెరిగింది. దేశంలో పట్టణ జనాభా 1901 నుంచి అయిదు దశాబ్దాల్లో 3.68 కోట్ల మేర పెరిగింది. 1951-2001 మధ్య కాలంలో మొత్తం జనాభా 28 రెట్లు, పట్టణ జనాభా 4.6రెట్లు పెరిగింది. 2011 లెక్కల ప్రకారం దేశ జనాభా 121 కోట్లలో పట్టణాల్లో నివసించే వారు 37.71 కోట్లు... అంటే 31.16శాతం. 2030 నాటికి దేశ జనాభాలో పట్టణ ప్రజల వాటా 50శాతానికి చేరుతుందని ‘ప్రపంచ బ్యాంకు, మెకిన్సే’ నివేదికలు వెల్లడించాయి.

రాష్ట్రాల మధ్య అంతరాలు

దేశంలో పట్టణాలను జనాభా ప్రాతిపదికన ఆరు తరగతులుగా వర్గీకరించారు. వీటిలో లక్ష జనాభా ఉన్నవి, 5000 కంటే తక్కువ జనాభా ఉన్న పట్టణాలు ఉన్నాయి. 1951లో దేశంలో పది లక్షలకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల సంఖ్య తొమ్మిది. 2011 నాటికి అది 53కు పెరిగింది. అందులో హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ ఉన్నాయి. దేశంలోని పట్టణ జనాభాలో 37శాతం మెట్రోపాలిటన్‌ నగరాల్లోనే నివసిస్తోంది. దిల్లీ, ముంబయి, అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌లలో జనాభా 40లక్షల పైమాటే కాబట్టి, వాటిని మెగా నగరాలుగా వర్గీకరించారు. పట్టణీకరణ దేశం మొత్తం మీద ఒకే రకంగా లేదు. రాష్ట్రాల మధ్య అంతరాలున్నాయి. 49.7శాతం పట్టణ జనాభాతో గోవా అత్యధిక పట్టణీకరణ చెందిన రాష్ట్రంగా నిలిచింది. తరవాతి స్థానాలను వరసగా మిజోరం, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ్‌బెంగాల్‌ ఆక్రమించాయి. పారిశ్రామికీకరణలో పెరుగుదల ఆర్థికాభివృద్ధితో పాటు పట్టణీకరణను వేగవంతం చేస్తుంది. జనాభా సహజ వృద్ధి రేటు, వలసలు, విస్తరిస్తున్న సేవా రంగం, పారిశ్రామికీకరణ, ఉపాధి అవకాశాలు పట్టణీకరణకు ప్రధాన కారకాలని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

భారతదేశంలో పట్టణీకరణ విధానాలన్నీ స్వాతంత్య్రానంతరం రూపుదిద్దుకొన్నవే. 75 సంవత్సరాల పట్టణీకరణ విధానాలు, ప్రణాళికల వల్ల భారత స్థూల దేశీయోత్పత్తిలో పట్టణాల వాటా పెరిగింది. ప్రైవేటు రంగం విస్తరించి ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. సేవారంగం కీలకంగా మారింది. రవాణా, విద్యుత్‌ వంటి మౌలిక వసతులు అభివృద్ధి చెందాయి. విద్య, వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. భారత్‌లో పంచవర్ష ప్రణాళికల ద్వారా ప్రభుత్వాలు పట్టణీకరణ విధానాల రూపకల్పన, సంస్థల ఏర్పాటుపై దృష్టి సారించాయి. ఆధునిక భారతదేశానికి సంకేతంగా నిలిచిన మొట్టమొదటి ప్రణాళికా నగరం చండీగఢ్‌ తొలి పంచవర్ష ప్రణాళికా కాలంలో నిర్మితమైంది. పట్టణీకరణకు ఊతమిచ్చే వ్యవస్థలను, సంస్థలను వివిధ ప్రణాళికా కాలాల్లో ఏర్పాటు చేశారు. సమతులాభివృద్ధి లక్ష్యంగా చిన్న పట్టణాల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చారు. పట్టణ భూవిధానాన్ని రూపొందించి, బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణానికి పథకాలు రూపొందించారు. 1976లో పట్టణ భూపరిమితి చట్టం చేశారు. 1988లో జాతీయ గృహ విధానానికి, పట్టణ మౌలిక సేవల పథకానికి రూపకల్పన చేశారు. 1989లో పట్టణ పేదల ఉపాధి కల్పన కోసం నెహ్రూ రోజ్‌గార్‌ యోజన ప్రారంభించారు. 74వ రాజ్యాంగ సవరణ స్థానిక ప్రభుత్వాల స్వయం ప్రతిపత్తికి, నిర్ణయాత్మక శక్తికి, వికేంద్రీకరణకు బలమైన పునాదులు వేసింది. పట్టణ పేదరిక నిర్మూలనకు వివిధ ప్రణాళికల కాలంలో పలు కార్యక్రమాల్ని చేపట్టారు. ప్రధాన మంత్రి రోజ్‌గార్‌ యోజన, ప్రధాన మంత్రి సమగ్ర పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమం, స్వర్ణ జయంతి షహరి రోజ్‌గార్‌ యోజన, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన, మురికివాడల నిర్మూలన లాంటి కార్యక్రమాలు పథకాలు పట్టణీకరణపై ప్రభావం కనబరచాయి. స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ కార్యక్రమం పట్టణాల్లో పారిశుద్ధ్య మెరుగుదలకు, ఆరోగ్య భద్రతకు దోహదం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2016లో ఎంపిక చేసిన 100 నగరాల్లో ఆకర్షణీయ నగరాల కార్యక్రమాన్ని ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం, కాకినాడ, వరంగల్‌, కరీంనగర్‌ ఆకర్షణీయ నగరాల పథకానికి ఎంపికయ్యాయి. వారసత్వ నగరాల అభివృద్ధి ధ్యేయంగా ‘హృదయ్‌’ పథకం పని చేస్తోంది. పట్టణాలు అభివృద్ధి పథంలో పోటీ పడటానికి పరిశుభ్ర నగరం, వారసత్వ నగరం, జీవన నాణ్యత సూచీలు... తదితర పోటీలను నిర్వహించి ఎంపికైన నగరాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోంది.

పౌరసేవలే లక్ష్యం కావాలి

భారత్‌లో పట్టణీకరణలోని లోపాలను సరిదిద్ది, దిశ మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వలసల మార్గం మారాలి. మహా నగరాల్లో సంతృప్త స్థాయికి చేరిన జనాభా- మురికివాడల విస్తరణకు, ఉపాధి అవకాశాల క్షీణతకు కారణమవుతోంది. మహా నగరాలకు బలమైన ఆర్థిక పునాదులను నిర్మించాలి. ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైన చిన్న పట్టణాలకు పెట్టుబడులను, వలసలను మళ్ళించాలి. అప్పుడే పట్టణ ఆర్థిక వ్యవస్థ సామర్థ్యం పెరుగుతుంది. తులనాత్మకమైన పట్టణ ప్రణాళికలను రూపొందించాలి.

సుస్థిరాభివృద్ధి, పర్యావరణ హితకరమైన విధానాల ద్వారా పట్టణ వ్యవస్థల నిర్మాణం జరగాలి. చాలా ఏళ్లుగా దేశంలో కొత్త నగరాల నిర్మాణం జరగలేదు. 5000 జనాభా కలిగిన అనేక పట్టణాలు పుట్టగొడుగుల్లా విస్తరించినా, వాటిని పట్టణాలుగా ప్రకటించక పోవడంతో, స్థానిక సంస్థల ఏర్పాటు జరగలేదు. 2001లో 1,862గా ఉన్న పట్టణాలు 2011 నాటికి 3,894కు పెరిగాయని గణాంకాలు వివరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎనిమిది నూతన నగరాల నిర్మాణానికి 15వ ఆర్థిక సంఘం సంకల్పించింది. ఆ నగరాలను ఉపగ్రహ పట్టణాలుగా కాక గ్రీన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టులుగా ప్రకటించాలి. ఈ మధ్య కాలంలో అమెరికా, యూరప్‌ దేశాల్లో ‘నవీన పట్టణీకరణ’ అనే భావన ప్రాచుర్యం పొందుతోంది. ఈ సిద్ధాంతం అనేక చిన్న పట్టణాల నిర్మాణానికి ప్రేరణ కలిగిస్తోంది. అమెరికాలో ఫ్లోరిడాలోని ‘సీసైడ్‌’ పట్టణం ఇందుకు ఉదాహరణ. బిల్డర్లు బలవంతంగా రుద్దే జోనింగ్‌ వ్యవస్థ బదులుగా, పౌరుల ఆకాంక్షలను ప్రతిబింబించే క్రమబద్ధమైన ప్రణాళికా నగరాల నిర్మాణం నవీన పట్టణీకరణ లక్ష్యంగా సిద్ధాంతవేత్తలు చెబుతున్నారు. సుస్థిర ఆర్థికాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, పేదరిక నిర్మూలన, జీవన భద్రత ప్రాధాన్యాంశాలుగా జాతీయ పట్టణ విధానాన్ని తీర్చిదిద్దాలి. పట్టణ పరిపాలనలో మౌలిక సంస్కరణలు అవసరం. పరిపాలన పౌర కేంద్రీకృతంగా ఉండాలి. అప్పుడే సుస్థిర నగరాలు రూపుదిద్దుకుంటాయి. పట్టణీకరణ అర్థవంతమవుతుంది.

కుంగదీస్తున్న ప్రణాళికారాహిత్యం

క్రమపద్ధతి, ప్రణాళిక, దిశ... లోపించడంతో పట్టణీకరణ పలు సమస్యలను సృష్టిస్తోంది. పట్టణ పేదరికం పెరిగింది. మురికివాడలు విస్తరించాయి. తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. జల, వాయు కాలుష్యం పెచ్చరిల్లింది. మెరుగైన విద్య, వైద్య సేవలు అందడంలేదు. చెరువులు, నాలాల ఆక్రమణ, అక్రమ నిర్మాణాలతో పట్టణాలు జల విలయానికి గురవుతున్నాయి. ప్రణాళికా రాహిత్యం నగరాలను కుంగదీస్తోంది. దేశంలోని సగం నగరాలకు మాస్టర్‌ ప్లాన్లు లేవని నీతి ఆయోగ్‌ తాజా నివేదిక తెలిపింది. గుంతల రోడ్లు, మురుగునీటి పారుదల వ్యవస్థలు నరకాన్ని తలపిస్తున్నాయి. పర్యావరణ వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. జీవన నాణ్యత సూచీలో ఇండియాలోని నగరాలు అధమ స్థాయిలో ఉన్నాయి. నిరుద్యోగం, నేరాల రేటు పెరుగుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో పట్టణీకరణ- ఒక క్రమ పద్ధతిలో సుస్థిరంగా రూపుదిద్దుకొంది. ఈ తరహా విధానాలను ప్రభుత్వాలు పరిశీలించాలి.


 

******************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నీరుగారుతున్న ‘సహ’ స్ఫూర్తి

‣ మద్దతు దక్కని కడగండ్ల సాగు

‣ చిన్నారులకు మెరుగైన భవిష్యత్తు

‣ కొండలకూ వ్యర్థాల ముప్పు

Posted Date: 13-12-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం