• facebook
  • whatsapp
  • telegram

మారుతున్న ఆధునిక యుద్ధ రీతి!

సాంకేతిక పరిజ్ఞానమే సరికొత్త ఆయుధం

కొన్నిసార్లు గతం భవిష్యత్తుకు దర్పణమవుతుంది. 1991 గల్ఫ్‌ యుద్ధం నేర్పిన పాఠాలు ఇటీవల ఆర్మీనియాపై పోరులో అజర్‌ బైజాన్‌ విజయానికి దోహదం చేశాయి. ఈ రెండు యుద్ధాలు సాంకేతికతే విజయ సాధనమని చాటాయి. దీన్ని చైనా బాగా ఒంటపట్టించుకోగా, దురదృష్టవశాత్తు- భారత్‌లో ఆ చొరవ కనబడటం లేదు. 1991 గల్ఫ్‌ యుద్ధంలో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళ విమానాలు ఉపగ్రహ జీపీఎస్‌ సాయంతో గురితప్పని రీతిలో  నిక్కచ్చిగా లక్ష్యాన్ని ఛేదించే బాంబులు ప్రయోగించి ఇరాకీ సైన్యాన్ని చిత్తు చేశాయి. ఆ సమరంలో దాదాపు 10,000 మంది ఇరాకీ సైనికులు మరణించగా, సంకీర్ణ దళాల్లో కేవలం 300 మంది హతమయ్యారు. ఆపైన 2001 నుంచి ఆ తరహా లక్ష్య ఛేదన బాంబులను అమర్చిన డ్రోన్లతో అమెరికా అనేకమంది అల్‌ఖైదా, తాలిబన్‌ నాయకులను వధించింది. ఇటీవల ఆర్మీనియాపై కేవలం డ్రోన్లతోనే గెలిచిన అజర్‌ బైజాన్‌, నేటియుద్ధంలో సైనిక సంఖ్యాబలం కన్నా సాంకేతిక నాణ్యతే మిన్న అని చాటింది.

చైనా ముందంజ
చైనా సైనిక సంఖ్యాబలాన్ని తగ్గించుకొని సాంకేతిక పోరాట సత్తాను పెంచుకొంటోంది. నేడు అంతరిక్షంలో పరిభ్రమిస్తున్న 20 చైనా ఉపగ్రహాలు రాడార్‌ కన్నుగప్పి తమ భూభాగంలోకి చొరబడే ఎటువంటి స్టెల్త్‌ విమానాన్నైనా పసిగట్టగలవు. జీపీఎస్‌కు పోటీగా ఆ దేశం రూపొందించుకున్న ఉపగ్రహ వ్యవస్థ శత్రు జలాంతర్గాములు, విమానాలు, ట్యాంకుల కదలికలను చప్పున కనిపెట్టగలదు. నేడు ప్రపంచంలోని 25 అగ్రశ్రేణి ఆయుధోత్పత్తి కంపెనీల్లో నాలుగు చైనా ప్రభుత్వ రంగ సంస్థలు. ఆ జాబితాలో భారతీయ ఆయుధ కంపెనీ ఒక్కటి కూడా లేదు. దీన్నిబట్టి సైనిక ఆధునికీకరణలో డ్రాగన్‌ ఎంతగా దూసుకుపోతోందో అర్థం చేసుకోవచ్చు. చంద్ర, కుజ గ్రహాల వద్దకు రాకెట్లను ప్రయోగించిన భారత్‌ సొంతంగా యుద్ధ విమాన ఇంజిన్‌ను తయారు చేసుకోలేకపోవడం విస్మయపరచేదే. భారత్‌ ఇప్పటికీ యుద్ధ విమానాలు, శతఘ్నులు, హెలికాప్టర్లు, డ్రోన్లు, రక్షణ ఎలెక్ట్రానిక్స్‌ ఉపకరణాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోక తప్పడం లేదు. 2015-19 మధ్య ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకున్న దేశాల్లో రెండో స్థానం భారత్‌దే. మరోవైపు ప్రపంచంలో అయిదో పెద్ద ఆయుధ ఎగుమతిదారుగా చైనా అవతరించింది.

నవీకరణకు చాలని నిధులు
ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసిన, అరువు తెచ్చుకున్న, దొంగిలించిన, తానే సొంతంగా రూపొందించుకున్న సాంకేతిక పరిజ్ఞానంతో అమెరికాకు ప్రధాన పోటీదారుగా చైనా ఆవిర్భవిస్తోంది. డ్రోన్ల దండు, రోబోటిక్స్‌, లేజర్లు, బిగ్‌ డేటా, కృత్రిమ మేధలతో యుద్ధం చేసే సామర్థ్యాన్ని సాధించుకొంది. ఈ అంశాల్లో భారత్‌ చైనాకన్నా మూడు దశాబ్దాలు వెనకంజలో ఉంది. దీనికి కారణాలు అనేకం. సమాచార సాంకేతికతలో అగ్రగామిగా ప్రశంసలు అందుకొంటున్న భారత్‌ ఆ పరిజ్ఞానాన్ని యుద్ధ నైపుణ్యానికి ఉపయోగించుకోవడంపై శ్రద్ధ పెట్టడం లేదు. రక్షణ బడ్జెట్‌లో సింహభాగం సిబ్బంది జీతభత్యాలకు, పింఛన్లకే ఖర్చయిపోవడం వల్ల సైనిక ఆధునికీకరణకు నిధులు చాలడం లేదు. సైన్యానికి అత్యధికంగా సిబ్బందిని అందించే హిందీ రాష్ట్రాలు పెద్ద ఓటు బ్యాంకులు కావడంతో ఏ ప్రభుత్వమూ సైనిక సిబ్బందిని తగ్గించడానికి సిద్ధపడటం లేదు. చైనాలా ఇతర దేశాల సాంకేతికతను దొంగిలించడం, అనుకరించడం భారత్‌కు అలవాటు లేదు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, ఇజ్రాయెల్‌, బ్రిటన్‌ వంటి దేశాల నుంచి సాంకేతిక పరిజ్ఞానం బదిలీ షరతుపై ఇండియా ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. కానీ, ఆయా దేశాలు సాంకేతికతను బదిలీ చేయడంలో జాప్యం చేస్తున్నాయి. దీనివల్ల భారత్‌లో రక్షణ పరిశ్రమలు ఎదగలేక ఆయుధాలకు తీవ్ర కొరత ఏర్పడుతోంది.

‘భారత్‌లో తయారీ’ కింద ఆయుధ తయారీలో ప్రైవేటు రంగాన్ని భాగస్వామిగా చేయాలన్న లక్ష్యమూ నెరవేరడం లేదు. ఉదాహరణకు ఎల్‌ అండ్‌ టి నుంచి 100 ఫిరంగులను కొనుగోలు చేస్తానన్న సైన్యం- నిధుల కొరతతో సంఖ్య తగ్గించుకుంది. దీంతో తమ ఫిరంగి కర్మాగారాన్ని మూసివేయాల్సి రావచ్చని ఎల్‌ అండ్‌ టి చైర్మన్‌ ఎ.ఎం.నాయక్‌ వ్యాఖ్యానించారు. ఆయుధ కంపెనీలకు వేగంగా ఆర్డర్లు ఇచ్చి, సకాలంలో చెల్లింపులు జరిపితేనే, అవి ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఉత్సాహం చూపుతాయి. ఇతర దేశాలు డ్రోన్లు, సాఫ్ట్‌వేర్‌ దాడులతో యుద్ధ సన్నద్ధతను పెంచుకుంటున్నాయి. ఇలాంటి పరిణామాలన్నీ భారత్‌కు మేల్కొలుపు కావాలి. ఇటీవల అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాలు సమాచార యుద్ధానికి తోడ్పడతాయి. 5జీ, ఏఐ, సైబర్‌ భద్రత వంటి కీలక రంగాల్లో సహకారానికి జపాన్‌తో భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఇజ్రాయెల్‌ నుంచి డ్రోన్లు, ఎలెక్ట్రానిక్‌ సమర సామగ్రిని సేకరిస్తోంది. బాహాబాహీ యుద్ధాలకు కాలం చెల్లుతోందని గ్రహించి మన వ్యూహాలను, ఆలోచనా విధానాలను మార్చుకోవాలి. స్వదేశీ రక్షణ పరిశ్రమలను అభివృద్ధి చేసుకోవాలి!  

‘డ్రోన్ల’పై లోపించిన శ్రద్ధ
యుద్ధ విమానాలు, నౌకలు, శతఘ్నుల తయారీకి కావలసినంత భారీ పెట్టుబడులు డ్రోన్ల తయారీకి, సైబర్‌, ఎలెక్ట్రానిక్‌ ఆయుధాలకు అవసరం ఉండదు. అయినా, ఈ అంశంలోనూ భారత్‌ వెనకబడి ఉంది. నేడు డ్రోన్ల తయారీలో, ఎగుమతిలో అమెరికా, ఇజాయెల్‌, చైనాలే అగ్రగాములు. టర్కీ కూడా ఈ విషయంలో ముందున్నది. ఇజ్రాయెల్‌, టర్కీల నుంచి కొన్న డ్రోన్లతోనే అజర్‌ బైజాన్‌ ఇటీవల ఆర్మీనియాను చిత్తుచేసింది. 2007లో అమెరికాలోని ఎంఐటీలో పీహెచ్‌డీ చేస్తున్న టర్కీ విద్యార్థి సెల్యూక్‌ బేరక్తర్‌ చదువును మధ్యలోనే ఆపేసి టీబీ2 అనే సాయుధ డ్రోన్‌ను తయారు చేశారు. ఆ డ్రోన్‌ ఆర్మీనియాపై యుద్ధంలో అజర్‌ బైజాన్‌కు గెలుపు సాధించిపెట్టింది. మన ఐఐటీ విద్యార్థులకు, డీఆర్డీఓకు ఇది ఆదర్శం కావాలి. నేడు పాకిస్థాన్‌, నైజీరియా, ఇరాన్‌లు కూడా డ్రోన్లతో దాడులు జరపడంలో ఆరితేరాయి. చైనా డ్రోన్ల నమూనాతో పాకిస్థాన్‌ 2013లోనే సొంతంగా డ్రోన్లు రూపొందించింది. ఆకాశంలో తారట్లాడుతూ నేల మీద ప్రత్యర్థులు కనబడగానే బాంబులు విసిరే లాయిటర్‌ డ్రోన్లు కూడా చైనా నుంచి పాక్‌ అమ్ములపొదిలోకి చేరి ఉంటాయని అంచనా. భారత్‌ ఇంతవరకు సొంత డ్రోన్ల తయారీని చేపట్టలేక, అమెరికా, ఇజ్రాయెల్‌ల నుంచి దిగుమతి చేసుకొంటోంది. సాఫ్ట్‌వేర్‌ సమర సన్నద్ధతలోనూ చైనాకన్నా భారత్‌ వెనకబడి ఉంది. ఈ తరహా యుద్ధానికి చైనా 2015లోనే ‘స్ట్రాటజిక్‌ సపోర్ట్‌ ఫోర్స్‌’ పేరిట ప్రత్యేక దళాన్ని ఏర్పరచింది. ఆ దళానికి ఎలెక్ట్రానిక్‌, ఎలక్ట్రోమాగ్నెటిక్‌, సంప్రదాయ ఆయుధాలతో శత్రు సమాచార వ్యవస్థలను ధ్వంసం చేసే సామర్థ్యాన్ని సమకూరుస్తోంది.

- వరప్రసాద్‌
 

Posted Date: 26-12-2020



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం