• facebook
  • whatsapp
  • telegram

వ్యక్తిగత సమాచారం భద్రమేనా?

గోప్యతా హక్కుకు తూట్లు

వాట్సాప్‌ లేని స్మార్ట్‌ఫోన్‌ ఉండదేమో అన్నంతగా వినియోగదారుల ఆదరణ చూరగొన్న ఈ మెసేజింగ్‌ యాప్‌ వినియోగదారులకు ఇప్పుడు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. వినియోగదారుల సమాచారాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుతున్నామని, అందుకోసం ‘ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌’ ఉందని డాంబికాలు పోయే వాట్సాప్‌... తాజాగా తమ గోప్యతా విధానాన్ని నవీకరించామని, వినియోగదారులంతా దాన్ని ఆమోదించాలని ప్రకటించింది. కొత్త విధానం ప్రకారం వాట్సాప్‌ కీలక సమాచారాన్ని వినియోగదారుల నుంచి సేకరిస్తుందని, దాన్ని తన యాజమాన్య సంస్థ ఫేస్‌బుక్‌తో పంచుకుంటుందన్నది ఆ ప్రకటన సారాంశం. కొత్త విధానాన్ని వాట్సాప్‌ వినియోగదారులు ఫిబ్రవరి 8లోగా అంగీకరించాలని, లేకపోతే ఆ తరవాత తమ యాప్‌ వాడుకోలేరని స్పష్టంగా చెప్పేసింది. దాంతో వాట్సాప్‌ వినియోగదారుల్లో కలకలం మొదలైంది. వాట్సాప్‌లో ఉన్న తమ వ్యక్తిగత సమాచారాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక మాధ్యమ వేదిక అయిన ఫేస్‌బుక్‌తో పంచుకుంటే ఇక దానికి గోప్యత ఎక్కడ ఉంటుందని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సమాచార గోప్యత’ (డేటా ప్రైవసీ) చట్టం ఉండాలన్న డిమాండ్‌ బలంగా తెరపైకి వస్తోంది.

వాట్సాప్‌ ఎలాంటి వివరాలు సేకరిస్తుంది?

నూతన గోప్యత విధానంలో భాగంగా వినియోగదారుల సమాచారాన్ని తమ మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో పంచుకుంటామని వాట్సాప్‌ ప్రకటించింది. చరవాణి సంఖ్య, వాట్సాప్‌ ఖాతా తెరిచే సమయంలో వెల్లడించిన వివరాలు అంటే పేరు, ఫొటో వంటివాటిని అది ఫేస్‌బుక్‌తో పంచుకుంటుంది. వాట్సాప్‌ను వినియోగదారులు ఎంత తరచుగా వాడుతున్నారన్న సమాచారాన్ని సేకరిస్తుంది. అంతేకాదు- వినియోగిస్తున్న ఫోన్‌ ఏ కంపెనీది, దాని ఆపరేటింగ్‌ వ్యవస్థ, బ్యాటరీ సామర్థ్యం, ప్రాంతం, బ్రౌజర్‌లో ఎంపిక చేసుకున్న భాష, మొబైల్‌ ఫోన్‌ ఐపీ చిరునామా వంటి వివరాలనూ అది తెలుసుకుంటుంది. ఇవన్నీ ఫేస్‌బుక్‌తో పంచుకుంటే వినియోగదారుల వ్యక్తిగత సమాచారమంతా నెట్టింట్లో ఉన్నట్లే. ఫేస్‌బుక్‌ గ్రూప్‌లో వాట్సాప్‌తో పాటు ఫేస్‌బుక్‌ మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ షాప్స్‌ వంటివి ఉన్నాయి. సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో పంచుకోవడమంటే- అది దాని అనుబంధ విభాగాలకూ ఆ వివరాలను అందిస్తుందనే అర్థమని నిపుణులు చెబుతున్నారు. ఐరోపా సమాఖ్య దేశాల్లో పౌరుల సమాచార భద్రతకు జనరల్‌ ‘సమాచార భద్రత నియంత్రణ చట్టం’ ఉంది. దాని ప్రకారం వాట్సాప్‌ తమ వినియోగదారుల సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో పంచుకోవడం కుదరదు. అలాంటి బలమైన చట్టమేదీ భారత్‌లో లేదు. అందువల్ల వాట్సాప్‌ ప్రతిపాదిస్తున్న నూతన గోప్యత విధానంతో వినియోగదారుల సమాచారమంతా బయటికి పొక్కే ప్రమాదం ఉందని తెలిసినా-  దాన్ని అడ్డుకోలేని పరిస్థితి నెలకొంది. భారత్‌లో వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు-2019 కోసం రెండేళ్లుగా ఎన్నో చర్చలు, నిపుణుల సలహాలు, ప్రజాభిప్రాయ సేకరణలు సాగాయి. 2019 డిసెంబరులోనే ఆ బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చింది. అనంతరం 14 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ దానిలో ఎలాంటి కదలికా లేదు. దీనిపై నిపుణుల అభిప్రాయాలు తీసుకుని మరింత లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని, మార్పుచేర్పుల అనంతరమే ఆ బిల్లును చట్టంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత సాంకేతిక విప్లవం ఇదే రీతిన కొనసాగితే 2025నాటికి దాని విలువ 7.34 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా. ఇందులో అధిక భాగం డేటా సృష్టి, వినియోగం, అమ్మకంపై ఆధారపడి ఉంది. అందుకు అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థల దన్ను అవసరం. వ్యక్తిగత సమాచార భద్రత బిల్లును ఇప్పుడున్నది ఉన్నట్లుగా చట్టంగా మారిస్తే ఆయా కంపెనీల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందన్న సంశయంతోనే దాన్ని చట్టంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్నది ఆ రంగంలోని నిపుణుల అభిప్రాయం. ఐరోపా సమాఖ్యలోని దేశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90దేశాలు పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఉంచే చట్టాలను పటిష్ఠంగా అమలు చేస్తున్నాయి. దానివల్ల వాట్సాప్‌ వంటివి ఆయా దేశంలో పౌరుల సమాచారాన్ని ఇష్టారీతిన ఉపయోగించుకునే అవకాశాలు మూసుకుపోయాయి. కానీ, భారత్‌లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉండటమే బాధాకరం.

మార్కెట్‌ యుద్ధంలో పావులు!

సామాజిక మాధ్యమ వేదికగా ఫేస్‌బుక్‌ ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉంది. దానికితోడు మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ను కొనుగోలు చేయడంతో అటు సందేశాల్లోనూ ఇటు సామాజిక మాధ్యమాల్లోనూ ఫేస్‌బుక్‌ అధినేత జుకెర్‌బర్గ్‌ తిరుగులేని శక్తిగా తయారయ్యారు. ఇప్పుడు ‘వినియోగదారుల సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో పంచుకుంటాం’ అని వాట్సాప్‌ అనగానే- టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌, పేటీఎం అధినేత విజయశేఖర్‌ శర్మవంటి ప్రముఖులు వాట్సాప్‌ను పక్కనపెట్టి సిగ్నల్‌ వంటి ఇతర మెసేజింగ్‌ యాప్‌లను వాడుకొమ్మని సలహా ఇస్తున్నారు. దీని వెనక జుకెర్‌బర్గ్‌ గ్రూప్‌ సంస్థలను దెబ్బతీయాలనే ఉద్దేశం కనిపిస్తోంది. వాట్సాప్‌ను కాదని సిగ్నల్‌, టెలిగ్రాం వంటి మెసేజింగ్‌ యాప్‌లను వాడుకోవడం తాత్కాలికంగా బాగానే ఉండవచ్చు. కానీ రేపొద్దున అవి కూడా వాట్సాప్‌ లాగే వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని బట్టబయలు చేయడానికి ప్రయత్నించవన్న నమ్మకం లేదు. కాబట్టి ఇప్పుడు అత్యవసరంగా కావలసింది వాట్సాప్‌ను పక్కనపెట్టడం కాదు. ఏ రకంగానూ దేశ పౌరుల సమాచార భద్రతను ప్రశ్నార్థకం చేయని బలమైన చట్టాల రూపకల్పన. ఆ లక్ష్యంతో వ్యక్తిగత సమాచార భద్రత బిల్లును తీర్చిదిద్దితేనే సమాచారానికి భద్రత!

- గ్రీష్మశ్రీ
 

Posted Date: 13-01-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం