• facebook
  • whatsapp
  • telegram

నైపుణ్యాల ఖని... డిజిటల్‌ భారత్‌!

చిత్తశుద్ధితోనే సాకారం

 

 

డిజిటల్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా పథకాలు భావి భారతానికి మూల స్తంభాలుగా భాసిస్తాయని కేంద్ర ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పదవీ స్వీకారం చేసిన రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఉద్ఘాటించారు. ఈ రెండు పథకాలను ఎంత ఉత్తమంగా సమ్మేళనం చేస్తారనే దానిపై ఉజ్జ్వల భారత నిర్మాణం ఆధారపడి ఉంటుంది. లాక్‌డౌన్‌ కాలంలో నగరాల నుంచి సొంత ఊళ్లకు తిరిగివచ్చిన వలస కూలీల నైపుణ్యాలను పెంపొందించడంపై, కొవిడ్‌ వల్ల ఉపాధి కోల్పోయిన పట్టణ యువత కౌశలాలకు మరింత పదును పెట్టడంపై దృష్టి కేంద్రీకరించాలి. కానీ, ఆత్మనిర్భర్‌ కౌశల్‌ ఉద్యోగి, యజమాని మ్యాపింగ్‌ పథకం కింద వలస కూలీల నైపుణ్యాలను నమోదు చేసే పని నత్తనడకన సాగడంతో వారి కౌశలాలను పెంపొందించడం ఆలస్యమవుతోందని కార్మిక వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీసంఘం విమర్శించింది. గత ప్రభుత్వాల హయాములోనూ పరిస్థితి ఇంతే. 2022కల్లా 50 కోట్ల నిపుణ మానవ వనరులను తయారు చేసుకోవాలని ప్రభుత్వం ఘనంగా లక్షించింది. కానీ, 2010-19 మధ్య కాలంలో భారత్‌లో వివిధ పథకాల కింద నైపుణ్యాలు పొందినవారు మొత్తం కార్మిక బలగంలో 21.1 శాతానికి మించరని ఐక్యరాజ్యసమితి అభివృద్ధి సంస్థ (యూఎన్‌డీపీ) తాజా నివేదిక వెల్లడించింది. భారతదేశ మానవ వనరులను దేశాభివృద్ధి సాధనాలుగా తీర్చిదిద్దాలంటే అన్ని వర్గాలకూ వేగంగా నైపుణ్యాలు గరపాలి. వాస్తవంలో జరుగుతున్నది దీనికి భిన్నం. జాతీయ అప్రెంటిస్‌ షిప్‌ శిక్షణ పథకానికి ఈ ఏటి బడ్జెట్‌లో రూ.3,000 కోట్లు కేటాయించినా- కేవలం ఇంజినీరింగ్‌ విద్యార్హతలు ఉన్నవారికే దీన్ని పరిమితం చేసి, ఆర్ట్స్‌, సైన్స్‌ పట్టభద్రులపై శీతకన్ను వేశారు. 2020-21లో ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన మూడో దశ కింద ఎనిమిది లక్షల మంది దినసరి కూలీలకు నైపుణ్యాలను పెంపొందించాలని లక్షించి, ఆ బాధ్యతను జిల్లా కలెక్టర్లపై మోపారు. పని ఒత్తిళ్ల వల్ల కలెక్టర్లు కొత్త బాధ్యతకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నారు.

 

లక్ష్యసాధనలో వెనకంజ

దేశ జనాభాలో 54శాతం 25 ఏళ్ల లోపువారే. 2023 నాటికి పనిచేసే వయోవర్గం (15-59 ఏళ్లు)లోకి అదనంగా ఏడు కోట్ల మంది ప్రవేశించబోతున్నందువల్ల, వారికి వృత్తి కౌశలాన్ని అందించడానికి త్వరపడాల్సి ఉంది. గ్రామాల్లో పనులులేక పట్టణాలకు వలస వస్తున్న యువతకు మారుతున్న కాలానికి తగిన నైపుణ్యాలను నేర్పాలి. బడ్జెట్లలో విద్యకు కేటాయింపులను భారీగా పెంచి, యువతకు నాణ్యమైన విద్యను, ఆధునిక నైపుణ్యాలను అందించినప్పుడే స్కిల్‌ ఇండియా విజయవంతమవుతుంది. జీడీపీలో ఆరు శాతాన్ని విద్యకు కేటాయించాలన్న జాతీయ విద్యా విధాన సూచనను ప్రభుత్వం అవశ్యం అమలుచేయాలి. కేంద్ర సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని నైపుణ్యపరంగా పల్లెలు, పట్టణాల మధ్య అంతరాన్ని తగ్గించడంపై దృష్టిసారించాలి. ఇందుకు తోడ్పడగల డిజిటల్‌ ఇండియా పథకం అమలులోనూ ఎన్నో లొసుగులు ఉన్నాయి. డిజిటల్‌ ఇండియా పథకం కింద పల్లెలకు అంతర్జాల సౌకర్యాన్ని విస్తరించడంలో జరుగుతున్న జాప్యం అందుకు ఒక ఉదాహరణ. గతేడాది డిసెంబరు నాటికి గ్రామీణ జనాభాలో 35శాతం కన్నా తక్కువ మందికే ఇంటర్నెట్‌ సౌకర్యం ఉంది. ఇది పట్టణ నెట్‌ వాడకందారుల సంఖ్యలో మూడోవంతుకు సమానం. మొత్తం 4.54 కోట్ల మందికి డిజిటల్‌ అక్షరాస్యతను గరపాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఈ మార్చి నాటికి కేవలం 2.71 కోట్ల మంది మాత్రమే సంబంధిత కోర్సు పూర్తిచేశారు. కొవిడ్‌ లాక్‌డౌన్‌లు డిజిటల్‌ ఇండియా ఆవశ్యకతను ముందుకుతెచ్చాయి. బ్యాంకింగ్‌ తదితర సేవలు మొబైల్‌, ఇంటర్నెట్‌, పర్సనల్‌ కంప్యూటర్లకు మళ్ళాయి. అదే సమయంలో సైబర్‌ దాడులు, హ్యాకింగ్‌, మాల్‌వేర్‌ వ్యాప్తి సైతం హెచ్చాయి. వీటిని ఎదుర్కొనే సత్తా ఉన్న సైబర్‌ యోధులను మనం తయారుచేసుకోవాలి.

 

పెరగాల్సిన కేటాయింపులు

ప్రస్తుతం డిజిటల్‌ నైపుణ్యాలు ఉన్న వారిదే రాజ్యమంటే అతిశయోక్తి కాదు. భారత్‌ను అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే కల నెరవేరాలంటే డిజిటల్‌ ఇండియా తోడ్పాటు కీలకం. ఆ అయిదు లక్షల కోట్లలో ఒక లక్ష కోట్ల డాలర్లు డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ ద్వారా చేకూరగలదు. డిజిటల్‌ స్వప్న సాఫల్యానికి భారత్‌ చేయవలసింది చాలా ఉంది. డిజిటల్‌ మౌలిక వసతుల నిర్మాణంపై సంపన్న దేశాలు తమ జీడీపీలో 1.2 శాతానికి పైనే వెచ్చిస్తుంటే, భారత్‌ వ్యయం ఆ దరిదాపులకు సైతం రావడం లేదు. ప్రభుత్వ పెట్టుబడులలో 80శాతం రోడ్లు, రేవులు, విద్యుత్కేంద్రాల వంటి భౌతిక మౌలిక వసతులకు దక్కుతుండగా, డిజిటల్‌ మౌలిక వసతులకు అంత ప్రాధాన్యం లభించడం లేదు. ప్రపంచంలో అయిదు అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల జాబితాలో చోటు సంపాదించాలంటే భారతదేశం ఏటా 3,500 కోట్ల డాలర్లను డిజిటల్‌ మౌలిక వసతుల విస్తరణపై ఖర్చుపెట్టాలి. అలా చేయకపోవడం వల్లనే దేశంలో 37,439 గ్రామాలకు ఇప్పటికీ టెలికాం సర్వీసు ప్రొవైడర్ల సేవలు అందడం లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంటుకు తెలిపింది. దేశంలో 2.5 లక్షల గ్రామాలకు ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని అందించడానికి చేపట్టిన భారత్‌ నెట్‌ తన లక్ష్యాన్ని అందుకోలేకపోయిందని దీన్నిబట్టి అర్థమవుతుంది. టెండర్ల ఖరారులో జాప్యం, ప్రభుత్వ, ప్రైవేటు భూముల గుండా ఫైబర్‌ ఆప్టిక్‌ లైన్లు వేయడానికి వేగంగా అనుమతులు లభించకపోవడం ఈ ఆలస్యానికి కారణమవుతున్నాయి. భారత్‌ నెట్‌ పనులు కొన్ని రాష్ట్రాల్లో వేగంగా జరుగుతుంటే, మరి కొన్ని రాష్ట్రాల్లో మందకొడిగా సాగుతున్నాయి. పర్వతమయ ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు తీవ్ర అంతరాయం కలిగిస్తుంటాయి. అలాగని డిజిటల్‌ ఇండియా మందగించకూడదు. యువ భారతీయులు, శాస్త్ర సాంకేతిక నిపుణులు, పారిశ్రామిక వ్యవస్థాపకులు డిజిటల్‌ ఇండియాలో ఉజ్జ్వల అవకాశాలను లక్షిస్తున్నారు. వారి ఆశలు వమ్ము కాకూడదు!

 

ప్రైవేటు భాగస్వామ్యమూ అవసరం

ప్రపంచంలోని 17 ప్రధాన డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా డిజిటల్‌కు మారుతున్న దేశాల్లో భారత్‌ రెండో స్థానం ఆక్రమిస్తోంది. భారత్‌లో ఇంటర్నెట్‌ వాడకందారుల సంఖ్య కొన్ని సంపన్న దేశాల్లోని మొత్తం నెట్‌ వాడకందారులకన్నా ఎంతో ఎక్కువ. ఈ బలాలపై పటిష్ఠ డిజిటల్‌ భారతాన్ని నిర్మించుకోవాలి. మేకిన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా పట్టాలపై రేపటి భారతం పరుగులు తీయనుంది. ఈ పథకాలకు కావలసిన నిధులను పూర్తిగా ప్రభుత్వమే సమకూర్చలేదు. ఆర్థికంగా కొవిడ్‌ తెచ్చిపెట్టిన గడ్డు పరిస్థితి నిధుల కేటాయింపునకు పెద్ద అవరోధంగా ఉంది. 138 కోట్ల భారత జనాభాకు డిజిటల్‌ మౌలిక వసతులను విస్తరించడానికి ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం తోడ్పడుతుంది.

 

- ఆర్య
 

Posted Date: 28-07-2021 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌