• facebook
  • whatsapp
  • telegram

మరో ఆవాసం కోసం అన్వేషణ!

కుజ గ్రహంపై ‘పెర్సెవరెన్స్‌’

కాలుష్యం, భూతాపం, పర్యావరణ విధ్వంసం తోడై భూగోళం మానవులకు నివాస యోగ్యం కాకుండా పోయే ప్రమాదం ఎంతో దూరంలో లేదు. అయితే ఆ ప్రమాదం ముంచుకొస్తే శాస్త్ర సాంకేతిక విజ్ఞానం సాయంతో మానవాళి రెక్కలు వచ్చిన పక్షుల్లా భూమాత ఒడి నుంచి సుదూర నక్షత్ర కూటములకు ఎగిరిపోవచ్చుననే ఆశావాదులూ ఉన్నారు. ఎంత దూరమైనా చిన్న అడుగుతోనే ప్రారంభమవుతుంది కాబట్టి, మనిషి మొదట సౌర కుటుంబంలో చంద్రమండలంపై కాలు మోపాడు. ఆపైన వామనుడిలా అంగారకుడి (కుజుడి) మీదకు కాలు విస్తరిస్తున్నాడు. కుజ గ్రహాన్ని ఒకప్పుడు వాతావరణం ఆవరించి ఉండేదనీ, అక్కడ నీరు కూడా ఉండేదని శాస్త్రజ్ఞుల అంచనా. భూమి తరవాత మానవునికి కుజ గ్రహమే నివాసయోగ్యమవుతుందని వారు భావిస్తున్నారు. సౌర కుటుంబంలో బుధ, శుక్ర గ్రహాలపై ఉష్ణోగ్రత 400 డిగ్రీల సెల్సియస్‌కు పైనే ఉంటుంది. మిగతావి ప్రధానంగా వాయు గ్రహాలు. కుజ గ్రహమొక్కటే భూమిలా మట్టి, రాళ్లతో కూడిన గ్రహం. కుజ మధ్య రేఖపై ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్‌గా, ధ్రువాల వద్ద మైనస్‌ 125 డిగ్రీల సెల్సియస్‌గా ఉండి మానవులకు ఆవాసంగా ఉపకరిస్తుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

పోటాపోటీ పరిశోధనలు

అమెరికా వైమానిక, అంతరిక్ష శోధన సంస్థ (నాసా) ఈ నెల 18న కుజుని మీద దింపిన పెర్సెవరెన్స్‌  వాహనం ఆ గ్రహం మీద గతంలో జీవం ఉండేదా అని పరిశీలించడంతోపాటు, గ్రహ వాతావరణంలో పుష్కలంగా ఉన్న బొగ్గు పులుసు వాయువు నుంచి ఆమ్లజనిని ఉత్పత్తి చేయబోతున్నది. ఒక కారు సైజులో ఉండే పెర్సెవరెన్స్‌ రోవర్‌ను 28 మైళ్ల వ్యాసమున్న జెజెరో బిలంలో భద్రంగా దింపిన ఇంజినీర్ల బృందంలో భారత సంతతికి చెందిన డాక్టర్‌ స్వాతీ మోహన్‌ సైతం ఉండటం భారతీయులకు గర్వకారణం. 1997 నుంచి అంగారకుని మీద అమెరికా దింపిన రోవర్లలో పెర్సెవరెన్స్‌ అయిదవది. దానికి ముందు అమెరికా ప్రయోగించిన క్యూరియాసిటీ రోవర్‌, ఇన్‌సైట్‌ ల్యాండర్‌లు ఇంకా కుజుని మీదనే ఉన్నాయి. ఇవి కాకుండా మూడు అమెరికా ఉపగ్రహాలు కుజ కక్ష్యలో పరిభ్రమిస్తున్నాయి. నేడు మొత్తం అయిదు దేశాలకు చెందిన 10  అంతరిక్ష వాహనాలు కుజ కక్ష్యలో పరిభ్రమించడమో, కుజుని మీద దిగి శోధించడమో చేస్తున్నాయి. భారతదేశానికి చెందిన మంగళ్‌యాన్‌-1 ఆర్బిటర్‌కు తోడు ఐరోపా సమాఖ్య (ఈయూ)కు చెందిన రెండు ఆర్బిటర్లు కుజ కక్ష్యలో పరిభ్రమిస్తున్నాయి. అమెరికా, ఈయూ, భారత్‌లకు తోడు రష్యా, చైనా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఏఇ)లు కుజ గ్రహాన్వేషణలో నిమగ్నమై ఉన్నాయి.

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఒకే దఫాలో మూడు దేశాలు కుజుని వద్దకు అంతరిక్ష నౌకలను పంపాయి. ఫిబ్రవరి 9న యూఏఈ తన ఉపగ్రహం హోప్‌ ఆర్బిటర్‌ను కుజ కక్ష్యలోకి పంపగా, 10వ తేదీన చైనాకు చెందిన టియాన్వెన్‌-1 ఆర్బిటర్‌ దానికి జతకలిసింది. ఈ ఆర్బిటర్‌తోపాటు చైనా ప్రయోగించిన రోవర్‌ వచ్చే మే నెలలో కుజుని మీద దిగి పెర్సెవరెన్స్‌ మాదిరిగా అన్వేషణ సాగిస్తుంది. ఈ నెల 18న కుజుని మీదకు దిగిన అమెరికన్‌ పెర్సెవరెన్స్‌ మొదట కుజ ఉపరితలం మీదకు తాను దిగుతున్న దృశ్యాన్నీ, తన ‘సెల్ఫీ’ని భూమికి ప్రసారం చేసింది.కొద్ది రోజుల తరవాత ఆ గ్రహ ఛాయాచిత్రాలను విరివిగా భూమికి ప్రసారం చేస్తుంది. దీనికోసం శక్తిమంతమైన కెమెరాలను, ఆడియో పరికరాలను పెర్సెవరెన్స్‌లో అమర్చారు. ఈ రోవర్‌ దిగిన జెజెరో బిలం 350 కోట్ల ఏళ్ళ క్రితం పెద్ద సరస్సు. అక్కడి నీటిలో పురాతన జీవజాలం ఉండి ఉంటే, జెజెరో   శిలాజాల్లో కానీ, అక్కడి నేల రసాయన స్వభావంలో కానీ జీవం ఆనవాళ్లు దొరకవచ్చు. ఆ జీవ ఛాయలను కనిపెట్టగల ఉపకరణాలు పెర్సెవరెన్స్‌లో ఉన్నాయి. కుజునిపై ఇంతకుముందు దింపిన ఏ రోవర్‌కూ ప్రాచీన జీవం ఆనవాళ్లను కనిపెట్టే బాధ్యత అప్పగించలేదు. అవి ప్రధానంగా కుజ గర్భంలో నీటి జాడలను కనిపెట్టడంలో నిమగ్నమయ్యాయి.

భవిష్యత్తుపై ఎన్నో ఆశలు

ప్రస్తుతం కుజునిపై సంచరిస్తున్న క్యూరియాసిటీ రోవర్‌ కుజ వాతావరణం, అక్కడి నేల రసాయన స్వభావాన్ని పరిశీలించడానికి పరిమితమైంది. పెర్సెవరెన్స్‌ జీవ ఛాయలను అన్వేషించడంతోపాటు జెజెరో బిలంలో 40 చోట్ల తవ్వి కుజుని శిలలను వెలికితీస్తుంది కూడా. ఈ 40 శిలా నమూనాలను ఒక గొట్టంలో ఉంచి కుజ ఉపరితలం మీద భద్రపరుస్తుంది. భవిష్యత్తులో కుజుని మీద దిగే అమెరికా, ఈయూ అంతరిక్ష నౌకల్లో ఏదో ఒకటి ఆ గొట్టాన్ని కుజ కక్ష్యకు చేరుస్తుంది. బహుశా ఈ పని 2026లో జరగవచ్చు. అక్కడి నుంచి ఆ శిలల గొట్టాన్ని 2030లో మరో నౌక భూమికి తీసుకొస్తుంది. వాటిని పరిశీలించాక కుజునిపై ఒకప్పుడు జీవం ఉండేదో లేదో నిర్ధారించవచ్చు. భూమి మీద 380 కోట్ల ఏళ్ల క్రితం జీవం పుట్టింది. కుజుని మీద 400 కోట్ల ఏళ్ల క్రితం అచ్చం భూమిలానే దట్టమైన వాతావరణం, నీరు ఉండేవి. ఆ పరిస్థితులు జీవం పుట్టుకకు దారి తీసే అవకాశాలే ఎక్కువ. ఆ సంగతి నిర్ధారించుకోవడానికి పెర్సెవరెన్స్‌ తోడ్పడనున్నది.

జెజెరో బిలంలో దాదాపు రెండు భూ సంవత్సరాల (ఒక కుజ సంవత్సరం) పాటు సంచరించిన తరవాత పెర్సెవరెన్స్‌ 610 మీటర్ల ఎత్తయిన బిలం అంచును ఎక్కి బయటకు వెళుతుంది. పెర్సెవరెన్స్‌ 2023 ఏప్రిల్‌ వరకు కుజుని మీద సంచరిస్తుందని శాస్త్రజ్ఞులు చెబుతున్నా, వాస్తవంలో అంతకన్నా ఎక్కువ కాలమే అది కార్యకలాపాలు నిర్వహించే అవకాశముంది. పెర్సెవరెన్స్‌ తోపాటు కుజుని మీద దింపిన హెలికాప్టర్‌ మార్చి నెల మధ్యలో పైకి ఎగిరి శాస్త్రీయ ప్రయోగాలు ప్రారంభిస్తుంది. ఈ హెలికాప్టర్‌ విజయవంతంగా పైకి ఎగిరితే భూమి మీద కాకుండా మరో గ్రహం మీద నింగిలో విహరించిన తొలి వైమానిక వాహనం అదే అవుతుంది. ఇంతవరకు కుజుని మీద దింపిన రోవర్లన్నింటిలోకీ పెర్సెవరెన్సే అత్యంత ఆధునిక సంచార ప్రయోగశాల. అది కనిపెట్టే అంశాలు రాగల రెండు మూడు దశాబ్దాలపాటు కుజునిపై పరిశోధనలకు ప్రాతిపదికగా ఉపకరిస్తాయి.

స్పేస్‌ ఎక్స్‌... జోరు!

పారిశ్రామిక వేత్త, అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ అంతరిక్షాన్వేషణలో దూసుకు పోతున్నారు. ఆయన నాయకత్వంలోని స్పేస్‌ ఎక్స్‌ సంస్థ మానవులను కుజుని మీదకు పంపి భూమికి తిరిగి తీసుకురాగల స్టార్‌ షిప్‌ను నిర్మించే పనిలో నిమగ్నమైంది. చంద్రుని వద్దకు వెళ్లడానికి మూడు రోజులు పడితే కుజుని చేరడానికి ఏడు నెలలు ప్రయాణించాల్సి ఉంటుంది. కుజ కక్ష్యలో స్టార్‌షిప్‌ తిరిగి ఇంధనం నింపుకోవడం, కుజ ఉపరితలంపైనే రాకెట్‌ ఇంధనం తయారుచేయడం వంటి అంశాలపై స్పేస్‌ ఎక్స్‌ ప్రయోగాలు చేస్తోంది. పెర్సెవరెన్స్‌ కుజ వాతావరణం నుంచి ఆక్సిజన్‌ తయారు చేయడం ద్వారా అక్కడ మానవుల నివాసానికి అనువైన పరిస్థితుల సృష్టికి తోడ్పడనున్నది. రానున్న సంవత్సరాల్లో స్పేస్‌ ఎక్స్‌ మొదట వివిధ సామగ్రులను, పరికరాలను కుజుని వద్దకు పంపుతుంది. ఆ పైన మానవులను చేరవేస్తుంది. కుజుడు నివాసయోగ్యంగా మారితే భారత్‌, చైనాల వంటి అధిక జనసంఖ్య గల దేశాలు భవిష్యత్తులో జనాభా ఒత్తిడిని తగ్గించుకోగలుగుతాయి. అందుకే, భారత్‌ మంగళ్‌ యాన్‌-2, చైనా టియాన్‌ వెన్‌-2 రోవర్లను కుజునిపైకి పంపి శిలా నమూనాలను భూమికి తీసుకువచ్చేందుకు సమాయత్తమవుతున్నాయి. మానవాళికి రాగల దశాబ్దాలు ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటాయనడంలో సందేహం లేదు.

- ఏఏవీ ప్రసాద్‌

Posted Date: 25-02-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం