• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ బడ్జెట్‌ 2021-22

సబ్బండ వర్గాల సంక్షేమానికే తెరాస సర్కారు పెద్దపీట వేసింది. రాష్ట్ర ఖజానాపై కరోనా తీవ్ర ప్రభావం చూపినా ఆశావహ దృక్పథంతో భారీ బడ్జెట్‌ను తీసుకువచ్చింది. వ్యవసాయం, సాగునీటి రంగాలకు  ప్రాధాన్యం ఇస్తూ గ్రామీణ వికాసం, పట్టణాభివృద్ధికి పట్టం కట్టింది. పాఠశాలల బాగుకు కొత్త పథకాన్ని తెచ్చింది. దళితుల సాధికారత కార్యక్రమాన్ని ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమాన్ని నొక్కి చెప్పింది. నియోజకవర్గ అభివృద్ధి నిధులనూ పెంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు బాధ్యత పెంచింది. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లపై నమ్మకంతో ముందుకెళ్లింది.

గతం కంటే 38 శాతం అంచనాలు పెంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.2.30 లక్షల కోట్లతో భారీ బడ్జెట్‌ను మార్చి 18న‌ ప్రవేశపెట్టింది. ప్రస్తుత ఏడాది బడ్జెట్‌ను రూ.1.82 లక్షల కోట్ల నుంచి రూ.1.66 లక్షల కోట్లకు సవరించినా వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారీగా పద్దును పెంచింది. పథకాల వ్యయం రూ.1.26 లక్షల కోట్లు కాగా.. నిర్వహణ వ్యయం రూ.1.04 లక్షల కోట్లుగా ప్రభుత్వం విశ్లేషించింది. సొంత రాబడులను గణనీయంగా పెంచుకోవడంతో పాటు గ్రాంట్లు, పన్నేతర రాబడి పెంచుకోవడం, బహిరంగ మార్కెట్‌ రుణాలతో ముందుకు వెళ్లనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆశావహంతో భారీ బడ్జెట్‌ దిశగా ముందుకు సాగినా పన్నుల రాబడి, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లు, పన్నేతర రాబడి అంచనాల మేరకు సమకూరడం ప్రభుత్వానికి సవాల్‌గానే ఉండనుంది. ప్రభుత్వ ప్రాధాన్య పథకాలు, కార్యక్రమాలకు నిధులను పెంచింది. సంక్షేమం, వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి, పురపాలన, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి సింహభాగం నిధులు దక్కాయి. కోతలు లేకుండా గతం కంటే ఎంతో కొంత పెంపుతో దాదాపు అన్ని శాఖలకూ కేటాయింపులు చేసింది. గ్రామీణాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. ప్రత్యేకంగా రూ.1000 కోట్లతో దళితుల సాధికారత కార్యక్రమాన్ని ప్రకటించింది. గొల్ల, కురమలకు గొర్రెల కొనుగోలుకు రూ. మూడు వేల కోట్లను కేటాయించింది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌కు నిధులను పెంచింది. గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రైతు సంక్షేమం లక్ష్యంగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.25 వేల కోట్లతో పెద్దపీట వేసింది. రైతుబంధు, రుణమాఫీ, రైతుబీమా వంటి రైతు సంక్షేమానికి కేటాయింపులు వాస్తవ వ్యయం ఆధారంగా చేసింది. సాగునీటి రంగానికి ప్రాధాన్యం పెంచింది. పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.4 వేల కోట్లను వ్యయం చేయనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఈ ఏడాది రూ.2 వేల కోట్లను కేటాయించింది. తొలిసారిగా జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లకు నిధులు ఇవ్వనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వీటికి రూ.500 కోట్లు అందనున్నాయి. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏటా ఇచ్చే నిధులను రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెంచింది. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి నిధులు గతంకంటే పెరిగాయి. రాజధాని అభివృద్ధిలో మరో కీలక అంశంగా ఉంటూ జిల్లాల అనుసంధానానికి దోహదపడే రీజినల్‌ రింగ్‌ రోడ్డు కార్యాచరణలో భాగంగా రూ.750 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. రూ.400 కోట్లతో భూముల సమగ్ర సర్వేకు బడ్జెట్‌లో పచ్చజెండా ఊపింది. రూ.1,500 కోట్ల కేటాయింపుతో ఆర్టీసీకి మరోసారి అండగా నిలిచింది. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌ భవిష్యత్తు తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రతిపాదించిన సుంకిశాల ఇన్‌టేక్‌ పథకానికి నిధులిచ్చింది. కరోనా నేపథ్యంలో వైద్య,ఆరోగ్యశాఖ వ్యయం పెరగ్గా భవిష్యత్తు అవసరాలను అంచనా వేసి నిధులనూ పెంచింది. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.మూడు వేల కోట్లను ప్రతిపాదించింది. పరిశ్రమలకు ప్రోత్సాహకనిధులిచ్చింది. రోడ్ల మరమ్మతులు, నిర్వహణ, బ్రిడ్జిల నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులిచ్చింది.


గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లపై భారీ నమ్మకంతో

సగటున ఏడాదికి రూ.11 వేల కోట్ల గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ వస్తుండగా ఈ సారి బడ్జెట్‌లో రూ.38,669 కోట్లను ప్రతిపాదించారు. కేంద్ర నుంచి అందే ప్రత్యేక నిధులు, జీఎస్టీ పరిహారం బకాయిలు సహా 15వ ఆర్థిక సంఘం ప్రత్యేక నిధులు అందుతాయని ప్రభుత్వ అంచనా వేసింది. కేంద్ర పన్నుల వాటాగా వచ్చే మొత్తం రూ.14వేల కోట్లుగా లెక్కకట్టింది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెరిగిన నేపథ్యంలో ద్రవ్యలోటు భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్‌ రుణాలను గతం కంటే ఎక్కువ ప్రతిపాదించింది. బాండ్ల విక్రయం ద్వారా రూ.47,500 కోట్లను సమీకరించుకోనున్నట్లు ప్రతిపాదించారు. బడ్జెట్‌ పరిధిలో రూ.50 వేల కోట్ల రుణాలు లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించుకుంది. రాబడుల్లో వడ్డీలు, అసలు చెల్లింపునకు రూ.23 వేల కోట్లు ప్రతిపాదించారు.

ఘనంగా రాబడుల అంచనాలు

పన్నుల రాబడిలో రూ.16 వేల కోట్ల, పన్నేతర రాబడిలో రూ.30,557 కోట్ల పెరుగుదలను రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. పన్నేతర రాబడిలో కీలకంగా భూముల విక్రయం ద్వారా 25 వేల కోట్ల దాకా సమకూర్చుకోవాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. గత బడ్జెట్‌లోనూ ఈ మొత్తాన్ని ప్రతిపాదించినా కరోనా నేపథ్యంలో నామమాత్రంగానే రాబడి వచ్చింది. హైదరాబాద్‌ స్థిరాస్తి వ్యాపారానికి ఉన్న డిమాండ్‌ నేపథ్యంలో భూముల విక్రయం ద్వారా నిధుల సమీకరించుకోవాలని  ప్రభుత్వం యోచిస్తోంది.  ఖనిజాలు, గనుల శాఖ ద్వారా రాబడిని పెంచుకోనుంది. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రాబడిని ప్రభుత్వం భారీగా అంచనావేసింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి రూ.12,500 కోట్లు వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. కరోనా నేపథ్యంలో ఈ మొత్తం రూ.6000 కోట్లు మాత్రం రాగా వచ్చే ఏడాది రెట్టింపు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. వాహనాల ద్వారా వచ్చే పన్నును ఐదువేల కోట్లుగా పేర్కొంది. వాణిజ్య పన్నుల శాఖ ద్వారా వచ్చే రాబడిలో పెరుగుదలను రూ.10వేల కోట్లుగా విశ్లేషించింది. రిజిస్ట్రేషన్‌ ఛార్జీల్లో సవరణ, వాహనాల పన్ను సవరణ అవకాశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని అంచనాలను రూపొందించినట్లు సమాచారం.

బడ్జెట్‌ ప్రసంగంలో హరీశ్‌రావు

దుక్కి ఉంటేనే దిక్కు ఉంటుంది. నాగలి సాగితేనే ఆకలి తీరుతుంది. ఇదే స్ఫూర్తితో నేడు తెలంగాణ   వ్యవసాయరంగం కళకళలాడుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా రైతు. కర్షకుల కష్టనష్టాలు, సాదకబాధకాలు ఆయనకు అనుభవమే. ఈ నేపథ్యంతోనే ఆయన ప్రవేశపెట్టిన వ్యవసాయ పథకాలకు ఐక్యరాజ్యసమితి నుంచి ప్రశంసలు రావడం మనకు గర్వకారణం. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ అన్నట్లు.. ధ్యేయం పట్ల నిలువెల్లా అంకిత భావం కలిగిన వ్యక్తులు సమాజాన్ని ముందుకు నడిపిస్తారన్న చందాన సీఎం కేసీఆర్‌ షెడ్యూల్డు కులాల ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసం నూతన   పథకాన్ని రూపొందించారు. కాటన్‌ మహాశయుడు అన్నట్లు బంగారు గనుల ద్వారా వచ్చే ఆదాయం కన్నా భూమికి నీటి వసతి కల్పిస్తే వచ్చే ఆదాయమే ఎక్కువ అన్న వాస్తవాన్ని గ్రహించి సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రాజెక్టుల ద్వారా నీరందుతున్న ఏ ఊరికి పోయినా, మా చెరువు నిండిందని... మా కాల్వ పారిందని... మా పొలం పండిందని సంబురపడుతున్నారు.

నేడు రాష్ట్రంలో ఆడబిడ్డలు బిందెలు పట్టుకుని బజారులో తిరగాల్సిన బాధలు లేవు. అతిసారంతో ఆదివాసీల మరణాలు లేవు. శాసనసభలో తాగునీటి కోసం చర్చలు, నిరసనలు లేవు. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేంద్రానికి చెందిన జల్‌జీవన్‌మిషన్‌ అధికారికంగా ప్రకటించడం ఇందుకు తార్కాణం.

‘నాగరికత వల్ల కలిగే సంపద, సుఖాలు, విలాసాలను వదులుకోవచ్చు కానీ, విద్య వల్ల కలిగే జ్ఞానాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. విద్య లేకుండా వెనుకబడిన తరగతుల ప్రజలు తమ మనుగడను కాపాడుకోలేరు’... అన్నారు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌. ఇదే స్ఫూర్తితో విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం. పేద, వెనుకబడిన వర్గాలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను ఉచితంగా అందిస్తున్నాం. కార్పొరేట్‌ విద్యాసంస్థలను తలదన్నేలా ఏర్పాటైన గురుకులాల్లో తమ పిల్లలను చదివించుకోవాలని తల్లితండ్రులు ఆరాటపడుతుండడమే ఇందుకు నిదర్శనం.

దళిత సాధికారత పథకానికి రూ. వెయ్యికోట్లు

‣ కేటాయింపులు:
2020-21: రూ.10,771.31 కోట్లు
2021-22: రూ.15,772.57  కోట్లు

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు ప్రభుత్వం బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 46.42 శాతం అదనంగా ఇచ్చింది. కొత్తగా రూ. వెయ్యి కోట్లతో సీఎం దళిత సాధికారత పథకాన్ని తీసుకురానుంది. స్వయంఉపాధి పథకాలకు ప్రాధాన్యం పెంచింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ,  మైనార్టీ సంక్షేమ శాఖలకు కలిపి రూ.15,772.57 కోట్లు కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి ప్రగతి పద్దు కింద మరో రూ.22,185.22 కోట్లు ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు కలిపి రూ.37,957.76  కోట్లు చూపించింది.


‣ స్వయం ఉపాధి, సాధికారతకు రూ.4,333 కోట్లు

ఎస్సీల స్వయం ఉపాధి, సాధికారతకు ప్రభుత్వం కేటాయింపులు పెంచింది. ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.1884 కోట్లు ఇచ్చింది. గతంతో పోలిస్తే ఇది దాదాపు 9 రెట్లు. ఆర్థిక స్వయం ఉపాధికి రూ.1784 కోట్లు, కార్పొరేషన్‌కు అదనపు ఆర్థిక సాయం కింద రూ.100 కోట్లు పేర్కొంది. సీఎం దళిత సాధికారత పథకం కింద వెయ్యి కోట్లు ఇచ్చింది. ఈ ఒక్క సంక్షేమశాఖకు అన్నీ కలిపి రూ.2,884 కోట్లు కేటాయించింది. గిరిజన ఆర్థిక సహకార సొసైటీ కింద పథకాల అమలుకు రూ.418 కోట్లు ఇచ్చింది. బీసీ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు, అత్యంత వెనుకబడిన వర్గాల కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు, మైనార్టీ కార్పొరేషన్‌కు రూ.28.56 కోట్లు, క్రైస్తవ మైనార్టీ కార్పొరేషన్‌కు రూ.2.5 కోట్లు ప్రతిపాదించింది.
* ఎస్సీ గురుకులాలకు రూ.958.26 కోట్లు ఇచ్చింది. గిరిజన గురుకులాల బడ్జెట్‌ రూ.738 కోట్ల నుంచి ఈ ఏడాది రూ.461.33 కోట్లకు తగ్గింది. బీసీ సొసైటీకి రూ.281.88 కోట్లు, మైనార్టీ సొసైటీకి రూ.222.92 కోట్లు కేటాయించారు.
* విదేశీవిద్య పథకం కింద మైనార్టీ విద్యార్థుల కోసం  రూ72.54 కోట్లు, ఎస్సీలకు అంబేడ్కర్‌ విదేశీ విద్యాపథకం కింద రూ.50 కోట్లు, ఎస్టీలకు రూ.4.48 కోట్లు కేటాయించింది. బీసీల కేటాయింపులు రూ.33 కోట్లకు పరిమితమయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులకు బోధన ఫీజులు, ఉపకారవేతనాల కోసం ప్రభుత్వం రూ.2457.54 కోట్లు కేటాయించింది.
కల్యాణలక్ష్మికి పెరిగిన కేటాయింపులు
కల్యాణలక్ష్మి పథకానికి ప్రభుత్వం కేటాయింపులు భారీగా పెంచింది. 2020-21 ఏడాదికి రూ.2240 కోట్లు కేటాయిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో ఈ మొత్తాన్ని రూ.2750.46 కోట్లకు పెంచింది. బీసీల్లో లబ్ధిదారులు ఎక్కువగా ఉండటంతో ఆ శాఖకు వచ్చే ఏడాదికి రూ.1850 కోట్లు ఇచ్చింది. ఎస్సీ సంక్షేమశాఖకు రూ.400.46 కోట్లు, ఎస్టీ సంక్షేమశాఖకు రూ.200 కోట్లు, మైనార్టీ సంక్షేమశాఖకు రూ.300 కోట్లు పేర్కొంది.

‣ పింఛన్లకు రూ.11,728 కోట్లు

ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి 2021-22 ఏడాదిలో రూ.11,728 కోట్లను కేటాయించింది. రాష్ట్రంలో 65 ఏళ్లకు పైబడిన వృద్ధులతో పాటు దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికులు, ఫైలేరియా, హెచ్‌ఐవీ బాధితులతో కలిపి 37.72 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. వీరితో పాటు 57 ఏళ్ల వయసు దాటిన వారికి పింఛన్లు మంజూరు చేస్తామని గతంలో ప్రభుత్వం పేర్కొంది. ఈ తరహా లబ్ధిదారులు 9 లక్షల మందికి పైగా ఉంటారని అంచనా. ఈ ఏడాది బడ్జెట్‌ నిధులను పెంచుతారని భావించినా నిరాశ తప్పలేదు. ఆసరా పింఛన్లకు రూ.9,947 కోట్లు, ఒంటరి మహిళలకు రూ.359 కోట్లు, బీడీ కార్మికులకు రూ.1,142 కోట్లు ఇచ్చింది.

బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్దపీట

‣ కేటాయింపులు

2020-21: రూ.22,776 కోట్లు
2021-22: రూ.25,000 కోట్లు

తన్నకు చేయూత దక్కింది. వ్యవసాయ శాఖకు ప్రభుత్వం మొత్తం రూ.25 వేల కోట్లు కేటాయించింది. ఇది గతేడాది కన్నా రూ.2,224 కోట్లు అధికం. కూలీల కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ఆధునిక యంత్రాలను రాయితీ ధరలపై విక్రయించేందుకు యాంత్రీకరణ పథకానికి రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా రూ.1,500 కోట్లు ఇచ్చింది.

రైతుబంధుకు రూ.14,800కోట్లు, రుణమాఫీకి రూ.5,225 కోట్లు, రైతుబీమాకు రూ.1,200 కోట్లు ప్రతిపాదించింది. రైతుబంధు నిధులు ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున రైతు బ్యాంకు ఖాతాలో వేస్తారు. ఈ పథకం కింద ప్రస్తుత ఏడాది 59.25 లక్షల మంది ఖాతాల్లో సొమ్ము వేశారు.
2018లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రూ.లక్షలోపు ఉన్న పంట రుణాలన్నీ మాఫీ చేస్తామని తెరాస హామీ ఇచ్చింది. ఇప్పటికే రూ.25 వేల లోపు ఉన్న రైతులందరి రుణాలను మాఫీ చేసింది. రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకూ బకాయిలున్న రైతుల తరఫున బ్యాంకులకు చెల్లించేందుకు రూ. 5,225 కోట్లను తాజా బడ్జెట్‌లో కేటాయించింది. వచ్చే జూన్‌లో వానాకాలం సీజన్‌ ప్రారంభమయ్యేనాటికి బ్యాంకులకు నిధులు విడుదల చేసే అవకాశాలున్నాయి.
18 నుంచి 59 ఏళ్ల వయసు గల 32.73 లక్షల మంది రైతులకు జీవితబీమా పథకాన్ని వ్యవసాయ శాఖ అమలు చేస్తోంది. ప్రస్తుత ఏడాది (2020-21)లో రూ. 1141.40 కోట్ల ప్రీమియంను ఎల్‌ఐసీకి చెల్లించింది. వచ్చే ఆగస్టు 14 నుంచి ప్రీమియం చెల్లింపునకు రూ.1200 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద అర్హులైన రైతు చనిపోతే బాధిత కుటుంబానికి ఎల్‌ఐసీ రూ.5 లక్షలను పరిహారంగా ఇస్తోంది. గత మూడేళ్లలో 46,564 మంది రైతులు మరణించగా.. వారి కుటుంబాలకు రూ. 2,328 కోట్లను ఎల్‌ఐసీ చెల్లించింది.
గొల్ల, కురుమలకు మరో విడత గొర్రెల పంపిణీకి రూ.3 వేల కోట్లు కేటాయించింది. ఇప్పటికే రూ. 4,584 కోట్ల వ్యయంతో 3.66 లక్షల కుటుంబాలకు 77.02 లక్షల గొర్రెలను ప్రభుత్వం పంపిణీ చేసింది. వాటికి కొత్తగా 1.20 కోట్ల గొర్రెపిల్లలు పుట్టడం వల్ల రూ.5,400 కోట్ల సంపద గొల్ల, కురుమలకు చేకూరిందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

పంటల ధరలపై పరిశోధన, విశ్లేషణ చేసి రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేందుకు కొత్తగా ‘మార్కెటింగ్‌ విశ్లేషణ, పరిశోధనా విభాగం’ను మార్కెటింగ్‌ శాఖలో ఏర్పాటు చేసేందుకు రూ.15 కోట్లు కేటాయించారు. మార్కెట్‌ జోక్యం పథకం కింద రూ.500 కోట్లు కేటాయించారు.
పట్టణాల్లో మాంసం, చేపలు, కూరగాయలు, పండ్లు వంటివి ఒకేచోట విక్రయించేలా సమీకృత వ్యవసాయ మార్కెట్ల నిర్మాణానికి రూ.500 కోట్లను బడ్జెట్‌లో కేటాయించారు. ఇప్పటికే సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌, హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటలో వీటిని నిర్మించారు. ఇక రాష్ట్రమంతా నిర్మించాలని నిర్ణయించారు.
పశుసంవర్ధక, మత్స్యశాఖలకు రూ.1730 కోట్లు కేటాయించారు. ఉద్యానశాఖకు మాత్రం నిరాశ మిగిలింది. వివిధ పథకాలకు రూ.966 కోట్లు ఇవ్వాలని ఆ శాఖ తొలుత ప్రతిపాదనలివ్వగా వాటిని రూ.600 కోట్లకు తగ్గించి పంపాలని ఆర్థికశాఖ సూచించింది. చివరికి బడ్జెట్‌లో రూ.242.30 కోట్లు కేటాయించింది. హరితపందిరి బకాయిలకు నిధులేమీ ఇవ్వలేదు.

రూపాయిలో 47 పైసలు కాళేశ్వరానికే

సాగునీటి రంగానికి ప్రభుత్వం మరోసారి పెద్దపీట వేసింది. బడ్జెట్‌లో మొత్తం రూ.16,919.94 కోట్లను కేటాయించింది. దీనికి బ్యాంకులు, కార్పొరేషన్ల నుంచి తీసుకొనే రుణం అదనం. ఈసారి మొత్తం సాగునీటి ప్రాజెక్టులకు రూపాయి కేటాయించారనుకుంటే ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టుకు నిర్దేశించిన మొత్తం దాదాపు 47 (46.8) పైసలుగా ఉంది.

‣ కేటాయింపులు
2020-21: రూ.11,043  కోట్లు
2021-22: రూ.16,919.94  కోట్లు

‣ సాగునీటి రంగంలో చరిత్రే:

తెలంగాణ ఏర్పడిన తర్వాత రూ.1.12 లక్షల కోట్లు సాగునీటి రంగంపై ఖర్చు చేస్తే కాళేశ్వరంపైనే సుమారు రూ.70 వేల కోట్లు వెచ్చించింది. నాలుగున్నరేళ్లలో ఇంత భారీ వ్యయం ఒక ప్రాజెక్టుపై చేయడం సాగునీటి రంగంలో చరిత్రే.


‣ నీటిని మళ్లించే పనులపై ప్రభావం

మల్లన్నసాగర్‌ నుంచి సింగూరుకు, గంధమల, బస్వాపుర రిజర్వాయర్లకు నీటిని మళ్లించే పనులు, ఉమ్మడి నిజామాబాద్‌కు నీటిని మళ్లించే పనులకు బ్యాంకు రుణం లేదు. బడ్జెట్‌ నుంచి తక్కువగా చేసిన కేటాయింపు ఈ పనుల పూర్తిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వీటికి కూడా రుణాల కోసం ప్రయత్నిస్తున్నారు.


‣ పాలమూరు-రంగారెడ్డికి...

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ.960 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టుకు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి మంజూరైన రుణంలో సుమారు రూ.నాలుగువేల కోట్లు ఇంకా ఉంది. కార్పొరేషన్‌ నుంచి తీసుకొన్న రుణానికి మార్జిన్‌మనీ అవసరం లేదని నీటిపారుదల వర్గాలు తెలిపాయి. ఇలా సుమారు రూ.ఐదువేల కోట్లు పాలమూరు-రంగారెడ్డికి అందుబాటులో ఉంటున్నట్టు. చిన్ననీటి పారుదల, మధ్యతరహా ప్రాజెక్టులకు కూడా బడ్జెట్‌లో ఎక్కువ మొత్తంలోనే ప్రతిపాదించారు.

‣ రూ.7,003 కోట్లు వడ్డీలు, మార్జిన్‌మనీకే

బడ్జెట్‌లో రూ.7,921 కోట్లు కేటాయించినా ఇందులో రుణాలు రాని పనుల కోసం ఇచ్చింది. రూ.918 కోట్లు మాత్రమే. మిగిలిన రూ.7,003 కోట్లు కాళేశ్వరం కార్పొరేషన్‌కు కేటాయించింది. ఇప్పటికే తీసుకొన్న రుణాలకు వడ్డీలు, తీసుకోబోయే రుణాలకు 20 శాతం మార్జిన్‌ మనీ మొదలైన వాటికి ఈ మొత్తం ఖర్చు చేస్తారు.

‣ తలసరి అప్పు రూ.1,05,000

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) చివరికి అంటే ఈ నెలాఖరుకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న మొత్తం అప్పులు రూ.2.45 లక్షల కోట్లని బడ్జెట్‌లో ప్రభుత్వం వెల్లడించింది. ఇవి కాకుండా వివిధ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వ సంస్థలకు.. ప్రత్యేకించి సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ తదితర కార్పొరేషన్లకు విడిగా పూచీకత్తు ఇచ్చిన రుణాలు మరో రూ.లక్షా 5 వేల కోట్లున్నాయి. ఈ రెండూ కలిపితే ఈ నెలాఖరునాటికే మొత్తం అప్పులు రూ.3.50 లక్షల కోట్లకు చేరతాయి. రాష్ట్ర జనాభా 2018 నాటికి 3.72 కోట్లుంది. ఈ లెక్కన ప్రస్తుతం తలసరి అప్పు రూ.94,086గా ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో మరో రూ.41,522 కోట్ల అప్పులు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మొత్తం అప్పులు రూ.3.91 లక్షల కోట్లకు చేరి.. తలసరి అప్పు రూ.లక్షా ఐదువేలకు పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం వచ్చే ఏడాది ఇచ్చే పూచీకత్తును పరిగణనలోకి తీసుకోకుంటే ఇది మరికొంత పెరుగుతుంది.

‣ పరిమితి మీరకుండానే..

2016-19 మధ్యకాలంలో రాష్ట్ర జీఎస్‌డీపీలో వార్షిక అప్పుల సగటు నిష్పత్తి శాతం 21.1 ఉంది. ఈ ఏడాది (2020-21)లో ఈ శాతం 25.07కు చేరింది. వచ్చే ఏడాది (2021-22లో) మరో రూ.41,522 కోట్ల అప్పులు తీసుకున్నా జీఎస్‌డీపీలో 24.84 శాతానికి చేరుతుందని ఆర్థికశాఖ వెల్లడించింది. దీనికి కారణం రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరగడమే.
కరోనా కారణంగా ఆదాయం పడిపోయినా రైతుబంధు, పింఛన్లు వంటి పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మరింత ఎక్కువగా అప్పులు తీసుకోవాల్సి వచ్చిందని రాష్ట్ర సామాజిక, ఆర్థిక సర్వేలో తెలిపింది. కేంద్రం కూడా రాష్ట్ర జీఎస్‌డీపీలో అదనంగా మరో 2 శాతం వరకూ అప్పులు తీసుకోవడానికి ఈ ఏడాది అనుమతించింది. అంతకుముందు జీఎస్‌డీపీలో 3 శాతం వరకే అప్పులు తీసుకునే అవకాశముండేది. ఇప్పుడు 5 శాతం వరకూ అనుమతించినందున మరిన్ని అప్పులు తీసుకోవడానికి అవకాశమేర్పడింది. ఈ పరిమితికి లోబడే రుణాలు తీసుకోవడంతోపాటు జాతీయ సగటుతో పోల్చితే తక్కువగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

‣ తలసరి ఆదాయం రూ.2,27,145

దేశ తలసరి ఆదాయం తగ్గినా రాష్ట్రంలో ఈ ఆదాయం పెరిగింది. గత ఏడాది కంటే 0.6 శాతం వృద్ధి ఉంది. రాష్ట్రంలో ఇది రూ.2,27,145గా  కేంద్ర గణాంకశాఖ పేర్కొంది. తెలంగాణలో దేశ తలసరి ఆదాయం కంటే రూ.99,377 ఎక్కువగా ఉంది. దేశానికి సంబంధించి ఈ ఆదాయం గతం కంటే 4.8 శాతం తగ్గింది.
కరోనా నేపథ్యంలో దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 2019-20లో 7.8 శాతం ఉండగా 2020-21కి తిరోగమన దిశలోకి మళ్లి మైనస్‌ 3.8గా నమోదైంది. కానీ ఈ ఆర్థిక సంవత్సరం రాష్ట్రానికి సంబంధించి జీఎస్‌డీపీ(గ్రాస్‌ స్టేట్‌ డొమెస్టిక్‌ ప్రోడక్ట్‌)లో 1.3 శాతం వృద్ధిరేటు నమోదైంది. ఇది రూ.9,78,373 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. వ్యవసాయం కీలకంగా ఉండే ప్రాథమిక రంగంలో 17.7 శాతం వృద్ధిరేటు నమోదైంది. ద్వితీయ రంగంలో 5.3 శాతం తగ్గగా, సేవారంగంలో 1.9 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 13.5 శాతం.

‣ ప్రతి నెలా రూ. 2 వేల కోట్లు..

2016-19 మధ్యకాలంలో ఏటా అప్పులపై వడ్డీల చెల్లింపులకే రాష్ట్ర ఆదాయంలో 11.7 శాతం సొమ్ము వెచ్చించింది. జాతీయస్థాయిలో ఈ సగటు 13.1 శాతముందని రాష్ట్ర సామాజిక, ఆర్థిక సర్వే నివేదికలో తాజాగా వెల్లడించింది.
ఉదాహరణకు వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో రాష్ట్ర ఆదాయం రూ.లక్షా 76 వేల కోట్లుంటుందని ప్రభుత్వ అంచనా. ఇందులో రూ.17,584.38 కోట్లు పాత అప్పులపై వడ్డీలకే చెల్లించాల్సి ఉంటుంది. అసలు చెల్లింపులకు మరో రూ.6460.40 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. మొత్తమ్మీద ప్రతి నెలా సగటున దాదాపు రూ.2 వేల కోట్లు పాత అప్పుల చెల్లింపులకే ప్రభుత్వం వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బడ్జెట్ ప్ర‌సంగం పీడీఎఫ్ (తెలుగు)‌

బడ్జెట్ ప్ర‌సంగం పీడీఎఫ్ (ఇంగ్లిష్‌)‌

బడ్జెట్ ముఖ్యాంశాలు

Posted Date: 18-03-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం