• facebook
  • whatsapp
  • telegram

నష్టపోయేది సామాన్యుడే!

రష్యాపై ఆంక్షల ఫలితం

ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యాను దారికి తీసుకురావడానికి అమెరికా, ఐరోపా సమాఖ్య (ఈయూ) విధించిన ఆర్థిక ఆంక్షలు ఆశించిన ప్రయోజనాన్ని అందించడం లేదు. ఈ సందర్భంగా ఆర్థిక ఆంక్షల కథాకమామిషు తెలుసుకోవాలని అందరిలో ఆసక్తి పెరిగింది. మానవ హక్కుల ఉల్లంఘన, జనహననం, సైబర్‌ దాడులు, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, ఇతర దేశాలకు హానికలిగించే కార్యకలాపాలను చేపట్టడం వంటి నేరాలకు పాల్పడే దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధిస్తారు. ఐక్యరాజ్యసమితి ఇలాంటి ఆంక్షలు విధించవచ్చు. సమితి పరిధికి వెలుపల కొన్ని ప్రధాన దేశాలూ తమంతటతాము ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగిస్తుంటాయి. అమెరికా, ఐరోపా సమాఖ్య (ఈయూ) దీనికి ఉదాహరణ. ఇరాన్‌, ఉత్తర కొరియా, మయన్మార్‌, క్యూబా, యుగొస్లావియా-సెర్బియా దేశాలపై గతంలో సమితి ఆంక్షలు విధించింది. లిబియా, ఇరాక్‌, సిరియాలు కూడా గడచిన నాలుగు దశాబ్దాల్లో సమితి నుంచి బహుళ పక్ష ఆంక్షలను, అమెరికా దాని మిత్రదేశాల నుంచి ఏకపక్ష ఆంక్షలను ఎదుర్కొన్నాయి. దేశాలతోపాటు ఉగ్రవాద సంస్థలు, కంపెనీలు, వ్యక్తులు సైతం ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం రష్యన్‌ కోటీశ్వరులు, పుతిన్‌ కుటుంబీకులపైనా ఇలాంటి ఆంక్షలే అమలవుతున్నాయి. పోఖ్రాన్‌ అణు పరీక్షల తరవాత కొన్ని భారతీయ సంస్థలూ ఆంక్షలకు గురయ్యాయి.

తీవ్రత ఎక్కువే

ఆంక్షలకు గురైన దేశాలు ఆర్థికంగా బాగా దెబ్బతింటాయి. ఆంక్షల్లో ప్రాథమిక, ద్వితీయ శ్రేణి ఆంక్షలని రెండు రకాలు. ప్రభుత్వాలు, ప్రభుత్వ సభ్యులు, ప్రభుత్వ సంస్థలపై విధించేవి ప్రాథమిక ఆంక్షలు. ఫలానా వ్యక్తులు, సంస్థలతో కలిసి వ్యాపారం లేదా ఇతర లావాదేవీలు నిర్వహించకూడదంటూ ప్రభుత్వాలు విధించే ఆంక్షలను ద్వితీయ శ్రేణి ఆంక్షలంటారు. ఎగుమతి లైసెన్సులు, రుణాల మంజూరును నిరాకరించడం, నిర్దేశిత వ్యక్తులు, సంస్థలు తమ దేశాల్లో ప్రవేశించడాన్ని నిషేధించడం ఈ తరహా ఆంక్షల కిందకు వస్తాయి. సాధారణంగా ఆర్థికంగా బలీయమైన అమెరికా, ఐరోపా సమాఖ్య, జపాన్‌ వంటి దేశాలు విధించే ఆర్థిక ఆంక్షలు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. వాటి సాధికార కరెన్సీలైన డాలర్‌, యూరో, యెన్‌ల మీదే అంతర్జాతీయ వాణిజ్యం నడవడం దీనికి కారణం. 2021లో పాశ్చాత్య దేశాల ద్వితీయ శ్రేణి ఆంక్షలకు గురైన కంపెనీలు, వ్యక్తుల్లో 68శాతం ఇరాన్‌కు చెందినవారే. తదుపరి స్థానాలను ఉత్తర కొరియా       (22శాతం), రష్యా (అయిదు శాతం), హెజ్బొల్లా (మూడు శాతం), చైనా (రెండు శాతం) ఆక్రమిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి విధించే ఆంక్షలు మరింత విస్తృత ప్రభావం చూపుతాయి. అమెరికా, దాని మిత్ర దేశాలు విధించే ఆంక్షలు మానవాళి మేలుకోసం కాకుండా, సొంత ప్రయోజనాల కోసమేనని విమర్శలు వస్తున్నాయి.

ప్రపంచీకరణ తరవాత సంపన్న దేశాల ఆంక్షలు ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. వీటికన్నా ఐక్యరాజ్యసమితి ఆంక్షలు మరింత ప్రభావం చూపుతాయి. కారణం- సమితి విధించే ఆంక్షలకు అమెరికా, ఈయూలతో సహా 190 పైచిలుకు సభ్య దేశాల మద్దతు ఉండటమే దీనికి కారణం. ఆంక్షల వల్ల ప్రభుత్వాల కంటే సగటు పౌరులే ఎక్కువగా నష్టపోతారు. 1976-2012 మధ్య ఐక్యరాజ్యసమితి ఆంక్షలకు గురైన 68 దేశాల్లో వాస్తవ తలసరి జీడీపీ వృద్ధి రేటు 2.3 శాతం నుంచి 3.5 శాతం మేర కోసుకుపోయింది. ఆ నష్టం నుంచి తేరుకోవడానికి పదేళ్లకు పైనే పట్టింది. యావత్‌ ఆర్థిక వ్యవస్థపై ఆంక్షలు విధించినప్పుడు జీడీపీ అయిదు శాతం మేరకు తగ్గిపోయిందని 2015నాటి అధ్యయనం నిగ్గుతేల్చింది. ఆంక్షలకు గురైన దేశం నుంచి పెట్టుబడులు బయటికి వెళ్ళిపోతాయి. కరెన్సీ విలువ క్షీణించి, ధరలు పెరిగిపోయి సామాన్య ప్రజలు అష్టకష్టాలు పడతారు. ఎగుమతులు పడిపోయి ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. పౌరుల జీవన ప్రమాణాలు దిగజారిపోతాయి.

ఇంకా ఎంతకాలం?

రష్యాను ఉత్తర కొరియా, ఇరాన్‌, వెనెజువెలా దేశాలను ఒకే గాటన కట్టలేం. రష్యా ప్రపంచంలో ఆర్థికంగా బలమైన ‘గ్రూప్‌ ఆఫ్‌ 20’ దేశాల్లో ఒకటి. రష్యన్‌ ఎగుమతులు ప్రపంచ వాణిజ్యంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. రష్యాకు ఆంక్షలను ఎదుర్కోవడం కొత్త కాదు. 2014లో క్రిమియాను ఆక్రమించినప్పటి నుంచి రష్యాపై ఏదో ఒక రూపంలో ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు. అయితే, ఈసారి స్విఫ్ట్‌ యంత్రాంగం నుంచి బహిష్కరణకు గురి కావడం రష్యాను చీకాకు పరచే అంశమే. భారత్‌, చైనా వంటి పెద్ద దేశాలు రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగిస్తూనే ఉండటం సానుకూలాంశం. ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైన 60 రోజుల్లో రష్యా చమురు విక్రయాలు, గత ఏడాదికన్నా ఎక్కువయ్యాయి. నిరుడు రష్యన్‌ రేవుల నుంచి 357 చమురు ట్యాంకర్‌ నౌకలు బయలుదేరి వెళ్ళగా, యుద్ధం ప్రారంభమైన తరవాత 50 రోజుల్లో 380 ట్యాంకర్లు చమురును విదేశాలకు తీసుకెళ్ళాయి. వీటిలో మూడోవంతు చైనా, భారత్‌, దక్షిణ కొరియాలకు చేరాయి. యుద్ధం ప్రారంభమయ్యాక భారత్‌ కొనుగోలు చేసిన రష్యన్‌ చమురు మూడు రోజుల వినియోగానికి సరిపోతుంది. రష్యన్‌ చమురు 30శాతం తక్కువ ధరకే లభిస్తోంది. అలాగని రష్యాకు నష్టమే జరగడం లేదని కాదు. 35,000 కోట్ల డాలర్ల రష్యా విదేశ మారక ద్రవ్య నిల్వలను పాశ్చాత్య దేశాలు స్తంభింపజేశాయి. ఈ నిల్వలు ప్రధానంగా డాలర్‌, యూరోల్లోనే ఉన్నాయి. పెట్టుబడుల పలాయనం, పెట్టుబడుల కొరత, కరెన్సీ విలువ క్షీణత, వినియోగ వస్తువుల కొరత వంటి తీవ్ర సమస్యలను రష్యా ఎదుర్కొంటోంది. అదే సమయంలో రష్యా నుంచి చమురు, గోధుమల సరఫరా పడిపోవడం వర్ధమాన దేశాలకు ఆహార కొరత తెచ్చిపెట్టింది. ఆంక్షలు ఎంతకాలం కొనసాగుతాయి, రష్యా వాటిని ఎంతకాలం తట్టుకొంటుందనేవి నేటి కీలక ప్రశ్నలు.

చిన్న దేశాలపై అధిక ప్రభావం

ఆర్థిక ఆంక్షలు పెద్ద దేశాలకన్నా చిన్న దేశాలకే ఎక్కువ నష్టం కలిగిస్తాయి. పెద్ద దేశాలపై ఆంక్షలు వాటితోపాటు ఇతర దేశాలపైనా ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఇతర దేశాలకు ఎక్కువగా సరకులు సరఫరా చేసే దేశాలపై విధించే ఆంక్షలు అంతర్జాతీయ వాణిజ్యాన్ని కుంగదీస్తాయి. ఉదాహరణకు, ఉత్తర కొరియాకు అంతర్జాతీయ సరఫరా గొలుసుల్లో ఏమాత్రం ప్రాధాన్యం లేదు. ఆ దేశ ఎగుమతులపై ఇతర దేశాలు ఆధారపడి లేవు. అందువల్ల ఆంక్షల వల్ల ఉత్తర కొరియా తీవ్రంగా నష్టపోతుంది. అదే రష్యాను తీసుకుంటే చమురు, గోధుమ తదితర వ్యాపార సరకులను, రక్షణ సామగ్రిని భారీగా ఎగుమతి చేసే దేశమది. స్వల్పకాలంలో ఆంక్షల ప్రభావాన్ని రష్యా తట్టుకోగలదు. ఆ దేశంపై చమురు, గ్యాస్‌ కోసం ఆధారపడిన ఐరోపా దేశాలకూ ఆంక్షలు నష్టం కలిగిస్తున్నాయి. ఇక అంతర్జాతీయ సరఫరా గొలుసులో కీలక స్థానం ఆక్రమిస్తున్న చైనాపై ఆంక్షలు విధిస్తే ఇతర దేశాలకే ఎక్కువ నష్టం కలుగుతుంది. కాబట్టి చైనాపై ఆర్థిక ఆంక్షలు పనిచేయవు.


‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 05-05-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం