• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణ ఆర్థిక సర్వే 2020-21  

తెలంగాణ రాష్ట్రం సేవల రంగంలో దేశంలోనే ప్రధాన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉంది. గత అయిదేళ్లలో దేశంలోని మరే పెద్ద రాష్ట్రం సాధించని స్థాయిలో సగటున 10.25% మేర వృద్ధి నమోదుచేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసిన 2020-21 ఆర్థిక సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో 2019-20లో స్థూల విలువ జోడింపు (జీవీఏ)లో సేవల రంగం వాటా 65.19 శాతంగా పేర్కొంది. సిక్కిం మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలకంటే తెలంగాణ వృద్ధిరేటు ఎక్కువగా ఉందని సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో గత అయిదేళ్లలో నికర ఉత్పత్తి 68% మేర పెరిగింది. 2018-19లో పత్తి ఉత్పత్తిలో దేశంలో రెండోస్థానంలో, మొక్కజొన్న దిగుబడుల్లో మూడోస్థానంలో తెలంగాణ నిలిచింది. గ్రామాల్లో వందశాతం ఇళ్లకు నల్లా నీరు అందించిన జిల్లాలు దేశంలో 18 ఉండగా అందులో అయిదు తెలంగాణలో ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. కరోనా సమయంలో ప్రాణాలను కాపాడటంలోనూ రాష్ట్రం కేరళ తర్వాతి స్థానాన్ని ఆక్రమించింది. 

2019-20లో రాష్ట్ర స్థూల ఉత్పత్తికి జతచేరిన అదనపు విలువలో (గ్రాస్‌ స్టేట్‌ వాల్యూయాడెడ్‌) సేవా రంగం వాటా 65.19%మేర ఉంది. ఈ విషయంలో తెలంగాణ 5వ స్థానంలో ఉంది. ఏపీలో ఈ రంగం వాటా 41.80%. ఆ రాష్ట్రం 27వ స్థానంలో ఉంది. పెద్ద రాష్ట్రాల వారీగా చూస్తే జీవీఏలో సేవలరంగం వాటా కర్ణాటక తర్వాత తెలంగాణలోనే అత్యధికంగా ఉంది. గత అయిదేళ్లలో సగటున రెండంకెల వృద్ధి సాధించిన రాష్ట్రాల జాబితాలో త్రిపుర తర్వాతి స్థానంలో తెలంగాణ నిలిచింది. పెద్దరాష్ట్రాల పరంగా చూస్తే తెలంగాణలో మిగతా రాష్ట్రాల కంటే అధిక వృద్ధి నమోదైంది. 


ముఖ్యాంశాలు

 రాష్ట్ర నికర ఉత్పత్తి (నెట్‌ స్టేట్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌) 2011-12నాటి తాజా ధరల ప్రకారం 2015-16లో రూ.5,22,994 కోట్లు ఉండగా, 2019-20 నాటికి అది రూ.8,81,873 కోట్లకు (68.62%) చేరింది.   
‣ తలసరి నికర ఉత్పత్తి రూ.1,40,840 నుంచి రూ.2,28,216 (62.03%)కి  చేరింది.  
‣ 2019-20లో మొక్కజొన్న అత్యధికంగా పండిన రాష్ట్రాల్లో తెలంగాణ 3వ స్థానంలో నిలిచింది. ఆ ఏడాది రాష్ట్రంలో మూడు మిలియన్‌ టన్నుల దిగుబడి వచ్చింది. జాతీయస్థాయిలో వచ్చిన మొత్తం పంటలో 10.48% వాటా తెలంగాణ నుంచే సమకూరింది. 
‣ అదే ఏడాది పత్తి ఉత్పత్తిలో రాష్ట్రం రెండోస్థానంలో నిలిచింది. మొత్తం 6.83 మిలియన్‌ బేళ్ల పత్తి ఇక్కడి నుంచి వచ్చింది. దేశం మొత్తం ఉత్పత్తిలో తెలంగాణ వాటా 19.25%మేర ఉంది. 
 కరోనా సమయంలో మరణాలను నిలువరించడంలో తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది. ఇక్కడ అనుకున్నదానికంటే 2,290 మరణాలు తగ్గాయి. ఈ విషయంలో కేరళ (3,800) మొదటి స్థానంలో, ఆంధ్రప్రదేశ్‌ (1,410) మూడోస్థానంలో నిలిచాయి. 1.44 లక్షల కొవిడ్‌ కేసులను కూడా తెలంగాణ తగ్గించగలిగింది. ఈ విషయంలో దేశంలో రాష్ట్రం నాలుగో స్థానం. 


అసంఘటిత రంగంపై కొవిడ్‌ ప్రభావం

వివిధ రంగాల్లో  కొవిడ్‌-19 చూపిన ప్రభావ తీవ్రతను ఆర్థిక సర్వేలో విశ్లేషించారు. తెలంగాణ, దిల్లీ రాష్ట్రాల్లో అసంఘటిత రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చినపుడు అసంఘటిత రంగంలో తీవ్రత ప్రభావం 49.5 శాతంగా పేర్కొంది. రాష్ట్ర స్థూల విలువ జోడింపు (జీఎస్‌వీఏ)లో వ్యవసాయం, మైనింగ్, తయారీరంగం, నిర్మాణరంగం, సేవలరంగంపై కొవిడ్‌ ప్రభావం ఇలా ఉంది. 


జూన్‌లోనే వేబిల్లులు సాధారణ స్థితికి

ఈ-వేబిల్లులు రెవెన్యూ రాబడికి సంకేతం. దేశ వ్యాప్తంగా 2020 డిసెంబరు నాటికి ఈ-వేబిల్లులు గత ఏడాది స్థితికి చేరుకున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో మాత్రం జూన్‌లోనే సాధారణ స్థితికి చేరుకున్నాయి. హరియాణా, గుజరాత్‌లు జులైలో, మహారాష్ట్ర ఆగస్టులో గత ఏడాది నాటి స్థితికి చేరాయి.

 ఆర్థిక స‌ర్వే Volume -1 PDF 

ఆర్థిక స‌ర్వే  Volume -2 PDF 

ఆర్థిక సర్వే E-Book కోసం క్లిక్‌ చేయండి..

Posted Date: 30-01-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం