• facebook
  • whatsapp
  • telegram

కేంద్ర బడ్జెట్‌ 2024- 2025

2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తాత్కాలిక బడ్జెట్‌ను (Union budget 2024) ప్రవేశపెట్టారు. 
 


బడ్జెట్‌ సంక్షిప్త స్వరూపం :

* గతేడాది ప్రతిపాదించిన కొత్త పన్ను విధానామే ఈఏడాది కొనసాగింపు. రూ.7 లక్షల వరకు ఎలాంటి పన్ను భారం లేకుండా రిబేటు. 

* మధ్యతరగతి కోసం ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం 

*వచ్చే ఐదేళ్లలో పీఎం ఆవాస్‌ యోజన కింద 2కోట్ల ఇళ్ల నిర్మాణం

విమానయాన రంగంలో 2,3 తరగతి నగరాలకు కొత్త విమాన సర్వీసులు

* రైలు బోగీలన్నింటినీ వందే భారత్‌ ప్రమాణాలతో మార్పు 

* ఫేస్‌లెస్‌ విధానంతో పారదర్శకత, సత్వర రిటర్న్‌ల చెల్లింపులు.

* రూఫ్‌ టాప్‌ సోలార్‌ పాలసీ కింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌.

* మౌలిక వసతుల రంగం 11.1శాతం వృద్ధితో రూ.11లక్షల 11 వేల 111 కోట్ల కేటాయింపు.

* సంస్కరణలు అమలుకు రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు రూ.75వేల కోట్ల వడ్డీలేని రుణాలు.

* ఆయిల్‌ సీడ్స్‌ రంగంలో ఆత్మనిర్భరత.

* లక్‌ పతీ దీదీ టార్గెట్‌ను రెండు కోట్ల నుంచి మూడు కోట్లకు పెంపు.

* 9-18 ఏళ్ల బాలికలు సర్వైకల్‌ క్యాన్సర్‌ బారిన పడకుండా చర్యలు. 

* ఆశాలు, అంగన్‌వాడీలకు ఆయుష్మాన్‌ పథకం వర్తింపు.

* రక్షణ రంగానికి కేటాయింపులు 20శాతం పెంచడం ద్వారా రూ 6.2 లక్షల కోట్ల కేటాయింపు.

* ఉడాన్‌ స్కీమ్‌ కింద 517 కొత్త రూట్‌లు ప్రారంభం.

* గ్రామీణ ఉపాధి హామీ పథకం: రూ.86 వేల కోట్లు

* ఆయుష్మాన్‌ భారత్‌: రూ.7,500 కోట్లు

* పారిశ్రామిక ప్రోత్సాహకాలు: రూ.6,200 కోట్లు
 మూలధన వ్యయం ₹11.11 లక్షల కోట్లు 
 


మూలధన వ్యయానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి పెద్దపీట వేసింది. తాత్కాలిక బడ్జెట్‌లో రూ.11.11 లక్షల కోట్లు కేటాయించింది.

ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం మరోసారి మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ (Union budget 2024) తాత్కాలిక బడ్జెట్‌లో మూలధన వ్యయాన్ని మరింత పెంచింది. గతేడాదితో పోలిస్తే 11.11 శాతం మేర కేటాయింపులు పెంచి రూ.11.11 లక్షల కోట్లు కేటాయించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. 2022-23 బడ్జెట్‌లో రూ.7.36 లక్షల కోట్లుగా ఉన్న మూలధన వ్యయం 2023-24లో ఏకంగా 30 శాతం పెంచి రూ.10 లక్షల కోట్లకు చేర్చిన సంగతి తెలిసిందే.


రైల్వేలో మూడు కారిడార్లు  
 


రైల్వేను మూడు కారిడార్లుగా అభివృద్ధి చేయనున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఎనర్జీ, మినరల్‌, సిమెంట్‌ కారిడార్‌; పోర్ట్‌ కనెక్టివిటీ కారిడార్స్; హై ట్రాఫిక్‌ డెన్సిటీ కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనివల్ల సరకు రవాణా సామర్థ్యం మెరుగవడంతో పాటు ఖర్చు తగ్గుతుందని తెలిపారు. 40 వేల సాధారణ బోగీలను వందే భారత్‌ స్థాయికి తీసుకురావడం ద్వారా ప్రయాణికుల భద్రత, సౌకర్యాలు మెరుగుకానున్నాయని చెప్పారు.


వేగంగా.. ఎయిర్‌పోర్టుల అభివృద్ధి
దేశంలో ఎయిర్‌పోర్టుల విస్తరణ, కొత్త విమానాశ్రయాల అభివృద్ధిని వేగవంతం చేయనున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. గత పదేళ్లలో విమానాశ్రయాలు రెట్టింపు చేసి 149కి పెంచినట్లు తెలిపారు. దేశీయ విమానయాన సంస్థలు వెయ్యి కొత్త విమానాలకు ఆర్డర్‌ పెట్టినట్లు వివరించారు. ప్రపంచంలోనే పౌరవిమానయాన రంగంలో భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఉడాన్‌ స్కీమ్ ద్వారా 517 కొత్త రూట్లు అందుబాటులోకి వచ్చాయని, 1.3 కోట్ల మంది ప్రయాణికులు ఆయా మార్గాల్లో ప్రయాణం సాగించారని చెప్పారు.


జాతీయ రహదారులకు 2.78 లక్షల కోట్లు
జాతీయ రహదారుల కోసం బడ్జెట్‌లో ఈసారి రూ.2.78 లక్షల కోట్లు కేటాయించారు. 2023-24 బడ్జెట్‌లో ఈ మొత్తం రూ.2.70 లక్షల కోట్లుగా ఉంది. ఎన్‌హెచ్‌ఏఐకి బడ్జెట్‌లో రూ.1.67 లక్షల నుంచి రూ.1.68 లక్షల కోట్లకు కేటాయింపులు పెంచారు. దేశంలో జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌ వే రహదారుల నిర్మాణ బాధ్యతను NHAI, నేషనల్‌ హైవేస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (NHIDCL)లు చూస్తుంటాయి.


ఇ-బస్సులకు పెద్ద పీట
దేశంలో విద్యుత్‌ వాహనాలకు ఊతం ఇచ్చేందుకు ఛార్జింగ్‌ మౌలిక వసతుల కల్పన, తయారీని ప్రోత్సహించేందుకు నిర్ణయించింది. ఛార్జింగ్‌, తయారీ మౌలిక వసతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ముఖ్యంగా ప్రజారవాణాకు వినియోగించే ఇ-బస్సులకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు.


మధ్య తరగతి కోసం కొత్త హౌసింగ్‌ స్కీమ్‌
* పీఎం ఆవాస్‌ యోజన కింద రాబోయే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. కోటి ఇళ్లకు రూఫ్‌టాప్‌ సోలారైజేషన్‌ స్కీమ్‌నూ ఈ సందర్భంగా ప్రకటించారు.

* మధ్య తరగతికి కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. అర్హులైన వారికి ఇళ్ల కొనుగోలు, సొంతింటి నిర్మాణం కోసం హౌసింగ్‌ స్కీమ్‌ తీసుకొస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala sitharaman) తెలిపారు. బస్తీలు, అద్దె ఇళ్లలో ఉండేవారి సొంతింటి కలను నిజం చేస్తామని బడ్జెట్‌ (Union budget 2024) ప్రసంగంలో పేర్కొన్నారు. అలాగే, పీఎం ఆవాస్‌ యోజన కింద రాబోయే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

* సొంతింటి నిర్మాణం కోసం తీసుకొచ్చిన ‘పీఎం ఆవాస్‌ యోజన గ్రామీణ్‌’ కరోనా కాలంలోనూ కొనసాగిందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. 3 కోట్ల ఇళ్ల నిర్మాణం లక్ష్యాన్ని త్వరలో చేరుకోనున్నామని చెప్పారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని రాబోయే ఐదేళ్లూ ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మొత్తం 2 కోట్ల ఇళ్లను నిర్మించనున్నట్లు వివరించారు.


కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌
విద్యుత్‌ బిల్లుల నుంచి సామాన్య ప్రజలకు విముక్తి కలిగించేలా బడ్జెట్‌లో నూతన పథకాన్ని ఆర్థికమంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు సరికొత్త రూఫ్‌టాప్‌ సోలారైజేషన్‌ స్కీమ్‌ను తీసుకురానున్నట్లు తెలిపారు. దీనివల్ల గృహ వినియోగదారులకు ఏటా రూ. 15వేల నుంచి రూ.18 వేల వరకు ఆదా అవుతుందని తెలిపారు. ఈ పథకం గురించి అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.


వందే భారత్ స్థాయికి 40 వేల సాధారణ కోచ్‌లు
* బడ్జెట్‌లో రైల్వేపై కీలక ప్రకటన వెలువడింది. 40 వేల సాధారణ రైలు కోచ్‌లను వందేభారత్‌ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 

* దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థను మెరుగుపరిచేందుకు, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు 40 వేల సాధారణ బోగీలను వందే భారత్‌ (Vande Bharat) ప్రమాణాలకు అనుగుణంగా మార్చనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitaraman) తెలిపారు. గురువారం లోక్‌సభలో తాత్కాలిక బడ్జెట్‌ 2024ను (Union Budget 2024) ప్రవేశపెడుతూ ఆమె ఈ ప్రకటన చేశారు. దేశ ఆర్థికాభివృద్ధికి భారతీయ రైల్వే (Indian Railway) ఒక చోదక శక్తిగా పేర్కొన్న విత్త మంత్రి.. ఆ శాఖను మూడు ప్రధాన ఆర్థిక కారిడార్‌లుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. మొదటిది.. ‘ఇంధన, ఖనిజాలు, సిమెంట్‌ నడవా’ కాగా, రెండోది ‘నౌకా అనుసంధాన నడవా’, మూడోది ‘ట్రాఫిక్‌ డెన్సిటీ కారిడార్‌’ (రవాణా సాంద్రత నడవా)గా పేర్కొన్నారు. వీటిని ప్రధాని ‘గతిశక్తి పథకం’ కింద గుర్తించి వివిధ మార్గాల ద్వారా అనుసంధానించనున్నట్లు తెలిపారు. 

రవాణా సాంద్రత నడవాల ద్వారా ప్యాసింజర్‌ రైళ్ల కార్యకలాపాలు మెరుగుపరిచి వేగవంతమైన, సురక్షితమైన రైలు సర్వీసులు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులోభాగంగా వందే భారత్‌ వంటి సెమీ-హైస్పీడ్‌ రైళ్లను ఇప్పటికే రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. విడతల వారీగా వీటి సర్వీసులను దేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది. త్వరలో వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో కంటే వీటిలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు ఉంటాయని రైల్వే వర్గాలు తెలిపాయి. 


పన్ను విధానాల్లో ఎటువంటి మార్పులు లేవు
*ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో పన్నులకు సంబంధించి ఎటువంటి పెద్ద ప్రకటనలు లేవు. ప్రత్యక్ష పన్నుల్లో వివాదాలకు సంబంధించిన నోటీసులపై మాత్రం కొంత ఊరటనిచ్చారు.  

* ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో పన్ను విధానాల్లో మార్పుల జోలికి ఆర్థిక మంత్రి వెళ్లలేదు. ఆదాయపు పన్ను ( Income tax) కొత్త విధానంలో వారికి రూ.7 లక్షల వరకు ఎటువంటి పన్ను ఉండదని పునరుద్ఘాటించారు. ఇది 2013 - 14లో రూ.2.2 లక్షలుగా ఉందని గుర్తు చేశారు. కార్పొరేట్‌ పన్నును దేశీయ కంపెనీలకు 30 శాతం నుంచి 22 శాతానికి.. కొన్ని రకాల తయారీ రంగ సంస్థలకు 15 శాతానికి తగ్గించినట్లు వెల్లడించారు. ప్రజల సగటు వాస్తవిక ఆదాయం 50శాతం పెరిగినట్లు చెప్పారు.  

* ప్రత్యక్ష పన్నులకు సంబంధించి వివాదాస్పద డిమాండ్‌ నోటీసులు అందుకొన్న వారికి ఊరటనిచ్చారు. 2009 - 10 మధ్య రూ.25 వేల వరకు విలువైన డిమాండ్‌ నోటీసులను ఉపసంహరించుకొన్నారు.  2010 - 11 నుంచి 2014 - 15 ఆర్థిక సంవత్సరాల మధ్య రూ.10 వేల వరకు చెల్లించాలని జారీ అయిన నోటీసులను రద్దు చేశారు. దీంతో దాదాపు కోటి మంది లబ్ధి పొందనున్నట్లు ఆమె తెలిపారు. వ్యాపారాలను సరళతరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొన్నారు. ఈక్రమంలో చిన్న మొత్తంలో ఉన్న ప్రత్యక్షపన్ను వివాదాస్పద డిమాండ్ల (నోటీసులు)ను రద్దు చేసుకొంటున్నట్లు వివరించారు. 

* ఆదాయపు పన్ను రిఫండ్‌ సమయాన్ని తమ ప్రభుత్వం గణనీయంగా తగ్గించిందని ఆర్థిక మంత్రి వెల్లడించారు.  2013-14లో ఇది సగటున 93 రోజులు ఉండగా.. ప్రస్తుతం దానిని 10 రోజులకు తీసుకురాగలిగామని వెల్లడించారు. 


ఆదాయపన్ను వర్గాలు 
 


* 2023-24 సంవత్సరంలో కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారు, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎంచుకునేవారు ఈ విషయాలను గుర్తు పెట్టుకోండి.

* ఇన్‌కమ్‌ట్యాక్స్‌ శ్లాబ్‌లను ఆరు తరగతుల నుంచి ఐదుకు తగ్గించారు.

* కొత్త పన్ను విధానంలో మినహాయింపు రూ.2.5లక్షల నుంచి రూ.3లక్షల పెంచారు. (2023-24 బడ్జెట్‌)

* సెక్షన్‌ 87A ప్రకారం రూ.7లక్షల వరకూ ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు.

* అధిక ఆదాయం కలిగిన వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాల (హెచ్‌యూఎఫ్‌) సర్‌ఛార్జీని తగ్గించారు. రూ.5కోట్లకు మించి ఆదాయం ఉన్న వారికి 37శాతం సర్‌ఛార్జీ వర్తిస్తుండగా 25శాతానికి తగ్గించారు.

* పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను లేదా పాత పన్ను విధానంలో ఏదో ఒకదానికి ఒకదానిని ఎంచుకునే వీలుంది. పన్ను రిటర్నులు దాఖలు చేసేటప్పుడు వెబ్‌సైట్‌లో కొత్త పన్ను విధానమే డిఫాల్ట్‌గా ఉంటుంది.

* పాత పన్ను విధానంలో రూ.50వేల ప్రామాణికత తగ్గింపును అనుమతించేవారు. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికీ ఈ మినహాయింపు వర్తించనుంది.


‘టార్గెట్‌ లక్షద్వీప్‌’ దిశగా బడ్జెట్‌లో అడుగులు..!  
 


* మాల్దీవులతో వివాదం వేళ కేంద్రం లక్షద్వీప్‌ పర్యటకాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందుకోసం చర్యలు చేపట్టనున్నట్లు తాత్కాలిక బడ్జెట్‌లో ప్రకటించింది. మాల్దీవులతో వివాదం రగులుతున్న వేళ లక్షద్వీప్‌ (Lakshadweep)ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.  2024 తాత్కాలిక బడ్జెట్‌ ప్రసంగంలో ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) లోక్‌సభకు వెల్లడించారు. ప్రభుత్వం ప్రముఖ పర్యటక కేంద్రాలను ప్రచారం చేయడానికి వీలుగా వడ్డీ రహిత దీర్ఘకాలిక రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. లక్షద్వీప్‌లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తుందని వెల్లడించారు.

* ‘‘పర్యటక కేంద్రాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం. భారత్‌లోని 60 చోట్ల నిర్వహించిన జీ20 సమావేశాలు ఇక్కడి వైవిధ్యాన్ని ప్రపంచ పర్యటకులకు తెలియజేశాయి. మన ఆర్థిక శక్తితో దేశాన్ని వ్యాపారాలకు కేంద్రంగా చేయడంతో పాటు.. కాన్ఫరెన్స్‌ టూరిజాన్ని ఆకర్షించాలి. మన మధ్యతరగతి వర్గాలు ఇప్పుడు ప్రయాణాలకు, కొత్త ప్రాంతాల అన్వేషణలకు ఉత్సాహంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక పర్యటకం కారణంగా స్థానిక వ్యాపారాలకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ఆకర్షణీయమైన ప్రదేశాలను సమగ్రంగా అభివృద్ధి చేసేలా రాష్ట్రాలను ప్రోత్సహిస్తాం. వాటిని ప్రపంచ స్థాయిలో బ్రాండింగ్‌, మార్కెటింగ్‌ చేస్తాం’’

* ‘‘వసతులు, నాణ్యమైన సేవలు ఆధారంగా ఈ పర్యటక కేంద్రాలకు రేటింగ్‌ ఇచ్చేలా ఒక ఫ్రేమ్‌ వర్క్‌ను సిద్ధం చేస్తాం. రాష్ట్రాలతో కలిసి దామాషా విధానంలో ఆ కేంద్రాల అభివృద్ధికి అవసరమైన ఫైనాన్సింగ్‌ సమకూరుస్తాం. దేశీయ పర్యటక రంగాన్ని ప్రోత్సహించేందుకు పోర్టు కనెక్టివిటీ, టూరిజం ఇన్‌ఫ్రా, ఇతర వసతులను మన దీవుల్లో ఏర్పాటు చేస్తాము. వీటిల్లో లక్షద్వీప్‌ కూడా ఉంది. ఇది ఉద్యోగాలను సృష్టిస్తుంది’’ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  తెలిపారు. 


‘బాయ్‌కాట్‌ మాల్దీవ్స్‌’తో వార్తల్లోకి..
జనవరి మొదటి వారంలో ప్రధాని మోదీ లక్షద్వీప్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన డైవింగ్‌, స్నార్కెలింగ్‌ చేశారు. ఆ విశేషాలను నాడు ఎక్స్‌ వేదికగా పంచుకొన్నారు. అక్కడి అందాలు తన మది దోచుకున్నాయన్నారు. సాహసాలు చేయాలనుకునేవారు తమ జాబితాలో లక్షద్వీప్‌ను చేర్చాలని ఆయన కోరారు. ఈ పర్యటనపై మాల్దీవుల మంత్రులు విషం కక్కారు. ప్రధాని, భారత ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యవివాదం రాజుకొంది. చాలా మంది భారతీయ సెలబ్రిటీలు లక్షద్వీప్‌ను ప్రమోట్‌ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ప్రముఖ పర్యటక వెబ్‌సైట్లు మాల్దీవుల ప్యాకేజీలను నిలిపివేశాయి. 

తాజాగా భారత్‌ నుంచి మాలెకు వెళ్లేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత మూడు వారాలుగా మాల్దీవుల పర్యటక జాబితాను పరిశీలిస్తే.. అప్పటివరకు అగ్రస్థానంలో కొనసాగిన భారత్‌ వేగంగా ఐదో స్థానానికి పడిపోయింది. 13,989 మంది మాత్రమే మాల్దీవులను సందర్శించారు. 18,561 మంది పర్యటకులతో రష్యా తొలి స్థానంలో నిలిచింది. 18,111 మంది పర్యటకులతో ఇటలీ రెండో స్థానానికి ఎగబాకింది. చైనా 16,529.. బ్రిటన్‌ 14,588 మంది పర్యటకులతో మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. 


మన దేశంలోనూ అందాల దీవులు..
లక్షద్వీప్‌ ప్రాంతాన్ని ప్రపంచ పర్యటక హబ్‌గా తీర్చిదిద్దాలని కేంద్రం ఎప్పటి నుంచో భావిస్తోంది. తాజా వివాదం ప్రజల భావోద్వేగాలను బలంగా ప్రభావితం చేసింది. దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చింది. దీంతో ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు ఈ దిశగా ప్రయత్నాలు వేగవంతం చేయడం విశేషం. 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న లక్షద్వీప్‌లో 35 దీవులు ఉన్నాయి. సెప్టెంబరు-మే మధ్యకాలంలో ఇక్కడి వాతావరణం పర్యటకానికి అత్యంత అనుకూలం. బీచ్‌లు, పగడపు దీవులు, సముద్ర సాహస క్రీడల పరంగా చూస్తే ఇది మాల్దీవులకు ఏమాత్రం తీసిపోదు. అయితే, మౌలిక సదుపాయాలతో పాటు అంతర్జాతీయ స్థాయి ఆతిథ్య సేవలను మరింతగా అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. పర్యటకులు పెరిగినప్పుడు ప్లాస్టిక్‌, చెత్త పేరుకుపోతాయి. ఇవి దీవుల సహజత్వాన్ని, వాటి ప్రత్యేకతను దెబ్బతీసే ప్రమాదముంది. కాబట్టి లక్షద్వీప్‌, అండమాన్‌లలో టూరిజం ప్రాజెక్టులను పర్యావరణ హితకరమైన విధానాల్లో చేపట్టడం ఎంతో అవసరం. తాజా చర్యల్లో ఆ దిశగా అడుగులు పడే అవకాశం ఉంది.


కేంద్ర బడ్జెట్‌.. పలు రంగాలకు కేటాయింపులు ఇలా..
గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. 2024-25 తాత్కాలిక బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు రూ.1.77 లక్షల కోట్లను కేటాయించింది.


పల్లె ప్రగతికి పెద్దపీట
 


గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. 2024-25 తాత్కాలిక బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు రూ.1.77 లక్షల కోట్లను కేటాయించింది. 2023-24తో ఇచ్చిన రూ.1.57 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 12 శాతం ఎక్కువ. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం రూ.86,000 కోట్లను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. గత బడ్జెట్‌లో ఇచ్చిన నిధులు రూ.60,000 కోట్లతో పోలిస్తే 43 శాతం ఎక్కువ కేటాయించడం విశేషం. ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజనకు ఈసారి నిధుల్ని తగ్గించారు. 2024-25 తాత్కాలిక బడ్జెట్‌లో ఆ పథకానికి రూ.12,000 కోట్లను ప్రకటించారు. గత బడ్జెట్‌లో కేటాయింపులు రూ.19,000 కోట్లు.


బయోమాస్‌ను సీబీజీగా మార్చేందుకు ఆర్థిక సాయం
బయోమాస్‌ను కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌ (సీబీజీ)గా మార్చేందుకు ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. వాహనాలు, దేశీయ సరఫరాల కోసం ఇంధనంగా వినియోగించేందుకు సహజ వాయువులో తప్పనిసరిగా సీబీజీ కలపడాన్ని దశలవారీగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. దేశ ఇంధన భద్రతకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. బయోమాస్‌ అగ్రిగేషన్‌ పరికరాలు సమకూర్చుకునేందుకు ఆర్థిక సాయం కల్పిస్తామని అన్నారు. హరిత వృద్ధిని ప్రోత్సాహించేందుకు బయో తయారీ, బయో- ఫౌండ్రీ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.


ఎన్నికల సంఘానికి రూ.306 కోట్లు
ఈ ఏడాది లోక్‌సభతో పాటు కొన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘాని(ఈసీ)కి 2024-25 బడ్జెట్‌లో కేంద్రం రూ.306.06 కోట్లు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24)లో కేంద్రం రూ.385.67 కోట్లు ఇచ్చింది. న్యాయమంత్రిత్వ శాఖకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,502.30 కోట్లు ఇవ్వగా.. 2024-25లో రూ.34.84 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్ని ఈవీఎంల సేకరణ కోసం ఎన్నికల సంఘానికి ఇవ్వనున్నారు. న్యాయమంత్రిత్వ శాఖ పరిధిలోని శాసన విభాగం ఈసీకి సంబంధించిన ఎన్నికలు, ఎన్నికల చట్టాల అంశాలకు నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తుంది.


పరిశోధనలకు రూ.లక్ష కోట్ల కార్పస్‌ ఫండ్‌

ప్రైవేటు రంగంలో పరిశోధనలు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రూ.లక్ష కోట్ల కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ‘ఈ నిధితో.. 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఔత్సాహికులను ప్రోత్సహిస్తాం. దీర్ఘకాలిక ఫైనాన్సింగ్‌ లేదా రీఫైనాన్సింగ్‌, పూర్తిగా వడ్డీ లేకుండా సాయం చేస్తాం. యువత, సాంకేతికతను సమ్మిళితం చేసేలా.. సన్‌రైజ్‌ డొమైన్‌లో పరిశోధన, ఆవిష్కరణలో ఇది ఎంతగానో ఉపకరిస్తుంది’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.


ఉడాన్‌లో 517 మార్గాలు

పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా ప్రస్తుత విమానాశ్రయాల విస్తరణ, కొత్త విమానాశ్రయాల అభివృద్ధిని వేగంగా కొనసాగిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. గత పదేళ్లలో విమానాశ్రయాలు రెట్టింపై 149కు చేరాయని తెలిపారు. దేశీయ సంస్థలు 1120 కొత్త విమానాలకు ఆర్డర్లు పెట్టినట్లు గుర్తు చేశారు.  చిన్న పట్టణాలకు విమానాలు నడిపేందుకు అమలు చేస్తున్న ప్రాంతీయ వాయు అనుసంధానత పథకం (ఉడాన్‌) కింద వాయు ప్రయాణాలను మరింత అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఎఫ్‌ఎం తెలిపారు. ఈ పథకం కింద 517 కొత్త మార్గాల్లో 1.3 కోట్ల మంది ప్రయాణించారని వివరించారు.

* నిధులు ఇలా: 2024-25లో పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు రూ.2,300 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. 2023-24లో ఈ శాఖకు సవరించిన అంచనా రూ.2,922.12 కోట్ల కంటే ఈ మొత్తం తక్కువే. ఉడాన్‌కు 2024-25లో రూ.502 కోట్లు కేటాయించారు. 2023-24లో సవరించిన అంచనాలు రూ.850 కోట్ల కంటే ఇది తక్కువ. 22 విమానాశ్రయాలను పునరుద్ధరించడం, 124 వాయు మార్గాలను ప్రారంభించడంతో పాటు ఈశాన్య ప్రాంతాల అనుసంధానత కోసం, వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ కోసం తాజాగా కేటాయించిన నిధులను వినియోగించనున్నారు.


‘జనాభా పెరుగుదల- సవాళ్ల’పై ఉన్నత స్థాయి కమిటీ

వేగంగా జనాభా పెరుగుదల, అందులో మార్పుల వల్ల ఎదురవుతున్న సవాళ్లను అధ్యయనం చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యాలను చేరుకునేందుకు ఉన్న సవాళ్లను కమిటీ తప్పనిసరిగా గుర్తించాల్సి ఉంటుందన్నారు.


రెవెన్యూ లోటును పూడ్చేందుకు రూ.14.13 లక్షల కోట్ల రుణాలు

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏర్పడే రెవెన్యూ లోటును పూడ్చుకునేందుకు రూ.14.13 లక్షల కోట్ల రుణాల్ని తీసుకోనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదించారు. 2023-2024 ఆర్థిక సంవత్సరం స్థూల రుణ అంచనా రూ.15.43 లక్షల కోట్లతో పోలిస్తే ఇది తక్కువే. వచ్చే ఏడాది పన్నుల ద్వారా రాబడి పెరుగుతుందని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు రుణ సేకరణను తగ్గించుకుంది.


జలంతోనే జీవనమని!

తాగునీటి సదుపాయ కల్పనకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. 2024-25 తాత్కాలిక బడ్జెట్‌లో జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు రూ.98,418 కోట్లను కేటాయించారు. ఇందులో 71 శాతం నిధులు ‘జల్‌ జీవన్‌ మిషన్‌’ కోసం వెచ్చిస్తారు. జల్‌ జీవన్‌ మిషన్‌లో భాగంగా దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ నల్లా నీటి సౌకర్యాన్ని కల్పించనున్నారు. 2023-24 బడ్జెట్‌లో జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు రూ.96,549 కోట్లు కేటాయించారు.
జాతీయ గంగా ప్రణాళిక’ కింద గంగ, దాని ఉపనదులకు సంబంధించి చేపట్టే ప్రాజెక్టులు, పథకాల అమలు కోసం రూ.3,500 కోట్లను, ప్రధాన మంత్రి క్రిషి సించాయీ యోజనకు రూ.2,500 కోట్లను తాత్కాలిక బడ్జెట్‌లో కేటాయించారు.


పోషణ్‌ 2.0కు రూ.21,200 కోట్లు  
 


మహిళా శిశు సంక్షేమ శాఖకు 2024-25 బడ్జెట్‌లో కేటాయింపులు పెరిగాయి. గతం కంటే 2.52 శాతం నిధులను పెంచి రూ.26,000 కోట్లను కేటాయించారు. వీటిల్లో వివిధ పథకాల ఉమ్మడి కార్యక్రమమైన పోషణ్‌ 2.0కు అత్యధికంగా      రూ.21,200 కోట్లను ఖర్చు చేయనున్నారు. అంగన్‌వాడీ సర్వీసులు, పోషణ్‌ అభియాన్‌ తదితర పథకాలు పోషణ్‌   2.0లో భాగంగా ఉన్నాయి. మహిళల రక్షణ, స్వయంఉపాధికి ప్రారంభించిన మిషన్‌ శక్తికి రూ.3,145.97 కోట్లు, బాలల రక్షణ, సంక్షేమానికి ఉద్దేశించిన మిషన్‌ వాత్సల్యకు రూ.1,472 కోట్లను కేటాయించారు. ఈ శాఖ కింద పనిచేసే స్వతంత్ర సంస్థలు కేంద్రీయ దత్తత సంసాధన సంస్థ (సీఏఆర్‌ఏ), జాతీయ బాలల రక్షణ, హక్కుల కమిషన్‌ (ఎన్సీపీసీఆర్‌), జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్సీడబ్ల్యూ)లకు గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.15 కోట్లు కోత విధించి    రూ.153 కోట్లు కేటాయించారు.


జనగణన మరింత ఆలస్యం!

బడ్జెట్‌లో జనాభా లెక్కల కోసం రూ.1,277.80 కోట్లను కేటాయించారు. ఇది మూడేళ్ల క్రితం కంటే చాలా తక్కువ. 2021-2022లో జన గణనకు రూ.3,768 కోట్లను ప్రతిపాదించినప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదు. ఈ ఏడాది అంతకన్నా తక్కువ కేటాయించడంతో జనాభా లెక్కలు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. రూ.8,754 కోట్లతో 2021లో జనగణన చేపట్టాలని, రూ.3,941 కోట్లతో జాతీయ జనాభా నమోదు నవీకరించాలని గతంలో కేబినెట్‌ నిర్ణయించింది. 2020 ఏప్రిల్‌ 1నుంచి సెప్టెంబరు 30 వరకు ప్రక్రియ పూర్తి కావాలని ప్రణాళికలు చేసినా ఫలించలేదు. తర్వాత ఇప్పటివరకూ కొత్తగా ప్రకటన చేయలేదు. సార్వత్రిక ఎన్నికలు ఉన్న కారణంగా ఈ ఏడాదీ జనగణన చేపట్టే అవకాశాలు లేవని అధికారులు తెలిపారు.


‘వికసిత భారత్‌’ సాకారమయ్యేలా..
 


2047 నాటికి ‘వికసిత భారత్‌’ సాకారానికి రాష్ట్రాలు చేపట్టే సంస్కరణలకు తోడ్పాటు అందించేందుకు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం రూ.75 వేల కోట్ల వడ్డీలేని రుణాలను.. 50 ఏళ్ల కాలపరిమితితో అందించనుంది. కాగా, 2024-25 బడ్జెట్‌ అంచనాల ప్రకారం రాష్ట్రాలకు రూ.22,22,264 కోట్ల నిధులు బదిలీ చేయనున్నారు. ఇందులో రాష్ట్రాల నుంచి వచ్చిన నిధుల్లో వాటాతో పాటు గ్రాంట్లు/రుణాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఇచ్చే నిధులు ఉంటాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ కేటాయింపులతో పోల్చితే ఇది రూ.4,13,848 కోట్లు అధికం. దేశ సర్వతోముఖ, సమ్మిళిత అభివృద్ధి సాధించే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.


గిరిజనానికి 70% నిధుల పెంపు 
 


గిరిజనుల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ... కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తాత్కాలిక బడ్జెట్‌లో రూ.13,000 కోట్లను నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. గత బడ్జెట్‌లో ఇచ్చిన రూ.7,605 కోట్లతో పోలిస్తే 70 శాతం ఎక్కువ. ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణానికి రూ.6,399 కోట్లను వెచ్చించనున్నారు. ప్రధానమంత్రి ఆది ఆదర్శ్‌ గ్రామ యోజనకు రూ.1,000 కోట్లను ప్రకటించారు.


పాఠశాల విద్యకు రూ.73 వేల కోట్లు  
 

గతంలో ఎన్నడూ లేని స్థాయిలో పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగానికి కేంద్రప్రభుత్వం రూ.73,498 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మోడల్‌ స్కూళ్లుగా అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన పీఎం శ్రీ పథకానికి బడ్జెట్‌లో రూ.6,050 కోట్లు కేటాయించారు. సమగ్ర శిక్షా అభియాన్‌, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలకు సైతం ఈ బడ్జెట్‌లో ఎక్కువ నిధులను ఇవ్వనున్నారు. పాఠశాల విద్యకు కేంద్రం వాటాగా రాష్ట్రాలకు వెళ్లాల్సిన నిధులనూ పెంచారు. రాష్ట్రాలకు రూ.8,200 కోట్లు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.308 కోట్ల చొప్పున కేటాయింపులు పెరిగాయి.


2014 తర్వాతే పెద్ద సంఖ్యలో ఐఐటీలు, ఐఐఎంలు

ఐఐటీలు, ఐఐఎంలు వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలను 2014 తర్వాత పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశామని కేంద్ర ఆర్థికమంత్రి వెల్లడించారు. ఈ దశాబ్ద కాలంలో 7 ఐఐటీలు, 16 ఐఐఐటీలు, 7 ఐఐఎంలు, 15 ఎయిమ్స్‌, 390 విశ్వవిద్యాలయాలను నెలకొల్పామని పేర్కొన్నారు.


అయిదేళ్లు... రెండు కోట్ల ఇళ్లు!  
 


ఎన్నికల వేళ మధ్య తరగతిని ఆకర్షించేందుకు కేంద్రం గృహ నిర్మాణ పథకాన్ని ప్రకటించింది. రానున్న ఐదేళ్లలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(గ్రామీణ) కింద మరో రెండు కోట్ల ఇళ్లను అదనంగా నిర్మించనున్నట్లు తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.80,671 కోట్లను కేటాయించారు. 2023-24లో కేటాయించిన రూ.79,590 కోట్లతో పోలిస్తే ఇది ఎక్కువ. అద్దె ఇళ్లు, మురికివాడలు, అనధికార కాలనీల్లో నివసించే మధ్య తరగతి వారి కోసం గృహాల్ని నిర్మించేందుకు, కొనుగోలు చేసేందుకు ఈ పథకం ఉపకరిస్తుందని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్దేశించుకున్న మూడు కోట్ల ఇళ్ల నిర్మాణ లక్ష్యాన్ని త్వరలోనే చేరుకోనున్నట్లు వెల్లడించింది. పెరుగుతున్న కుటుంబాల అవసరాల్ని తీర్చేందుకు రాబోయే ఐదేళ్లలో అదనంగా మరో రెండు కోట్ల ఇళ్లను అందుబాటులో తెస్తామంది. ఈ పథకంలో భాగంగా మైదాన ప్రాంత లబ్ధిదారులకు రూ.1.20 లక్షలు, కొండ ప్రాంతాల్లోని వారికి రూ.1.30 లక్షల చొప్పున సాయంగా అందిస్తారు. ఈ వ్యయాన్ని 60:40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి.


వాణిజ్యంపై యుద్ధాల ప్రభావం

 యుద్ధాలు, సంఘర్షణల నడుమ అంతర్జాతీయ వ్యవహారాలు మరింత సంక్లిష్టంగా, సవాలుగా మారాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అభిప్రాయపడ్డారు. రష్యా-ఉక్రెయిన్‌, ఇజ్రాయెల్‌-హమాస్‌ సంక్షోభాల వల్ల అంతర్జాతీయ సరఫరా గొలుసు వ్యవస్థలు దెబ్బతిన్నాయని తద్వారా వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందని తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. చమురు, ఎరువుల ధరలపై ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ భారత్‌ విజయవంతంగా ముందుకు వెళుతోందని ఆమె అన్నారు.


ముద్రా యోజనతో రూ. 22.5 లక్షల కోట్ల రుణాలు
 


ముద్రా యోజన కింద 43 కోట్ల రుణాలను అందించామని.. ఆ రుణాల విలువ రూ.22.5 లక్షల కోట్లని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. జన్‌ధన్‌ ఖాతాల ద్వారా ఇప్పటి వరకు రూ.34 లక్షల కోట్లను లబ్ధిదారులకు బదిలీ చేయగా.. వాటిల్లో పొదుపు మొత్తం రూ.2.7 లక్షల కోట్లుగా ఉందని  తెలిపారు. గత పదేళ్లలో మహిళలకు     30 కోట్ల ముద్ర రుణాలను అందించామని వెల్లడించారు. అర్హుల్లో చివరి వ్యక్తికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని.. ఇదే నిజమైన సామాజిక న్యాయం, లౌకికత్వం  అని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. 


‘లఖ్‌పతి’తో లక్షార్జన!
 


స్వయం సహాయక సంఘా(ఎస్‌హెచ్‌జీ)లకు సంబంధించిన ‘లఖ్‌పతి దీదీ’ పథక లక్ష్యాన్ని విస్తృతం చేస్తున్నారు. ఇకపై 3 కోట్ల మంది మహిళలకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి వెల్లడించారు.


3 కోట్ల మంది మహిళలకు నైపుణ్య శిక్షణ
స్వయం సహాయక సంఘా(ఎస్‌హెచ్‌జీ)లకు సంబంధించిన ‘లఖ్‌పతి దీదీ’ పథక లక్ష్యాన్ని విస్తృతం చేస్తున్నారు. ఇకపై 3 కోట్ల మంది మహిళలకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి వెల్లడించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా స్వయం సహాయక మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి.. వారు ఏడాదికి కనీసం రూ.లక్ష స్థిర ఆదాయం పొందేలా చేయడమే పథక లక్ష్యం. ‘తొమ్మిది కోట్ల మహిళల సభ్యత్వంతో 83 లక్షలు ఉన్న ఎస్‌హెచ్‌జీలు గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక స్వావలంబనకు ఉపకరిస్తున్నాయి. ఈ సంఘాలతో ఇప్పటికే కోటి మంది మహిళలు లక్షాధిపతులయ్యారు. వీరు ఇతరులకూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. గణతంత్ర దినోత్సవం నాడు ప్రధాని మోదీ ‘లఖ్‌పతి దీదీ’ కింద 2 కోట్ల మంది మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వాలని పిలుపునిచ్చారు. వీరు సాధించిన విజయాలు, మహిళల సంఘటిత స్ఫూర్తి చూసి ‘లఖ్‌పతి దీదీ’ లక్ష్యాన్ని 2 కోట్ల నుంచి 3 కోట్లకు నిర్దేశించుకున్నాం’ అని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.ఈ పథకం కింద మహిళలకు డ్రోన్‌ ఆపరేటింగ్‌, ఎల్‌ఈడీ బల్బుల తయారీ వంటి పనుల్లో శిక్షణ ఇస్తారు.


సాగు సాయం అంతంతే!
 


వ్యవసాయం, అనుబంధ రంగాలకు గత ఏడాదితో పోలిస్తే నిధుల కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. 2023-24లో రూ.1.25 లక్షల కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ.1.27 లక్షల కోట్లు కేటాయించారు.

* కేటాయింపులు స్వల్పంగా పెంపు

* వంటనూనెల రంగంలో ఆత్మనిర్భరతకు ప్రణాళిక

* పాడిరైతుల కోసం సమగ్ర కార్యక్రమం

* అయిదు సమీకృత ఆక్వాపార్కుల ఏర్పాటు

వ్యవసాయం, అనుబంధ రంగాలకు గత ఏడాదితో పోలిస్తే నిధుల కేటాయింపులు స్వల్పంగా పెరిగాయి. 2023-24లో రూ.1.25 లక్షల కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ.1.27 లక్షల కోట్లు కేటాయించారు. మత్స్య, పశుపోషణ, పాడి మంత్రిత్వ శాఖకు రూ.7,105 కోట్లు, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖకు రూ.3,290 కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగంలో మరింత వృద్ధి కోసం పబ్లిక్‌, ప్రైవేట్‌ పెట్టుబడులను ప్రోత్సహించనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. రైతుల ఆదాయం పెంచేందుకు, వ్యవసాయ రంగంలో విలువ  జోడింపునకు మరింత కృషి చేస్తామని పేర్కొన్నారు. బడ్జెట్‌ ప్రసంగంలో ఆమె పలు కీలక ప్రకటనలు చేశారు.


నూనెగింజల సాగుకు ప్రోత్సాహం

దేశీయంగా నూనెగింజల సాగును ప్రోత్సహించడం ద్వారా వంటనూనెల రంగంలో ఆత్మనిర్భరత సాధించేందుకు ఓ వ్యూహం రూపొందిస్తారు. భారత్‌ ప్రస్తుతం విదేశాల నుంచి పెద్దమొత్తంలో వంటనూనెలు దిగుమతి చేసుకుంటోంది. 2022 నవంబరు నుంచి 2023 అక్టోబరు వరకు (మార్కెటింగ్‌ సంవత్సరంలో) రూ.1.38 లక్షల కోట్ల విలువ చేసే సుమారు 165 లక్షల టన్నులు దిగుమతి చేసుకుంది. ఈ నేపథ్యంలో వేరుసెనగ, నువ్వులు, ఆవాలు, సోయా, పొద్దుతిరుగుడు సాగును ప్రోత్సహించేందుకు ప్రత్యేక వ్యూహం అమలు చేస్తారు. అధిక దిగుబడి ఇచ్చే వంగడాలపై పరిశోధన, ఆధునిక సాగు పద్ధతుల వినియోగం, మార్కెట్‌ అనుసంధానం, పంటల బీమా అందులో ఉంటాయి.


పాల ఉత్పాదకత పెంచేందుకు..

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఉంది. కానీ, పశువుల పాల ఉత్పాదకత తక్కువగా ఉంది. ఇప్పటికే ఉన్న రాష్ట్రీయ గోకుల్‌ మిషన్‌, నేషనల్‌ లైవ్‌ స్టాక్‌ మిషన్‌, డెయిరీ ప్రాసెసింగ్‌- పశు పోషణ కోసం ‘మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధులు’ వంటి పథకాల ఆధారంగా పాడి రైతులను ఆదుకునేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తారు. 


11.8 కోట్ల మందికి ‘పీఎం కిసాన్‌’

‘‘పీఎం కిసాన్‌ యోజన కింద 11.8 కోట్ల మంది రైతులకు ఆర్థిక సాయం అందించారు. 4 కోట్ల మందికి పీఎం ఫసల్‌ బీమా అందించారు. ప్రధాన మంత్రి కిసాన్‌ సంపద యోజన కింద 38 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. 10 లక్షల మందికి ఉపాధి లభించింది. మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పథకం ద్వారా 2.4 లక్షల స్వయం సహాయక సంఘాలకు, వ్యక్తిగతంగా 60 వేల మందికి రుణసాయం అందించారు.


మత్స్య సంపద పెంపు..

ఆక్వా రంగంలో ప్రస్తుతం హెక్టారుకు 3 టన్నుల మత్స్య సంపద ఉత్పత్తి అవుతోంది. దీన్ని 5 టన్నులకు పెంచేందుకు, ఎగుమతులను రెట్టింపు అంటే రూ.లక్ష కోట్లకు పెంచేందుకు, సమీప భవిష్యత్తులో 55 లక్షల మందికి ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు ప్రధాన మంత్రి మత్స్య సంపద పథకం అమలును ముమ్మరం చేస్తారు. అయిదు సమీకృత ఆక్వాపార్కులు ఏర్పాటు చేస్తారు. నానో యూరియా విధానం విజయవంతమైన నేపథ్యంలో నానో లిక్విడ్‌ డీఏపీ వినియోగాన్ని అన్ని అగ్రో-క్లైమేటిక్‌ జోన్లకు విస్తరిస్తారు.


మరిన్ని వైద్య కళాశాలలు.. అంగన్‌వాడీలకు ఆరోగ్య రక్ష

* ప్రస్తుతం దేశంలో గల ఆసుపత్రుల మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని మరిన్ని వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది

* ప్రస్తుతం దేశంలో గల ఆసుపత్రుల మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుని మరిన్ని వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈ అంశాన్ని పరిశీలించి, సిఫారసులు చేసేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు.

* తొమ్మిది నుంచి 14 సంవత్సరాల మధ్య గల బాలికలకు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ నిరోధక టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని కేంద్రం ప్రోత్సహించనుంది. తాజా గణాంకాల ప్రకారం ఏటా దేశంలో 80 వేల మంది గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. 35 వేల మంది ఈ వ్యాధి కారణంగా మరణిస్తున్నారు.

మాతా శిశు సంరక్షణకు సంబంధించిన అన్ని రకాల పథకాలను ఓ సమీకృత కార్యక్రమం కిందకు తీసుకురానున్నారు.

* బాలల సంరక్షణ, అభివృద్ధికి మెరుగైన పోషకాహార పంపిణీ కోసం సక్షామ్‌ అంగన్‌వాడీ-పోషణ్‌ 2.0 కింద అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునికీకరించనున్నారు.

* దేశంలోని ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులందరికీ ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద ఆరోగ్య బీమా కల్పించనున్నట్లు కేంద్రం పేర్కొంది. ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద లబ్ధిదారు కుటుంబానికి రూ.5 లక్షల ఆరోగ్య బీమాను కల్పిస్తున్నారు. గతేడాది డిసెంబరు 27 నాటి 12 కోట్ల కుటుంబాలకు చెందిన 55 కోట్ల మంది ఈ పథకం పరిధిలోకి వచ్చారు.

* దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు,  పిల్లల్లో రోగ నిరోధకత పెంచడం కోసం తీసుకొచ్చిన ‘మిషన్‌ ఇంద్రధనుస్సు’ పథకం సమర్థ అమలుకు యూ-విన్‌ వేదికను వేగవంతంగా విస్తరిస్తారు. ప్రస్తుతం ఒక్కో రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల్లోని రెండేసి జిల్లాల్లో యూ-విన్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. దీని కింద దేశ టీకా కార్యక్రమాన్ని డిజటలీకరిస్తారు.


అంతరిక్ష రంగానికి రూ.2వేల కోట్ల పెంపు 

మధ్యంతర బడ్జెట్‌లో అంతరిక్ష రంగానికి రూ.13,042.75 కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

మధ్యంతర బడ్జెట్‌లో అంతరిక్ష రంగానికి రూ.13,042.75 కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 2023-24కు సంబంధించి సవరించిన అంచనాల ప్రకారం ఈ రంగానికి కేటాయింపులు రూ.11,070.07 కోట్లు. ఈ లెక్కన తాజా బడ్జెట్‌లో దాదాపు రూ.2వేల కోట్లు పెరుగుదల నమోదైనట్లే. అంతరిక్ష పరిజ్ఞాన రంగానికి ఈసారి రూ.10,087 కోట్లు ప్రతిపాదించారు. 2023-24లో ఈ పద్దు కింద రూ.8,180 కోట్లు కేటాయించారు. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని, 2040 నాటికి భారత వ్యోమగామిని చంద్రుడిపైకి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఈ కేటాయింపులు జరిగాయి.

అణుశక్తి శాఖకు రూ.36,159.93 కోట్లను తాజా బడ్జెట్‌లో కేటాయించారు. 2023-24 కేటాయింపుల (రూ.36,905.45 కోట్లు)తో పోలిస్తే ఇప్పుడు ఈ పద్దు కింద కోత పడింది.

ముఖ్య రంగాలకు రూ.1.21 లక్షల కోట్ల కోత

కేంద్ర ప్రభుత్వం 2023-24లో ముఖ్య రంగాలకు కేటాయించిన బడ్జెట్‌ను పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేదు.

కేంద్ర ప్రభుత్వం 2023-24లో ముఖ్య రంగాలకు కేటాయించిన బడ్జెట్‌ను పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేదు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, వాణిజ్యం, విద్య, విద్యుత్తు, వైద్యం, హోం, సామాజిక సంక్షేమం, రాష్ట్రాలకు బదిలీ చేయాల్సిన నిధుల్లో రూ.1,21,433 కోట్లు కోతపెట్టింది. బడ్జెట్‌ సవరించిన అంచనాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.

నిర్మలమ్మ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రజ్ఞానంద ప్రస్తావన

యువత క్రీడల్లో నూతన అధ్యాయాలను సృష్టిస్తున్నందుకు దేశం గర్విస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (nirmala sitaraman)అన్నారు. 2023లో ప్రస్తుత ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ కార్ల్‌సన్‌ (carlsen)కు భారత నెం1 ఆటగాడు ప్రజ్ఞానంద (praggnananda)గట్టి పోటినిచ్చాడని కొనియాడారు. మధ్యంతర బడ్జెట్‌ (budget 2024)ను ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి క్రీడా రంగంపై పలు విషయాలు మాట్లాడారు. 

‘‘మన యువత క్రీడల్లో నూతన రికార్డులు నెలకొల్పుతున్నందుకు దేశం గర్విస్తోంది. 2023లో జరిగిన ఆసియా, ఆసియా పారా గేమ్స్‌లో మన ఆటగాళ్లు అత్యధిక పతకాలు సాధించారు. ఇది ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. ప్రపంచ చెస్‌ ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌లో ప్రజ్ఞానంద.. మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు గట్టిపోటీ ఇచ్చాడు. 2010లో దేశంలో చెస్‌ గ్రాండ్‌ మాస్టర్లు 20 మంది ఉండగా 2023లో ఆ సంఖ్య 80కు చేరింది’’ అని కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

2024 టాటా స్టీల్‌ చెస్‌ టోర్నమెంట్‌లో చైనా ఆటగాడు లిరెన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద, విశ్వనాథన్‌ ఆనంద్‌ను అధిగమించి భారత నెం1 ర్యాంకు ఆటగాడిగా అవతరించాడు. 12 సంవత్సరాలకే గ్రాండ్ మాస్టరైన అతడు ప్రపంచంలో రెండో అతి పిన్న వయస్కుడైన గ్రాండ్‌ మాస్టర్‌గా రికార్డు నెలకొల్పాడు. భారత క్రీడాకారులు 2023 ఆసియా గేమ్స్‌లో 107 పతకాలు, ఆసియా పారా గేమ్స్‌లో 111 పతకాలను సాధించి సత్తా చాటారు.


కోటి కుటుంబాల్లో సూర్యోదయం!

ప్రధానమంత్రి సూర్యోదయ యోజన... కోటి కుటుంబాల్లో వెలుగులు నింపనుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఈ పథకంలో భాగంగా కోటి ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తారు. ఫలితంగా ఒక్కో కుటుంబం నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా పొందేందుకు, ఏడాదికి రూ.15,000 నుంచి రూ.18,000 దాకా ఆదా చేసుకునేందుకు, మిగులు విద్యుత్‌ను డిస్కంలకు విక్రయించేందుకు వీలు కలుగుతుంది. తాత్కాలిక బడ్జెట్‌లో సౌర విద్యుత్‌ రంగానికి రూ.7,327 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో కేటాయించిన రూ.4,979 కోట్ల కంటే దాదాపు 48 శాతం ఎక్కువ. బడ్జెట్‌ ప్రసంగంలో భాగంగా ‘రూఫ్‌ టాప్‌ సోలార్‌’ పథకం వల్ల కలిగే ప్రయోజనాల్ని కేంద్రమంత్రి సభకు వివరించారు. ఈ పథకం విద్యుత్‌ వాహనాల ఛార్జింగ్‌కూ ఉపకరిస్తుందని, ఉపకరణాల తయారీ, నైపుణ్యాల పరంగా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.  అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ప్రధాని మోదీ ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘రూఫ్‌ టాప్‌ సోలార్‌’ పథకానికి రూ.10,000 కోట్లు కేటాయించనున్నట్లు ఆర్థికశాఖ కార్యదర్శి టి.వి.సోమనాథన్‌ చెప్పారు.


డిజిటల్‌ బడ్జెట్           

బ్రిటిష్‌ కాలం నుంచి ప్రవేశపెడుతూ వస్తోన్న కేంద్ర బడ్జెట్‌ ప్రతుల్ని.. 2018 దాకా లెదర్‌ సూట్‌కేస్‌లోనే పార్లమెంట్‌కు తీసుకొచ్చేవారు. కానీ 2019 నుంచి నిర్మలమ్మ ఈ సంప్రదాయానికి చెక్‌ పెట్టారు. ఆర్థిక మంత్రిగా ఆ ఏడాది తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆమె.. వాటి తాలూకు ప్రతుల్ని ‘బాహీ ఖాతా’గా పిలిచే ఎరుపు రంగు క్లాత్‌ బ్యాగ్‌లో తీసుకొచ్చారు. దీనిపై జాతీయ చిహ్నం కూడా అమర్చారు. తద్వారా భారతీయ సంస్కృతికి తెర తీశారామె. ‘ఇకనైనా బ్రిటిష్‌ సంస్కృతికి చరమగీతం పాడి.. భారతీయ సంప్రదాయానికి తెరతీద్దాం.. పైగా బాహీ ఖాతా ద్వారా బడ్జెట్‌ ప్రతుల్ని మోసుకురావడం కూడా చాలా సులువు..’ అంటూ రెండేళ్ల పాటు ఇదే సంప్రదాయాన్ని కొనసాగించిన నిర్మలమ్మ.. 2021లో డిజిటల్‌ బడ్జెట్‌ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. అటు కరోనాను, ఇటు పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని.. ఈ మార్పు చేశారామె. ఇందులో భాగంగానే ఓ యాప్‌ను కూడా లాంచ్‌ చేశారు. బడ్జెట్‌కు సంబంధించిన ప్రతి అంశాన్నీ సరళంగా, అందరికీ అర్థమయ్యేలా దీన్ని రూపొందించారు. ఆ ఏడాది నిర్వహించిన ‘హల్వా వేడుక’ (ఏటా బడ్జెట్‌కు ముందు రోజు నిర్వహించే వేడుక ఇది. ఇందులో భాగంగా ఆర్థిక మంత్రి చేతుల మీదుగా బడ్జెట్ రూపకల్పనలో పాలుపంచుకున్న వారందరికీ హల్వాను పంచిపెడతారు..)లో భాగంగా ఈ యాప్‌ను విడుదల చేశారు. ఇక ఈసారి ‘దహీ-చీనీ (పెరుగు-చక్కెర)’ మిశ్రమంతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నిర్మలమ్మ నోరు తీపి చేసి.. శుభాకాంక్షలు తెలిపారు.


అరుదుగా ఆరోసారి!

2019లో ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలమ్మ.. పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా పనిచేసిన తొలి మహిళగా చరిత్రకెక్కారు. ఇక అదే ఏడాది కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆమె.. ఈ ఘనత సాధించిన రెండో మహిళగా నిలిచారు. 1970-71లో ఇందిరాగాంధీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళగా కీర్తి గడించారు. అయితే ఆ సమయంలో ఆమె తాత్కాలిక ఆర్థిక మంత్రిగా ఉన్నారు. కానీ పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా పనిచేసి, బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తొలి మహిళగా ఘనత నిర్మలమ్మకే దక్కింది. ఇక ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు నిర్మలమ్మ. దీంతో వరుసగా ఆరుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థిక మంత్రిగా అరుదైన కీర్తిని సొంతం చేసుకున్నారామె. గతంలో 1959-64 మధ్య కాలంలో ప్రధానిగా పనిచేసిన మొరార్జీ దేశాయ్‌ తర్వాత వరుసగా అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన మంత్రిగా రికార్డులకెక్కారు నిర్మలమ్మ.


సుదీర్ఘ ప్రసంగం!

ఎక్కువసార్లు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడమే కాదు.. అత్యధిక సమయం బడ్జెట్‌ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలమ్మ ఖాతాలోనే ఉంది. ఈ క్రమంలోనే 2020-21 లో 162 నిమిషాల పాటు ప్రసంగించారామె. అయితే ఒంట్లో నలతగా ఉండడంతో మరో రెండు పేజీలు మిగిలి ఉండగానే ప్రసంగాన్ని ముగించారు. దీంతో బడ్జెట్‌ చరిత్రలో ఇదే ఇప్పటివరకు సుదీర్ఘ ప్రసంగంగా కొనసాగుతోంది. ఇక 2019-20 బడ్జెట్‌లో భాగంగా 137 నిమిషాల పాటు బడ్జెట్‌ను చదివి వినిపించారు. అంతకుముందు 2003-04 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన జస్వంత్‌ సింగ్‌ 135 నిమిషాల పాటు మాట్లాడారు. ఇలా ఎక్కువ సమయం బడ్జెట్‌ ప్రసంగం చేయడమే కాదు.. ఈసారి కనిష్టంగా 57 నిమిషాల్లోనే బడ్జెట్‌ ప్రసంగాన్ని ముగించారు నిర్మలమ్మ. ఈ ఆరేళ్లలో ఆమె చేసిన బడ్జెట్‌ ప్రసంగాల్లో ఇదే చిన్నది. ఇక గతేడాది 86 నిమిషాల పాటు బడ్జెట్‌ ప్రసంగం చేశారామె.


మినీ బడ్జెట్‌ ఘనతా ఆమెదే!

సాధారణంగా బడ్జెట్‌ను ఏడాదికి ఒకసారే ప్రవేశపెడతారు. అయితే కరోనా కారణంగా 2021లో ఒకేసారి పెద్ద బడ్జెట్‌ కాకుండా.. నాలుగైదు చిన్న బడ్జెట్‌లను విడతల వారీగా ప్రవేశపెట్టారు నిర్మలమ్మ. ఆ సమయంలో ఛిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్థిక ప్యాకేజీల రూపంలో మినీ బడ్జెట్‌లను రూపొందించారు. ఇలా మినీ బడ్జెట్‌లను తొలిసారి ప్రవేశపెట్టిన ఘనత కూడా నిర్మలమ్మ ఖాతాలోనే చేరడం విశేషం.


‘సర్వైకల్‌ క్యాన్సర్‌’కు వ్యాక్సినేషన్‌.. మరిన్ని మెడికల్‌ కాలేజీలు9 - 14 ఏళ్ల బాలికల్లో సర్వైకల్ క్యాన్సర్‌ నివారణకు కీలక చర్యలు చేపట్టనున్నట్లు ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో ప్రకటించారు. ఇందుకోసం వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) గురువారం లోక్‌సభలో తాత్కాలిక బడ్జెట్‌ (Union Budget 2024)ను ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసారి పెద్దగా కీలక పథకాల జోలికి వెళ్లని విత్త మంత్రి.. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించారు. దీంతోపాటు ఆరోగ్య సంరక్షణ రంగానికి (health care sector) సంబంధించి కొన్ని ప్రకటనలు చేశారు. బాలికల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణకు చర్యలు చేపట్టడంతో పాటు.. కొత్తగా మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 


హెల్త్‌ కేర్‌పై నిర్మలమ్మ ప్రకటనలివే

* వైద్యులుగా ప్రజలకు సేవ చేయాలని చాలామంది యువత ఆశ పడుతున్నారు. అందుకే, ప్రస్తుతమున్న మౌలిక సదుపాయాలను ఉపయోగించుకొని మరిన్ని వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తాం. ఈ అంశాన్ని పరిశీలించి సంబంధిత సిఫార్సులు చేసేందుకు ఓ కమిటీని నియమిస్తాం.

* 9 - 14 ఏళ్ల బాలికలు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ బారిన పడకుండా ఉండేలా వ్యాక్సినేషన్‌పై దృష్టి సారిస్తాం.

* పిల్లల్లో రోగ నిరోధకత పెంచడం కోసం తీసుకొచ్చిన ‘మిషన్ ఇంద్రధనుస్సు’ను నిర్వహించేందుకు కొత్తగా ఏర్పాటు చేసిన ‘యు - విన్‌’ ప్లాట్‌ఫామ్‌ను దేశవ్యాప్తంగా విస్తరిస్తాం.

* మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ కోసం అమలు చేస్తున్న పథకాలను సమగ్ర ప్రోగ్రామ్‌ కిందకు తీసుకొస్తాం.

* సాక్షమ్‌ అంగన్వాడీ పథకం కింద అంగన్వాడీ కేంద్రాలను ఆధునీకరిస్తాం. చిన్నారుల ఎదుగుదల కోసం పోషకాహార పంపిణీని మెరుగ్గా అందించేందుకు పోషణ్‌ 2.0 కార్యక్రమాన్ని అప్‌గ్రేడ్‌ చేస్తాం.

* ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య సంరక్షణ పథకాన్ని ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలకు విస్తరిస్తాం.


నలుగురిలో ఒకరు మన దేశంలోనే...

ప్రపంచ మహిళా జనాభాలో 16 శాతం మంది భారత్‌లోనే ఉన్నారు. సర్వైకల్‌ క్యాన్సర్‌ బారిన పడుతున్న ప్రతి నలుగురిలో ఒకరు మన దేశంలోనే ఉండటం గమనార్హం. ఇక, ఈ వ్యాధి కారణంగా మరణిస్తున్న వారిలో మూడో వంతు మంది భారతీయ మహిళలే. తాజా గణాంకాల ప్రకారం ఏటా దేశంలో 80 వేల మంది గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. 35 వేల మంది ఈ వ్యాధి కారణంగా మరణిస్తున్నట్లు తేలింది.


ఈసారీ డిజిటల్‌ పద్దే


మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ గతేడాదిలాగే ఈసారి కూడా కాగితరహిత బడ్జెట్‌ విధానాన్ని ఉపయోగించారు. మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ గతేడాదిలాగే ఈసారి కూడా కాగితరహిత బడ్జెట్‌ విధానాన్ని ఉపయోగించారు. ఇందుకోసం సంప్రదాయ ‘బహీ ఖాతా’(వస్త్రం లాంటి సంచి)లో ట్యాబ్‌ను తీసుకెళ్లారు. రాష్ట్రపతిని కలిసే ముందు అధికారులతో కలిసి ఆమె తన కార్యాలయం ఎదుట ఫోటోలు దిగారు. డిజిటల్‌ విధానంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు బ్రీఫ్‌కేస్‌కు బదులుగా ట్యాబ్‌ను తీసుకెళ్లారు. ఎర్రటి వస్త్రం మీద బంగారు వర్ణంలో జాతీయచిహ్నం ముద్రించి ఉన్న సంచితో రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆర్థికమంత్రి.. రాష్ట్రపతిని కలిసి అక్కడి నుంచి నేరుగా పార్లమెంటుకు వెళ్లారు.


కొత్త సంప్రదాయానికి నాంది
2019లో ఆర్థికశాఖ బాధ్యతలు స్వీకరించిన నిర్మల..దేశంలో పూర్తిస్థాయిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మహిళా ఆర్థికమంత్రిగా రికార్డు నెలకొల్పారు.  బ్రిటిష్‌ కాలంలో ఉపయోగించిన ‘బ్రీఫ్‌కేస్‌’ విధానం స్థానంలో ‘ట్యాబ్‌లెట్‌’ పద్ధతి తెచ్చి కొత్త సంప్రదాయానికి నాందిపలికారు.  భాజపా ప్రభుత్వం 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికమంత్రిగా నిర్మలను నియమించారు. అదే ఏడాది జులై 5న ఆమె తొలిసారిగా మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విదేశీ పాలన నుంచి స్వాతంత్య్రం పొంది ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ వారి విధానాలను అనుసరించడమేంటని ప్రశ్నించారు. బ్రిటిష్‌ సంప్రదాయానికి ‘బహీ ఖాతా’విధానంతో స్వస్తి పలికామన్నారు.


58 నిమిషాల్లో ముగిసిన బడ్జెట్‌ ప్రసంగం
నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం 58 నిమిషాల పాటు సాగింది. ఆమె చేసిన ఆరు బడ్జెట్‌ ప్రసంగాల్లో ఇదే చిన్నది. అత్యధిక సమయం పాటు బడ్జెట్‌ ప్రసంగం చేసిన ఆర్థికమంత్రిగా ఆమె ఇది వరకే రికార్డు సృష్టించారు.

* నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం 58 నిమిషాల పాటు సాగింది. ఆమె చేసిన ఆరు బడ్జెట్‌ ప్రసంగాల్లో ఇదే చిన్నది. అత్యధిక సమయం పాటు బడ్జెట్‌ ప్రసంగం చేసిన ఆర్థికమంత్రిగా ఆమె ఇది వరకే రికార్డు సృష్టించారు. 2020లో రెండు గంటల 40 నిమిషాల పాటు ఆమె మాట్లాడారు.

* జులైలో తమ ప్రభుత్వమే పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందని నిర్మల అన్నప్పుడు అధికార పార్టీ సభ్యులు ఏకకంఠంతో మద్దతు తెలిపారు. విపక్ష సభ్యులు దీనిని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.

* లోక్‌సభకు ప్రధాని మోదీ వచ్చే సమయంలో భారత్‌ మాతా కీ జై, జై శ్రీరామ్‌, జై సియా రామ్‌ నినాదాలతో సభ మార్మోగింది.

* గతంలో తమిళ కవుల పద్యాలను ఎక్కువగా ఉటంకించే నిర్మల.. ఈ ప్రసంగంలో వాటిని ప్రస్తావించలేదు. ప్రధాని మోదీ పేరును కనీసం ఎనిమిది సార్లు వివిధ సందర్భాల్లో ఉచ్చరించారు.

* లోక్‌సభ పబ్లిక్‌ గ్యాలరీల్లో సందర్శకులు పెద్దగా కనబడలేదు. కొందరు రాజ్యసభ సభ్యులు, నిర్మలా సీతారామన్‌ కుమార్తె వాంగ్మయీ పరకాల, మరికొందరు బంధువులు హాజరయ్యారు.

* ఎఫ్‌డీఐకి ఫస్ట్‌ డెవలప్‌ ఇండియా అని, జీడీపీకి గవర్నెన్స్‌, డెవలప్‌మెంట్‌, పర్ఫార్మెన్స్‌ అని ఆర్థికమంత్రి కొత్త అర్థాన్నిచ్చారు.

బడ్జెట్‌ ప్రసంగం పూర్తయిన అనంతరం నిర్మలా సీతారామన్‌ వద్దకు ప్రధాని మోదీ వెళ్లి అభినందించారు.

Posted Date: 09-02-2024గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని