• facebook
  • whatsapp
  • telegram

వెల్లివిరుస్తున్న మహిళా చేతన

ఓటింగ్‌లో పెరుగుతున్న భాగస్వామ్యం

భారతదేశ ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యం క్రమక్రమంగా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 67.2శాతం పురుష ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనగా, స్త్రీలు దాదాపు అదే స్థాయిలో (67శాతం) ఓటుహక్కు వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇటీవల బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నీతీశ్‌ కుమార్‌, 2016 తమిళనాడు ఎన్నికల్లో జయలలిత గెలవడానికి మహిళా ఓట్లే మూల కారణం. ఈ రెండు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికల్లోనూ మహిళలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేశారు. 2019 సంవత్సరానికి ముందు నుంచే దాదాపు మూడింట రెండు వంతుల రాష్ట్రాల్లో పురుషులకన్నా మహిళలు ఎక్కువ సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొంటూ వస్తున్నారు. 2004 ఎన్నికల్లో స్త్రీలకన్నా పురుషుల ఓటింగ్‌ 8.4శాతం ఎక్కువగా నమోదైంది. 2014నాటికి పురుషుల ఓట్ల ఆధిక్యం కేవలం 1.8శాతానికి కుదించుకుపోయింది. 2019నాటికి స్త్రీపురుషులు దాదాపు సరిసమానంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. మహిళల్లో అక్షరాస్యత, ఆదాయాలు పెరుగుతున్నకొద్దీ రాజకీయ చైతన్యమూ హెచ్చుతోంది. రాజకీయాల్లో స్త్రీలు పాలుపంచుకోవాలనే ఆసక్తిని స్వయంసహాయక సంఘాలు పెంచుతున్నాయి. ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం, వారు నిర్భయంగా ఓటు వేసే వాతావరణాన్ని ఏర్పరచడం, పోలింగ్‌ రోజు మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం వంటి చర్యలు వారిని పెద్ద సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు రప్పిస్తున్నాయి.

ప్రాతినిధ్యంలో పాత కథే!

ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల పాత్రపై ఆసక్తి వ్యక్తమవుతోంది. అయిదు రాష్ట్రాల్లో ఒక్క పశ్చిమ్‌ బంగ రాష్ట్రానికే ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రంతో పాటు కేరళలోనూ పురుషులకన్నా స్త్రీలు ఎక్కువ సంఖ్యలో ఓట్లు వేశారు. ఇక్కడ త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే సరళి పునరావృతమైతే ఫలితాలు ఎలా ఉంటాయనేది కీలక ప్రశ్న. నిరుడు బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నీతీశ్‌ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కనిపించినా, ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులైన మహిళా ఓటర్లు చివరకు ఆయన్ను గెలిపించారని విశ్లేషకులు పేర్కొన్నారు. 2015లో నీతీశ్‌ ప్రవేశపెట్టిన మద్య నిషేధ చట్టం మహిళా ఓటర్లను ఆకట్టుకుంది. బిహార్‌ మాదిరిగా గత అయిదేళ్లలో తమిళనాడు, పశ్చిమ్‌ బంగ రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఓటర్లకు విస్తారంగా సంక్షేమ ఫలాలను అందించాయి. మరి అవిరానున్న ఎన్నికల్లో విజయ ఫలాన్ని అందిస్తాయా?

రాజకీయాల్లో వెనకబాటు

మహిళా ఓటర్లు పురుషులతో సమానంగా ఓటు వేస్తున్నా, పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు గణనీయ సంఖ్యలో ఎన్నికవుతున్నా- కీలక రాజకీయ కార్యకలాపాల్లో వారు అంతగా పాలు పంచుకోకపోవడం పెద్ద లోపం. ఎన్నికల ప్రచారంలో కానీ, ప్రభుత్వాధికారులతో పనులు చేయించడంలో కానీ, మహిళలు పురుషులకన్నా బాగా వెనకబడి ఉన్నారు. ఒకవేళ చొరవ తీసుకుని ముందుకు వచ్చినా పురుషాధిక్య ప్రపంచం వారి ముందరికాళ్లకు బందాలు వేస్తోంది. ఇంటి పనుల ఒత్తిడి, పిల్లల ఆలనాపాలనా చూసుకోవలసిన బాధ్యత వారిని వెనక్కులాగుతాయి. అందువల్ల పంచాయతీలకు ఎన్నికయ్యే మహిళలు స్థానిక పాలనలో నామమాత్ర పాత్రనే పోషిస్తున్నారు. వారి తరఫున ఆయా కుటుంబాల్లోని పురుషులే పనులు చక్కబెడుతుంటారు. అలాగని, రాజ్యాలు ఏలడం మహిళలకు చేతకాదని పొరపడకూడదు. భారత్‌, ఇజ్రాయెల్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంకలతో పాటు అనేక దేశాల్లో మహిళా నేతలు తమ దీక్షాదక్షతలను ఎన్నడో నిరూపించారు.

ఎన్నికల ఫలితాలపై స్త్రీల ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నా, పాలనా స్థాయిలో వారికి ప్రముఖ పాత్ర లభించడం లేదు. నేడు పార్లమెంటు సభ్యుల్లో 14శాతం మాత్రమే మహిళలు. వారిలోనూ దాదాపు సగంమంది కేవలం నాలుగు రాష్ట్రాల నుంచి ఎన్నికైనవారే. ఇక అన్ని రాష్ట్రాల శాసన సభ్యుల్లో మహిళలు తొమ్మిది శాతమే. పార్లమెంటులో మహిళా ప్రాతినిధ్యానికి సంబంధించి ప్రపంచ ఆర్థిక వేదిక నిరుడు విడుదల చేసిన నివేదికలోని 153 దేశాల జాబితాలో భారత్‌ 122వ స్థానంతో సరిపెట్టుకొంది. పార్లమెంటు, అసెంబ్లీలకన్నా పంచాయతీ స్థాయిలో మహిళలకు మెరుగైన ప్రాతినిధ్యం లభిస్తోంది. ఇది 73వ రాజ్యాంగ సవరణ చలవే. దీని ద్వారా పంచాయతీ సర్పంచ్‌ పదవుల్లో మూడో వంతు మహిళలకే కేటాయించారు. పార్లమెంటు, అసెంబ్లీలకు ఎన్నికవుతున్న మహిళల్లో ఎక్కువమంది రాజకీయ, సంపన్న కుటుంబాలకు చెందినవారే. పార్లమెంటుకు ఎన్నికైన మహిళల్లో 42శాతం రాజకీయ కుటుంబాలకు చెందినవారు. పార్లమెంటు స్థాయిలో మహిళలకు రిజర్వేషన్లు లేవు. పంచాయతీ స్థాయిలో అలాంటి రిజర్వేషన్లు ఉన్న స్థానాలకు స్థానిక రాజకీయ కుటుంబాల పురుషులు పోటీచేయలేరు కాబట్టి తమ మహిళలను పోటీ చేయిస్తున్నారు. ప్రచార ఖర్చులు భరించే స్థోమత, తీరిక సంపన్న కుటుంబాలకు ఉండటంవల్ల ఆయా కుటుంబాల స్త్రీలు బరిలో దిగుతున్నారు.

ప్రపంచం దృష్టిని ఆకట్టుకునేలా...

ప్రస్తుతం కొవిడ్‌పై పోరాటంలో మహిళా నేతల పాలనలోని న్యూజిలాండ్‌, తైవాన్‌, జర్మనీ దేశాల విజయాలు అపూర్వం. అమెరికాలోనూ మహిళా గవర్నర్ల పాలనలోని రాష్ట్రాల్లో కొవిడ్‌ మరణాలు చాలా తక్కువగా నమోదయ్యాయి. ఇలా ఆరోగ్యంతోపాటు విద్యారంగంలో, మహిళలపై నేరాల నిరోధంలో మహిళా విధానకర్తలు పురుషులకన్నా ఎంతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు.  భారత్‌లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు మహిళలకు సాధికారత ప్రదానం చేసినా- మతపరమైన, సాంస్కృతికపరమైన అడ్డంకులను తొలగిస్తే భారతీయ మహిళ మరెన్నో విజయాలు సాధించగలుగుతుంది. రాజకీయంగా 2008 నుంచి పెండింగులో పడిఉన్న మహిళా రిజర్వేషన్‌ బిల్లును తక్షణం ఆమోదించడం వనితా విజయాలకు గట్టి పునాది వేస్తుంది. 108వ రాజ్యాంగ సవరణ బిల్లుగా వ్యవహరిస్తున్న ఈ బిల్లు అమలైతే శాసనసభల నుంచి లోక్‌సభ వరకు 33శాతం సీట్లు మహిళలకు కేటాయించాల్సిందే. దీనికితోడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పదవుల్లో సగాన్ని స్త్రీలకే కేటాయించాలన్న ప్రతిపాదనా ఉంది. అసోం, పశ్చిమ్‌ బంగ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి మార్చి 27 మొదలుకొని ఏప్రిల్‌ 29 వరకు ఎన్నికలు జరగనున్న తరుణంలో మహిళా ప్రాతినిధ్యం అంశాన్ని లోతుగా పరిశీలించాలి. మార్చి 29-31 తేదీల్లో మెక్సికో సిటీలో ప్రారంభమయ్యే తరాల సమానత్వ వేదిక సమావేశాలు జూన్‌ 21న ప్యారిస్‌లో ముగియనున్నాయి. ఐక్యరాజ్య సమితి మహిళా సంస్థ నిర్వహిస్తున్న ఈ సమావేశాలు మహిళా నాయకత్వం, మహిళా ఉద్యమాలు, లింగ సమానత్వంపై చర్చిస్తాయి. ఈ నేపథ్యంలో భారతదేశ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, వాటిలో మహిళా విజయాలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాయనడంలో సందేహం లేదు.

- ఆర్య

Posted Date: 26-03-2021గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం