• facebook
  • whatsapp
  • telegram

పాఠాలు నేర్వని కాంగ్రెస్‌

వరస వైఫల్యాలతో సతమతం

 

 

సమకాలీన రాజకీయాల నుంచి పాఠాలు నేర్చుకోవడంలో కాంగ్రెస్‌ తడబడుతున్నట్లు ఆ పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలే స్పష్టం చేస్తున్నాయి. ప్రతి నిర్ణయం గందరగోళం సృష్టిస్తోంది. అంతర్గత కుమ్ములాటలకు అధిష్ఠానమే ఆజ్యం పోయడం పార్టీ ప్రయోజనాలకు ప్రమాదకరంగా మారుతోంది. అర్ధ శతాబ్దానికిపైగా రాజకీయానుభవం కలిగిన నాయకుడు అవమానాలను భరించలేక ముఖ్యమంత్రి పీఠాన్నే వదిలేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించడం దురవస్థకు నిదర్శనం. పంజాబ్‌ ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ చేసిన రాజీనామా జాతీయ స్థాయిలో కలకలం రేపింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ రాజకీయ నిర్ణయాలు పార్టీ ప్రతిష్ఠను మంటగలుపుతున్నాయనే విమర్శలున్నాయి. ఎన్నికల వేళ పార్టీలో రగడ ప్రత్యర్థులకు ఆయుధంగా ఉపయోగపడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆరు నెలల వ్యవధిలో భాజపా నలుగురు సీఎమ్‌లను మార్చినా ఎక్కడా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉన్నామంటూ పదవులు త్యజించి పక్కకు వైదొలగారు.

 

స్వయంకృతాపరాధాలే!

ఒక దశలో దేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్‌ ఇలాంటి అస్తవ్యస్త రాజకీయ నిర్ణయాలతో ఇప్పుడు విజయం కోసం తహతహలాడే పరిస్థితికి చేరుకుంది. మారుమూల ప్రాంతాల్లోనూ వేళ్లూనుకున్న వందేళ్లు పైబడిన పార్టీ మూలాలు క్రమంగా క్షీణిస్తున్నాయి. ప్రజలను, ముఖ్యంగా యువ ఓటర్లను, నవతరం నాయకులను ప్రభావితం చేయగలిగిన శక్తిని కోల్పోతోంది. శక్తిమంతమైన ప్రత్యర్థి ఎదుట ఉన్నప్పుడు మరింత బలాన్ని పుంజుకోవాల్సింది పోయి, రోజు రోజుకు బలహీనపడుతోంది. అందుకు ప్రధాన కారణం కాంగ్రెస్‌ స్వయంకృతాపరాధాలే అన్నది సుస్పష్టం. పార్టీ కేంద్ర నాయకత్వం సంవత్సరాలుగా అయోమయంలో ఉంటే, రాష్ట్రాల్లో నేతలు అంతర్గత విభేదాలతో స్వీయ విధ్వంసాలకు పాల్పడుతున్నారు. దీంతో 2022లో ఏడు రాష్ట్రాల అసెంబ్లీలకు, 2024లో లోక్‌సభకు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ సామర్థ్య ప్రదర్శనపై అటు ప్రజల్లోనూ ఇటు మిత్రపక్షాల్లోనూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  

 

మూడేళ్లుగా సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షతనే పార్టీ నడుస్తోంది. సమగ్ర దిశానిర్దేశం లేక కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. పార్టీ పతనావస్థను వివరిస్తూ నేతను ఎన్నుకోవాల్సిన అవసరాన్ని సీనియర్‌ నేతలు కొందరు అధినాయకత్వానికి లేఖల ద్వారా విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని మోదీకి ఎదురు నిలబడగలిగిన నేతను సిద్ధం చేసుకోవడంలో కాంగ్రెస్‌ తడబడుతోంది. ఓటర్ల ఆలోచనలను ప్రభావితం చేయగలిగిన సైద్ధాంతిక భావజాలం కొరవడటం సమస్యగా మారింది. బలమైన ప్రాంతీయ నేతలను, సామర్థ్యం కలిగిన యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దుకోవడంలోనూ విఫలమవుతోంది. భాజపా సహా ఇతర ప్రాంతీయ పార్టీలకు అండగా నిలుస్తున్న ఓటర్ల వర్గాలవంటివేవీ కాంగ్రెస్‌కు ప్రత్యేకంగా లేకపోవడం ఇప్పుడు పెద్దలోటుగా మారింది. ఒకప్పుడు పేదలు, రైతులు, దళితులు, మహిళలు, మధ్యతరగతి ప్రజలకు బలమైన రాజకీయ సందేశాలను అందించగలిగిన ఆ పార్టీని జడత్వం ఆవహించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి పిలుపిచ్చినా అది పూర్తిస్థాయి ప్రచారానికి నోచుకోవడం లేదు. ఉద్యమ రూపాన్ని సంతరించుకోవడం లేదు. రఫేల్‌ ఉదంతం, క్రోనీ క్యాపిటలిజం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలపై రాహుల్‌గాంధీ గళం విప్పినప్పుడు పార్టీ నుంచి సరైన స్పందన రాలేదు. సీనియర్లు నోరు మెదపలేదు. పైగా జైరామ్‌ రమేశ్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌ వంటివారు మోదీ విధానాలను బహిరంగంగా సమర్థించారు. దీన్ని పార్టీ వైఫల్యంగానే గుర్తించాలి.

 

యువనేతల్లో నిరాశ

కాంగ్రెస్‌ యువనేతల్లోనూ ఒక రకమైన నిరాశా నిస్పృహలు నెలకొని ఉండటం మరో సమస్య. తమ రాజకీయ లక్ష్యాలు, ఆకాంక్షలు నెరవేరవేమోనన్న భయాలు వారిలో మొదలయ్యాయి. దాన్ని భాజపా అవకాశంగా మార్చుకుంటోంది. యువ నాయకులను తమ పార్టీలోకి ఆకర్షించి ఆయా రాష్ట్రాల్లో బలపడేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. అందులో భాగంగానే రాహుల్‌కు అత్యంత సన్నిహితులు, తరాలుగా కాంగ్రెస్‌తో అనుబంధం కలిగిన కుటుంబాల నుంచి వచ్చిన జ్యోతిరాదిత్య సింధియా, జితిన్‌ ప్రసాద వంటి నాయకులను చేర్చుకుంది. సచిన్‌ పైలట్‌ సమయం కోసం వేచి చూస్తున్నారు. అస్సాం మహిళా కాంగ్రెస్‌ నేత సుస్మితాదేవ్‌ టీఎంసీలో చేరారు. దక్షిణ ముంబయి మాజీ ఎంపీ మిలింద్‌ దియోరా, గతంలో మూడుసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న దీపేందర్‌ సింగ్‌ హుడా, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ కుమారుడు సందీప్‌ దీక్షిత్‌ వంటి ప్రజాకర్షణ కలిగిన యువనేతలకు కాంగ్రెస్‌ ఎలాంటి బాధ్యతలనూ అప్పగించలేదు. దీంతో వారు పార్టీ విధానాలకు విరుద్ధంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. కీలక ప్రభుత్వ రంగాలను ప్రైవేటుకు లీజుకు ఇవ్వడం, పెగాసస్‌ వ్యవహారం, వ్యవసాయ బిల్లులు, దీర్ఘకాలంగా సాగుతున్న రైతుల ఆందోళనలు, పెట్టుబడుల ఉపసంహరణ, పెట్రోల్‌ ధరలు, అస్తవ్యస్త ఆర్థిక, ఆరోగ్య విధానాలు తదితర సర్కారు వైఫల్యాలపై ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. కాంగ్రెస్‌ నాయకత్వంలో భాజపాను ఎదుర్కోవడానికి ఒక్కటవుతున్నా... హస్తం పార్టీ బలహీన రాజకీయమే అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవలి రాజస్థాన్‌ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ మెరుగైన ఫలితాలనే సాధించడం- ప్రజాదరణను పూర్తిగా కోల్పోలేదనడానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ దశలో పార్టీ అధిష్ఠానం పంజాబ్‌ తరహా రాజకీయాలతో సొంత నేతలు, కార్యకర్తలను కలవరపెట్టే చర్యలు మానుకోవాల్సిన అవసరం ఉంది. సీనియర్ల గౌరవానికి భంగం కలగకుండా, యువత ఉత్సాహం దెబ్బతినకుండా సమస్యలు పరిష్కరించాలి. అంతర్గతంగా పార్టీపై పట్టు పెంచుకొని విపక్షాలకు నమ్మకమైన సారథ్యాన్ని అందించాలి. అప్పుడే అజేయమనే ముద్రతో ముందుకు సాగుతున్న భాజపాను నిలువరించడం సాధ్యమవుతుంది.

 

పేలవ ప్రదర్శన

కాంగ్రెస్‌, భాజపా 2014 లోక్‌సభ ఎన్నికల్లో 189 సీట్లలో ముఖాముఖీ తలపడితే కమలం 166 సీట్లు గెలుచుకుంది. 2019లో 192 స్థానాల్లో ప్రత్యక్ష పోరుకు దిగితే భాజపా 176 సీట్లను కైవసం చేసుకుంది. 2019లో భాజపాకు దాదాపు 23 కోట్ల ఓట్లు పడగా, కాంగ్రెస్‌ సుమారు 12 కోట్ల ఓట్లు పొందింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ 2018 మినహా మిగతా సంవత్సరాల్లో 2021 వరకు కాంగ్రెస్‌ పేలవ ప్రదర్శనే కనబరచింది. ఇలాంటి దశలో పార్టీని బలోపేతం చేయడానికి శ్రమించాల్సిన శ్రేణులు స్వీయ సంఘర్షణల్లో తలమునకలయ్యాయి. అధికార పార్టీని నేరుగా ఎదుర్కోవడానికి మరిన్ని అస్త్రశస్త్రాలను, వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరాన్ని పార్టీ శ్రేణులు, నేతలు, అగ్రనాయకత్వం ఇకనైనా గుర్తించాల్సి ఉంది.

 

- ఎం.శ్రీనివాసరావు
 

Posted Date: 25-09-2021గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం