• facebook
  • whatsapp
  • telegram

గోవా రణక్షేత్రంలో దీదీ పోరు

స్థానికంగా కొరవడిన మద్దతు

తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ గోవా ఎన్నికల బరిలోకి దూకడం కేవలం అతిశయ ప్రదర్శనకేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆమెకు అక్కడ నిజంగా బలం లేదు. పశ్చిమ్‌ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీని ఓడించిన దీదీ- తాను దేశంలో మరెక్కడైనా ఆ పార్టీని చిత్తు చేయగలనని చాటుకోవాలనుకుంటున్నారు. అయితే, ప్రతి రాష్ట్రమూ బెంగాల్‌ కాదన్న విషయాన్ని ఆమె మరిచిపోతున్నారు. ఎటువంటి ముందస్తు సన్నాహాలు లేకుండా, గోవాలో టీఎంసీని పటిష్ఠం చేయకుండా ఆమె ఎన్నికల పోరులోకి ఎలా దిగారో అంతుచిక్కడం లేదు. గోవాలో అధికార సాధనకు కేవలం 100 రోజుల్లో తృణమూల్‌ను బలమైన పోటీదారుగా నిలబెట్టడం సాధ్యమేనా? బెంగాల్‌లో ఏళ్లతరబడి శ్రమించి బలమైన పార్టీని నిర్మించుకోవడం ద్వారానే మమత అక్కడ అజేయమనుకున్న వామపక్షాలను ఓడించి అధికారంలోకి రాగలిగారు. బెంగాల్‌లో వీధి పోరాటాలు చేసి మరీ నాయకురాలిగా ఎదిగారు. దానికి భిన్నంగా ఆమె గోవాలో అకస్మాత్తుగా ఊడిపడిన నేతగా కనిపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకన్నా 2024 లోక్‌సభ ఎలక్షన్ల కోసమే ఆమె పునాది నిర్మించుకుంటున్నారని స్పష్టమవుతూనే ఉంది. ఆ లక్ష్య సాధనకోసం ఆమె కింది స్థాయి నుంచి పైవరకు కార్యకర్తలు, నాయకుల యంత్రాంగాన్ని నిర్మించుకోవలసింది పోయి, పైస్థాయి నాయకులతో పార్టీ వ్యవస్థను రూపుదిద్దాలనుకోవడం చోద్యంగా కనిపిస్తోంది.

ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే గోవాలోనూ విధేయత అనేది వ్యాపార సరకుగా మారింది. పార్టీలో పైకి ఎదగలేకపోయినవారు, పార్టీ టికెట్లు పొందలేకపోయినవారు ఇతర పార్టీలకు తమ విధేయతను అమ్ముకోవడానికి రాజకీయ బజారులోకి వస్తారు. అక్కడ తమకు పనికొచ్చే నాయకులకోసం వేటను టీఎంసీ చాలా ముందు నుంచే మొదలుపెట్టింది. పూర్వం గోవా ముఖ్యమంత్రిగా, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేసిన లూయిజినో ఫలేరోతో మొదటి బేరం కుదరడం టీఎంసీని పరమానందభరితం చేసింది. ఫెలీరో రాజ్యసభ సీటును కోరారు. దానికి మమత వెంటనే అంగీకరించారు. గోవాలో తృణమూల్‌ కోట నిర్మాణానికి ఫలేరో మూల స్తంభంగా పనికొస్తారని దీదీ భావిస్తున్నారు. ఫలేరో తన నియోజకవర్గం నావెలిం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాట నిజమేకానీ, ఆయన బలం అక్కడికే పరిమితం. గోవా అంతటా ఆయనకు పలుకుబడి లేదు. ఆయనకు జన సమూహాలను ఆకర్షించే శక్తీ లేదు. గోవా ముఖ్యమంత్రిగా ఆయన చెప్పుకోదగిన విజయాలేమీ సాధించలేదు. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిలోనూ రాణించలేకపోయారు.

ఫలేరో తరవాత మరింతమంది ప్రముఖులకోసం తృణమూల్‌ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అన్వేషణ సాగించారు. అయితే, ప్రతి ఒక్క ప్రముఖుడూ తననే గోవా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని షరతు పెట్టడం పెద్ద చిక్కయింది. ఎవరైనా నాయకుడిని తృణమూల్‌ తరఫున గోవా సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే, మిగతా నాయకులు అలిగి దూరమయ్యే ప్రమాదం ఉంది. దాన్ని గ్రహించిన తృణమూల్‌- ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటించకుండానే ఎన్నికల బరిలో ముందుకెళ్తోంది. ముగ్గురు ఎమ్మెల్యేలను కలిగిన గోవా ఫార్వర్డ్‌ పార్టీ (జీఎఫ్‌పీ)ని తమ వైపు తిప్పుకోవడానికి టీఎంసీ నాయకులు అనేకసార్లు చర్చలు జరిపారు. తమ పార్టీని టీఎంసీలో విలీనం చేయాలన్న షరతుకు జీఎఫ్‌పీ నాయకుడు విజయ్‌ సర్దేశాయ్‌ ఒప్పుకోలేదు. రెండు పార్టీల పొత్తుతో ముందుకెళ్దామన్నారు. ఆయన అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి తృణమూల్‌ సుముఖంగా లేదు. చివరకు డిసెంబరు మూడో వారానికల్లా తృణమూల్‌ ఇద్దరు సీనియర్‌ నాయకులను ఆకట్టుకోగలిగింది. వారు- అలెక్సో రెజినాల్డో (కాంగ్రెస్‌), చర్చిల్‌ అలెమావో (ఎన్‌సీపీ). వారిద్దరికీ తమ నియోజకవర్గాల బయట బలం లేదు. ఫలేరో, రెజినాల్డో, అలెమావోలు ముగ్గురూ క్రైస్తవులు కావడం గోవాలో తృణమూల్‌కు బలమూ, బలహీనతగా సైతం పరిణమిస్తుంది. గోవాలో అత్యధికంగా ఉండే క్రైస్తవులు ఆదినుంచీ కాంగ్రెస్‌తోనే ఉన్నారు. రాష్ట్రంలో భాజపా బలం పెరగడంతో వారు కాంగ్రెస్‌కు మరింత దగ్గరయ్యారు. గోవాకు కొత్త పార్టీ అయిన టీఎంసీకి- తమకు అండగా నిలిచే సత్తా ఉందని వారికి నమ్మకం కలగడం లేదు. పైగా, దీదీ తన రాజకీయ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికే గోవా వచ్చారని అక్కడి క్రైస్తవులు భావిస్తున్నారు. దిల్లీలో అధికారం సాధించడానికి మమత గోవాను ఒక సోపానంగా వాడుకొంటున్నారని వారు భావిస్తున్నారు.

- అరుణ్‌ సిన్హా

Posted Date: 13-01-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం