• facebook
  • whatsapp
  • telegram

గెలుపుపై ఇరుపార్టీల ధీమా

మణిపుర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పైచేయి ఎవరిదో?

ఎన్నికలకు సిద్ధమవుతున్న ఈశాన్య రాష్ట్రాల్లోని మణిపుర్‌లో మొత్తం 60 శాసనసభ నియోజకవర్గాల్లో 19 గిరిజనులకు, దళితులకు ఒక్కటి రిజర్వయ్యాయి. మిగతా 40 జనరల్‌ స్థానాలు. కాంగ్రెస్‌ తరఫున హ్యాట్రిక్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఓక్రమ్‌ ఇబోబి సింగ్‌ను తోసిరాజని తొలిసారి భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్‌.బీరేన్‌ సింగ్‌ అభివృద్ధి మంత్రమే అజెండాగా మరోసారి బరిలోకి దిగుతున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీని ప్రధానంగా యువ నాయకత్వలేమి వేధిస్తోంది. మూడుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఇబోబి సింగ్‌పైనే ఆ పార్టీ ఆధార పడుతోంది. ఆయన వయసు 73 ఏళ్లు కావడంతో ప్రచార భారాన్ని పూర్తిగా తలకెత్తుకునే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు, కాంగ్రెస్‌ నేతల్లో చాలామందిని బీరేన్‌సింగ్‌ కమలం పార్టీలోకి లాగేసుకున్నారు. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయడానికి గట్టి అభ్యర్థులు లేకుండా పోయారు. వివాదాస్పద సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టానికి సంబంధించిన వివాదం జోలికి వెళ్లేందుకు ఏ పార్టీ సాహసించడం లేదు. తాము అధికారంలోకి రాగానే మొదటి మంత్రివర్గ సమావేశంలోనే ఆ చట్టం అమలు అవసరం లేదని ప్రకటిస్తామని కాంగ్రెస్‌ చెబుతున్నా, నిజానికి రాష్ట్రంలో ఆ చట్టం అమలులోకి వచ్చింది ఆ పార్టీ హయాంలోనే. ఆ చట్టాన్ని రద్దు చేయాలంటూ 16 ఏళ్లు నిరాహార దీక్ష చేపట్టిన ఇరోం షర్మిలా చాను 2016లో దీక్ష విరమించి, 2017 ఎన్నికల్లో పోటీ చేయగా, కేవలం 90 ఓట్లు మాత్రమే దక్కడం గమనార్హం.

 

ఇబోబి సింగ్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 28 స్థానాలు సాధించింది. 60 మంది సభ్యులుండే అక్కడి శాసనసభలో మరొక్క ముగ్గురి మద్దతు పొందితే సులభంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేవారు. కానీ కాంగ్రెస్‌ నాయకత్వం స్పందించడం ఆలస్యమైంది. 21 స్థానాలే సాధించిన భాజపా ఈలోపే చకచకా పావులు కదిపి, స్థానిక పార్టీల మద్దతు కూడగట్టింది. ఒక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేను ఆకర్షించడంతో పాటు, నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ, లోక్‌జనశక్తి పార్టీల మద్దతుతో అధికారాన్ని చేపట్టి, దిగ్విజయంగా అయిదేళ్లూ పూర్తి చేసుకుంది. నేషనల్‌ పీపుల్స్‌ పార్టీలో నలుగురు ఎమ్మెల్యేలుండగా నలుగురికీ మంత్రిపదవులు దక్కాయి. నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌లోని నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు మంత్రులయ్యారు. లోక్‌జనశక్తి పార్టీ నుంచి గెలిచిన ఒక్కరికీ పదవి దక్కింది. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన ఎమ్మెల్యేనూ మంత్రిగా చేసినా, సుప్రీంకోర్టు అనర్హత వేటు వేయడంతో ఆయన పదవి పోయింది. మణిపుర్‌లో ముఖ్యమంత్రి సహా 12 మంది మంత్రులే ఉండాలి. ఇతర పార్టీల వారే ఎనిమిది మంది ఉండటంతో భాజపాకు మూడు పదవులే మిగిలాయి. భాజపా ఎమ్మెల్యేలలో చాలామంది కొత్తవారే కావడంతో వారు పదవుల కోసం అంతగా పోటీ పడకపోవడం కలిసివచ్చింది.

 

ఈసారి ఎన్నికల బరిలో దిగుతున్న కొత్తవారిలో చాలామంది ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌ల టికెట్లు కాకుండా, ఎన్నికల తరవాత కింగ్‌మేకర్లుగా మారడానికి అవకాశమున్న చిన్నపార్టీల నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు! దీనివల్ల ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమకు మంత్రిపదవి దక్కడమో, భారీ మొత్తాలు చేజిక్కడమో ఖాయమన్నది వారి ధీమాగా విదితమవుతోంది. పెద్ద పార్టీల నుంచి బరిలోకి దిగడానికి తీవ్రమైన పోటీని తట్టుకోవాల్సి రావడమూ వీరిని చిన్న పార్టీలవైపు నడిపిస్తోంది. మరోవైపు, ఎన్నికల తరవాత ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాకపోతే ఇలాంటి వారికి డిమాండు పెరిగే అవకాశాలు అధికంగా ఉండటమూ ముఖ్యమైన కారణమే. మణిపుర్‌ లాంటి రాష్ట్రాల్లో నియోజకవర్గాల వారీగా ఓటర్ల సంఖ్య తక్కువ. కొన్నిచోట్ల ఓట్లు వేయడానికి ప్రజలు 15-20 కిలోమీటర్ల వరకు నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. దానివల్ల పోలింగ్‌ శాతం తక్కువగానే నమోదవుతుంది. దీనివల్ల వెయ్యి ఓట్లు అటూఇటూ అయితే ఫలితం తారుమారవుతుంది. గత ఎన్నికల్లో రాష్ట్రంలోని 18 నియోజక వర్గాల్లో ఇలా వెయ్యిలోపు ఓట్ల తేడాతో పలువురు గెలిచారు. అందుకని, తుది ఫలితాలను ఊహించడం కష్టమే. మణిపుర్‌లో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, తమకు స్పష్టమైన ఆధిక్యం ఖాయమని ఇటు భాజపా, అటు కాంగ్రెస్‌ పార్టీ రెండూ నమ్మకంగా చెబుతున్నాయి. కానీ, ప్రస్తుత పరిస్థితులను చూస్తే అందుకు అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

 

- కామేశ్వరరావు

Posted Date: 17-01-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం