• facebook
  • whatsapp
  • telegram

ఎన్నికల గోదాలో గెలిచేదెవరో?

ఆసక్తికరంగా పంజాబ్‌ రాజకీయాలు

 

 

పంజాబ్‌లో ప్రాబల్య జాట్‌ సిక్కు వర్గానికి చెందిన కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి- దళిత సిక్కు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీని గద్దెనెక్కించడం ద్వారా కాంగ్రెస్‌ అందరినీ ఆశ్చర్యపరచింది. ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి ఒక దళితుడిని వరించడం ఇదే ప్రథమం. పంజాబ్‌ జనాభాలో దళితులు 32శాతం మేర ఉన్నా... వారు రెండు శాతం భూములకు మాత్రమే యజమానులు. గ్రామాల్లోనైతే కేవలం 0.72శాతం వ్యవసాయ భూములకే దళితులు హక్కుదారులు. వారు జాట్‌ సిక్కు భూస్వాములు, రైతుల పొలాల్లో కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. పంజాబ్‌ శాసనసభలోని మొత్తం 117 సీట్లలో 34 స్థానాలను దళితులకు కేటాయించారు. 54 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళిత ఓటర్లు 30శాతానికిపైనే ఉంటారు. 45 స్థానాల్లో వారు 20-30శాతం చొప్పున ఉన్నారు. పంజాబ్‌లోని దళితుల్లో 61శాతం దళిత సిక్కులైతే, 39శాతం దళిత హిందువులు. పంజాబీ దళితులు మజహబీ సిక్కులు, రవిదాసియా, రాందాసియా, ఆది ధర్మీ, వాల్మీకి తెగలుగా విడిపోయి ఉన్నందువల్ల రాజకీయంగా సంఘటితం కాలేకపోయారు. ఈ పరిస్థితిలో చన్నీని ముఖ్యమంత్రిని చేయడం- దళిత సిక్కులు రాజకీయాధికారం చేపట్టడానికి తోడ్పడదనే ప్రచారం గట్టిగా వినవస్తోంది.

 

హస్తానికి సవాళ్లెన్నో...

భూ గరిష్ఠ పరిమితి చట్టం అమలుకు మొదట్లో హడావుడి చేసిన చన్నీ తరవాత చప్పబడిపోవడం దళితుల ఆశలపై నీళ్లు చల్లింది. మరోవైపు దళితుల ఆదరణను చూరగొనడంలో ముందున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి గట్టి పోటీ నెలకొంది. పంజాబ్‌ దళితుల్లో 20శాతందాకా ఆమ్‌ ఆద్మీని సమర్థిస్తున్నారు. ఆమ్‌ఆద్మీ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 24శాతం ఓట్లు సాధించి 20 సీట్లు గెలుచుకొని రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఈసారి తమను ఎన్నుకుంటే 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌, మహిళలకు వెయ్యి రూపాయల నెలవారీ భృతి ఇస్తామని ఆ పార్టీ వాగ్దానం చేసింది. ఆప్‌ను ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌ దళిత సీఎం చన్నీ- తానే అసలు సిసలు పంజాబీ ఆమ్‌ ఆద్మీ (సామాన్య మానవుడి)నని ప్రచారం చేసుకొంటున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి విజయం నల్లేరుమీద బండి నడక కాబోదు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు 20 మందిలో తొమ్మండుగురు 2017 ఎన్నికల తరవాత పార్టీ నుంచి నిష్క్రమించారు. పంజాబ్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు భగవంత్‌ మాన్‌ తనను పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకపోవడంపట్ల గుర్రుగా ఉన్నారు. ఇక కాంగ్రెస్‌ దళిత ముఖ్యమంత్రి చన్నీకి గత నాలుగున్నరేళ్ల అమరీందర్‌ సింగ్‌ పాలనలో పెరిగిన ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడమెలాగన్నదీ గడ్డు సవాలుగా మారింది. 2017నాటి ఎన్నికల హామీలను నెరవేర్చకపోవడం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల గెలుపు అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇది చాలదన్నట్లు పంజాబ్‌ కాంగ్రెస్‌ శాఖ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ, ఉప ముఖ్యమంత్రి సుఖ్‌జిందర్‌ల కీచులాటలు పార్టీకి చేటు కలిగిస్తున్నాయి. ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశిస్తున్న సిద్ధూ అటు సుఖ్‌జిందర్‌పై, ఇటు ముఖ్యమంత్రి చన్నీపై విమర్శలు చేయడం పార్టీకి నష్టం చేస్తోంది.

 

హిందూ ఓటర్లు కీలకం

రాష్ట్ర జనాభాలో 38శాతంగా ఉన్న హిందువులను ఆకట్టుకోవడంలో కేజ్రీవాల్‌ కన్నా చన్నీయే ముందున్నారు. పంజాబ్‌ పట్టణాల్లో జయాపజయాలను నిర్ణయించే సత్తా హిందువులకు ఉంది. వారు మొదటినుంచీ కాంగ్రెస్‌ మద్దతుదారులే. ఈసారి చన్నీ రాష్ట్రంలోని ప్రసిద్ధ హిందూ దేవాలయాలన్నింటినీ సందర్శిస్తూ హిందూ ఓటర్లను ఆకట్టుకోవడానికి కృషి చేస్తున్నారు. పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌, పాక్‌ సైన్యాధిపతి కమర్‌ జావేద్‌ బాజ్వా పట్ల సిద్ధూ స్నేహపూర్వక వైఖరి అవలంబించడం, పాక్‌తో వాణిజ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండు చేయడం పంజాబీ హిందువులకు గిట్టడం లేదు. ఆమ్‌ ఆద్మీ అధినేత కేజ్రీవాల్‌ పంజాబ్‌ జనాభాలో 58శాతం ఉన్న సిక్కులను దూరం చేసుకోకూడదని హిందూ దేవాలయ యాత్రలకు దూరంగా ఉంటున్నారు. మూడు వ్యవసాయ చట్టాలపై సందిగ్ధ వైఖరిని అనుసరించడం ద్వారా సిక్కు రైతుల ఆదరణను కోల్పోయిన శిరోమణి అకాలీదళ్‌- హిందూ ఓటర్ల అభిమానం చూరగొనడానికి ప్రయత్నిస్తున్నా, అది ఫలించే సూచనలు కనిపించడం లేదు. వ్యవసాయ చట్టాలపై, పాకిస్థాన్‌మీదా కఠిన వైఖరిని అవలంబించడం ద్వారా మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ పంజాబీ హిందువులు, సిక్కు రైతుల ఆదరణను చూరగొన్నారు. అధిష్ఠానంతో విభేదాలవల్ల ఆయన కాంగ్రెస్‌ నుంచి నిష్క్రమించి సొంతంగా పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించారు. భారతీయ జనతా పార్టీతో, అకాలీ దళ్‌ చీలిక వర్గంతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో తలపడుతున్నారు. ఏతావతా పంజాబ్‌లో కాంగ్రెస్‌ విజయావకాశాలను అమరీందర్‌ పార్టీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ అవకాశాలను అకాలీదళ్‌ ఏ మేరకు దెబ్బతీస్తాయి అనేదానిపైనే ఎన్నికల ఫలితాలు ప్రధానంగా ఆధారపడి ఉంటాయి.

 

- రాజీవ్‌ రాజన్‌

Posted Date: 17-01-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం