• facebook
  • whatsapp
  • telegram

విజయ పరంపర కొనసాగుతుందా?

విస్తరిస్తున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ

కుల, మత, వర్గ, ప్రాంత, భాషలకు అతీతమైన అవినీతి నిరోధకమనే సార్వజనీన లక్ష్యం ప్రాతిపదికగా ఏర్పాటైన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) తరాల అంతరాన్ని, కాలానుగుణ మార్పులను ఒడిసిపడుతూ ముందుకు సాగుతోంది. కొత్త తరం ఓటర్లను ఆకట్టుకోవడంలో, పాలనపై సమర్థ ముద్ర వేయడంలో విఫలమవుతున్న ప్రాంతీయ పార్టీలకు భిన్నంగా, ఇటీవలి పంజాబ్‌ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా రెండోరాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే దేశ రాజధానిలో మూడో విడత అధికారాన్ని సాధించిన ఆప్‌ వైపు ఇతర రాష్ట్రాల ఓటర్లూ ఆసక్తి ప్రదర్శిస్తున్నారనేందుకు ఈ విజయం తార్కాణంగా నిలిచింది. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలకు కట్టుబడటం, సంక్షేమంతో పాటు అభివృద్ధికీ పెద్దపీట వేయడం, ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడం వంటి అంశాల ఆధారంగా ఆమ్‌ఆద్మీ వైపు పంజాబ్‌ ఓటర్లు మొగ్గు చూపారనే విశ్లేషణలున్నాయి. పంజాబ్‌ శాసనసభ ఎన్నికల్లో 42 శాతం ఓట్లను కైవసం చేసుకున్న ఆమ్‌ఆద్మీని యువ ఓటర్లు బాగా ఆదరించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులు, దిగువ మధ్యతరగతి ప్రజానీకం ఆ పార్టీకి అండగా నిలిచారు.

పాలనలో ప్రత్యేకత  

దేశంలో పెచ్చరిల్లుతున్న అవినీతిని నిర్మూలించడానికి జన్‌ లోక్‌పాల్‌ బిల్లును తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ 2011లో అన్నాహజారే, కిరణ్‌బేడీ తదితరులతో పాటు అవినీతి వ్యతిరేక ఉద్యమంలో మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి అరవింద్‌ కేజ్రీవాల్‌ పాలుపంచుకున్నారు. జన్‌ లోక్‌పాల్‌ బిల్లును సాధించడానికి రాజకీయ ఉద్యమం అవసరమని భావించి, 2012లో ఆమ్‌ఆద్మీ పార్టీని ఏర్పాటు చేశారు. 70 స్థానాలున్న దిల్లీ శాసనసభకు 2013లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకీ ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడినంత ఆధిక్యం రాకపోవడంతో 28 స్థానాలు పొందిన కేజ్రీవాల్‌, కాంగ్రెస్‌ పార్టీ సహకారంతో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తమ పార్టీ ఆవిర్భావ లక్ష్యాల్లో కీలకమైన జన్‌ లోక్‌పాల్‌ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి, తగినంత సంఖ్యాబలం లేక దానికి ఆమోదం పొందలేకపోయారు. ఫలితంగా 49 రోజులకే అధికారం నుంచి వైదొలగాల్సి వచ్చింది. 2015లో జరిగిన దిల్లీ శాసనసభ ఎన్నికల్లో 67 స్థానాల్లో ఘన విజయం సాధించారు. అనంతరం 2020లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 62 స్థానాలతో మళ్లీ అధికారం చేజిక్కించుకున్నారు. దాదాపు ఏడేళ్ల పాలనలో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనలో ఆప్‌ తనదైన ముద్రవేసింది. ప్రభుత్వ విద్యాలయాల్లో స్మార్టు తరగతి గదులు, గ్రంథాలయం, ఈతకొలను, ప్రయోగశాలల వంటి సదుపాయాలను కల్పించడంతో పాటు ఆన్‌లైన్‌ బోధన కోసం ఉచితంగా ఉపకరణాలను పంపిణీ చేసింది. బోధన రుసుములపై ప్రైవేట్‌ విద్యాసంస్థలను కట్టడి చేసినట్లు తెలుస్తోంది. 200 యూనిట్ల వరకు గృహ వినియోగ విద్యుత్తు ఉచితంగా, 201 నుంచి 400 యూనిట్ల వరకు 50 శాతం రాయితీ కల్పించింది. ప్రతి కుటుంబానికి నెలకు 20 వేల లీటర్ల తాగునీరు ఉచితం. మూడంచెల వైద్య వ్యవస్థలో భాగంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసిన మొహల్లా క్లినిక్‌లలో ఇప్పటి వరకు 20 లక్షల మంది లబ్ధి పొందినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దిల్లీ రవాణా సంస్థ పరిధిలోని బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సదుపాయం కల్పించారు. ఇందుకు కేవలం రూ.10 విలువ చేసే గులాబీ టిక్కెట్లను ప్రవేశపెట్టారు. 20 వేల మందికి మురికివాడల నుంచి విముక్తి కల్పించారు. 318 కాలనీలను పైపులైన్లతో అనుసంధానించారు. చేసిన వాగ్దానాలు, మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాల అమలుకు కృషి చేయడమే కేజ్రీవాల్‌ ప్రభుత్వ విజయంలో కీలకమని చెబుతున్నారు. ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్‌) నివేదిక ప్రకారం- ఆమ్‌ ఆద్మీ పార్టీ విరాళాల్లో 92 శాతం చెక్కులు, ఎలెక్ట్రానిక్‌ విధానాల్లో వచ్చినవే. మిగిలిన ఎనిమిది శాతం నిధులూ బ్యాంకుల్లో డిపాజిట్‌ అయినవే. దేశంలో అత్యధిక రాజకీయ పక్షాలు తమ విరాళాల్లో 60 శాతానికి పైగా గుర్తుతెలియని మూలాల నుంచి నగదు రూపంలో పొందినవిగానే చూపిస్తున్నాయి.

రాజకీయ ఆశలు

దేశ రాజధాని దిల్లీలో కీలకమైన శాంతిభద్రతలు కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధిలో ఉంటాయి. ఫలితంగా అక్కడి ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించడానికి అవకాశం అధికం. దాన్ని ఆప్‌ ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంది. ఇదేతరహా సానుకూల ప్రభావాన్ని పంజాబ్‌లో సాధించగలదా అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకం. ఆ రాష్ట్ర రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు దేశ రాజధానితో పోలిస్తే విభిన్నంగా ఉంటాయి. దిల్లీలో అమలు చేసిన పథకాలన్నీ పంజాబ్‌లోనూ కొనసాగించినా ఫలితాలు ఎలా ఉంటాయన్నది వేచిచూడాల్సిందే. ఈ ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీకి ఆప్‌ సమాయత్తమవుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో జతకట్టిన ఆప్‌, గుజరాత్‌లో భాజపాకు వ్యతిరేకంగా కూటమి కట్టే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల ఫలితాలు ఆప్‌ జాతీయ రాజకీయ ఆశలపై ప్రభావం చూపే అవకాశముంది. అక్కడ సానుకూల విజయం వరించినా, ఇప్పటికే భాజపా, కాంగ్రెసేతర కూటమి యత్నాల్లో ఉన్న ఇతర పార్టీల నేతలు కేజ్రీవాల్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించేందుకు మొగ్గు చూపుతారా అన్నది ప్రశ్నార్థకమే. సొంత రాష్ట్రాల్లో ఎన్నిసార్లు అధికారం దక్కించుకున్నా, రెండో రాష్ట్రంలో విజయం సాధించలేని ప్రాంతీయ పార్టీలకంటే భిన్నమైన ప్రగతిని చూపిన ఆమ్‌ ఆద్మీ పార్టీ మరింతగా విస్తరించి జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తుందా అనేది కాలమే చెప్పాలి.

ప్రశంసల వెంటే విమర్శలూ...

ఆమ్‌ఆద్మీ పార్టీపై ప్రశంసలతోపాటు విమర్శలూ ఉన్నాయి. కేజ్రీవాల్‌ ఏకపక్షంగా, నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ పార్టీ వ్యవస్థాపకుల్లో కీలకమైన యోగేంద్ర యాదవ్‌, ప్రశాంత్‌ భూషణ్ బయటకు వెళ్లిపోయారు. పార్టీ నాయకులను కాదని, తన మిత్రుడైన వ్యాపారి సుశీల్‌ గుప్తాను రాజ్యసభకు పంపించడంపై కేజ్రీవాల్‌ ఆరోపణలు ఎదుర్కొన్నారు. నిర్ణయాధికారాన్ని తన గుప్పిట్లోనే పెట్టుకొని, వ్యక్తి పూజను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు పెరిగాయి. పంజాబ్‌ ఎన్నికల్లో నెగ్గిన భగవంత్‌సింగ్‌ మాన్‌ తన ప్రమాణ స్వీకారం సందర్భంగా కేజ్రీవాల్‌కు పాదాభివందనం చేయడం ఇలాంటి ఆరోపణలకు బలం చేకూర్చింది. ప్రజాపాలనలో విశ్వసనీయతను, నిబద్ధతను చాటుకుంటే రాజకీయ విస్తరణ అసాధ్యం కాదని నిరూపించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ సైతం ఇటువంటి విమర్శలు, ఆరోపణలకు తావిస్తోంది.

- ఎం.కృష్ణారావ్‌

 

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 28-03-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం