• facebook
  • whatsapp
  • telegram

చింతన నాస్తి... చేతలు శూన్యం

కాంగ్రెస్‌ సంస్కరణ మాటలకే పరిమితం

 

 

కాంగ్రెస్‌ చింతన్‌ శిబిరాల్లో ఆర్భాటం జాస్తి ఆచరణ నాస్తి అన్నది ఎప్పటి నుంచో వినిపిస్తున్న విమర్శ. నూతన ఆరంభం, దృఢ సంకల్పం, కొత్త మార్పు అంటూ పటాటోప ప్రసంగాలు రివాజుగా సాగిపోతాయి. చివరకు పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక అంటూ ఏదీ రూపుదిద్దుకోదు. దాన్ని నెరవేర్చాలన్న నిబద్ధతా కనబడదు. రాజస్థాన్‌లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమే కాబట్టి తాజా ఉదయ్‌పుర్‌లో జరిగిన నవసంకల్ప చింతన శిబిరంలోనూ కోలాహలానికి ఏమాత్రం కొదవ లేదు. చింతన్‌ శిబిరంలో ఎవరేం మాట్లాడాలి, ఏయే తీర్మానాలు చేయాలన్నది అంతా సోనియా కుటుంబ కనుసన్నల్లోనే జరిగిపోయింది. ఏది ఏమైనా కాంగ్రెస్‌ పాలక కుటుంబం తీరు మారదు, దాని స్థానంలో కొత్త నాయకత్వమూ అవతరించదని ఈ శిబిరం మరోసారి రుజువు చేసింది.

 

పాత పద్ధతులు

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తుడిచిపెట్టుకు పోవడంతో తమకు బుద్ధి వచ్చిందన్నట్లుగా గాంధీ-నెహ్రూ వంశీయులు ప్రవర్తించారు. పార్టీ పునరుద్ధరణకు విస్తృత చర్యలు తీసుకోవడానికి సిద్ధమన్నట్లు సంకేతాలిచ్చారు. దానికి ఒక ప్రణాళికను రచించడానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ను రంగంలోకి దించుతున్నట్లు టీవీ ఛానళ్లలో, పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో ఊదరగొట్టారు. పార్టీలోకి కొత్త రక్తం ఎక్కించాలని ప్రశాంత్‌ కిశోర్‌ సిఫార్సు చేశారు. సైద్ధాంతికంగా తనదైన విలక్షణ పంథా అనుసరించాలని, ప్రజల్లోకి సరైన సందేశాలను పంపాలనీ సూచించారు. ఈ కొత్త అజెండా గురించి వారం రోజులపాటు అధిష్ఠానానికి నివేదించారు. మరి నిజంగానే పార్టీని సంస్కరించి బలోపేతం చేయాలన్న లక్ష్యశుద్ధి అధిష్ఠానానికి ఉన్నదా అన్నది అసలు ప్రశ్న. దానికి త్వరగానే జవాబు దొరికింది. ప్రశాంత్‌ కిశోర్‌ ప్రణాళిక సమర్పణ ఇంకా పూర్తికావాల్సి ఉండగానే, రాహుల్‌ గాంధీ విశ్రాంతి కోసమంటూ విదేశాలకు వెళ్ళిపోయారు. ఆయన సోదరి ప్రియాంక అమెరికా విమానమెక్కారు. పార్టీలో అంతర్గత తిరుగుబాటు ముప్పు తప్పిపోయిందనే ఊరటతో వారు విదేశీ విహార యాత్రలు చేపట్టారు. మార్పునకు తలుపులు మూసేసి పాత పద్ధతుల రొంపిలో మళ్ళీ కూరుకుపోయారు.

 

ఇతరత్రా మంచి అవకాశాల్లేక కాంగ్రెస్‌లో మిగిలిపోయినవారే ఉదయ్‌పుర్‌ చింతన శిబిరంలో పాల్గొన్నారు. పార్టీకి మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయని వారిని నమ్మించడానికి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి దిద్దుబాటు చర్యలు తీసుకోబోతున్నామని భ్రమ కల్పించారు. శిబిరం ప్రారంభమైన రోజు సోనియా గాంధీ ముందే సిద్ధం చేసిన లిఖిత ప్రసంగ ప్రతిని చదివారు. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని దించడానికి సిద్ధం కావాలని కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ఆత్మ చింతన (ఆత్మావలోకనం) చేసుకోవాల్సి ఉందన్నారు. ఈ మాటలు నిజమేనేమోనని కొందరు కాంగ్రెస్‌ వాదులు నమ్మారు. ఆత్మ విమర్శ చేసుకొని కాంగ్రెస్‌ పునరుత్తేజితం అవుతుందని ఆశించారు. అది వట్టి అడియాసేనని కపిల్‌ సిబ్బల్‌ ఉదంతం చూస్తే తెలుస్తుంది. కపిల్‌ ప్రేరణతోనే 23 మంది సీనియర్‌ నేతలు కాంగ్రెస్‌లో సమూల మార్పులకు పిలుపిచ్చారు. అలాంటి వ్యక్తిని ఉదయ్‌పుర్‌ శిబిరానికి ఆహ్వానించక పోవడాన్ని బట్టి మార్పు పట్ల అధిష్ఠానం వైఖరేమిటో స్పష్టమవుతోంది. పార్టీ మేలు, భవిష్యత్తు కోసం చేసే సద్విమర్శలను సైతం సోనియా కుటుంబం సహించదని తేలిపోయింది. మార్పును కోరేవారిని శంకరగిరి మాన్యాలు పట్టిస్తామని అధిష్ఠానం సందేశం పంపించినట్లే అర్థమవుతోంది. ఇందిరే ఇండియా, ఇండియానే ఇందిర అని గతంలో కాంగ్రెస్‌ నాయకుడు డి.కె.బారువా పొగిడారు. ఇప్పుడు సోనియా కుటుంబమే కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ అంటే సోనియా కుటుంబమే అనుకోవాలన్నట్లుగా పరిస్థితి ఉంది. అలాంటప్పుడు పార్టీలో సంస్కరణలు రావాలని సోనియా పిలుపివ్వడం హాస్యాస్పదమే. సోనియా తన పుత్ర ప్రేమను వదిలి కొత్త నాయకత్వం వేళ్లూనుకోవడానికి అనుమతించడమే హస్తం పార్టీలో ప్రధానంగా చోటుచేసుకోవాల్సిన సంస్కరణ. ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్న పరిస్థితుల్లో ప్రైవేటు విభాగంలోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్ల అమలుకు డిమాండు చేయాలని శిబిరంలో నిర్ణయించారు. అయిదు దశాబ్దాలపాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్‌- బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ఏమి చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

 

పెత్తనం తగ్గాల్సిందే

రాహుల్‌ ఇప్పటికే కాంగ్రెస్‌కు అనధికార అధినేత అయినా, ఆయన లాంఛనంగా పార్టీ పగ్గాలను చేపట్టాలని ఉదయ్‌పుర్‌లో ఒక వర్గం నినదించింది. దాన్ని అధికారికంగా జరిపించడానికి కొన్ని నెలల తరవాత సంస్థాగత ఎన్నికలు నిర్వహించవచ్చు. ఆ ఎన్నికల్లో రాహుల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నిక కావచ్చు. దానివల్ల పార్టీ దశ, దిశ మారతాయని విధేయులు ఊదరగొట్టవచ్చు. వాస్తవంలో అలా జరుగుతుందా అన్నది కీలక ప్రశ్న. సోనియా కుటుంబాన్ని వీటిపై ప్రశ్నించేవారెవరూ ఉండరు. కళ్లెదుట కనిపించే వాస్తవాలను గుర్తెరిగి నడుచుకోవడం కాంగ్రెస్‌ పాలక కుటుంబానికి చేతకాదని ఇప్పటికే పలుమార్లు నిరూపితమైంది. మార్పులకు అనుగుణంగా తమనుతాము మలచుకోగలవారే మనుగడ సాగిస్తారు. ఈ పాఠాన్ని సోనియా కుటుంబం ఒంటపట్టించుకోవడం లేదు. 2024 ఎన్నికల్లో గెలవడానికి అవసరమైన వ్యూహాన్ని రూపొందించుకోవడం లేదు. తాజాగా దేశవ్యాప్త పాదయాత్రలకు ఉదయ్‌పుర్‌ శిబిరంలో కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం పిలుపిచ్చింది. వాస్తవానికి పార్టీ పునర్‌ వైభవం సాధించాలంటే, దానిపై పాలక కుటుంబ పెత్తనం తగ్గాలి. కొత్త రక్తంతో అది జవజీవాలు సంతరించుకోవాలి.

 

ప్రాంతీయ పార్టీలకు దూరం

భారతీయ జనతా పార్టీ వ్యతిరేక ఓట్లలో చీలికను నివారించడానికి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవాలని ప్రశాంత్‌ కిశోర్‌ సూచించారు. కానీ భాజపాను, బలమైన ప్రాంతీయ పార్టీలను ఒంటి చేత్తో ఎదుర్కొని తాను అధికారంలోకి రాగలననే భ్రమలో కాంగ్రెస్‌ పార్టీ ఉంది. ప్రశాంత్‌ కిశోర్‌ వాస్తవిక దృష్టితో చేసిన సూచనను హస్తం పార్టీ పెడచెవిన పెట్టేలా కనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ జూనియర్‌ భాగస్వామిగా మసలుకోవాలని కిశోర్‌ సూచించారు. దానివల్ల హస్తం పార్టీ మనుగడను నిలుపుకొని, భాజపాను ఓడించే అవకాశాలు పెరుగుతాయన్నారు. ఆ సూత్రాన్ని రాహుల్‌ గాంధీ ఒంటపట్టించుకోలేదనే చెప్పాలి. అందుకే ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీకీ మెజారిటీ దక్కకపోతే, టీఆర్‌ఎస్‌ వంటి ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పటి నుంచే ప్రాంతీయ పార్టీలను దూరం చేసుకుంటే, తరవాత అవసరం వచ్చినప్పుడు వాటి సహకారం అందకుండా పోతుంది.

 

 

 


 

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 17-05-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం