• facebook
  • whatsapp
  • telegram

కశ్మీరంలో ఎన్నికల సన్నాహాలు

బ్యాలట్‌ పోరుకు ఈసీ కసరత్తు

కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది చివరికి ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సూచనప్రాయంగా వెల్లడించారు. జస్టిస్‌ రంజనాప్రకాశ్‌ దేశాయ్‌ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల నియోజకవర్గాల పునర్విభజన కమిటీ నివేదికా మే 20 నుంచి అమలులోకి వచ్చింది. అంతకుముందు జమ్ము, కశ్మీర్‌ ప్రాంతాల్లో కలిపి 83 స్థానాలు ఉన్నాయి. కొత్తగా ఏడు స్థానాలను ఏర్పాటు చేయడంతో అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 90కి చేరుకుంది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పిస్తున్న 370 అధికరణను కేంద్రం రద్దు చేయడంతో పాటు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లుగా విభజించింది. దీనిపై విపక్షాలు ఆందోళనలు నిర్వహించినా కొంతకాలానికి సద్దుమణిగాయి. కశ్మీర్‌ అంశంలో కేంద్రం దృఢవైఖరి అవలంబిస్తోంది. పాక్‌ ఎగదోస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని రూపుమాపాలంటే పటిష్ఠమైన భద్రతా యంత్రాంగంతో పాటు స్థానికంగా అనుకూలమైన వాతావరణం ఉండాలి. ఈ మేరకు కేంద్రం పలు చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగుపడుతున్న తరుణంలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది.

నియోజకవర్గాల పునర్విభజనపై మొదట్లో అసమ్మతి స్వరాలు వినిపించినా కేంద్రం చొరవతో సద్దుమణిగాయి. జమ్ము ప్రాంతంలో కొత్తగా ఆరుసీట్లను పెంచడంతో అక్కడ సీట్ల సంఖ్య 43కు చేరుకుంది. కశ్మీర్‌ లోయలో ఒక సీటునే పెంచడంతో స్థానాల సంఖ్య 47గా మారింది. మొత్తంగా 90 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలిసారిగా తొమ్మిది సీట్లను ఆదివాసులకు రిజర్వ్‌ చేశారు. కొన్ని నియోజకవర్గాల సరిహద్దులూ మారాయి. లోక్‌సభ స్థానాల్లోనూ పలుమార్పులు చేపట్టారు. 1994-95లో చివరిసారిగా నియోజక వర్గాల విభజన చేశారు. అప్పట్లో మొత్తం 111 స్థానాలు ఉండేవి. జమ్ము, కశ్మీర్‌, లద్దాఖ్‌లకు సంబంధించి 87 స్థానాలకే ఎన్నికలు నిర్వహించేవారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌కు సంబంధించి 24 స్థానాలను ప్రత్యేకంగా కేటాయించారు. 2019లో రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడంతో లద్దాఖ్‌కు సంబంధించి లోక్‌సభ స్థానంతో పాటు నాలుగు అసెంబ్లీ సీట్లూ తగ్గాయి. ఫలితంగా జమ్మూకశ్మీర్‌ సీట్ల సంఖ్య 87 నుంచి 83కు పడిపోయింది. పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా ఏడింటిని చేర్చడంతో తిరిగి 90కి చేరుకుంది. ఇప్పటిదాకా కశ్మీర్‌లోయకు చెందిన వారే రాష్ట్ర పగ్గాలు చేపట్టేవారు. తాజా పరిణామాలతో అధికారం ఏ ప్రాంతానికి దక్కుతుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. కశ్మీర్‌ పండిట్ల వర్గం నుంచి ఇద్దరు నామినేటెడ్‌ సభ్యులు ఉండాలని కమిషన్‌ సూచించింది. కేంద్రం సైతం ఎన్నికలకు మొగ్గు చూపడంతో ఎన్నికల సంఘం(ఈసీ) సన్నాహాలు ప్రారంభించింది. అన్నీ అనుకూలిస్తే అక్టోబరుకల్లా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఈసీ ఆశిస్తోంది.

రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే భాజపా-నేషనల్‌ కాన్ఫరెన్స్‌(ఎన్‌సీ), పీడీపీ తదితర పార్టీలతో కూడిన గుప్కార్‌ కూటమి మధ్యే పోటీ ఉండనుంది. గతంలో రాష్ట్రంగా ఉన్న సమయంలో నిర్వహించిన ఎన్నికల్లో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడింది. పీడీపీ ఎక్కువ సీట్లు సాధించినా మెజారిటీ మార్కు అందుకోలేకపోయింది. భాజపా మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. 2018లో భాజపా మద్దతు ఉపసంహరించుకోవడంతో సీఎంగా ఉన్న మెహబూబా ముఫ్తీ రాజీనామా చేశారు. తదనంతరం గవర్నర్‌ పాలనలో పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కశ్మీర్‌లో ప్రశాంత పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఇటీవల పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు మైనారిటీలైన కశ్మీరీ పండితులపై దాడులు చేయడంతో భయానక వాతావరణం నెలకొంది. ఇతర రాష్ట్రాల కూలీలపై దాడులు జరుగుతున్నాయి. భద్రతాదళాలు దీటుగా స్పందిస్తున్నా, ఉగ్రదాడులు ఆగడం లేదు. నియోజకవర్గాల పునర్విభజనపై పీడీపీ, ఎన్‌సీ తొలుత అభ్యంతరం వ్యక్తం చేసినా కశ్మీర్‌ లోయలోనే ఎక్కువ స్థానాలు ఉండటంతో ఎన్నికల్లో పాల్గొనేందుకు సుముఖంగా ఉన్నట్లు విదితమవుతోంది. ప్రధాని మోదీ ఇప్పటికే పలు అంశాలపై జమ్మూకశ్మీర్‌ రాజకీయ పక్షాలతో చర్చించిన సంగతి తెలిసిందే. 2020లో జరిగిన జిల్లా అభివృద్ధి మండళ్ల ఎన్నికల్లో గుప్కార్‌ కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకోగా, జమ్ములో అతిపెద్ద పార్టీగా భాజపా అవతరించింది. ఆ ఫలితాలను విశ్లేషిస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గుప్కార్‌ కూటమి-భాజపా మధ్యే హోరాహోరీ పోటీ నెలకొనే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఒకవేళ, కూటమిలోని ప్రధాన రాజకీయ పక్షాలైన పీడీపీ, ఎన్‌సీ మధ్య విభేదాలు చోటుచేసుకుంటే- భాజపా ఆధిక్యం ప్రదర్శించే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

 

- కె.శ్రీధర్‌
 

Posted Date: 30-06-2022



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

రాజకీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం