• facebook
  • whatsapp
  • telegram

బుల్లి విహంగాలకు కొత్త రెక్కలు

దేశంలో ఊపందుకుంటున్న డ్రోన్ల పరిశ్రమ

మనుషులు లేకుండానే స్వయంగా ఎగిరే డ్రోన్ల సాంకేతిక నామం యూఏవీ (అన్‌మ్యాన్డ్‌ ఏరియల్‌ వెహికల్‌). నేడు డ్రోన్లు యుద్ధ రంగాన్నే కాకుండా పౌర జీవితాన్నీ మార్చేస్తున్నాయి. 2020-21లో భారత్‌లో రూ.60 కోట్లుగా ఉన్న డ్రోన్‌ మార్కెట్‌ 2023-24కల్లా రూ.900 కోట్లకు పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం అమెరికా, చైనా, ఇజ్రాయెల్‌ దేశాల ఆధిపత్యంలో ఉన్న అంతర్జాతీయ డ్రోన్ల మార్కెట్‌ పరిమాణం ఈ ఏడాది 2,847 కోట్ల డాలర్లకు (2.14 లక్షల కోట్ల రూపాయలకు పైగా) చేరుతుందని, అందులో భారత్‌ వాటా 4.25శాతమని బీఐఎస్‌ రీసెర్చ్‌ సంస్థ తెలిపింది. ప్రపంచంలో సైనిక డ్రోన్లను పెద్దయెత్తున దిగుమతి చేసుకొంటున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానాన ఉంది. భారతీయ వాణిజ్య యూఏవీ మార్కెట్‌ ఇప్పటి నుంచి 2026 వరకు ఏటా 12.6శాతం చొప్పున వృద్ధి సాధించనుందంటున్నారు. వాణిజ్య, వాణిజ్యేతర ప్రయోజనాలకు డ్రోన్లను వినియోగించేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ ఆగస్టు 25న నియమ నిబంధనలను విడుదల చేసింది. ఇటీవలి వరకు యూఏవీల వినియోగంపై జాగ్రత్తలు పాటించిన ప్రభుత్వం- ఇక గరిష్ఠ స్థాయిలో వాటి వినియోగాన్ని ప్రోత్సహించాలనుకొంటోంది. తదనుగుణంగా డ్రోన్ల ఉత్పత్తి, దిగుమతి, పరిశోధన, వినియోగం, రిమోట్‌ పైలట్‌ లైసెన్సులకు అనుమతి కోసం నింపాల్సిన దరఖాస్తుల సంఖ్యను 25 నుంచి అయిదుకు తగ్గించింది. స్వదేశీ అంకురాలను డ్రోన్ల ఉత్పత్తి చేపట్టేలా ప్రోత్సహిస్తోంది. యూఏవీలు తీసుకెళ్ళగల బరువును 300 కిలోల నుంచి 500 కిలోలకు పెంచింది. విమానాశ్రయాల చుట్టూ అవి ఎగరడానికి అనుమతించే గగనతల మండలాలనూ సరళీకరించింది. ఆ మండలాలు డిజిటల్‌ గగన వేదిక మీద ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగుల్లో కనిపిస్తాయి. లోగడ విమానాశ్రయాల నుంచి 45 కిలోమీటర్ల పరిధిలోపల డ్రోన్లు ఎగరడానికి వీల్లేదన్న ఆంక్షలు ఉండేవి. పసుపు మండలంగా పరిగణించే దీని పరిధిని 12 కిలోమీటర్లకు తగ్గించారు. విమానాశ్రయాల నుంచి 8-12 కిలోమీటర్ల మధ్య ఆకుపచ్చ మండలంగా వ్యవహరిస్తారు. ఇందులో 200 అడుగుల ఎత్తు వరకు అనుమతులు లేకుండా యూఏవీలు ఎగరవచ్చు.

అన్ని రంగాల్లోనూ...

ప్రస్తుతం భారత్‌లో యూఏవీలను గగన తలం నుంచి ఫొటోలు తీయడానికి, సినిమా షూటింగ్‌లు, భూ సర్వే, మౌలిక వసతుల పరిశీలన, భవన నిర్మాణం, గనులు, రక్షణ, టెలికాం, ప్రకృతి ఉత్పాతాల సమయంలో సహాయ కార్యక్రమాలు తదితర అవసరాల\కు ఉపయోగిస్తున్నారు. వ్యవసాయ రంగంలోనూ డ్రోన్ల వినియోగం పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తొమ్మిది రాష్ట్రాల్లో డ్రోన్లతో గ్రామీణ భూముల సర్వే కోసం ఉద్దేశించిన ‘స్వామిత్వ’ కార్యక్రమాన్ని 2020 ఏప్రిల్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీనివల్ల యూఏవీ పైలట్లకు ఉపాధి అవకాశాలు లభించాయి. తెలంగాణలోని మారుమూల ప్రాంతాలకు మందులు, ఆరోగ్య సేవలు అందించడానికి ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక పైలట్‌ పథకం చేపట్టింది. తుపానులు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు జరిగే నష్టాన్ని గగనతలం నుంచి పరిశీలించడానికి, సహాయ కార్యక్రమాలు నిర్వహించడానికి యూఏవీలు అక్కరకొస్తాయి. అక్రమ గనుల తవ్వకందారులను కనిపెట్టడానికి కోల్‌ ఇండియా 2019లో విజయవంతంగా డ్రోన్లను ఉపయోగించింది. ఇప్పటికే భారత్‌లో 191 డ్రోన్‌ అంకుర పరిశ్రమలు పనిచేస్తున్నాయి. ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకం కింద ప్రోత్సహించదలచిన 26 రంగాల్లో గత ఏడాది డ్రోన్ల పరిశ్రమనూ చేర్చారు.

గాలిలో పోరాటం

జమ్మూ వాయుసేన స్థావరంపై జూన్‌ 27న వెనువెంటనే రెండుసార్లు డ్రోన్లతో దాడులు జరిగాయి. తరవాత అయిదు సార్లు జమ్మూ నగరంపై డ్రోన్లు కనిపించాయి. మన పశ్చిమ సరిహద్దులో 2019లో 167 సార్లు, 2020లో 77 సార్లు డ్రోన్లు కనిపించాయని బీఎస్‌ఎఫ్‌ వెల్లడించింది. పాకిస్థాన్‌ వైపు నుంచి యూఏవీలు ఆయుధాలు, మాదక ద్రవ్యాలను జమ్మూ, పంజాబ్‌లకు తీసుకొస్తున్నాయి. తూర్పున చైనా నుంచీ వాటి ముప్పు పెరుగుతోంది. వాటిని వెంటనే పసిగట్టి ఎదురుదాడి చేసే యంత్రాంగాన్ని భారత్‌ సమకూర్చుకొంటోంది. 2030కల్లా భారత్‌లో డ్రోన్ల సంఖ్య మూడు లక్షలకు పెరుగుతుందని అంచనా. వాటిలో 15శాతం శత్రు డ్రోన్లను కూల్చే కౌంటర్‌ డ్రోన్లు ఉంటాయి. స్వదేశీ పరిజ్ఞానంతో వాటిని అభివృద్ధి చేసుకోవడానికి డీఆర్‌డీఓ ప్రాధాన్యమిస్తోంది. 2030కల్లా భారత్‌లో డ్రోన్‌, కౌంటర్‌ డ్రోన్‌ మార్కెట్‌ 4,000 కోట్ల డాలర్లకు (మూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా) చేరుతుందని ‘ఫిక్కీ’ అంచనా.

అమెరికా యూఏవీ మార్కెట్‌లో 70.5శాతం వినోదపరమైనవే. మున్ముందు వాణిజ్య డ్రోన్ల వినియోగం పెరగనుంది. సరకుల బట్వాడాకూ డ్రోన్లను అనుమతిస్తున్నారు. మెక్సికోలో మాదకద్రవ్య రవాణా, ఇతర నేరాలను నిరోధించడానికి వాటి వినియోగం పెరుగుతోంది. అమెజాన్‌ అడవుల పరిరక్షణకూ వినియోగిస్తున్నారు. ఐరోపాలో వాటి వినియోగం విస్తరించాలంటే నియమ నిబంధనలను సడలించక తప్పదు. టర్కీ తయారుచేసిన సాయుధ డ్రోన్ల సాయంతో ఆర్మీనియాపై పోరులో అజర్‌ బైజాన్‌ ఆధిక్యం సాధించింది. పశ్చిమాసియా, మధ్యాసియా దేశాల్లో సైనిక ప్రయోజనాల కోసం డ్రోన్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌తో పాటు ఇరాన్‌ సైతం డ్రోన్ల రూపకల్పనపై దృష్టి పెట్టింది. ఇక చైనా కంపెనీ డీజేఐ ప్రపంచ యూఏవీ మార్కెట్‌లో 70శాతం వాటాను ఆక్రమిస్తోంది. చైనాతోపాటు అనేక ఆసియా దేశాల్లో జనంపై నిఘా వేయడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. మలేసియా, సింగపూర్‌లలో ప్రజలు కొవిడ్‌ ఆంక్షలను పాటిస్తున్నారా లేదా అనేది యూఏవీలతో ఆరా తీస్తున్నారు. జపాన్‌లో భూకంపాలు, సునామీల గురించి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలకు, సహాయ కార్యక్రమాలకు యూఏవీ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఆఫ్రికాలో వైద్య డ్రోన్లు ప్రాణాలను కాపాడుతున్నాయి. 

పెట్టుబడులకు అవకాశం

ఇజ్రాయెల్‌ సరఫరా చేసిన హెరాన్‌, సెర్చర్‌ పోరాట యూఏవీలను భారత్‌- కార్గిల్‌ యుద్ధం సందర్భంగా 1999లో పాక్‌ చొరబాటుదారులపై ప్రయోగించింది. ఆ తరవాతా ఇజ్రాయెల్‌ ఆధునిక డ్రోన్లను భారతదేశానికి అందించింది. భారత రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) సొంతంగా లక్ష్య, నిశాంత్‌, రుస్తుం యూఏవీలను అభివృద్ధి చేస్తోంది. దేశంలో డ్రోన్లు, వాటి విడి భాగాల ఉత్పత్తికి రాగల మూడేళ్లలో రూ.5,000 కోట్ల పెట్టుబడులు ప్రవహిస్తాయని అంచనా. డ్రోన్‌ పరిశ్రమకు ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) వెన్నుదన్నుగా ఉంది. వచ్చే మూడేళ్లలో యూఏవీ పరిశ్రమ రూ.30,000 కోట్ల స్థాయికి చేరుకుని అయిదు లక్షల ఉద్యోగాలను కల్పించగలుగుతుంది. ఈ పరిశ్రమ వృద్ధి చెందుతున్న కొద్దీ అనుబంధ పరిశ్రమలు, యూఏవీ శిక్షణ సంస్థలు విస్తరిస్తాయి.


 

Posted Date: 16-10-2021



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం