• facebook
  • whatsapp
  • telegram

Self Support Seats: విశ్వవిద్యాలయాల్లో ‘సెల్ఫ్‌ సపోర్టు సీట్లు’

ఈనాడు, అమరావతి: రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లోనూ ప్రైవేటులో యాజమాన్య కోటా తరహాలో ‘సెల్ఫ్‌ సపోర్టు’ సీట్లను తీసుకొచ్చారు. వీటిల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులే బోధన రుసుంలను భరించాల్సి ఉంటుంది. వర్సిటీలు, ప్రయోగశాలలు, ఇతరత్రా నిర్వహణకు సొంతంగా నిధులను సమకూర్చుకునేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వ కళాశాలల్లో పీజీ కోర్సులకు ప్రభుత్వం బోధన రుసుంలను చెల్లిస్తోంది. వీటిని కేటగిరి-ఏగా చూడాల్సి ఉంటుంది. సెల్ఫ్‌ సపోర్టు సీట్లను కేటగిరి-బీగా పరిగణించాల్సి ఉంటుంది. విశ్వవిద్యాలయాల్లో డిమాండ్‌ ఉన్న పీజీ కోర్సుల్లో సీట్లను పెంచి, వాటికి వర్సిటీనే ఫీజులను ఖరారు చేస్తుంది. వర్సిటీ ప్రకటించిన ఫీజులను విద్యార్థులు చెల్లించాల్సి ఉంటుంది. ఎన్ని సీట్లు పెంచుకోవాలి? ఫీజు ఎంత నిర్ణయించాలనే విషయాన్ని వర్సిటీలకే వదిలేశారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా అన్ని పీజీ కోర్సులకు కలిపి ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఉన్నత విద్యామండలి నిర్వహిస్తోంది. ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. కౌన్సెలింగ్‌లో 3 రకాల సీట్లు ఉండనున్నాయి. సాధారణ, సెల్ఫ్‌ పైనాన్స్, సెల్ఫ్‌ సపోర్టు విభాగాల్లో వీటిని చూపిస్తారు.

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పేమెంట్‌ సీట్లు? 

రాష్ట్రంలో కొత్తగా రానున్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పేమెంట్‌ సీట్లు తీసుకురావాలనే ప్రతిపాదన ఉంది. ఇదే విధానాన్ని ప్రభుత్వ ఇంజినీరింగ్, ఇతర కోర్సులకు అమలు చేయాలని ఉన్నత విద్యాశాఖ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఈ విధానంలో సెల్ఫ్‌ సపోర్టు పేరుతో ప్రభుత్వ కళాశాలల్లో సీట్లను ప్రవేశపెడతారు. వీటిల్లో చేరేవారు ఫీజులను సొంతంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ కళాశాలల్లో యాజమాన్య కోటా తరహా సెల్ఫ్‌ సపోర్టు సీట్లు లేవు. అన్నింటినీ కన్వీనర్‌ ద్వారానే భర్తీ చేస్తున్నారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ మనసు తెలిసి... కలిసి మెలిసి!

‣ అనువుగా..  ఆన్‌లైన్‌ అభ్యాసం! 

‣ అసోం రైఫిల్స్‌- టెక్నికల్‌ అండ్‌ ట్రేడ్స్‌మెన్‌ ర్యాలీ

Posted Date : 28-09-2021