• facebook
  • whatsapp
  • telegram

ఎంసెట్‌ సిల‌బ‌స్‌పై త్వ‌ర‌లో నిర్ణ‌యం

ప్రైవేటు విద్యాసంస్థ‌లు ట్యూష‌న్ ఫీజు మాత్ర‌మే తీసుకోవాలి
ప్ర‌త్య‌క్ష బోధ‌న కోసం ఒత్తిడి చేయ‌రాదు
విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డితో ముఖాముఖి

ఎంసెట్‌ సిలబస్‌పై వారంరోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర‌ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రత్యక్ష బోధనకు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన కనిపించిందన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు కేవలం ట్యూషన్‌ ఫీజు మాత్రమే తీసుకోవాలన్న మంత్రి.. ఫీజుల వసూళ్లు, వేతనాల చెల్లింపులపై ప్రభుత్వ ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్‌ బోధన కూడా కొనసాగించాలని ప్రత్యక్ష బోధన కోసం ఒత్తిడి చేయవద్దంటున్న మంత్రి సబితాతో ముఖాముఖి.

ప్రత్యక్ష బోధన ప్రారంభమైన సందర్భంగా మొదటి రోజు కొన్ని పాఠశాలలను సందర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి స్పందన కనిపిస్తోంది?

రాష్ట్రవ్యాప్తంగా 14 వేలకు పైగా పాఠశాలల్లో 11 లక్షలకు పైగా విద్యార్థులు రావాల్సి ఉంది. ఇప్పుడు సగానికి పైగా వచ్చారు. మిగతా విద్యార్థులు కూడా అనుమతి పత్రాలు తీసుకొని త్వరలోనే వస్తారనుకుంటున్నాం. స్వస్థలాలకు వెళ్లినవారు కూడా వస్తున్నారు. పాఠశాలలకు విద్యాశాఖ నుంచి పలు ఆదేశాలు జారీ చేశాం. మాస్కులు, శానిటైజేషన్‌ తప్పనిసరి చేశాం. శానిటైజ్‌ చేసేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటుచేసుకోవాలని సూచించాం. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని స్కూళ్లను ప్రారంభించాం.

కొన్ని ప్రాంతాల్లో శానిటైజేషన్‌ చేసేందుకు స్థానికుల నుంచి స్పందన లేదని, దానికి సంబంధించి సిబ్బంది లేరని ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. వాటిపై మీ స్పందన?

అలాంటి పరిస్థితేం లేదు. ఫిబ్ర‌వ‌రి 1న‌ అన్ని పాఠశాలల్లో శానిటైజేషన్‌ ప్రక్రియ ప్రారంభించారు. పాఠశాలను గ్రామపంచాయతీ బాధ్యతగా భావించాలి.

మిగతా తరగతులు ఎప్పటి నుంచి ప్రారంభించే అవకాశం ఉంది?

ప్రస్తుతం ప్రారంభించిన తరగతులను కొద్దిరోజులు పరిశీలించాలి. పిల్లలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఐసోలేషన్‌ రూంలో ఉంచనున్నాం. వైద్య సేవలందించనున్నాం. విద్యాశాఖ తీసుకుంటున్న అన్ని రకాల చర్యలతో పిల్లలలోపాటు తల్లిదండ్రుల్లోనూ ధైర్యం రావాలి. అనంతరం మిగతా తరగతుల ప్రారంభంపై ఆలోచిస్తాం.

విద్యాశాఖ స్పష్టమైన జీవోలు ఇచ్చినప్పటికీ కొన్ని ప్రైవేటు స్కూళ్లు ఆన్‌లైన్‌ బోధన నిర్వహించబోమని పేర్కొంటూ ఫీజుల గురించి వేధిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వాటిపై మీ స్పందన?

ప్రైవేటు పాఠశాలలైనా, ప్రభుత్వ పాఠశాలలైనా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాల్సిందే. తల్లిదండ్రుల మీద ఒత్తిడి పెంచి విద్యార్థులను స్కూళ్లకు రప్పించుకోవద్దని, ట్యూషన్‌ ఫీజులు మాత్రమే తీసుకోవాలని విజ్ఞప్తి చేశాం. హాజరు శాతాన్ని కూడా పరిగణలోకి తీసుకోవద్దని సూచించాం. ఈ తరహా సమస్యలున్న స్కూళ్లలో పరిస్థితిని చక్కదిద్దేలా డీఈఓకు సూచిస్తున్నాం.

ఎంసెట్‌ సహా పోటీ పరీక్షల సిలబస్‌పై ఎప్పుడు స్పష్టత ఇవ్వనున్నారు?

వారం రోజుల్లోగా ఈ విషయంపై కూడా నిర్ణయం తీసుకుంటాం.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 02-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.