తెలుగు వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌కుమార్
నారాయణగూడ, న్యూస్‌టుడే: తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర ఉద్యోగాలతో పాటు మరో వెయ్యి పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ వెల్లడించారు. తెలుగువర్సిటీలో కూడా ఇది వరకు కోరిన పోస్టులే కాకుండా కొత్తగా ప్రవేశపెట్టబోయే కోర్సులను దృష్టిలో పెట్టుకొని మరిన్ని ఉద్యోగాలకు ప్రతిపాదనలు చేయాలని ఆయన సూచించారు. శుక్రవారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వర్సిటీలోని ఎన్టీఆర్ కళామందిరంలో జరిగిన కార్యక్రమంలో 2020 సంవత్సరానికి ప్రముఖ సాహితీవేత్త, రచయిత డా.ముదిగంటి సుజాతారెడ్డి... 2021 సంవత్సరానికి సంగీత, సాహిత్య, నృత్య కళావిమర్శకులు, బొబ్బిలి జమీందారు వంశీయులైన వి.ఎ.కె.రంగారావులకు విశిష్ట పురస్కారాలు అందజేశారు. రూ.లక్ష చొప్పున నగదు, ప్రత్యేక జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో వారిని ఘనంగా సత్కరించారు. తెలుగువర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య తంగెడ కిషన్‌రావు అధ్యక్షతన జరిగిన సభలో వినోద్‌కుమార్ మాట్లాడుతూ ఆంగ్లభాష నేర్చుకుంటేనే శాస్త్ర సాంకేతిక విజ్ఞానరంగంలో రాణించగలమనే అభిప్రాయం ఈ తరంలో ఉందన్నారు. పాశ్చత్య శాస్త్రవేత్తలు తమ మాతృభాషలోనే పరిశోధనలు చేసి ప్రపంచానికి మార్గనిర్దేశం చేశారని పేర్కొన్నారు. త్వరలో బాచుపల్లి ప్రాంగణానికి తరలించే తెలుగువర్సిటీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానిద్దామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి ప్రారంభోపన్యాసం చేస్తూ.. తెలుగువర్సిటీ అభ్యున్నతి చాలా ముఖ్యమన్నారు. తెలుగువర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య తంగెడ కిషన్‌రావు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రాంగణాలను ఏర్పాటుచేసి సాహిత్య, సాంస్కృతిక వికాసానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాలను రెండురోజులపాటు ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. వర్సిటీని జనవరి రెండో వారంలో బాచుపల్లికి తరలిస్తున్నట్లు ప్రకటించారు. వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ ప్రగతి నివేదికను సమర్పించారు. విస్తరణ సేవా విభాగం ఇన్‌ఛార్జి రింగు రామ్మూర్తి సమన్వయకర్తగా వ్యవహరించారు. ముందుగా జానపద పరిశోధక విద్యార్థి చుక్కా రవికుమార్ బృందం ఒగ్గుడోలు నృత్య ప్రదర్శన సభికులను ఆకట్టుకుంది. ఆంధ్ర నాట్య కళాకారిణి సువర్చలాదేవి కుమార్తె సాత్విక ఆంధ్రనాట్యం, జానపద కళల శాఖ విద్యార్థిని, దివ్యాంగురాలైన భాగ్య బృందం నాట్య ప్రదర్శన ఆకట్టుకుంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.