• facebook
  • whatsapp
  • telegram

Degree: డిగ్రీ ప్రిన్సిపళ్ల పదోన్నతుల్లో పీడీలకు అవకాశం 

ఈనాడు, అమరావతి: కళాశాల విద్య సర్వీసు నిబంధనల-2007కు సవరణలు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రిన్సిపల్‌ పోస్టుకు లెక్చరర్లతోపాటు ఫిజికల్‌ డైరెక్టర్లకు అవకాశం కల్పించారు. ప్రిన్సిపల్‌గా నియమితులయ్యే వారికి 15 ఏళ్ల అనుభవం ఉండాలని పేర్కొంది. 
ఎయిడెడ్‌ అధ్యాపకులకు పోస్టింగ్‌ కౌన్సెలింగ్‌
ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల నుంచి ప్రభుత్వంలో విలీనమైన అధ్యాపకులకు సెప్టెంబరు 23 నుంచి పోస్టింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలైంది. సెప్టెంబరు 30లోపు పోస్టులను కేటాయించనున్నారు. అక్టోబరు ఒకటిలోపు కేటాయించిన కళాశాలలో చేరాల్సి ఉంటుంది. వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా పోస్టులు కేటాయిస్తారు. ఒక జోన్‌లో పోస్టులు లేక అధ్యాపకులు మిగిలిపోతే వీరిని మరో జోన్‌లో సర్దుబాటు చేస్తారు. 50ఏళ్లలోపు ఉండే పురుష అధ్యాపకులను మహిళా కళాశాలల్లో నియమించరు. సబ్జెక్టులు, జోన్ల వారీగా ఆన్‌లైన్‌ ఉండే ఖాళీలకు ఐచ్ఛికాలు ఇవ్వాల్సి ఉంటుంది. 
అష్టావధానం కార్యక్రమానికి దరఖాస్తుల ఆహ్వానం
రాష్ట్ర స్థాయి అష్టావధానంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న ఉపాధ్యాయుల నుంచి పాఠశాల విద్యాశాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అక్టోబరు 8న ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న వారు ఈనెల 27వరకు దరఖాస్తులు సమర్పించాలని సూచించింది.
నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం 
జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో వచ్చే విద్యా సంవత్సరానికి ఆరు, తొమ్మిది తరగతులలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నవంబరు 30 చివరి గడువుగా విధించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 30న ప్రవేశ పరీక్ష ఉంటుంది. తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి అక్టోబరు 31వరకు అవకాశం కల్పించింది.
ప్రొబేషనరీ ఖరారుకు పరీక్షల్లో ఉత్తీర్ణులవ్వాల్సిందే
ప్రొబేషనరీ ఖరారుకుగాను సంక్షేమ విద్యా సహాయకులు శాఖాపరంగా నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ సబార్డినేట్‌ సర్వీసు నిబంధనలను సవరిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ సవరణ 2019 అక్టోబర్‌ 25 నుంచే అమల్లోకి వస్తుందని వెల్లడించింది.

Posted Date : 24-09-2021