• facebook
  • whatsapp
  • telegram

అన్ని జిల్లాల్లో పరీక్షలకు అవకాశం ఇవ్వండి 

* ‘డెబ్‌’కు లేఖ రాయనున్న కేయూ వీసీ 

* అంగీకరిస్తే 22 వేల మంది విద్యార్థులకు తప్పనున్న వ్యయప్రయాసలు

ఈనాడు, వరంగల్‌: కాకతీయ విశ్వవిద్యాలయంలో దూర విద్య కోర్సుల్లో చేరిన విద్యార్థులకు పరీక్షలు రాయడమే పెద్ద పరీక్షగా మారింది. పలుమార్లు వాయిదా తర్వాత ఎట్టకేలకు సెప్టెంబరు 22 నుంచి నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. తీరాచూస్తే అన్ని కళాశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కావడంతో పరీక్షల నిర్వహణకు కేంద్రాలు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో పరీక్షలు మరోసారి వాయిదా వేస్తూ కేయూ దూర విద్య కేంద్రం నిర్ణయం తీసుకొంది. గతంలో కేయూ పరిధిలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 140 అధ్యయన కేంద్రాలు(స్టడీ సెంటర్‌) అన్ని జిల్లాల్లో ఉండేవి. దూరవిద్యలో చదివే విద్యార్థులకు వాటిలో పరీక్షలు రాసే వెసులుబాటు ఉండేది. ఇక్కడ పరీక్షల నిర్వహణ పకడ్బందీగా జరగడం లేదంటూ యూజీసీ పరిధిలోని ‘డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో’ (డెబ్‌) గుర్తించింది. రెండేళ్ల కిందట కేయూ దూర విద్య పరీక్షలను కేవలం విశ్వవిద్యాలయ పరిధిలోని పూర్వ వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లోనే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో దూర ప్రాంత జిల్లాల విద్యార్థులకు కేయూ పరిధిలోని జిల్లాల్లో మాత్రమే పరీక్షలు రాయాల్సి రావడం వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారంగా మారింది. 

 

ఈ నేపథ్యంలో..‘‘ఈసారి దూర విద్యలో పరీక్షలను ఆయా అధ్యయన కేంద్రాల్లో రాసేందుకు అనుమతివ్వాలి. అవకతవకలకు తావివ్వకుండా కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వ కళాశాలలను మాత్రమే ఎంచుకుంటాం. కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా అనుమతివ్వాలి’’అని త్వరలో కేయూ వీసీ తాటికొండ రమేశ్‌ ‘డెబ్‌’కు లేఖ రాయనున్నట్టు తెలిసింది. డెబ్‌ ఇందుకు అవకాశం కల్పిస్తే సుమారు 22 వేల మంది విద్యార్థులకు ఇబ్బంది తప్పనున్నట్టు కేయూ అధికారులు చెబుతున్నారు. ఈ లేఖపై వచ్చే సమాధానం తర్వాతే పరీక్షల తేదీలను మళ్లీ ప్రకటిస్తారని సమాచారం.  

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ రాజ్యాంగ విలువల పరిరక్షణే సర్వోన్నతం

‣ భార లోహాలతో జలగరళం

Posted Date : 20-09-2021