హడావుడిగా రాగి జావ పంపిణీ
మైలవరం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న జగనన్న గోరుముద్ద (మధ్యాహ్న భోజన పథకం) కింద వంట ఏజెన్సీలకు సర్కారు అదనపు పని అప్పగించింది. ఏజెన్సీలకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనం కల్పించకుండానే రాగి జావ ఇవ్వాలని మార్గదర్శకాలు జారీ చేసింది. మరోవైపు విద్యార్థులు ఇళ్ల నుంచే గ్లాసులు తెచ్చుకోవాలంటూ ఉత్తర్వులు ఇచ్చింది. పిల్లలు తెచ్చుకోకపోతే ఎలాగన్న సంశయం ఉపాధ్యాయులను పీడిస్తోంది. కనీస నిధులు కేటాయించకపోవడంతో అటు ఏజెన్సీలు ఇటు ఉపాధ్యాయులకు ఇది భారంగా మారుతోందని విమర్శలు వస్తున్నాయి. నిజానికి సర్కారు బడుల్లో విద్యార్థులకు గోరుముద్ద పథకంలో భాగంగా అదనపు పౌష్టికాహారం పేరిట నాలుగైదు నెలల క్రితమే ప్రకటించిన ‘ఉదయం పూట రాగి జావ’ పంపిణీని ఎట్టకేలకు మంగళవారం జిల్లావ్యాప్తంగా పాఠశాల విద్యాశాఖ చేపట్టింది. ప్రతి గ్రామంలో అక్కడి ప్రజాప్రతినిధులతో ఆర్భాటంగా ప్రారంభించింది. రోజు విడిచి రోజు జావ, చిక్కీలు ఇవ్వాలని సూచించింది. వారంలో మూడ్రోజుల పాటు రాగి పిండి ఉడికించి ఇచ్చే బాధ్యత ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలకే అప్పగించారు. తరగతుల ప్రారంభానికి ముందే ఇవ్వాలని ఆదేశాలు వచ్చాయి.
ఏజెన్సీల గగ్గోలు: ప్రస్తుతం ఉప్పు, పప్పులతో పాటు గ్యాస్ బండ ధరలు విపరీతంగా పెరగడంతో, ప్రభుత్వ మెనూ కింద ఇచ్చే నిధులు చాలడం లేదని ఏజెన్సీల నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు. ఆ మొత్తాన్ని సర్దుబాటు చేసుకోవడానికి పిల్లల హాజరు సంఖ్యలో తేడాలు చూపుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో వారంలో మూడ్రోజులు జావ ఉడికించడానికి వాడే గ్యాస్ అదనపు భారమవుతుందని ఏజెన్సీల నిర్వాహకులు వాపోతున్నారు. ఇప్పటికే విద్యార్థులకు ఉడికించి ఇస్తున్న గుగ్గిళ్లకు వాడే గ్యాస్‌కు పైసా చెల్లించని ప్రభుత్వం, మరో అదనపు పని అప్పగించడంపై ఆవేదన చెందుతున్నారు. జావ కాయటానికి రోజూ కనీసం గంట ముందుగానే పాఠశాలలకు రావాల్సి వసుండటంతో ఇంటి పనులకు ఇబ్బంది అవుతోందని సహాయకులు వాపోతున్నారు. కనీసం గ్యాస్ భారమైనా ప్రభుత్వం భరించాలని వారు కోరుతున్నారు.
ఇంకా రాని గ్లాసులు
మరోవైపు ప్రతి విద్యార్థి శాశ్వతంగా వాడుకునేలా గ్లాసులిస్తామని ప్రభుత్వం ప్రకటించినా, టెండర్లు ఖరారు కానందున ఇళ్ల నుంచి తెచ్చుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ తెచ్చుకోకపోతే పరువు పోకూడదని, ఎలాగోలా సర్దుబాటు చేయాలన్న సూచనతో తొలిరోజు తెచ్చుకోని వారికి పేపర్, ప్లాస్టిక్ గ్లాసులు అక్కడక్కడ వినియోగించక తప్పలేదు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు తాగిన తర్వాత, వాటినే కడిగి ఇవ్వడం జరిగింది. ప్లాస్టిక్ గ్లాసుల వినియోగం సురక్షితం కాని నేపథ్యంలో, కాగితపు గ్లాసులు అందుబాటులో ఉంచాలంటే చేతి చమురు బాగా వదులుతుందని ఏజెన్సీల నిర్వాహకులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఒకట్రెండు రోజులైతే సర్దుబాటు చేయవచ్చుగాని, ఈ విద్యా ఏడాదిలో ఇంకా 40 రోజుల పాటు సొంత ఖర్చులు పెట్టుకోవడం సాధ్యం కాదంటున్నారు. చాక్‌పీస్ కొనుక్కోవడానికి, విద్యుత్తు బిల్లులు కట్టడానికి స్కూల్ గ్రాంట్ విడుదల చేయని పరిస్థితుల్లో ఈ అదనపు భారం ఎలా భరించాలో తెలియడంలేదంటూ నిట్టూరుస్తున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.