• facebook
  • whatsapp
  • telegram

Nagarjuna Versity VC: నాగార్జున వర్సిటీ వీసీగా ప్రొఫెసర్‌ రాజశేఖర్‌ 

గవర్నర్, ఏపీ సీఎం సంతకాలుపెట్టినా జీవో జారీలో జాప్యం
ఈనాడు, అమరావతి: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ప్రొఫెసర్‌ పేటేటి రాజశేఖర్‌ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం సెప్టెంబరు 27న ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు మూడేళ్ల నుంచి ఇన్‌ఛార్జి వీసీగా వ్యవహరిస్తున్న ఆయన వర్సిటీలో మూడు రాజధానులకు అనుకూలంగా ర్యాలీలు నిర్వహించడం, వైఎస్సార్‌ విగ్రహం నెలకొల్పడం వంటివి చేసి ప్రభుత్వానికి దగ్గరయ్యారనే అభిప్రాయం విశ్వవిద్యాలయం వర్గాల్లో ఉంది. వీసీగా రాజశేఖర్‌ నియామక దస్త్రంపై గవర్నర్, సీఎంలు సంతకం పెట్టి 15 రోజులు గడిచిపోయింది. జీవో ఇవ్వటానికి ఇన్ని రోజులు సమయం తీసుకోవటం వెనుక పెద్ద తతంగమే చోటుచేసుకుంది. ఆయన నియామకంపై పునరాలోచన చేయాలని వర్సిటీలోని పలువురు టీచింగ్, నాన్‌టీచింగ్‌ అధ్యాపకులు, పొన్నూరు ఎమ్మెల్యే రోశయ్య తదితరులు ప్రభుత్వ పెద్దలను కోరినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే గవర్నర్, సీఎం సంతకం అయిన తర్వాత కూడా జీవో వెలువరించకుండా మంత్రి, ఉన్నతాధికారులు ఇన్నాళ్లు కాలయాపన చేశారని తెలుస్తోంది. ఏఎన్‌యూతో పాటు రాష్ట్రంలోని మరో ఐదారు వర్సిటీలకు ఉపకులపతుల నియామకానికి ఏడాది క్రితమే సెర్చ్‌ కమిటీ సమావేశాలు జరిగాయి. అప్పట్లో ఏఎన్‌యూ నియామకాన్ని ఒక్కటే పెండింగ్‌లో పెట్టి మిగిలిన వర్సిటీలకు రెగ్యులర్‌ వీసీలను నియమించటం సంచలనమైంది. ప్రొఫెసర్‌ రాజశేఖర్‌ గతంలో వర్సిటీ రిజిస్ట్రార్‌గా పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో గత తెదేపా ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్‌ అధికారి చక్రపాణితో విచారణకు ఆదేశించింది. చక్రపాణి కమిటీ ఆయనపై ఆర్థిక అవకతవకలను నిర్ధారించి చర్యలకు సిఫార్సు చేసింది. ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై రంగయ్య కమిటీని వేసింది. ఆ కమిటీ ఆయనపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేసింది. చర్యలు తీసుకునే లోపే సార్వత్రిక ఎన్నికలు రావడం, రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చక్రపాణి కమిటీ నివేదికను పక్కన పెట్టారు. ఆ నివేదికను అనుసరించి రాజశేఖర్‌పై చర్యలు చేపట్టాలని అప్పటి వర్సిటీ పాలక మండలి సభ్యురాలు ప్రొఫెసర్‌ రత్నశీలామణి ముఖ్యమంత్రికి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు నేపథ్యంలో తిరిగి ప్రభుత్వం విశ్రాంత ఉపకులపతి నిరుపమారాణి నేతృత్వంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి తిరిగి విచారణ చేయించింది. ఆ కమిటీ ఆయనకు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. నిరుపమారాణి కమిటీ నివేదికను వర్సిటీ పాలక మండలిలో పెట్టి రాజశేఖర్‌కు అనుకూలంగా తీర్మానం చేయడంతో ప్రభుత్వం చక్రపాణి కమిటీ నివేదికను డ్రాప్‌ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. చక్రపాణి కమిటీ నివేదికను ప్రభుత్వం డ్రాప్‌ చేయటాన్ని సవాల్‌ చేస్తూ ప్రొఫెసర్‌ రత్నశీలామణి హైకోర్టులో కేసు వేశారు. ఆ పిటిషన్‌ ఇంకా బెంచి మీదకు రాలేదు. ఈలోపే రాజశేఖర్‌ను రెగ్యులర్‌ వీసీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.