దక్షిణాది విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశంలో గవర్నర్ ఉద్బోధ
ఈనాడు, విశాఖపట్నం: విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలను పెంచాల్సిన అవసరం ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల సంఖ్య అసంతృప్తిని కలిగిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి ర్యాంకింగుల కోసం మన దేశ వర్సిటీలు పోటీపడాలని నిర్దేశించారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన దక్షిణాది విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఏఐయూ (భారత విశ్వవిద్యాలయాల సంఘం), ఏయూ సహకారంతో ‘ఉన్నత విద్య రూపాంతరీకరణ కోసం పరిశోధన, సమర్థత’ అనే అంశంపై ఇందులో చర్చించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ‘ప్రపంచ మేధోసంపత్తి హక్కుల 2017 సూచిక ప్రకారం చైనా 13 లక్షల పేటెంట్ హక్కులను పొందితే ..అమెరికా 6.6 లక్షల హక్కులు సొంతంచేసుకుంది. భారత్ కేవలం 50 వేల హక్కులను మాత్రమే సాధించింది. ఇందులో 68 శాతం ఎన్‌ఆర్‌ఐల నుంచి వచ్చినవే. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. విశ్వవిద్యాలయాలు క్రియాశీలకంగా వ్యవహరించాలి. ఉపాధి కల్పనావకాశాలు సృష్టించడం, నైపుణ్య భారత్ నిర్మాణంలో ఉపకులపతులు ప్రధాన పాత్ర పోషించాలి’ అని నిర్దేశించారు. ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ 2020 నూతన విద్యావిధానాన్ని ఏపీ అందిపుచ్చుకొని సంస్కరణలకు నాంది పలికిందని, దీంతో ఉన్నతవిద్యలో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. ఏఐయూ అధ్యక్షుడు సురంజన్ దాస్, ప్రధాన కార్యదర్శి పంకజ్ మిట్టల్ ఏఐయూ కార్యకలాపాల గురించి వివరించారు. అంతకుముందు తాళపత్ర గ్రంథాల డిజిటలీకరణ ప్రక్రియను గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఏయూ వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి, గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ఆర్.పి.సిసోడియా, ఏపీ ఉన్నత విద్యామండలి వైస్‌ఛైర్మన్ కె.రామ్మోహనరావు, ఏయూ రిజిస్ట్రార్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ నీట్‌లో మేటిస్కోరుకు మెలకువలు!
‣ పాదాలు పదిలం... కొలువులు పుష్కలం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.