• facebook
  • whatsapp
  • telegram

TS Jobs: మరో 1,663 పోస్టుల భర్తీకి అనుమతి

* అత్యధికంగా నీటిపారుదల శాఖలో 1,238
* ఆర్థికశాఖ పచ్చజెండా

ఈనాడు, హైదరాబాద్‌: నీటిపారుదల, రహదారులు-భవనాల శాఖతోపాటు మరో రెండు శాఖలతో కలిపి 1,663 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. వీటిలో 80 శాతానికిపైగా ఇంజినీరింగ్‌ రంగాలకు చెందిన పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు జులై 2న ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు వేర్వేరుగా నాలుగు ఉత్తర్వులు జారీ చేశారు. నీటిపారుదల శాఖలో ఎక్కువ సంఖ్యలో పోస్టుల భర్తీ చేపట్టడం ఇదే తొలిసారి. రాష్ట్రంలోని 19 ప్రాదేశిక జలవనరుల ప్రాంతాల్లో క్షేత్రస్థాయి ఇంజినీర్లు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రాజెక్టులు పూర్తయినా ఆయకట్టుకు నీరందించేందుకు చర్యలు తీసుకునే సిబ్బంది కొరతను నీటిపారుదల శాఖ ఎదుర్కొంటోంది. దీనిలో భాగంగా 931 ఇంజినీర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇతర శాఖల్లోనూ సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగాలు కలిపి 211 పోస్టులు ఉన్నాయి. ఇవేకాక సాంకేతిక విభాగంలోనూ పోస్టులను భర్తీ చేస్తున్నారు. భూగర్భ జలవనరుల శాఖలో జియోఫిజిస్టు, హైడ్రోజియాలజిస్టు, హైడ్రాలజిస్టు విభాగాలకు చెందిన ఖాళీలను భర్తీ చేయనున్నారు.

  తాజాగా విడుదల చేసిన 1,663 పోస్టుల భర్తీని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్‌సీ) ద్వారా చేపట్టనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు భర్తీకి అనుమతించిన 45,325 పోస్టులతో కలిపితే రాష్ట్రంలో కొత్త ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పోస్టులు 46,988కి చేరుకున్నాయి. వివిధ శాఖలు, అనుబంధ విభాగాలు కలిపి ఇప్పటి వరకు పలు దఫాలుగా 43 ప్రత్యేక జీవోల ద్వారా పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులను అనుసరించి ఈ నియామకాలను చేపట్టనుండటంతో స్థానిక యువతకు ప్రాధాన్యం దక్కనుంది. ఇంజినీరింగ్‌ పట్టభద్రులకు తాజా నోటిఫికేషన్‌ సువర్ణావకాశమని ఆర్థికశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. త్వరలో మరిన్ని ఖాళీల భర్తీ చేపట్టనున్నట్లు, దీనిపై ముమ్మర కసరత్తు జరుగుతున్నట్లు స్పష్టం చేసింది.
3 నెలల్లో 46 వేలకు పైగా నోటిఫికేషన్లు: హరీశ్‌
రాష్ట్రంలో మూడు నెలల్లోనే 46 వేలకు పైగా ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. తాజాగా 1,663 పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వడం ద్వారా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్తను అందించినట్లు అయిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో నిరంతర అభివృద్ధి జరుగుతుంటే మరోవైపు అబద్ధాలు, విద్వేషాలు రగిల్చే పనిలో వలస పక్షులు తీరికలేకుండా ఉన్నాయంటూ భాజపాపై విమర్శలు చేశారు. మొత్తం నోటిఫికేషన్లకు సంబంధించిన జీవోలను ఉటంకిస్తూ ట్విటర్‌ ద్వారా ఒక సందేశాన్ని విడుదల చేశారు.

 

పోస్టుల వివరాలు...

* నీటిపారుదలశాఖ (1,238 పోస్టులు): ఏఈఈ- 704, ఏఈ- 227, జూనియర్‌ టెక్నికల్‌ అధికారులు-212, టెక్నికల్‌ సహాయకులు-95

* రహదారులు- భవనాలశాఖ (284): ఏఈ (సివిల్‌)-38, ఏఈఈ (సివిల్‌)-145, ఏఈఈ (ఎలక్ట్రికల్‌)-13, జూనియర్‌ టెక్నికల్‌ అధికారులు-60, సీనియర్‌ ఆర్కిటెక్చరల్‌ సహాయకుడు-01, టెక్నికల్‌ సహాయకులు-27

* భూగర్భ జలవనరులశాఖ (88): ఏఈ (సివిల్‌)-12, ఏఈఈ (మెకానికల్‌)-3, ఇతర పోస్టులు-73

* డైరెక్ట్‌ ఆఫ్‌ వర్క్స్‌ అకౌంట్స్‌ (53): డివిజినల్‌ అకౌంట్స్‌ అధికారులు గ్రేడ్‌-2-53

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.