• facebook
  • whatsapp
  • telegram

TS Schools: గంభీరావుపేటలో ‘కేజీ నుంచి పీజీ’ ప్రాంగణానికి జయశంకర్‌ పేరు

* మన ఊరు- మన బడి ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి, న్యూస్‌టుడే, గంభీరావుపేట: రాజకీయాలు ఎన్నైనా మాట్లాడవచ్చు. విమర్శలు ఎవరైనా చేయవచ్చు. నోటికి వచ్చినట్లు దూషణలు చేయడం గొప్పపని కాదు. కానీ పనులు చేయడం కష్టమని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో నిర్మించిన కేజీ టు పీజీ విద్యాలయాన్ని ఫిబ్ర‌వ‌రి 1న‌ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. సంక్షేమ పథకాలు ప్రకటించి అమలు చేయాలంటే చాలా కష్టమని, ఈ కష్టాలన్నింటినీ తట్టుకుంటూ తాము పనులు చేస్తున్నామని చెప్పారు. 2004లో సీఎం కేసీఆర్‌ పర్యటనలో భాగంగా ఒకే ప్రాంగణంలో కేజీ నుంచి పీజీ విద్యాసంస్థలను అందుబాటులోకి తీసుకొస్తానని ఇచ్చిన హామీ నేటికి కార్యరూపం దాల్చిందన్నారు. ఈ నమూనాను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడంలో భాగంగా మన ఊరు- మన బడి పథకాన్ని తీసుకొచ్చామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మెరుగైన ప్రమాణాలతో, ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు వెయ్యికిపైగా గురుకుల పాఠశాలలను సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో నెలకొల్పినట్లు చెప్పారు. మన ఊరు-మన బడి కింద మూడు దశల్లో విద్యా సంస్థలు, వ్యవస్థను సంస్కరించాలనే ఉద్దేశంతో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు. గంభీరావుపేట ప్రాంగణంలో మంచి గ్రంథాలయం, స్కిల్‌ నాలెడ్జ్‌సెంటర్‌, ఇతరత్రా విద్యాసముపార్జన కేంద్రాలు చూశాక సీఎం కేసీఆర్‌తో పాటు తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్‌ గుర్తుకువచ్చారన్నారు. రాష్ట్రంలోని మొట్టమొదటి కేజీ నుంచి పీజీ విద్యాసంస్థగా నిర్మితమైన ఈ ప్రాంగణానికి జయశంకర్‌ పేరు పెట్టాలని, ఆయన విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతిని కోరారు. దీనిని అందంగా తీర్చిదిద్దడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సంకేత్‌ కొండూరిని ఆయన సత్కరించారు.

 

దేశంలోనే మొదటి క్యాంపస్‌: మంత్రి సబిత

దేశంలో ప్రభుత్వపరంగా కేజీ నుంచి పీజీ వరకు క్యాంపస్‌లు ఎక్కడా లేవని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఒక విజన్‌తో ఏర్పాటు చేసిన ఈ క్యాంపస్‌ స్ఫూర్తితో మిగిలిన జిల్లాల్లోనూ నిర్మించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.7,300 కోట్లతో 26 వేల పాఠశాలలు ఎంపిక చేశామని, మొదటి విడతగా రూ.3,500 కోట్లు కేటాయించి 9 వేల పాఠశాలలను తీసుకున్నట్లు చెప్పారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన 680 పాఠశాలలను ఈ పథకం ద్వారా అభివృద్ధి చేసి సకల వసతులు ఏర్పాటు చేసి విద్యార్థులకు మెరుగైన విద్యాసౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు.

 

రాష్ట్రంలో వేడుకగా 680 పాఠశాలల ప్రారంభం

మన ఊరు- మన బడి కార్యక్రమం-తొలి విడత కింద పనులు పూర్తయి.. కొత్త రూపు సంతరించుకున్న ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫిబ్ర‌వ‌రి 1న‌ సుమారు 680 బడులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలు, గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. వేడుకలా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో నియోజకవర్గ, మండల స్థాయి ప్రజాప్రతినిధులతోపాటు గ్రామస్థులు, విద్యార్థులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ తదితరులు పాల్గొని కేజీ టూ పీజీ ప్రాంగణాన్ని ప్రారంభించారు.హైదరాబాద్‌లో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మూడు పాఠశాలల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం లక్ష్మణ్‌తండా ప్రాథమిక పాఠశాల ప్రారంభోత్సవానికి పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరయ్యారు. బడ్జెట్‌ రూపకల్పన, ఇతర పనుల్లో బిజీగా ఉన్నందున ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు హాజరుకాకపోవడంతో సిద్దిపేట నియోజకవర్గంలో బడులు ప్రారంభం కాలేదు.

 

రెండో విడత 9,123 బడులు.. రూ.2,516 కోట్లు

రాష్ట్రంలో మొత్తం 26,065 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. అందులో తొలి విడతలో అధిక విద్యార్థులున్న 9,123 పాఠశాలల్లో రూ.3,497 కోట్లతో 12 రకాల సౌకర్యాలను కల్పిస్తున్నారు. రెండో విడతలో అంతేసంఖ్యలో ఉన్న బడుల్లో వసతుల కోసం రూ.2,516 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక మూడో విడతలో 7,819 పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు రూ.1,275 కోట్లు వ్యయం చేయనున్నారు.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ వేదికపై ధీమాగా... నలుగురూ మెచ్చేలా!

‣ పరిశ్రమల సంరక్షకులు!

‣ వచ్చేస్తున్నాయ్‌... వర్చువల్‌ ల్యాబ్స్‌!

‣ టెన్త్‌ మార్కులతో పోస్టల్‌ ఉద్యోగం!

‣ బీటెక్‌ డిగ్రీతోపాటు నేవీలో ఉద్యోగం!

‣ కోస్ట్‌గార్డ్‌ కొలువు కావాలా?

‣ సరైన రివిజన్‌ సక్సెస్‌ సూత్రం!

‣ ఇంజినీర్లకు ఆర్మీ ఉద్యోగాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 02-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.