• facebook
  • whatsapp
  • telegram

TSPSC Exam Dates: ప‌రీక్ష తేదీలు తేల్చ‌లేక‌పోతున్న టీఎస్‌పీఎస్సీ

* శని, ఆదివారాల్లో వివిధ పోటీ పరీక్షలు

 

 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు వెలువరించిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)కు రాత పరీక్షల తేదీల ఖరారు పెద్ద పరీక్షగా మారింది. ఈ ఏడాది డిసెంబరు వరకు వివిధ పోటీ- ప్రవేశ- ఉద్యోగ పరీక్షలతో శని, ఆదివారాలన్నీ బిజీగా ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది. ప్రాథమికంగా కమిషన్‌ ఖరారు చేసిన పరీక్ష తేదీల్లో కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల పరీక్షలు, ఇతర ప్రవేశ పరీక్షలు, ఎస్‌ఎస్‌సీ, యూపీఎస్సీ పరీక్షల షెడ్యూళ్లు ఖరారయ్యాయి. రాష్ట్రంలోని అభ్యర్థులు ఆయా ఉద్యోగాలకు సంబంధించిన అన్ని పోటీ పరీక్షలకు హాజరయ్యేందుకు వీలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కమిషన్‌ పరీక్షలు నిర్వహించేందుకు అనువైన తేదీలు అందుబాటులో లేక సమస్యలు వస్తున్నాయి. ఒక్క గ్రూప్‌-4 పరీక్ష తేదీ ఖరారుకు రెండు వారాలకు పైగా కమిషన్‌ వర్గాలు కసరత్తు చేయాల్సి వచ్చిందని తెలిసింది. అలానే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఈ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రాల గుర్తింపు, తేదీల ఖరారుకూ తీవ్రంగా కృషి చేయాల్సి వస్తోంది. 

 

వాయిదా వేస్తే తదుపరి తేదీ కష్టం..

శని, ఆదివారాల్లోనే విద్యాసంస్థలకు సెలవు కావడంతో ఆ రోజుల్లోనే పోటీ పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి, ఏప్రిల్‌లో ఇంటర్మీడియట్‌, పదోతరగతి పరీక్షల నేపథ్యంలో కేంద్రాలన్నీ బిజీగా ఉన్నాయి. మేలో సెట్‌ పరీక్షల షెడ్యూలు ఇప్పటికే ఖరారైంది. గ్రూప్‌-1 ప్రధాన పరీక్ష ఏప్రిల్‌, మే నెలల్లో పెట్టాలని భావించినా ఇతర పరీక్షలతో తేదీలు అందుబాటులో లేక జూన్‌ మొదటి వారంలో ఖరారు చేయాల్సి వచ్చిందని ఆయా వర్గాలు తెలిపాయి. కొందరు అభ్యర్థులు ఇతర పరీక్షలు ఉన్నాయని, టీఎస్‌పీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని కమిషన్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఒకసారి పరీక్ష వాయిదా పడితే మరో తేదీ సమీపంలో అందుబాటులో లేదని, ఒక్కోసారి నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని, తద్వారా సీరియస్‌గా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు నష్టం జరుగుతుందని కమిషన్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రూప్‌-2, 3 పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలన్న విషయమై ఇప్పటికే ప్రాథమికంగా సమావేశాలు పెట్టినా, తేదీని ఖరారు చేయలేకపోయిందని తెలిసింది.

 

డిసెంబరు వరకూ శని, ఆదివారాల్లో వివిధ పరీక్షల షెడ్యూలు ఇలా..

మార్చి: 15 నుంచి ఇంటర్‌, టీఎస్‌పీఎస్సీ పోటీ పరీక్షలు

ఏప్రిల్‌: 3 నుంచి పది పరీక్షలు, టీఎస్‌పీఎస్సీ పోటీ పరీక్షలు

మే: తెలంగాణలో వివిధ కోర్సుల సెట్‌ పరీక్షలు, సివిల్స్‌ ప్రిలిమ్స్‌

జూన్‌: జేఈఈ, గ్రూప్‌-1 మెయిన్స్‌, యూజీసీనెట్‌, ఐఈఎస్‌, జియోసైంటిస్ట్‌, ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌, సీఏ ఇంటర్‌ పరీక్షలు

జులై: గ్రూప్‌-4, యూపీఎస్సీ, కంబైన్డ్‌ మెడికల్‌ పరీక్షలు

ఆగస్టు: సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌, ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ ఆఫీసర్‌, ఆఫీసు అసిస్టెంట్‌, ఐబీపీఎస్‌ క్లర్క్‌

సెప్టెంబరు: ఐబీపీఎస్‌ క్లర్క్స్‌, ఎన్‌డీఏ, సీడీఎస్‌, ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ, సివిల్స్‌ మెయిన్స్‌, ఐబీపీఎస్‌ ప్రొబేషనరీ పోస్టులకు పరీక్షలు

అక్టోబరు: ఐబీపీఎస్‌, యూపీఎస్సీ పరీక్షలు

నవంబరు: ఐబీపీఎస్‌ పరీక్షలు, ఐఎఫ్‌ఎస్‌ మెయిన్స్‌

డిసెంబరు: మిలిటరీ కళాశాల ప్రవేశ పరీక్ష, యూపీఎస్సీ పరీక్షలు, ఐబీపీఎస్‌ స్పెషలిస్టు పోస్టులకు పరీక్షలు

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రేమ్‌జీ సంస్థల్లో ప్రతిష్ఠాత్మక కోర్సులు!

‣ విద్యార్థులకు ఏఐ ఎందుకు?

‣ నాణ్యమైన బోధన.. నెలనెలా స్టైపెండ్‌!

‣ చివరివరకూ అంతే ఉత్సాహంగా..

 


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.