• facebook
  • whatsapp
  • telegram

Business Plans: ఐడియాల యుద్ధం... బిజినెస్‌ ప్లాన్‌ పోటీ!

* విజయానికి ఐదు మెట్లు

కత్తిలాంటి ఐడియా బుర్రలోనే మురిగిపోకూడదు. కాగితం మీద పెట్టాలి. బిజినెస్‌ ప్లాన్‌ తయారు చేసుకోవాలి. పైసలు కురిపించే ప్రణాళికలు ఫైల్స్‌లోనే నలిగిపోకూడదు. నిపుణుల ముందుకెళ్లాలి. ఇన్వెస్టర్లను ఆకట్టుకోవాలి. నిధుల వర్షం కురిపించాలి. ఇదంతా జరగాలంటే.. బిజినెస్‌ ప్లాన్‌ కాంపిటీషన్స్‌లో పాల్గొనాల్సిందే. ఎవరికి తెలుసు, పది పేజీల ప్రణాళిక.. మిమ్మల్ని వందకోట్ల కంపెనీకి అధిపతిని చేయొచ్చు. ఆ ఐడియాల యుద్ధానికి సిద్ధమా మీరు?

బిజినెస్‌ ప్లాన్‌-1

ఐస్‌క్రీమ్‌ అంటే ఇష్టపడనివాళ్లు ఎవరు?ఆ చల్లచల్లని, తీయతీయని రుచికి.. కాస్త ఆరోగ్యం జోడిస్తే.. చక్కెర శాతం తగ్గిస్తే.. గుప్పెడు ప్రొటీన్‌ కుమ్మరిస్తే.. తిరుగేం ఉంటుందీ?

బిజినెస్‌ ప్లాన్‌-2

శస్త్రచికిత్స సమయంలో రోగి చాలా రక్తాన్ని కోల్పోతాడు. సర్జరీ తర్వాత సంభవించే మరణాలకు ఇదీ ఓ కారణం. ఆ నష్టాన్ని నివారించగలిగితే త్వరగా కోలుకుంటాడు. అందుకు సాయపడే ఉపకరణాన్ని కనిపెడితే మానవాళికి మేలు చేసినట్టే.

బిజినెస్‌ ప్లాన్‌-3

యంత్రం అంటేనే చక్రాల సమాహారం. ఆ రాపిడి వల్ల శక్తి పుడుతుంది. వివిధ పరికరాలతో పరుగులు తీయిస్తుంది. అదే రాపిడి కారణంగా యంత్రాలు అరిగిపోతాయి. క్రమంగా మూలనపడతాయి. అయస్కాంత శక్తితో రాపిడి తీవ్రతను నియంత్రిస్తే.. పారిశ్రామిక రంగానికి ఉపకారం జరిగినట్టే.

 జాతీయ, అంతర్జాతీయ స్థాయి బిజినెస్‌ ప్లాన్‌ పోటీల్లో బహుమతికి అర్హత సాధించిన కొన్ని ఐడియాలు ఇవి.  

బిజినెస్‌ ప్లాన్‌ సత్తాకు ఇవన్నీ తిరుగులేని ఉదాహరణలే. మన వ్యాపార ప్రణాళికను చదవగానే, ఎవరైనా సరే ఆ ఐడియాతో ప్రేమలో పడిపోవాలి. సరికొత్త సక్సెస్‌ స్టోరీలో తామూ భాగం కావాలనే కోరిక కలగాలి. అంత పక్కాగా రాయగలిగితే.. ఏ పోటీలకు వెళ్లినా మనదే విజయం, ఏ ఇన్వెస్టర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నా మనకే లాభం.  

చేతిలో బిజినెస్‌ ప్లాన్‌ లేని అనుభవజ్ఞుడైన వ్యాపారవేత్త.

సవివరమైన బిజినెస్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకున్న యువ పట్టభద్రుడు.

ఇద్దరిలో ఎవరో ఒకరికే ఫండింగ్‌ ఇవ్వాల్సి వస్తే, పక్కా ప్లాన్‌తో వచ్చిన యువకుడి వైపే మొగ్గుచూపుతాయి వెంచర్‌  క్యాపిటల్‌ సంస్థలు. కాబట్టి, వ్యాపార స్వాప్నికులు.. ఐఐఎమ్‌ల మొహం చూడకపోయినా ఫర్వాలేదు. ఐఎస్‌బీలో చదవకపోయినా నష్టం లేదు. కానీ, బిజినెస్‌ ప్లాన్‌ ఎలా రాయాలో తెలుసుకోవాలి. ఆ నైపుణ్యానికి మెరుగులు పెట్టుకోవాలి. మార్కెట్‌ను అధ్యయనం చేయాలి. వినియోగదారుల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి. వివిధ విశ్వవిద్యాలయాలూ, వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలూ ఏటా నిర్వహించే బిజినెస్‌ ప్లాన్‌ పోటీల్లో తప్పక పాల్గొనాలి. నిజమే, విజయం అంత సులభంగా వరించదు. తొలి ప్రయత్నంలో ప్రాథమిక వడపోతలోనే తిరస్కారానికి గురికావచ్చు. రెండోసారి మలిదశ వరకూ చేరుకోవచ్చు. మూడోసారి, ఫైనల్‌ రౌండ్‌కు  వెళ్లగలిగినా, ‘సారీ’ అనే సమాధానం వినిపించవచ్చు. అయినా కూడా ఓటమిని అంగీకరించకూడదు. ప్రయత్నాన్ని ఆపేయకూడదు.  

ఆలోచన-ప్రణాళిక-ఆచరణ.. ప్రతి వ్యాపార విజయంలోనూ మూడు దశలు ఉంటాయి.

మొదటి దశ.. ఆంత్రప్రెన్యూర్‌ ఆలోచనల్లో ఓ కంపెనీ ప్రాణం పోసుకుంటుంది.

రెండో దశ.. ఆ ఆలోచన ప్రణాళికగా ల్యాప్‌టాప్‌కు ఎక్కుతుంది.

మూడో దశ.. ఆ ప్రణాళిక వాస్తవరూపం ధరిస్తుంది.

బుర్రలో తళుక్కుమన్న ఐడియాను.. ఒడుపుగా పట్టేసుకుని.. అందంగా అక్షరీకరించడమే బిజినెస్‌ ప్లాన్‌!

ఎన్నో వేదికలు..

హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ).. ఆంత్రప్రెన్యూర్ల కార్ఖానా. అక్కడ గాలిలో తేమ ఒక శాతమైతే, ఐడియాలు తొంభై తొమ్మిది శాతమని ఓ ప్రచారం. ‘స్పార్క్స్‌’ సంస్థతో కలిసి ఐఎస్‌బీ ఏటా బిజినెస్‌ ప్లాన్‌ పోటీలు నిర్వహిస్తోంది. ప్రథమ బహుమతిగా అక్షరాలా లక్ష రూపాయలు అందిస్తోంది. కాకపోతే, ఐడియా కొత్తగా ఉండాలి. కట్‌ అండ్‌ పేస్ట్‌లకు నిర్దాక్షిణ్యంగా కత్తెర వేస్తారు. ఒక్కరే పాల్గొనొచ్చు. నలుగురైదుగురు బృందంగానూ రంగంలోకి దిగొచ్చు. దేశంలోని ఏదో ఓ కాలేజీలో చదువుతున్న విద్యార్థులైతే చాలు. తాజా పట్టభద్రులకు రెండేళ్లు మినహాయింపు ఉంటుంది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (పట్నా) మాత్రం.. ఇలాంటి పరిమితులు విధించడం లేదు. అదిరిపోయే ఐడియా ఉంటే చాలు. ఎవరైనా బరిలో దూకేయొచ్చు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పరివారానికి చెందిన బెన్నెట్‌ యూనివర్సిటీ కూడా ‘స్పార్క్‌ ట్యాంక్‌’ పేరుతో బిజినెస్‌ ప్లాన్‌ పోటీలు నిర్వహిస్తోంది. వ్యవస్థాపకులు, ఆవిష్కర్తలు, విద్యార్థులు.. ఇలా వివిధ విభాగాలకు వేరువేరుగా ఎంట్రీలు స్వీకరిస్తారు. అంతిమ విజేతలకు పది లక్షల రూపాయల విలువైన బహుమతులు అందిస్తారు. ఐఐటీ బాంబే నేతృత్వంలో జరిగే ‘యురేకా’ బిజినెస్‌ ప్లాన్‌ కాంపిటీషన్స్‌ లక్షో, రెండు లక్షలో కాదు.. ఏకంగా కోటి రూపాయల విలువైన కానుకలతో ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నిజమే, కొత్తగా వ్యాపారంలో దిగుతున్నవారికి ప్రతి రూపాయీ కీలకమే. స్టార్టప్‌ ఏర్పాటులో ఆ బహుమతి సొమ్ము ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుంది. కానీ, నెట్‌వర్కింగ్‌ అంతకంటే ముఖ్యమైంది. బిజినెస్‌ ప్లాన్‌ పోటీలు ఆ అవకాశాన్నీ కల్పిస్తాయి. తాజాగా జరిగిన బిట్స్‌ పిలానీ ‘బి-ప్లాన్‌ కాంపిటీషన్‌’కు బిగ్‌ బాస్కెట్‌ సహ-వ్యవస్థాపకుడు హరి మేనన్‌, ప్రముఖ ఏంజల్‌ ఇన్వెస్టర్‌ రోహిత్‌ చన్నా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. తొలి పది స్థానాల్లో నిలిచినవారికి ఇన్వెస్టర్లతో ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఆంత్రప్రెన్యూర్లూ, ఇన్వెస్టర్లూ తమ ఐడియాలు షేర్‌ చేసుకున్నారు. విజిటింగ్‌ కార్డులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ ఆవరణలో అడుగుపెట్టే నాటికి చాలామంది చేతిలో బిజినెస్‌ ప్లాన్‌ మాత్రమే ఉంది. తిరిగివెళ్తున్న సమయానికి ఆత్మవిశ్వాసమూ తోడైంది.

క్రియేటివ్‌గా..

బిజినెస్‌ ప్లాన్‌ తయారీ.. సృజనాత్మకమైన కసరత్తు. ప్రణాళిక రచనలో కథనాత్మక శైలిని ఎంచుకోవడం ద్వారా న్యాయనిర్ణేతల్లో ఆసక్తిని రేకెత్తించవచ్చు. అలా అని ‘అనగనగా..’ అని సాగదీస్తూ కూర్చుంటే కుదరదు. కొన్నిసార్లు, పట్టుమని పది నిమిషాల సమయం కూడా ఉండదు. ఆ కొద్దిసేపట్లోనే చెప్పాల్సిందంతా చెప్పేయాలి. క్లుప్తత కిటుకు తెలిస్తేనే ఇదంతా సాధ్యం. ఎవరి ఐడియా వాళ్లకు బ్రహ్మాండంగానే తోస్తుంది. నిపుణుల ముందు పెట్టినప్పుడే.. ఏది వజ్రమో, ఏది గాజుముక్కో తేలిపోతుంది. వ్యాపార యోగ్యత తెలిసిపోతుంది. నిబంధనలను బట్టి,  ఇలాంటి పోటీల్లో నలుగురైదుగురు ఓ టీమ్‌గా పాల్గొనాల్సి ఉంటుంది. దీనివల్ల, ఓ బృందంగా పని చేయడం అలవాటు అవుతుంది. ‘బిజినెస్‌ ప్లాన్‌ కాంపిటీషన్స్‌ రెండు విధాలా లాభదాయకమే. గెలిస్తే బహుమతి వస్తుంది. గెలవకపోతే అనుభవం వస్తుంది’ అంటారు ఏంజల్‌ ఇన్వెస్టర్‌ దీపా జైన్‌. బిజినెస్‌ ప్లాన్‌ బేరీజు సమయంలో న్యాయనిర్ణేతలు మన ఐడియా బలాబలాలను సమీక్షిస్తారు. మార్పు చేర్పులనూ సూచిస్తారు. అలా మనల్ని మనం సరిదిద్దుకునే అవకాశం దొరుకుతుంది. ఇదొక ఐడియాల ములాఖత్‌. పోటీకి ఎంతోమంది సృజనజీవులు హాజరవుతారు. నలుగురి ఆలోచనల్నీ అర్థం చేసుకునే అవకాశం దొరుకుతుంది. మనల్ని మనం అప్‌డేట్‌ చేసుకోవచ్చు కూడా. మిగతా సమయాల్లో.. నేరుగా ఆఫీసుకెళ్లి కార్పొరేట్‌ దిగ్గజాల్ని కలుసుకోవడం దాదాపుగా అసాధ్యం. రిక్వెస్ట్‌ మెయిల్స్‌, ఫాలో-అప్స్‌, అపాయింట్‌మెంట్స్‌, చివరి నిమిషంలో క్యాన్సిలేషన్స్‌.. ఇదంతా చూసి, ఓ దశలో విసుగొచ్చేస్తుంది. బిజినెస్‌ ప్లాన్‌ కాంపిటీషన్‌లో ఇంత తతంగం ఉండదు. ఫైనల్‌ రౌండ్‌కు చేరుకుంటే చాలు. సాక్షాత్తు ఇన్వెస్టర్లే మన ముందుకొస్తారు. మనం చెప్పిందంతా వింటారు. మన ఐడియా నచ్చితే పంట పండినట్టే. ఫండింగ్‌ అందినట్టే.
 

కేస్‌స్టడీ పోటీలూ..

కేస్‌స్టడీ కాంపిటీషన్స్‌ కూడా బిజినెస్‌ ప్లాన్‌ పోటీల్లాంటివే. కాకపోతే ఇక్కడ, సంక్షోభంలోనో సమస్యలోనో ఉన్న  సంస్థను ఉదాహరణగా చూపిస్తూ.. ఆ కంపెనీని ఒడ్డున పడేసే మార్గం చెప్పమంటారు. ఆ కేస్‌స్టడీ మానవ వనరులకు సంబంధించింది కావచ్చు, మార్కెటింగ్‌తో ముడిపడిందీ కావచ్చు. అలా అని, కాశీమజిలీ కథలు చెప్పకూడదు. ఆచరణయోగ్యమైన పరిష్కారం అందించాలి. అవసరమైతే మనమే రంగంలో దూకి.. పరిస్థితుల్ని చక్కదిద్దగలగాలి. ఆదిత్య బిర్లా గ్రూప్‌ ప్రతి ఏటా ఇలాంటి కేస్‌స్టడీ కాంపిటీషన్స్‌ను ప్రకటిస్తుంది. విజేతకు పది లక్షల రూపాయల నగదు బహుమతితోపాటు.. రకరకాల కానుకలు అందిస్తుంది. తాజాగా, డెలాయిట్‌ నిర్వహించిన పోటీలో ‘ఫలానా రూపంలో సైబర్‌ దాడి జరిగితే.. నువ్వెలా అడ్డుకుంటావు?’ అంటూ ఆంత్రప్రెన్యూర్స్‌కు సవాలు విసిరారు. ఆలిండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ ఆరోగ్యం నుంచి వ్యవసాయం వరకు ఏ రంగాన్ని అయినా ఎంచుకునే అవకాశం కల్పిస్తోంది. ‘షార్క్‌ ట్యాంక్‌’ తరహా లైవ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ షోలూ కొత్త బిజినెస్‌ ఐడియాలకు పట్టం కడుతున్నాయి. ప్రస్తుతం సోనీ లివ్‌ ఓటీటీలో షార్క్‌ ట్యాంక్‌ మూడో భాగం ప్రసారం అవుతోంది. గత సీజన్‌లో దాదాపు ఎనభై కోట్ల విలువైన పెట్టుబడులు స్టార్టప్స్‌ తలుపు తట్టాయి. ఇవి కూడా బిజినెన్‌ ప్లాన్‌ కాంపిటీషన్స్‌ లాంటివే. కాకపోతే, ఆ ఆలోచనను మనమే నేరుగా కెమెరా ముందు చెప్పాలి. ఇన్వెస్టర్లను ఒప్పించాలి. టెలివిజన్‌ షో కాబట్టి.. కించిత్‌ డ్రామా జోడిస్తారు. అప్పటికే వ్యాపారాన్ని నిర్వహిస్తున్నవారు.. విస్తరణ అవకాశాల గురించీ వివరించవచ్చు. నాసిక్‌ కేంద్రంగా ఏర్పాటైన రీవాంప్‌ మోటో సంగతే తీసుకోండి. జయేష్‌, ప్రీతీష్‌, పుష్కరాజ్‌ అనే ఐఐటీ పట్టభద్రులు ఈ సంస్థను స్థాపించారు. వీధుల్లో అరటిపళ్లు, కూరగాయలు, తినుబండారాలు అమ్ముకునే సామాన్య వ్యాపారులు.. అందుబాటులో ఉన్న ఏదో ఓ పాత వాహనాన్ని అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటారు. అటూ ఇటూ అరలు ఏర్పాటు చేసుకుంటారు. అయినా అసౌకర్యంగానే ఉంటుంది. ఆ ఇబ్బంది లేకుండా,  వీధి వ్యాపారుల కోసమే డిజైన్‌ చేసిన ద్విచక్ర వాహనాల్ని అందిస్తోంది రీవాంప్‌ మోటో. షార్క్‌ట్యాంక్‌ న్యాయనిర్ణేతలకు ఆ ఐడియా నచ్చింది. తక్షణం, కోటి రూపాయలు ఇన్వెస్ట్‌ చేశారు. మరిన్ని పెట్టుబడులకు భరోసా ఇచ్చారు. అంతేకాదు, షో ప్రసారమైన తర్వాత.. వాహనాల విక్రయాలు పెరిగాయి కూడా. కాకపోతే, ఇలాంటి అవకాశాలు కొద్దిమందినే వరిస్తాయి. గత సీజన్‌లో దాదాపు రెండు లక్షల దరఖాస్తులు అందినట్టు నిర్వాహకులు ప్రకటించారు. అందులోంచి వంద పైచిలుకు అంకురాలను ఎంచుకోవడం కత్తిమీద సామే.

స్టార్టప్‌ దిశగా..

మహిళల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేసే ఉ-కేర్‌ (ఉమెన్‌ కేర్‌) సంస్థ ‘ఆరంభ’ బిజినెస్‌ ప్లాన్‌ పోరులో మొదటి బహుమతి సాధించింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ పూర్వ విద్యార్థులు ఈ స్టార్టప్‌కు ప్రాణం పోశారు. ఏ నవజాత శిశువుకూ పుట్టుకతోనే నూరేళ్లు నిండకూడదన్నదే ఈ సోషల్‌ స్టార్టప్‌ లక్ష్యం. ప్రసూతి గండాలను అధిగమించే సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది ఉ-కేర్‌. ఆ ఆలోచన నచ్చి ఏంజల్‌ ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెట్టారు. దేశంలో పదిశాతం ప్రజలు పాదాలతో ముడిపడిన రుగ్మతలతో బాధపడుతున్నారని అంచనా. అలాంటివారి కోసం ఓ అంకుర సంస్థను స్థాపిస్తే ఎలా ఉంటుంది... అనే ఆలోచనే విశ్వరాజ్‌, అనన్య చహాల్‌ అనే ఇంజినీరింగ్‌ విద్యార్థులతో ఓ బిజినెస్‌ ప్లాన్‌ తయారు చేయించింది. దాన్ని పోటీకి పంపారు. ఆ ఐడియా న్యాయనిర్ణేతలకు నచ్చింది. ఇన్వెస్టర్లు ముందుకొచ్చారు. నిధులు సమకూరాయి. ఈ మధ్యే, ఔషధగుణాలున్న సాక్సులను మార్కెట్‌లోకి తెచ్చింది విశ్వరాజ్‌ బృందం. బిజినెస్‌ ప్లాన్‌ పోటీలో గెలుపు వల్ల ఐడియాకు విశ్వసనీయత పెరుగు తుంది. ఏ కారణం చేతనో ఇన్వెస్టర్లు ఆసక్తి చూపకపోయినా.. క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా నిధులు సమీకరించుకోవడం సులభం అవుతుంది. ఎన్‌క్యాష్‌, కెట్టో తదితర క్రౌడ్‌ ఫండింగ్‌ వేదికలు ఉండనే ఉన్నాయి. కాకపోతే, వాటికి ఎంతోకొంత కమీషన్‌ ముట్టజెప్పాలి. సందర్భాన్ని బట్టి వాటాలూ సమర్పించుకోవాలి. కొన్ని సంస్థలు వర్చువల్‌గానూ పోటీలు నిర్వహిస్తున్నాయి.  వాటిల్లో కాలు కదపకుండానే.. ప్రైజ్‌ మనీ గెలుచుకోవచ్చు.

కొందరు ఐడియాల్ని సృష్టించగలరు కానీ.. ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. లక్షణంగా ఉద్యోగం చేయాలనుకుంటారు. బిజినెస్‌ ప్లాన్‌, కేస్‌స్టడీ కాంపిటీషన్స్‌ అలాంటి వారికి కూడా ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే, నిర్వాహక సంస్థలు విజేతలకు బహుమతులతోపాటు ఆఫర్‌ లెటర్లూ అందిస్తున్నాయి. బిజినెస్‌ లీడర్‌షిప్‌ కంపెనీ ఎవరెస్ట్‌ తన తాజా ప్రకటనలో ఇలాంటి అవకాశమే ఇచ్చింది. అప్పటికే అభ్యర్థి ప్రతిభ గురించి ఓ అవగాహనకు వచ్చేసి ఉంటారు కాబట్టి, బ్యాక్‌లాగ్‌లూ గట్రా ఉన్నా పట్టించుకోరు. ఇంకేముంది, టాపర్స్‌ను దాటుకుని ఫైనల్‌ రౌండ్‌ ఇంటర్వ్యూ వైపు దూసుకెళ్లిపోవచ్చు. మంచి ప్యాకేజ్‌తో కార్పొరేట్‌ పౌరసత్వం తీసుకోవచ్చు.


*   *   *  

సాధారణ బిజినెస్‌ ప్లాన్‌..

లాభాలను సృష్టిస్తుంది.

ఇది తాత్కాలిక విజయం.

  అత్యుత్తమ బిజినెస్‌ ప్లాన్‌..

కస్టమర్లను సృష్టిస్తుంది.

ఇది దీర్ఘకాలిక విజయం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.