• facebook
  • whatsapp
  • telegram

EAPCET: ఎప్‌సెట్‌ ఇంజినీరింగ్‌లో 74.98% ఉత్తీర్ణత

* అగ్రికల్చర్‌-ఫార్మసీలో 89.66%..

* ఏపీకి చెందిన జ్యోతిరాదిత్య, ప్రణీతలకు తొలి ర్యాంకులు

* ఇంజినీరింగ్‌ టాప్‌ 10లో 9 మంది బాలురే.. అగ్రికల్చర్‌లోనూ ఏడుగురు వారే
 

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌ ఎప్‌సెట్‌-2024 ఇంజినీరింగ్‌ విభాగంలో 74.98 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్‌ విభాగంలో 89.66 శాతం మంది అర్హత సాధించారు. ఇంజినీరింగ్‌ మొదటి పది ర్యాంకుల్లో తొమ్మిది, అగ్రికల్చర్‌ విభాగంలో మొదటి పదిలో ఏడు ర్యాంకులను బాలురు సొంతం చేసుకున్నారు.రెండు విభాగాల్లో తొలి ర్యాంకును ఏపీ విద్యార్థులే దక్కించుకున్నారు. ఎప్‌సెట్‌ ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగాల ర్యాంకులను శనివారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, కార్యదర్శి శ్రీరాం వెంకటేష్, జేఎన్‌టీయూహెచ్‌ ఉపకులపతి కట్టా నర్సింహారెడ్డి, కన్వీనర్‌ డీన్‌కుమార్, రిజిస్ట్రార్‌ వెంకటేశ్వరరావు విడుదలచేశారు. ఎప్‌సెట్‌ కో కన్వీనర్‌ కె.విజయకుమార్‌రెడ్డి, పరీక్ష సమన్వయకర్తలు ఎస్‌.తారాకల్యాణి, ఎన్‌.దర్గాకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.





ఇంజినీరింగ్‌లో శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన సతివాడ జ్యోతిరాదిత్య 160కి 155.63 మార్కులు సాధించి ప్రథమ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. అగ్రికల్చర్‌ విభాగంలో అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన అలూరు ప్రణీత 146.44 మార్కులు పొంది అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది వరకు ఈ పరీక్షను ఎంసెట్‌గా పిలవగా... మెడికల్‌ సీట్ల కోసం నీట్‌ ఉన్నందున ఆ స్థానంలో ఫార్మసీ విభాగాన్ని చేర్చి ఈ ఏడాది ఎప్‌సెట్‌ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష- ఈఏపీసెట్‌)గా మార్చిన సంగతి తెలిసిందే.
 

ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత తగ్గుతోంది..

గత మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఇంజినీరింగ్‌ విభాగంలో ఉత్తీర్ణత శాతం తగ్గుతోంది. 2022లో 80.41 శాతం మంది కనీస మార్కులు (40) సాధించి కన్వీనర్‌ కోటా (కౌన్సెలింగ్‌)లో సీట్లు పొందేందుకు అర్హత సాధించారు. 2023లో ఆ శాతం 80.33కి తగ్గింది. తాజాగా 74.98 శాతానికి పడిపోయింది. 160 మార్కులకు 25 శాతం అంటే 40 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులవుతారు (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కనీస మార్కుల నిబంధన వర్తించదు). అగ్రికల్చర్‌ విభాగంలో గత రెండేళ్లతో పోల్చుకుంటే ఉత్తీర్ణత శాతం పెరిగింది. 2022లో 88.34 శాతం ఉండగా.. 2023లో 86.31, ప్రస్తుతం 89.66 శాతం మంది పాసయ్యారు. ప్రశ్నపత్రం కఠిన స్థాయిని బట్టి ఉత్తీర్ణత శాతంలో పెరుగుదల, తగ్గుదల ఉంటాయని ఎప్‌సెట్‌ అధికారులు చెబుతున్నారు.
 


అమ్మాయిలదే పైచేయి

టాపర్లలో అబ్బాయిలు సత్తా చాటుతున్నా ఉత్తీర్ణత శాతంలో మాత్రం అమ్మాయిలు పైచేయి సాధిస్తున్నారు. ఇంజినీరింగ్‌లో అబ్బాయిలు, అమ్మాయిలు వరుసగా 74.38, 75.85 శాతం మంది పాసయ్యారు. అగ్రికల్చర్‌లో అబ్బాయిలు, అమ్మాయిలు వరుసగా 88.25, 90.18 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.


ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యం

తెలంగాణ ఎప్‌సెట్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన సతివాడ జ్యోతిరాదిత్య తొలి ర్యాంకు సాధించి సత్తా చాటాడు. ఐఐటీలో సీటు సాధించడమే తన లక్ష్యమని ‘న్యూస్‌టుడే’కు తెలిపాడు. తల్లిదండ్రులు హైమావతి, మోహనరావు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులని, వారి ప్రోత్సాహంతో ఈ విజయం సాధించినట్లు చెప్పాడు. 

* బాంబే ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ చేయాలనేది తన లక్ష్యమని 2వ ర్యాంకు సాధించిన కర్నూలు విద్యార్థి జి.ఎల్‌.హర్ష తెలిపాడు. నాన్న సూర్యకుమార్‌ విశాఖ పోలీసు శాఖలో కమ్యూనికేషన్స్‌ విభాగం ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారని, తల్లి సుహాసిని గృహిణి అని, ప్రణాళికాబద్ధంగా చదివించారని వెల్లడించాడు.  

* కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ చదవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మూడో ర్యాంక్‌ సాధించిన హైదరాబాద్‌ అల్వాల్‌కు చెందిన రుషిశేఖర్‌ శుక్లా తెలిపాడు. తల్లిదండ్రులు ఇస్రో శాస్త్రవేత్తలు కావడంతో స్ఫూర్తినిచ్చారని వెల్లడించాడు.


నీట్‌ ర్యాంకులు సాధించి వైద్యులమవుతాం

అగ్రి-ఫార్మసీ విభాగంలో మొదటి ర్యాంకు రావడం సంతోషంగా ఉందని అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన అలూరు ప్రణీత చెప్పారు. దిల్లీ ఎయిమ్స్‌లో వైద్య విద్య చదివి గుండె వైద్యురాలిగా సేవలందించాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. నాన్న శ్రీకర్‌ హోమియో వైద్యులు, అమ్మ కల్యాణి ప్రైవేటు పాఠశాలలో సైన్స్‌ ఉపాధ్యాయురాలని వారి స్ఫూర్తితో ఈ విజయం సాధ్యమైందని చెప్పారు. 

నీట్‌ రాసి మంచి ర్యాంకు సాధించి కార్డియాలజిస్టు కావాలన్నదే తన అభిమతమని 2వ ర్యాంకర్, పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేటకు చెందిన నాగు దాసరి రాధాకృష్ణ తెలిపాడు. తల్లిదండ్రులు నారాయణరావు, కృష్ణవేణి, తాతయ్య జగన్నాథరావు ప్రోత్సాహంతో ఈ విజయం సాధించినట్లు వెల్లడించాడు.

హనుమకొండ రెడ్డికాలనీకి చెందిన గడ్డం కన్నయ్య, లావణ్య దంపతుల కుమార్తె గడ్డం శ్రీవర్షిణి రాష్ట్రస్థాయి మూడో ర్యాంకు సాధించింది. డాక్టర్‌ కావడమే తన లక్ష్యమని, ఇటీవల నీట్‌ కూడా బాగా రాశానని, మంచి ర్యాంకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.






 



Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.