• facebook
  • whatsapp
  • telegram

టీఎస్‌పీఎస్సీ ఛైర్మ‌న్, స‌భ్యుల‌ను నియ‌మించండి: హైకోర్టు

 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)కి ఛైర్మన్‌, ఇతర సభ్యులను నియమించకుండా మూసివేయాలని అనుకుంటున్నారా అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏప్రిల్ 29న‌ హైకోర్టు ప్రశ్నించింది. ఉన్న ఒక్క సభ్యుడూ ఆగస్టులో పదవీ విరమణ చేస్తారని, తరువాత మేమే దాన్ని మూసేస్తామని వ్యాఖ్యానించింది. ఛైర్మన్‌తో సహా సభ్యుల నియామకాన్ని చేపట్టి దానికి సంబంధించిన నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను జూన్‌ 17వ తేదీకి వాయిదా వేసింది. టీఎస్‌పీఎస్సీకి ఛైర్మన్‌ను, 9 మంది సభ్యులను నియమించకపోవడాన్ని సవాలు చేస్తూ జగిత్యాలకు చెందిన నిరుద్యోగి జె.శంకర్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎస్‌.సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ ఛైర్మన్‌ పోస్టు ఫిబ్రవరి నుంచి ఖాళీగా ఉందని, 10మంది సభ్యులకు 9మంది పోస్టులు ఖాళీ అయ్యాయన్నారు. మిగిలిన సభ్యుడి పదవీకాలం ఈ ఆగస్టుతో ముగుస్తుందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ రాష్ట్రంలో ఇంతటి కీలకమైన సంస్థలో సభ్యుల పోస్టుల భర్తీలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని పేర్కొంది.

Posted Date : 29-04-2021