• facebook
  • whatsapp
  • telegram

సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల ర‌ద్దుకు సుప్రీంలో పిటిష‌న్‌

 

సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. దేశంలో క‌రోనా తీవ్ర స్థాయిలో ఉండ‌టంతో ఇలాంటి ప‌రిస్థితుల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌వద్దని అందులో పేర్కొన్నారు. అయితే కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. దేశంలో క‌రోనా విజృంభ‌న కార‌ణంగా సీబీఎస్ఈ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసి, 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసిన విష‌యం తెలిసిందే. ఆయా ప‌రీక్ష‌లు షెడ్యూలు ప్ర‌కారం మే 4 నుంచి జూన్ 14 వ‌ర‌కు జ‌ర‌గాల్సి ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే కొవిడ్ నియంత్ర‌ణ‌లోకి రాక‌పోవ‌డంతో వాయిదా వేసిన ప‌రీక్ష‌ల‌ను కూడా ర‌ద్దు చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. తాజాగా సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. అలాగే ప‌రీక్ష‌లు ర‌ద్దు చేయాల‌ని కోరుతూ సీబీఎస్ఈ విద్యార్థులు ‘సేవ్ బోర్డ్ స్టూడెంట్స్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆన్‌లైన్ నిర‌స‌న‌ను చేప‌ట్టారు. ఛేంజ్‌.ఆర్గ్‌నైజేష‌న్‌లోనూ విద్యార్థులు పిటిష‌న్ వేశారు.
 

ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు
 

ఇదే విష‌య‌మై స్పందించిన సీబీఎస్ఈ.. ప‌రీక్ష‌ల ర‌ద్దుకు సంబంధించిన ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని స్ప‌ష్టం చేసింది. 12వ తరగతి పరీక్షల నిర్వహణ దాదాపు రద్దంటూ కొన్ని మీడియా ఛానళ్లు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని తెలిపింది. ఏ నిర్ణ‌యం తీసుకున్నా సీబీఎస్ఈ ప్ర‌క‌ట‌న చేస్తుంద‌ని పేర్కొంది. అయితే జూన్ 1న‌ 12వ త‌ర‌గ‌తి ప‌రీక్షల‌ నిర్వ‌హ‌ణపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని గ‌తంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ర‌మేశ్ పోఖ్రియాల్ వెల్ల‌డించారు. 

Posted Date : 14-05-2021