• facebook
  • whatsapp
  • telegram

గురుకుల ఇంటర్‌లో వృత్తి విద్యా కోర్సులు  

న్యూస్‌టుడే, మార్కండేయకాలనీ(గోదావరిఖని): మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలల్లో నూతనంగా కళాశాలల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలంగాణ‌ రాష్ట్రంలో ప్రస్తుతం 119 జూనియర్‌ కళాశాలలు ఏర్పడ్డాయి. ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 13 బీసీ గురుకులాలు ఉండగా ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీ, సీఈసీలతో పాటు ఈ విద్యా సంవత్సరం వృత్తి విద్యా కోర్సులకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌తో సమాంతరంగా ఈ కోర్సులను ప్రవేశపెట్టారు. గతేడాది వరకు పదోతరగతి వరకే ఉన్న బీసీ గురుకుల పాఠశాలలు ఇంటర్‌ విద్య కోసం స్థాయిని పెంచారు. ఈ విద్యా సంవత్సరంలో రెండు కళాశాలల్లో ప్రయోగాత్మకంగా వృత్తి విద్యా కోర్సులను సైతం అందుబాటులోకి తెచ్చారు. జీవితంలో స్థిరపడాలనే వారికి ఈ కోర్సులు ఎంతో ఉపయోగపడనున్నాయి.

ఆసక్తిగల విద్యార్థులకు ఉపయోగం.. 

వృత్తి విద్యా కోర్సులు గతంలో ప్రైవేటు కళాశాలల్లోనే ఎక్కువగా ఉండేవి.. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు త్వరగా ఉద్యోగాలు సాధించడానికి ఈ కోర్సుల్లో చేరేవారు. ఈ చదువులకు ప్రైవేటు కళాశాలల్లో ఫీజులు అధికంగానే చెల్లించాల్సి వచ్చేది. ప్రభుత్వం బోధనా రుసుం అవకాశం కల్పించినప్పటికీ కళాశాలల్లో వివిధ అంశాలకు సంబంధించి రూ.వేలల్లో ఫీజులను కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు బీసీ గురుకుల కళాశాలల్లో వృత్తి విద్య విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఉచితంగా అందజేసేందుకు సిద్ధం చేశారు.  

పదోతరగతి విద్యార్థులకు సువర్ణవకాశం

ఈ విద్యా సంవత్సరం పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన ప్రతి విద్యార్థి వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. చిన్న వయసులో కోర్సు పూర్తి చేసుకున్న యువతకు పలు పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు పొందే ఆస్కారం ఉంది. ఇతరులపై ఆధారపడకుండా నేర్చుకున్న విద్యతో ఆర్థిక ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రెండు గురుకుల కళాశాలలో నాలుగు కోర్సుల్లో మొత్తం 80 సీట్లతో పాటు బైపీసీ 80 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వృత్తి విద్యా కోర్సు ఆయా కళాశాలల్లో చేరాలనుకునే వారు ఆన్‌లైన్‌ mjptbcwreis.gov.telangana వెబ్‌సైట్‌లో జూన్ 27వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి.

వృత్తి విద్యా కోర్సుల వివరాలు

కళాశాల    జిల్లా  కోర్సులు  సీట్లు
గురుకుల బాలికల కరీంనగర్‌ పట్టణం హోంసైన్స్‌    20
    మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌  20
    బైపీసీ    40 
గన్నేరువరం బాలుర కరీంనగర్‌        ఫిజియోథెరపీ  20
    మెడికల్‌ ల్యాబ్‌ టెక్నిషియన్‌ 20
    బైపీసీ    40


 

Posted Date : 23-06-2021